Monday, April 7, 2014 By: visalakshi

పూర్ణ పురుషోత్తముడు - శ్రీరామచంద్రుడు




ఓం శ్రీ కోదండరామాయ నమో నమ:


ప్రార్ధన:

రామో మత్కులదైవతం సకరుణం రామం భజే సాదరం
రామేణా2ఖిలఘోరపాపనిహతీ రామాయ తస్మై నమ:
రామాన్నాస్తి జగత్త్ర్యైక సులభో రామస్య దాసో2స్మ్యహం
రామే ప్రీతి రతీవ మే కులగురో శ్రీరామ రక్షస్వ మాం.
                                                                         


 ఆదర్శరాజ్యం ఎలా ఉంటుందో తన పరిపాలన ద్వారా "ధర్మ నిరతి" తో తెలియజేసాడు శ్రీరాముడు. ధర్మ పరిరక్షణలో అనుబంధాలకు ప్రాముఖ్యం లేదని ఆచరించి మరీ చూపాడు.

 "ధర్మం" నిలువెత్తు రూపంలో మానవాకృతిని దాల్చి "శ్రీరామచంద్రుని"గా రూపుదిద్దుకుంది.

"రామాయణం" అంటే రాముని మార్గం. ఆ రాముని మార్గం రామాయణంలో ......

బాలకాండ:   
భక్తి మార్గంలో 'మనస్సు బాలుని మనస్సు లాగ స్వచ్చంగా ఉండాలి.ధనం,గౌరవం,జ్ఞానం ఎంత పెరిగినప్పటికీ మనస్సు మాత్రం బాలకుని లాగ స్వచ్చంగా ఉండాలి. హృదయం నిర్మలంగా నిష్కపటంగా ఉండాలి. ఇదే మనకు బాలకాండ నేర్పే ఆదర్శం.





అయోధ్యకాండ:   
ఎక్కడైతే దుర్బుద్ధి ,విరోధం, వాదోపవాదాలు లేవో అదే అయోధ్యాపురం. అక్కడ శ్రీరాముడు అవతరిస్తాడు. ఎప్పుడైతే మనస్సులో దురాలోచనలు మొదలవుతాయో అక్కడ రాముడు నిలువజాలడు.కైకేయి మనస్సులో దుర్బుద్ధి మొదలవగానే అయోధ్యను వదలి వెళ్ళాడు శ్రీరాముడు.అందువల్ల దుర్గుణాలకు తావివ్వకూడదని మనకు అయోధ్యకాండ తెలియజేస్తుంది.





అరణ్యకాండ:    
దట్టమైన అజ్ఞానారణ్యంలో చిక్కుకున్న సాధకులకు దారితెన్నులు చూపగలిగేవి ఇంద్రియ నిగ్రహం, వాసనాక్షయాలు మాత్రమే. సాధుసజ్జనుల సాంగత్యం ఆ మార్గాన్ని మరింత సుగమం చేస్తుంది.  శ్రీరామునికి శూర్పణక అనే మహా మోహం, శబరి అనే శుద్ధ భక్తి ఎదురయ్యాయి. అప్పుడు శ్రీరాముడు మోహాన్ని తృణీకరించి, భక్తిని ఆదరించాడు. మోహాన్ని విడిస్తే వివేకం, వైరాగ్యం జాగృతమై, భక్తిని పెంపొందిస్తాయి అనేది అరణ్యకాండ  సందేశం.


కిష్కిందకాండ: 
  శ్రీరామునితో సుగ్రీవుని మైత్రిని చేకూర్చినవాడు హనుమంతుడు(ఆచార్యుడు)  ఆదర్శ బ్రహ్మచారి అయిన హనుమంతుడు వారధిగా నిలిచి సుగ్రీవుడికీ(జీవాత్మ) శ్రీరాముడికీ(పరమాత్మ) మైత్రిని కలిగించాడు. రాముడు ఉన్నచోట కాముడు నిలవడు. అందువల్ల బ్రహ్మచర్యం ఆవశ్యకతను తెలియజేస్తూ, విషయానంద భ్రమలు తొలగితేనే బ్రహ్మానందంపై మనస్సు నిలవగలదనే సత్యాన్ని చాటుతుంది. కిష్కిందకాండ.





సుందరకాండ:   
 సుందరమైనది సుందరకాండ .మధురమైన రామనామామృతాన్ని గ్రోలిన వారి మనస్సులకి, రామనామాన్ని గట్టిగా పట్టుకున్నవారికి   భవసాగరాన్ని దాటడం అతి సునాయసమని ౠజువు చేస్తోంది. సుందరకాండ. నిరంతర రామనామ జపం వల్ల జగన్మాత (సీతామాత) దర్శనభాగ్యం కలగడమే కాక అజ్ఞానమనే అసుర లక్షణం అంతం కూడా సాధ్యమని వివరిస్తోంది.






యుద్ధకాండ:   
మానవునిలోని దశేంద్రియాలు పది తలల రావణునికి చిహ్నం. ఈ దశేంద్రియాలూ వాటి తాలూకు విషయాలు సంకల్పమనే అంతస్సూత్రంతో గుచ్చబడి ఉన్నాయి. ఆ తంతువు (దారం) తెగితేనే సంకల్పాలు క్షీణించి అది బ్రహ్మత్వానికి దారి తీయగలదు. దీనికోసం అచంచల కార్యదీక్ష, సం యమనం, స్థితప్రజ్ఞత అనే లక్షణాలు ఆవశ్యకం.ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొని ఒక సాధారణ మానవునిలా ప్రవర్తిస్తూనే రాముడు అసురవధ చేసాడు. మనకు ఆదర్శప్రాయమై నిలిచాడు.


ఉత్తరకాండ: 
 రాజ్య సం రక్షణ ;ధర్మ పరిపాలనలో ప్రజాభిప్రాయాలకు ప్రాధాన్యమిచ్చి,మమకార రహితంగా జగన్మాత అయిన సీతాదేవిని అడవులకు పంపవలసి వచ్చినా చలించలేదు. తాను సార్వభౌముడై ఉండి కూడా, భోగాలను త్యజించి, ఏకపత్నీ వ్రతానికి కట్టుబడి, ముని ప్రవృత్తిలో జీవనాన్ని కొనసాగించినవాడు శ్రీరామచంద్రుడు.బాహ్యదృష్టిని నిరోధిస్తే, జ్ఞాననేత్రం తెరుచుకోగలదని  ఉత్తరకాండ తెలియజేస్తోంది.



"ఆ ప్రాచీన ధీరయుగానికి  కన్నుల వెలుగైన శ్రీరాముడు మూర్తీభవించిన సత్య, ధర్మస్వరూపుడు, ఆదర్శతనయుడు, ఆదర్శపతి, ఆదర్శజనకుడు, అన్నిటికీ మించి ఆదర్శ నృపతి". - స్వామి వివేకానంద.


శ్రీరామ నవమి శుభాకాంక్షలతో........












      



1 comments:

durgeswara said...

జై శ్రీరాం