వసంత పంచమి ...
మాఘశుద్ధ పంచమిని సరస్వతీ జయంతిగా ఆరాధించడం అనేది మనకి పురాణాలలోను, ఇతర శాస్త్రాలలోను కనబడుతున్నటువంటి అంశం.
ఈ మాఘశుద్ధ పంచమికే వసంత పంచమి అని వ్యవహారం ఉన్నది.
నిజానికి వసంత ఋతువు చైత్రమాసంలో వస్తుంది, కానీ శాస్త్రరీత్యా దీనికి శ్రీపంచమి అనే పేరు ప్రసిద్ధిగా కనిపిస్తున్నది.
ఈరోజున సరస్వతీ దేవి ఆవిర్భావదినంగా దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం ప్రస్తావిస్తున్న అంశములు.
పరమ పురుషుని యొక్క వదనం నుంచి సరస్వతీ దేవి ఆవిర్భవించింది అని కథ, ఇందులో ఉన్న సంకేతార్థం ఏమిటంటే ఈ జగతి అంతటికీ కారణమైనటువంటి పరమేశ్వరుడు, విరాట్ పురుషుడు; ఆయన యొక్క వాక్కు, బుద్ధి, జ్ఞానము ఈ మూడింటి యొక్క స్వరూపమే సరస్వతి.
మనం కూడా ఏదైనా పని చేయాలంటే మననుంచి రకరకాల శక్తులు వ్యక్తమవుతుంటాయి.
అందులో జ్ఞానశక్తితో ఏదైనా ఒక విషయాన్ని జ్ఞానశక్తితో, క్రియాశక్తితో, ఇచ్ఛాశక్తితో చేయగలం.
ఒక పని చేయడానికి మనయొక్క వాక్కు, బుద్ధి, జ్ఞానము ఎలా కావాలో ఈ విశాలమైన విశ్వమనేటటువంటి దీని యొక్క సృష్టిస్థితిలయలు చేయడానికి పరమేశ్వరుడికి కూడా ఒక జ్ఞానము, ఒక వాక్కు, ఒక బుద్ధి ఉంది.
ఆయన యొక్క బుద్ధి, జ్ఞానము ఏదైతే ఉందో ఆ శక్తిని మనం సరస్వతి అని ఉపాసన చేస్తున్నాం.
ఆ సరస్వతి ఈనాడు విరాట్ పురుషుని నుంచి ఆవిర్భవించింది. అని మనకు శాస్త్రం చెప్తున్న వాక్యం, అందుకే ఈరోజున సరస్వతీ దేవి ఆరాధన అత్యంత ప్రశస్తిగా ఉన్నది.
కేవలం భూలోక మానవులు మాత్రమే కాకుండా దేవలోకంలో వారు కూడా ఈరోజు సరస్వతీ దేవిని ఆరాధిస్తారు అని దేవీభాగవతం చెప్తున్నది.
అందుకు ఈరోజున విద్యార్థులు, పెద్దవారు అందరూ కూడా అమ్మవారిని వివిధ విధాలుగా పూజించాలి అని శాస్త్రం చెప్తున్న విషయం.
అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు.సరస్వతీ మాత ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది.. అమ్మ కరుణతో సద్భుద్ధిని పొందుతారు.
మేధ ,ఆలోచన ,ప్రతిభ ,ధారణ ,ప్రజ్ఞ ,స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని అంటారు.
అహింస కు అధినాయిక సరస్వతీ దేవి. సరః అంటే కాంతి. కాంతినీ ఇచ్చే మాత సరస్వతి. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరంచేసి విజ్ఞానాన్నిఅందించే సరస్వతీ మాత పుస్తకం, జపమాల ,అభయముద్రలను ధరించి ఉంటుంది. జ్ఞాన కాంతిని అందించే ఈ తల్లిని తెల్లని పూవులతోనూ ,శ్వేత వస్త్రాలతోనూ ,శ్రీ గంధము తోనూ అలంకరిస్తారు. క్షీరాన్నం..అరటిపళ్ళు.. నారికేళ నివేదన చేస్తారు.ఆ తల్లి చల్లని కరుణాకటాక్షాలతో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు..
"సామాంపాతు సరస్వతీ.." అని మాతను ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావస్థలయందు మాతోనే ఉండుమని మనమందరం ఆరాధిద్దాము.🙏
శ్రీ పంచమి సందర్భంగా...అక్షరాభ్యాసం..
’వసంత పంచమి’ నాడు అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది. సాధారణంగా అమ్మ ఆవిర్భావ దినం రోజు విద్య మొదలుపెడితే సకల విద్యలు సులభంగా సుసాధ్యం అవుతాయి అనేది నమ్మకం.
యజ్ఞం, పూజలు, అర్చనలు పూర్తి అయిన తరువాత పంతులు తమ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలక మీద బలపంతో ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’ అని రాసి దిద్దిస్తారు.
అక్షరాభ్యాసం ఎలా చేయాలి?
విద్య బతుకు తెరువును చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం. ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా మనవాళ్లు రూపొందించారు. వసంత పంచమి సందర్భంగా పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దించడం మన ఆనవాయితీ.
పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవి. ముఖ్యంగా విజయదశమీ, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు, శ్రీపంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయటంవల్ల ఆ దేవతల ఆశీస్సులూ అనుగ్రహమూ లభించి, విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని మన నమ్మకం.
సర్వసాధారణంగా అక్షరాభ్యాసం ఐదో ఏట చేస్తారు. ఆ వయస్సు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని, మనస్సులో నిలుపుకొనే శక్తి విద్యార్థికి లభిస్తుంది. ఈ కాలంలో దేశకాల పరిస్థితులను బట్టి మూడవయేటనే అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఉదయం వేళ ఇంట్లోగానీ, దేవాలయంలోగానీ, పాఠశాలలోగానీ, పెద్దలు, గురువుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు.
మన సంప్రదాయంలో విద్యాధిదేవతలు కొందరున్నారు. అక్షరాభ్యాసం నాడు ఆ దేవతలను పూజించి విద్యార్థిచేత అక్షరాలు దిద్దించటం సంప్రదాయం. సకల విఘ్నాలనూ తొలగించే వినాయకుణ్ణి, విద్యల దేవత అయిన సరస్వతీ దేవిని అర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, విష్వక్సేనుడు మొదలైనవారిని విద్యాదేవతలుగా పూజిస్తారు.
అక్షరం అంటే నశించనిది అని ,అభ్యాసం అంటే నేర్చుకోవటం అని అర్థం. వర్ణమాలను నేర్చుకోవటానికి చేసే తొలి ప్రయత్నమే ఈ అక్షరాభ్యాసం అనే కార్యక్రమం.
తల్లి తండ్రులు కుటుంబ సభ్యుల సమక్షంలో పురోహితుని ద్వారా పిల్లల కుడిచేతితో బిడ్డను తన ఒడిలో ఉంచుకుని ,పంచాక్షరీ మంత్రం తో పాటు "ఓం"ను వ్రాస్తూ అక్షరం దిద్దిస్తారు.
ఆ తరువాత ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’ అనే అక్షరాలను విద్యార్థిచేత దిద్దిస్తారు. విద్యాధి దేవత సరస్వతి అయినా, జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి ‘నమశ్శివాయ’ అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది.
విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్నిచోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం.
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏