శ్రీ బాబాగారు సాయి సత్యచరిత్ర 27వ అధ్యాయంలో తమ భక్తులపై చూపే అనుగ్రహం ఇలా...ఒకసారి ప్రసన్నులైతే సద్గురువు ఆ భక్తులని అనేకరకాల ఉపాయాలతో ఉద్ధరించడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఒకానొక భక్తుడికి తాను స్వయంగా ఎన్నుకొన్న మార్గం నచ్చినా కానీ సద్గురు అభిప్రాయం ప్రకారం ఆ మార్గం ఆభక్తుడికి అయోగ్యమైనదైతే ఆయన ఆ మార్గం గురించి ఎలాంటి ఉత్తేజాన్నీ ఇవ్వకుండా దాన్నుంచి అతన్ని వెనక్కి మరలుస్తారు.
సాయిబాబా పద్ధతి అదే. భక్తులు ధార్మిక గ్రంధాలను అంగడి నుంచి తెచ్చి బాబా చేతికిచ్చేవారు. వారి చేతినుంచి మరల ప్రసాదంగా ఆ గ్రంధాలను తీసుకోవాలని కోరుకొనేవారు. అలా చేస్తే తమ ఆ పుస్తక పారాయణలోని బోధ యధావిధిగా అర్ధమౌతుందని వారనుకొనేవారు. కానీ బాబా ఆ గ్రంధాలను అందరికీ తిరిగి ఇచ్చేవారు కాదు. భక్తుల బుద్ధి, వారి గ్రహణశక్తి, స్వభావంలోని నిజానిజాలను చూసి ఆయన వాటిని వారికి ఇస్తుండేవారు. మిగిలినవి శ్యామాకి సంగ్రహం కోసం ఇచ్చేసేవారు.
శ్యామా కాకా మహాజని నుంచి చదవటం కోసం తీసుకొన్న ఏకనాధభాగవతాన్ని బాబా చూడటానికి అని అడిగి తీసుకొని శ్యామాకి దాన్ని ఇచ్చారు. ఎందుకంటే అది చదవాలని శ్యామాకి మనసులో కోరిక కలుగుట వలన..ఆకోరికను బాబాగారు నిజంచేయుటకు ఆ పుస్తకం శ్యామాకు ఇచ్చారు. కాకామహాజనికి ఆ తరువాత బాబా కరుణతో మరో భాగవతాన్నిచ్చి పదిలపరుచుకోమన్నారు.
బాపూసాహెబు జోగ్ కొచ్చిన 'గీతారహస్యం ' పార్శిల్ ఎవరో పంపగా వచ్చింది. అసలు బాబానే ఈ ఏర్పాటు చేసి ఉండవచ్చు. జోగ్ బాబా పాదాలకు నమస్కరిస్తున్నప్పుడు సరిగ్గా ఆ పుస్తకం బాబా చరణాలపై పడటం, బాబా అతన్ని దాని గురించి అడగటం ఈ ఘటన చాలా అద్భుతం. తిలక్ గారి గీతారహస్యం(అంటే కర్మయోగ శాస్త్రం గురించిఉన్న ఈ పుస్తకాన్ని) జోగ్ తప్పక చదవాలి అన్న సంకల్పం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే జోగ్ భార్య జీవించివున్నప్పుడు అతని మనసులో సన్యసించాలన్న ఆలోచన వచ్చింది. సర్వజ్ఞులైన బాబాకిది తెలుసు. సన్యసించటానికి అతనికి అప్పటికింకా ఆలస్యం ఉంది. ఆ సమయం వచ్చేవరకు జోగ్ తన సంసారంలోని కర్తవ్యం నెరవేర్చవలసి ఉంది. కనుకే బాబా ఆ ఏర్పాటు చేసారు. తరువాత జోగ్ భార్య మరణించింది. జోగ్ నిజంగా సన్యాసం తీసుకొన్నాడు. శ్యామాని ఏకనాధ భాగవతం చదవమనటం, సుశిక్షితుడైన జోగ్ ని గీతారహస్యం చదవమని చెప్పటం..బాబా భక్తుల అధికారాన్ని చూసి వారిని అనుగ్రహిస్తారనటానికి చక్కని నిదర్శనం.
శ్యామాకి రామదాసు వద్ద ఉన్న విష్ణుసహస్రనామ పారాయణ గ్రంధం ఇవ్వటం బాబాకి భక్తులపట్ల ఉన్న అనన్యకారుణ్యాన్ని చూపిస్తుంది.తరువాత రామదాసుకి కూదా క్రోధాన్నీ, అలాగే లోభాన్నీ కూడా పెట్టుకోరాదన్న రామదాస సంప్రదాయానికి శోభ కలిగేలా వ్యవహరించటం గురించిన బోధను బాబా ఇచ్చారు. బాబా బోధనా పద్ధతి ధన్యం.
భగవంతుడు తన భక్తులచేతిలో ఆటబొమ్మ. అమాయకులు, భావికులు అయిన భక్తులకోసం ఆయన అలమటిస్తుంటాడు. వాళ్ళ ప్రేమకోసం వారికి అంకితమవుతాడు.
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.
1 comments:
సాయి భక్తులకు అభివందనములు. శ్రీ సద్గురు సాయి అనుగ్రహ, ఆశ్శీసులతో, శ్రీ సాయి భక్తులకు నా మనసులో శ్రీ సాయినాధుని పట్ల కలిగే భావాలను మీతో పంచుకునేందుకు శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం అనే బ్లాగును పూర్తిగా తెలుగులో ఇటీవలే ప్రారంభించాను. ఈ క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా ఈ బ్లాగును దర్శించి, మీ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించవల్సిందిగా ప్రార్ధిస్తున్నాను.
www.chsairutvik.blogspot.in
Dear Sai Devotees. Recently I have launched a new blog in Telugu, dedicated to the teachings and experiences with Shri Sai Baba of Shirdi. The same can be reached at www.chsairutvik.blogspot.in
Request all to read the blog and offer your valuable feedback and suggestions.
Post a Comment