Wednesday, September 20, 2017 0 comments By: visalakshi

హృదయకమలం - జగన్మాత



దైవానికి ప్రతిరూపం "తల్లి జగన్మాత" . అమ్మ అయినా అమ్మలగన్న అమ్మ అయినా నిష్కల్మష హృదయంతో పరితపించగలిగితే ఆ పరమేశ్వరి ప్రత్యక్షమవుతుంది. అందుకు మన హృదయం పసిహృదయంలా పరితపించాలి. 

'యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా!..యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా!.. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా!'

సకల గుణాల సంయుక్త అయిన ఆ జగన్మాత సర్వజీవుల్లోనూ విరాజిల్లుతోంది. మనలో ఉన్న బుద్ధికీ, స్మృతికీ, శక్తికీ ఆధారం ఆ ఆదిపరాశక్తియే! కానీ అహంకారంతో మన బుద్ధికుశలత, మన శక్తిసామర్ధ్యాల వల్లే మనం సాధించామని అనుకుంటాం. మనలో క్షుధారూపంలోనూ, నిద్రారూపంలోనూ ఉన్నది ఆ జగన్మాతే! కానీ మనం కొన్ని డిగ్రీలు చేతబట్టుకొని కొంత అధికారం సంపాదించి సంపాదన కలగగానే మనలోని శక్తులన్నింటికి మూలాధారమైన దైవాన్ని మరచిపోతాం. 'నేను' అన్న అహంకారంతో కనురెప్పలనే నియంత్రించలేని మనం ప్రపంచాన్ని శాసించాలనుకుంటాం. అలాంటి భ్రమల్ని పోగొట్టి ఈ 'నేను' అనే అహంకారాన్ని అజ్ఞానాన్ని తొలగించడానికి ఆ జగన్మాత మన హృదయకమలంగా అంతరంలో ఉండి అవసరమైతే శిక్షించి తగిన గుణపాఠం నేర్పుతుంది.  కనువిప్పు కలిగిస్తుంది.  మన జ్ఞాపక శక్తికి ఆధారం ఆ జగన్మాతే!..మనలో శక్తిరూపంలో ఉన్నది ఆ జగన్మాతే! సర్వశక్తులకూ మూలాధారం అమ్మలగన్న అమ్మ జగన్మాత. 



శరదృతువు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ఆరంభమయ్యే తొలి తొమ్మిదిరోజుల శక్తిరూపిణీ పూజలకి ఫలితంగా పదవనాటి ప్రత్యేక పర్వదినమే దసరా పండుగ. 'దశహర ' అన్న సంస్కృత పదానికి దసరా వ్యవహారమైంది కానీ వాస్తవానికి 'దశదోషహరం ' (పది దోషాలను పోగొట్టేది)అన్న అర్ధంతో కూడిన పండుగే ఇది. ఈ తొమ్మిది రాత్రులను శరన్నవరాత్రులంటారు. అమ్మవారిని శారదారాధ్యా అన్న నామంతో పూజిస్తారు తొమ్మిదిరోజులూ..'నవ ' అంటే సంఖ్యాపరంగా 9 ..సాహిత్యపరంగా కొత్తదన్న అర్ధం సూచిస్తోంది. 9వ సంఖ్య పూర్ణత్వ సంకేతం. సృష్టి నవాత్మకం- నవరసాత్మకం- అదే ఏకశక్తి. ఏకత్వం నవత్వంగా విస్తరించడమే విశ్వప్రణాలికారహస్యం. ఈ శక్తి చైతన్యమే సౌందర్యం. నవదుర్గలు అంటే  క్తిస్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించిందని ప్రతి అవతారం నుండి రెండు రూపాలు వెలువడినాయని కధనం. 9 స్వరూపిణులుగా అనగా నవదుర్గలుగా దుర్గను పూజిస్తారు. తొమ్మిది సౌందర్య రూపాలుగా విభజించుకుని ' శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి లేదా మహిషాసురమర్దినీదేవి ' అని తొమ్మిదిరోజులూ పూజించి పదవరోజున కార్యసిద్ధి కోసం   కోరుకున్న విషయానికి పునాదిరాయి వేసుకుని    పూర్ణఫలం పొండడానికి ప్రయత్నించాలి. 

పూర్వం రోజుల్లో దసరాపండుగనాడు సరస్వతీ పూజరోజున ఉపాధ్యాయులందరికీ సన్మానాలు చేసి పిల్లలతో "సరస్వతీ నమస్తుభ్యం వరదేకామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా..".అంటూ శ్లోకాలను పాడించేవారు. విజయదశమి రోజు శుభప్రదంగా శుభకార్యాలను ప్రారంభించేవారు.శక్తిరూపంగా పూజింపబడే తల్లి శ్రీమాత. తొమ్మిది రూపాలతో అర్చించిన దుర్గామాతను చివరగా "దుర్గాదేవి జగన్మాత స్వస్థానంగచ్చ పూజితే" అంటూ అమ్మవారిని సాగనంపి జలనిమజ్జనం చేయడంతో పండగ పూర్తవుతుంది. మన హృదయకమలంగా ప్రతిష్టిత అయిన ఆ జగన్మాతను "నీవు లేనిదే మేము లేము" అన్న సుస్థిరభావం కలిగేలా అమ్మను ప్రార్ధిద్దాం. ముగురమ్మల ప్రతిరూపమైన తల్లిని ఆరాధనాభావంతో కొలుద్దాం. ఆ జగన్మాత ప్రసాదించిన సర్వశక్తులనూ సద్వినియోగపరుచుకునేందుకు ప్రయత్నిద్దాం. నిరంతరం ఆదిపరాశక్తి స్మరణలో జీవిద్దాం.సర్వజీవులయందూ మాతృరూపంగా ప్రతిష్ఠితమై ఉన్న దేవికి పదే పదే నమస్కారములు. 
"ఓం శ్రీమాత్రే నమ:"      



మొదటిరోజు విశిష్టత..శైలపుత్రి..సాక్షాత్తు పరమశివుడిని పరిణయమాడిన పార్వతీదేవి ఈమె. పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు "శైలపుత్రి" అనే నామము వచ్చింది.వృషభ వాహనారాఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమ చేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. మానవ శరీరంలో 108 చక్రాలుంటే వాటిలో ప్రధానమైన ఆరు చక్రాలలో అమ్మవారు నివసిస్తుందని లలితాసహస్రం 'షట్చక్రోపరివాసిని ' అన్నది నామం. ఈ చక్రాలలో మూలాధారచక్రంలో ఉంటుంది శైలపుత్రి. హిమశైలానికి భూమి ఆధారం. మూలాధార చక్రానికీ, భూమికీ అన్వయం చెబుతారు. ఈ చక్రం ఎరుపురంగులో ఉంటుంది. ప్రతి చక్రాధిదేవతకూ పద్మాలను కలిగిన హస్తాలుండడం విశేషం. రేపు శైలపుత్రిగా మాత అలంకరణ... 
నవదుర్గలు......



శైలపుత్రి:  వందే వాంచితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం!
                వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం!!

బ్రహ్మచారిణి: దధానా కరపద్మాభ్యాం  అక్షమాలాకమండల:!
                   దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా !!

చంద్రఘంట: పిండజప్రవరారూఢా చండకోపాస్త్ర  కైర్యుతా !
                   ప్రసాదం తనుతే మహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా !!

కూష్మాండ: సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ !
                 దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే !!

స్కందమాత: సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా !
                   శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ !!

కాత్యాయని: చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా !
                   కాత్యాయనీ శుభం దద్యాద్దేవి దానవఘాతినీ !!

కాళరాత్రి:  ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నఖరా స్థితా
               లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ !
               వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా
               వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ !!

మహాగౌరి:  శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచి: !
                మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా !!

సిద్ధధాత్రి:  సిద్ధ గంధర్వ యక్షాద్యై: అసురైర మరైరపి !
               సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ !!

             సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే !
             శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమో2స్తుతే !!

"జగన్మాత ఆశీస్సులతో శరన్నవరాత్రి శుభాకాంక్షలు..."