Monday, September 27, 2021 12 comments By: visalakshi

మృత్యుంజయుడు - శ్రీ సాయి బాబా

ఓం శ్రీ ద్వారకామాయి యే నమో నమః


"నీ ఆలోచనలకు, లక్ష్యాలకు నన్నే ముఖ్య కేంద్రంగా చేసుకో! పరమార్థం లభిస్తుంది. అచంచల విశ్వాసంతో గురువును ఎప్పుడూ అంటిపెట్టుకొనిఉండు..అదిచాలు!"...శ్రీసాయిబాబా.

మానవునిలో సమతను, మమతను పెంపొందించి మనిషిని దివ్యునిగా రూపొందించగల మార్గమైన 'మతమే' తద్విరుధ్ధమైన పాశవిక పైశాచిక ప్రయోజనాలకు  సాధనం  కావడమే  నిజమైన 'ధర్మగ్లాని'! అంటే ధర్మానికి పట్టిన జబ్బు! సమాజంలో ఈ ధర్మగ్లాని ముదిరి శృతిమించి రాగాన పడే సమయంలో మానవాళికి  సన్మార్గాన్ని  చూపటానికి 
అవతార పురుషులుదయిస్తారు. ధర్మగ్లాని ని మాన్పి లక్షలాది మందిని శుభమార్గంలో నడిపించడానికి ఈ యుగంలో అవతరించిన యుగపురుషుడు  శ్రీ సాయి బాబా.

శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ రమణ మహర్షి మొదలైన మహాత్ములు సర్వ మతాల సారం ఒక్కటేనని అన్ని భేదాలకు అతీతమైన ఆధ్యాత్మికానుభూతే పరమ సత్యమని బోధించేవారు. వారు 'జన్మతః' ఒక మతానికి చెందిన వారు అని తెలియటం చేత, ఇతర మతస్తులకు వారి హితవు అంతగా చెవికెక్కకపోవడం చూస్తాం. ఆ మహాత్ముల దివ్యసందేశాన్ని ఆచరించడానికి బదులు వారు మా మతానికి చెందినవారని చాటుకొని గర్వించడానికి మాత్రమే ఆ మత అనుయాయులు ఉపయోగించుకోవడం కూడా చూస్తున్నాం. 

అందుకే శ్రీ సాయి తమ జన్మ వివరాలను ఒక 'దేవరహస్యంగా'ఉంచారు. సర్వమతాలలోని శ్రేష్ఠ లక్షణాలు ఆయనలో మూర్తీభవించి గోచరిస్తాయి.

ఈ సామరస్యం ఎంత అద్భుతంగా ఆయనలో ఇమిడిందంటే..,వివిధ మతాల ఛాందసవాదులు కూడా ఏమాత్రం సంకోచం లేకుండా ఆయనను 'తనవాడిగా' అనుకునేంత కనిపిస్తుంది. "ఇది మానవాళి ఆధ్యాత్మిక చరిత్రలోనే అపూర్వం." మతవిద్వేషాగ్నిలో సమిధలవుతున్న మనలోని అరిషడ్వర్గాలను , స్వార్ధపరత్వాన్నీ తమ జ్ఞానాగ్ని అనే 'ధుని'లో భస్మం చేసి ,దానికి ఫలమైన మహిమాన్వితమైన "ఊదీ"ని మనకు ప్రసాదిస్తున్నారు శ్రీ సాయి. శ్రీ సాయి అద్భుత తత్వమిది..

శ్రీ సాయి బాబా అవతార కార్యంలో ప్రధాన అంశమైన ఈ  సర్వమత సమరస  భావాన్ని త్రికరణశుధ్ధిగా ఆచరించనిదే ఎప్పటికీ మనం సాయి భక్తులవలేము.



ఈశ్వరుడు తప్ప తక్కినదంతయు మృతమే. మృతమనగా చచ్చినది అని అర్ధం . మరణం మరు జన్మకు బీజకారణం. మరుజన్మ లేక పోవుటకు అమృతమని పేరు. దుఃఖించుచూ చనిపోయిన మనకు దుఃఖించెడి జన్మమే కలుగును. ఆనందంగా ప్రాణత్యాగం కావించిన ఆ స్థితికి అమృతమని పేరు.మృతము గాక అమృతము నొసగునది ఈశ్వరుడు.

మోక్షం అనగా విడివడుట.
తగులుకున్నవాడు  దాని  నుండి
తప్పించుకొనుటయే  మోక్షం.. 

"నా గురువు నన్ను ఈ దేహంనుండి ఏనాడో విడుదల చేసాడు." అని శ్రీ సాయి బాబా చెప్పింది ఇటువంటి జీవన్ముక్తి గురించే.

ఒక సందర్భంలో బాబా "నన్ను ప్రసవించినప్పుడు తనకు కుమారుడు కలిగి నందుకు నా తల్లి ఎంతో ఉప్పొంగిపోయింది.  నా మటుకు నాకు ఆమె సంతోషం చూసి ఆశ్చర్యం వేసింది. నిజానికి నన్ను ఆమె కన్నదెప్పుడు? అసలు నాకు పుట్టుక ఉన్నదా? అంతకు ముందు మాత్రం నేను లేనా? అని అన్నారు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. "జాతస్యహి మరణం ధృవం". అయితే జననమే లేని శ్రీ సాయికి మరణం మాత్రం ఎక్కడిది?

1886 లో శ్రీ సాయి "భగత్ !నేను అల్లా వద్దకు వెళుతున్నాను. నీవు నిర్జీవమైన ఈ దేహాన్ని భద్రపరచమని మహల్సాపతికి చెప్పి దేహత్యాగం చేసి అనగా వారు సూక్ష్మ శరీరాన్ని వేరు చేయడం ద్వారా  72గంటలపాటు అనగా 3రోజులు నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నారు. 3రోజుల తరువాత తిరిగి తన దేహంలో ప్రవేశించి ,ఆ తరువాత సుమారు 32 సం"లు అదే దేహంతో సంచరించిన శ్రీసాయికన్నా మృత్యుంజయుడెవరు?

సాయి అంటే ఒక శరీరం కాదు అని, శరీరాన్ని ధరించిన దివ్యశక్తి..ఆత్మజ్యోతి అనిమనం గ్రహించాలి.బాబాయొక్క మృత్యుంజయత్వం కేవలం తన దేహానికే పరిమితం కాదు. అన్ని విధాలా ఆశలు పూర్తిగా వదులుకొని ఇక జీవించడం అసంభవం అనుకున్న ఎందరో భక్తులను మృత్యుముఖం నుండి బాబా రక్షించారు. తన భక్తులను మృత్యువు నుండి రక్షించే సందర్భాలలో ఏదో అదృశ్యశక్తితో ఘర్షణ పడుతున్నట్లు తిడుతూ, బెదిరిస్తూ , అదిలిస్తూ..బాబా చేసే చర్యలు....తన భక్తుడయిన మార్కండేయుని ప్రాణం రక్షించడానికి ఆ ముక్కంటి మృత్యుదేవతతో పోరాటానికి సిధ్ధమయ్యాడని చెప్పే పురాణకధలను స్మృతికి తేక మానవు.

బాబా మృత్యుంజయుడు కనుకనే  "నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. నా నామం పలుకుతుంది. నా మట్టి సమాధానమిస్తుంది." అని హామీ ఇచ్చి ఆ హామీని ఇప్పటికీ నెరవేరుస్తున్నారు. అందుకే శ్రీ సాయినాధుని కన్నా మృత్యుంజయుడెవరు? సాయినామాన్ని మించిన మృత్యుంజయ మంత్రమేమున్నది? 

శ్రీ సాయి మహత్యాలు భక్తులు దర్శించి అనుగ్రహముతో తెలుసుకున్నవే..వారు ఏ చమత్కారాలు చేయలేదు.. మంత్రోపదేశాలు చేయలేదు.

'నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను!
నేను ఇవ్వదలచినది వారు అడిగేంతవరకూ!
కోరికలను తీర్చి దిద్దుటయే శ్రీ సాయి విధానము...

    సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు..