Thursday, November 17, 2016 By: visalakshi

మేఘశ్యాముడి భక్తిఫలం

 సాయి సత్యచరిత్ర 28వ అధ్యాయములో మేఘుడు..ఆతని శివభక్తిని గూర్చి తెలుసుకుందాం..

ఒక గుజరాతీ బ్రాహ్మణుడు (మేఘుడు) రావుబహదూర్ సాఠె వద్ద పని చేసేవాడు. సాఠె అతన్ని నిత్యపూజలకోసం శివాలయంలో పూజారిగా పెట్టాడు. తరువాత సాఠె శిరిడీకి వచ్చాడు. అక్కడ సాయిమహరాజు సాన్నిధ్యం లభించింది. సాఠె మేఘుడికి గాయత్రీమంత్రం ఉపదేశించి, మంచిమార్గంలో ప్రవేశపెట్టాడు. మేఘుడు సాఠెని గురువుగా భావించేవాడు.  సాఠె బాబాను గురువుగా కొలిచేవాడు. ఓసారి సహజంగా మేఘుడితో మాట్లాడుతూ బాబాగారి గొప్పతనం గురించి చెఫ్ఫేటప్పుడు సాఠె హృదయంలో ప్రేమ ఉప్పెనలా పొంగి, "బాబాకి గంగాజలంతో స్నానం చేయించాలని నా మనసులో తీవ్రంగా కోరిక కలిగింది. అందుకు నిన్ను నేను శిరిడీ పంపుతున్నాను. నీ అనన్య సేవ చూసాక నాకేమనిపిస్తోందంటే, ఆ సద్గురువుతో నీకు సాంగత్యం ఏర్పడాలి. ఆయన చరణాల్లో నీకు భక్తి కలగాలి. వెళ్ళి కాయా, వాచా, మనసా నువ్వు ఆ సద్గురువు పాదాలు పట్టుకో. నీ జన్మ సార్ధకమౌతుంది . మేఘుడు ఎవరా సద్గురువు జాతి ఏమిటి? అని అడిగాడు. నిజం చెప్పాలంటే సాఠెకి కూడా ఆ విషయం తెలియదు. "మశీదులో ఉంటారు కనుక ఆయన్ని ముస్లిం అంటారు." ముస్లిం అన్న పదం వినగానే మేఘుడి మనసు తల్లడిల్లిపోయింది. అతను మనసులో ఆయన గురుత్వం ఎంతటిది? కాదు అంటే సాఠె కోపిస్తాడు. సరే అందామంటే తను ఖచ్చితంగా దుర్గతిపాలౌతాడు. మేఘుడికి ఏంచెయ్యాలో తోచలేదు. కానీ సాఠె ఎంతో బలవంతం చేయటం వల్ల అతను బాబాని దర్శనం చేసుకోవాలని శిరిడీ వచ్చాడు. మశీదు ప్రాంగణం చేరుకున్నాడు.    అతను మశీదు మెట్లెక్కేటప్పుడు "ఖబద్దార్! ఇంకో అడుగు వేసావంటే చూడు.గుర్తుంచుకో ఇది ముస్లింలుండే స్థానం. నీవు బ్రాహ్మణుడివి. నేను నీకు అంటరానివాణ్ణి వెళ్ళు. " ఉగ్రంగా ఉన్న బాబా రూపంసాక్షాత్తూ ప్రళయకాలంలోని రుద్రుడి స్వరూపమే. మేఘుడు గజగజ కంపించిపోయాడు. బాబాకి నా మనసులోని విషయాలెలా తెలుసు అని నిర్ఘాంతపోయాడు. ముందుకెళ్ళే ధైర్యం లేక కొద్దిరోజులు శిరిడీలో ఉండిపోయాడు. బాబా కోపతాపాలు చూసాడు. సేవ చేశాడు. కానీ దృఢవిశ్వాసం మాత్రం కలగలేదు. తరువాత అతను ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ విపరీతమైన జ్వరంతో బాధపడి, బాబాపై గాలి మళ్ళగానే తిరిగి శిరిడీ వచ్చేశాడు. 




 అతనికి సాయిబాబా చరణాలపై భక్తిభావం కుదిరింది. సాయికి అనన్య భక్తుడిగా అయ్యాడు. బాబా అంటే ప్రత్యక్షంగా శంకర భగవానుడే అన్న భావన అతనికి కల్గింది. శిరిడీలో బిల్వవృక్షం లేదని, నాలుగు కిలోమీటర్ల దూరం నడచి వెళ్ళి.బిల్వపత్రాలతో బాబాని కొలిచేవాడు. ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించటం, బాబా పాదాలు నొక్కటం, కడగటం, ఆయన చరణతీర్ధాన్ని త్రాగటం - ఇదే అతని నిత్యక్రమం.  మేఘుడు శిరిడీలో గ్రామ దేవతలను పూజించి, మశీదుకు వెళ్ళేవాడు. ఒకరోజు అతని నియమం తప్పిపోయింది. ఎంత ప్రయత్నించినా ఖండోభా తలుపులు తెరుచుకోలేదు. పూజకు అంతరాయం కలిగింది. అలాగే మేఘుడు హారతి తీసుకొని మశీదుకు వచ్చాడు. బాబా అతనితో నీ పూజకు అంతరాయం కలిగింది. సర్వదేవతల పూజను చేసావు కానీ ఒకదైవం పూజ చేయలేదు. వెళ్ళు తలుపులు తెరచివున్నాయి ..అది పూర్తి చేసి ఇక్కడికి రా అన్నారు. అతని మనసులో అశాంతి తొలగిపోయింది. మేఘుడు ఖండోబాని పూజించి, గంధపుష్పాది ఎనిమిది ఉపచారాలతో బాబాని పూజించాడు. 




ఒక మకరసంక్రాంతి నాడు  మేఘుడు తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసితీరవలెనని పట్టుబట్టెను. మేఘశ్యాముడు 8 క్రోసుల దూరమునున్న నదీతీరము నుండి గంగాజలము తెచ్చి  బాబా వద్దకు వచ్చి మరల అభిషేకమునకై అడుగగా.. సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకుసాచి ..ఓ మేఘా శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్ళు పోయుము. శరీరమంతటిపై పోసినట్లగును" సరే అని మేఘుడు భక్తిపారవశ్యమున 'హరగంగే, హరగంగే' అనుచు శరీరమంతటిపై నీళ్ళు పోసెను. బాబా వైపు చూడగా అతని ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి, శరీరమంతయు పొడిగా నుండెను. ఇదే సాయి భక్తియొక్క సారం. ఆ భక్తి అంటూ ఏర్పడితే అప్పుడు ఆ భక్తులు దేన్నైనా ప్రాప్తింపచేసుకోగలరు.

 మేఘశ్యాముడు బాబాను రెండుచోట్ల పూజించుచుండెను. మశీదులో ప్రత్యక్షంగా, సాఠెవాడాలో నానాసాహెబ్ చాందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఒకనాడు వేకువఝామున మేఘుడు తనశయ్యపై పడుకొని కండ్లుమూసుకొని లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూసెను. బాబా అతనిపై అక్షతలు చల్లి "మేఘా! త్రిశూలము గీయుము"! అని చెప్పి అదృశ్యుడయ్యెను.ఇది కలా నిజమా అని చూడగా అక్కడ అక్షతలు పడియుండెను. బాబా వద్దకు వెళ్ళి త్రిశూలం సంగతి అడుగగా..నా మాటలు వినలేదా? త్రిశూలము గీయి. దృశ్యము కాదు నేనేచెప్పాను. నేను ప్రవేశించడానికి తలుపులు అవసరం లేదు. నాకు ఆకారమూ లేదు విస్తరణా లేదు. నేను సర్వదా అంతటా వ్యాపించి వున్నాను. మేఘుడు వాడాలో బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్రరంగుతో గీసెను. ఆ మరునాడు ఒక రామదాస భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అక్కడ మేఘుడు కూడా ఉండెను. "చూడు శంకరుడు వచ్చినాడు! జాగ్రత్తగా పూజింపుము!" మేఘుడు త్రిశూలము గీసిన వెంటనే లింగము వచ్చుట చూసి ఆశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానము చేసి సాయిని తలచుకొనుచుండగా తన మనోదృష్టి యందు లింగము వచ్చుట గాంచెను. అతడాశ్చర్యపడుచుండగా మేఘుడు వచ్చి, బాబా తనకు లింగము కానుకగా ఇచ్చెనని చూపెను. కాకాసాహెబ్ కి ఈ లింగం విశిష్టతను చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. ఒక క్షణం ముందర ఎవరి ఆకారమూ, చిహ్నమూ ధ్యానంలో వచ్చాయో అదే లింగాన్ని చూసి దీక్షిత్ మనసు సుఖించింది. ఈ ప్రకారంగా గోడమీద త్రిశూల ఆకారం గీయించి, తన చిత్రం పక్కన శివలింగస్థాపన చేయించారు బాబా. మేఘుడికి శంకరుని పూజ అంటే ఇష్టమని అతనికి శివలింగాన్నిచ్చి అతని శివభక్తిని బాబా దృఢం చేశారు.











  ఈ మేఘుడు బ్రహ్మచారి. ప్రతిరోజు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసి దేహమంతా భస్మం పూసుకొని మృగచర్మంపై కూచునేవాడు. ఫాలభాగంపై అడ్డుగా విభూతిరేఖలు దిద్దుకొని తెల్లటి చందనం పెట్టుకొనేవాడు. తన దేహంలో తపోబలాన్ని మరొక జలంధరుడులా ప్రతిబింబించేవాడు. నిజంగానే మేఘుడి తపస్సు గొప్పది. అతను బాబా హారతి కూడా ఒంటికాలిమీదే నిలబడి చేసేవాడని అంటారు. బాబాకి అతనితో ఏదో ఋణానుబంధం ఉండి ఉంటుంది. లేకపోతే అతన్ని రావ్ బహదూర్ సాఠె ద్వారా శిరిడీకి లాగి, శంకరుడు సాక్షాత్తూ తానే అన్నట్లు అతని భక్తి పట్లా, తపశ్చర్య పట్లా ప్రసన్నులై బాబాగారు క్రీ.శ 1912వ సంవత్సరంలో శిరిడీలో తమ వద్ద మేఘుడు మరణించినప్పుడు స్వయంగా అతని శ్మశాన యాత్రలో తాము ఉండి, అతని దేహంపై పూలు జల్లి, అతనికి సద్గతిని ప్రసాదించారు. మేఘుడు అదృష్టవంతుడు. మేఘుడు జన్మ ధన్యం. మేఘుడు తన జీవితాన్ని సార్ధకం చేసుకొన్నాడు. గురుకృప ఉన్నప్పటికీ సాధకులు తమ సాధన తామే స్వయంగా చేసుకోవాలి. గురువు కేవలం మార్గదర్శనం చేస్తూ వారి  సాధనను నడిపిస్తారు. బాబాఇలా చెప్పారు. " మీరు తీవ్రంగా ప్రయత్నించండి! ప్రతిఫలాపేక్షను పూర్తిగా వదిలేయండి. మీకు ఫలాన్నివ్వటానికి మీ వెనక నేను నిలబడి ఉన్నాను."



   సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు








0 comments: