Monday, June 29, 2020 By: visalakshi

శ్రీ సాయి దత్త .....

"శిరిడి సాయిబాబా అంటే ఆనందసాగరమే*"..!!



శ్రీ సాయిబాబా ఎంతటి మహనీయులైనా, ఇప్పుడా యన బౌతికంగా లేరు కదా అన్నదే చాలామందికి కలిగే సందేహం. దానికి తోడు ఎంతటి సద్గురువైనా సజీవులుగా వున్నంత వరకే శిష్యులకు ఆత్మజ్ఞానం ప్రసాదించగలరని పెద్దలు చెబుతుంటారు. కానీ శ్రీసాయి కేవలం సిద్ధపురుషులు మాత్రమే కాదు. సాక్షాత్తూ దత్తాత్రేయుల అవతారం!

అంతేగాక బాబా మహాసమాధి అనంతరం కూడా తాము భక్తులను పూర్వంలాగానే అనుగ్రహిస్తామని గమ్యం చేరుస్తామని వాగ్దానం చేశారు. ఎందరో మహనీయులు కూడా ఈ విషయమే ధృవపరిచారు. అది ఎందరి అనుభవమో సాయి భక్తులు శ్రీ ఎమ్
రంగాచార్యగారు శ్రీసాయి గురించి సాధు సత్పురుషుల నుండి వినిన వాక్యాలను వ్రాస్తున్నారు.

స్వామి శంభునాథ్ జీ అను సిద్ధ పురుషుడు 1937లో నాతో, “ముందు ముందు నీవు ఒక సాటిలేని మహాత్ముని శరణు పొంది అంతిమ ఘడియ వరకు ఆయనకు అంకితమవుతావు" అన్నారు. వారు చెప్పిన మాటలు ఒకటి రెండు సంవత్సరాలలో నేను శ్రీ సాయిబాబాను ఆశ్రయించడం జరిగింది. తరువాత 1940లో స్వామి రామదాసు (కన్హన్ గఢ్)గారిని దర్శిం చాను. వారు నా గురించి విని, నిధులన్నింటికీ నిధియని చెప్పదగిన మహాత్ముని ఆశ్రయించావు. ఆయననెన్నడూ విడువకు" అన్నారు.

అలానే 1958లో విజయదశమికి ఋషీకేశ్ లోని స్వామి శివానందసరస్వతి గారిని సందేశం కోరగా “షిరిడి సాయిబాబా అంటే ఆనందసాగరమే! అంతకంటే గొప్పది మరేమున్నది?" అన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద అను సిద్ధపురుషుని యిటీవల నేను దర్శించాను. అప్పుడు వారు "శిరిడి సాయిబాబా అంటే దత్తాత్రేయుని అవతారమే!" అని, ఒక్కక్షణం ఆలోచించి, "కాదు, కాదు! వారు సాక్షాత్తూ దత్తాత్రేయులే!" అన్నారు.

కొద్ది సంవత్సరాల కిందట మద్రాసు వెళ్ళి నప్పుడు ఒక మిత్రుడు నన్ను ఒక భక్తురాలి దర్శనానికి తీసుకు వెళ్ళాడు. మేము వెళ్ళే సరికి శ్రీ మాతాజీ ధ్యాన సమాధిలో వివిథ దేవతా పటాలకి ఎదుట కూర్చుని వున్నారు. నేనొక మూల కూర్చొన్నాను. ఒక పావుగంట తర్వాత ఆమె "శిరిడి సాయిబాబా" అన్నారు. ఆయనే నా ఇష్టదైవమని వారికెలా తెలుసు ఆమె యింకా యిలా అన్నారు. "త్రిమూర్తుల్లో బ్రహ్మకు ఆలయం, పూజా లేవు. వారి మొదటి అవతారం త్రేతాయుగంలో వశిష్టమహర్షి, రెండవ అవతారం ద్వాపరయుగంలో దత్తాత్రేయుడు, మూడవ అవతారం కలియుగంలో షిరిడి సాయిబాబా!" అన్నారు.

బాబాకు ముందు కొందరు దత్తావతారులు వున్నారు కదా! అని మనసులో అనుకున్నాను. వెంటనే ఆమె “బాబాకు ముందున్న వారంతా దత్తాత్రేయుని అంశ అవతారాలే. ఈ యుగంలో శిరిడి సాయిబాబా ఒక్కరే సంపూర్ణ దత్తావతారం. ఇప్పుడు శివాలయాలు, రామ మందిరాలు వున్నట్లే, ఒకటి రెండు శతాబ్దాల్లో ప్రతి గ్రామంలోనూ సాయి మందిరాలు వెలుస్తాయి. అవి మన గ్రామ జీవితమంతటికి కేంద్రాలవుతాయి" అన్నారు.

(సాయిలీలామృతం నుండి)

*సాయితత్వ రహస్యం*..

మానవాళికి భగవంతుడు ఇచ్చిన మహనీయ వరం శ్రీ సాయి. శ్రీకృష్ణుడు మనిషి ఎలా బతకాలో భగవద్గీతలో చెప్పాడు .

శ్రీ సాయి అలా జీవించి చూపారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నోసమస్యలకు, బాధలకు ఏకైక పరిష్కారం సాయితత్త్వం. చిక్కులో పడి కొట్టుకుపోతున్న మనిషికి, అలసిన మనసుకు చేయుతనిచ్చి సేద తీర్చే సాధనం సాయితత్త్వమే. మానవాళికి ఉద్దరణ కోసం, మనిషిగా మానవత్వంలో ఎలా బతకాలో చెప్పటం కోసం శ్రీ సాయి తన కాలాన్ని మొత్తం వెచ్చించారు.

పూజా విధులు, పురస్కార తంతులు, విధి విధానాలు ... బాబాకు వీటితో పనిలేదు. శ్రద్ధ , సహనం ...ఇవి రెండే భక్తుల నుంచి కోరిన బాబా, వాటిని ఆచరించిన వారికి తన ప్రేమను పంచారు. సాయి ఆదర్శ జీవన విధానం మనవ సంశయాలను పటాపంచలు చేస్తుంది.

బాబా బోధనలు మనో వికాసాన్ని కలిగిస్తాయి . ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను అలవరుస్తాయి. అదే సాయితత్వ రహస్యం.
 
   సాయితత్వాన్ని నిత్యజీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతు౦ది జీవితం ధన్యమవుతుంది .సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటం కాక, జీవితమే ఒక సాధనగా మారుతుంది.

 శ్రీ సాయి సద్గురువు. ధర్మసూత్రాలు, సత్య ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు . స్వయంగా ఆచరించి చూపారు. అందుకే బాబా సమర్ధ సద్గురు అయ్యారు .మనిషి జీవిత పరమార్ధం ఏమిటి ?ఎలా నడుచుకోవాలి ?ఇదంతా బాబా ఆచరించి చూపారు .

ఆచరించి చూపటమే అవతార పురుషుని ప్రథమకర్తవ్యం కదా! బాబా చెప్పిన విషయాలను, బాబా జీవన విధానాలను చదివి మననం చేసుకోవటం ముఖ్యం. బాబా బోధనలు, మంచి మాటలు మన హృదయమనే క్షేత్రంలో మొలిచిన దుష్టబుద్దులు, చెడు లక్షణాలనే కలుపు మొక్కల్ని పెకిలించి వేస్తాయి.

 షిరిడి సాయిబాబా ఈ యుగావతరం. నేడు ప్రపంచ౦ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ‘శ్రీ సాయి సచ్చరిత్ర’లో పరిష్కారం లభిస్తుంది.

           *ఓం సాయిరాం*

0 comments: