Tuesday, September 30, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం -70

ఓం శ్రీ హృదయ నివాసాయ నమ:

"సాయిబాబాగారి అవతార లక్ష్యం - హిందూ,ముస్లిములు ఐకమత్యంగా అన్నదమ్ములవలె

జీవించాలని,వారు ఏకాత్ములని బాబా నిశ్చితాభిమతం."

బ్రహ్మం అన్నా,ఈశ్వరుడన్నా, అల్లాహ్ అన్నా ఒక్కటేనన్నాడు. 

మనిషి మంచితనానికి,ఆధ్యాత్మికతకు,పవిత్ర జీవనానికి మతం అవరోధం కాదన్నది బాబా అభిమతం.


 బాబాగారు సశరీరులుగా ఉన్న ఆ రోజుల్లో, మరియు మా గృహమునందు సాయి మహత్యములు
 చూసిన ఈ రోజుల్లోనూభక్తులకు సరైన అవగాహన లేక అడిగే ఒక ప్రశ్న.. బాబాకి తెలుగు వచ్చా?
 అని కొందరు మా ఇంట్లో బాబాగారి అక్షరమాలను చూసి అడిగారు. మేము వారి ప్రశ్నకు
 నవ్వుతూ శ్రీ సాయిబాబాను మీరు సామాన్య వ్యక్తిగా తీసుకుని ఇలా ప్రశ్నిస్తున్నారు. 
 అవతార పురుషుడు అంటేనే భగవంతుని మానుష రూపం కదా! వారికి లేని 
పాండిత్యం, రాని భాషలు ఉంటాయా..ఆయన దివ్యాంశ సంభూతుడు.కారణజన్ముడు. 
"వారు ఫకీరు వేషధారణులు ,మసీదు నివాసం, అల్లాహ్ మాలిక్ స్మరణ. "కాబట్టి ఆయనకు 
ఇతర భాషలు రావు అని కొంతమంది అభిప్రాయం. శ్రీ సాయికి ఖురాన్ పైన ఎంత అవగాహన
 ఉందో, భగవద్గీత పైన అంత సాధికారత ఉంది. 

 బాబాగారు నానాసాహెబ్ చందోర్కరుగారి అహంకారమును తొలగించి 'శిష్యుడైనవాడు గురువుకు మనసా,వాచా,కర్మణా సర్వసమర్పణ కావాలీ' అని భగవద్గీత శ్లోకంతో  జ్ఞానబోధ ఏవిధంగా చేసారో చెప్పేముందు  
ఒక చిన్న ఉదంతం.  


శ్రీసాయి మహత్యాలు అనంతములు. వారి లీలలలో భాగంగా ఒకరి ఇంట్లో సాయి ఊదీ రూపధారుడుగా వెలిసారు. వారి గురించి సవివరంగా మరొక టపాలో వ్రాస్తాను. వారి ఇంటికి భక్తులు సమస్యలతో వచ్చేవారు.వారింట్లో ఆ మాత(పేరు గోప్యం)ద్వారా సాయి భక్తుల కష్టాలకు పరిష్కారాలు చూపేవారు. అర్ధరాత్రి కూడా కొందరు సమస్యలతో వచ్చుట వారి కుటుంబానికి అసౌకర్యంగా అనిపించి బాబాను వేడు కొని కలకత్తా బదిలీ పెట్టుకొని ఇల్లు తాళం పెట్టుకొని కలకత్తా వెళ్ళిపోయారుట. హమ్మయ్య! ఇక్కడ తెలుగువారు లేరు అందరూ బెంగాలి కదా ఆ భాష నాకు రాదు కాబట్టి భక్తుల తాకిడి ఉండదు అనుకొన్నారుట. ఆ స్వామి వచ్చిందే భక్తుల బాధలు తీర్చడానికి. అక్కడ కూడా వీరింట్లో మహత్యాలు తెలిసి జనులు వచ్చేవారట. ఆవిడకి తెలియకుండానే బెగాలీలో వారికి సమాధానాలు చెప్పేవారట. రాను,రాను ఆవిడకి అర్ధమైందేమిటంటే  ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఏ భాషైనా నా ప్రమేయం లేకుండా బాబా మాట్లాడిస్తారు. ఆయన నాద్వారా చేయాలనుకున్నది ఎక్కడున్నా చేస్తారు అని ఆ సద్గురు లీలలను తెలుసుకొని మరల వారు వారి సొంత ఇంటికి వచ్చారుట. ఆవిడ అంటారూ "వారిముందు మనమెంత సాయీ" అందరినీ ఆవిడ సాయీ అని పిలుస్తారు. వారు అనగా శ్రీసాయి భగవానుడు.  

తదుపరి భగవద్గీత శ్లోక వివరణ..   సశెషం 


సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు.    

    

  

   

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 69

ఓం శ్రీ సర్వాధారాయ నమ:

శ్లో"  పరీత్య భూతాని పరీత్య లోకాన్

       పరీత్య సర్వా: ప్రదిశో దిశశ్చ/

      ఉపస్థాయ ప్రధమజామృతస్యాత్మ

      నాత్మాన మభి సం వివేశ//


భా:-    ఆకాశాది పంచభూతములందు, సూర్యాదిలోకాలలోనూ, పూర్వాది నాలుగు దిక్కులందు ఆగ్నేయాది దిక్కోణములందును పరమాత్మ నిరంతరం వ్యాపించి ఉన్నాడు. ప్రతి అణువణులో అంతర్యామి రూపంలో నిండి ఉన్నాడు.ఆ భగవంతునిలోనే సృష్టి రహస్యాలన్నీ ఇమిడి ఉన్నాయి. ఆ పరమానంద మంగళరూపుడే అమృతస్వరూపుడు. అతడే మోక్షప్రదాత.


శ్రీ సాయి సగుణబ్రహ్మ స్వరూపుడు 

 భగవంతుడు నిర్గుణుడు, సగుణుడు. 

భగవంతుడు అవతారానికి రాకముందు నిర్గుణుడు.ఏ రూపం ధరించినా సగుణుడు.

రెండూ బ్రహ్మమే అయినా ఒకటి సగుణబ్రహ్మ,రెండవది నిర్గుణబ్రహ్మ.

సగుణబ్రహ్మస్వరూపము పూజ్యనీయము.

నిర్గుణబ్రహ్మస్వరూపము నిర్గుణోపాసన అనగా మనమునందు ( పరమాత్మ సమీపాన కూర్చొని ) ధ్యానించుట . 

సాయి అవతారం సగుణం. సాయితత్వం సగుణ బ్రహ్మతత్వం. 

అరూపారాధన నిర్గుణం. కాని మనస్సు రూపాన్ని కోరుతుంది. ఒక రూపం కోసం మనస్సు ఆరాటపడుతుంది. భగవంతుడు ఒక్కడే అంటూనే ఇన్ని రూపాలు కల్పించడం మనిషి బలహీనత. విగ్రహంలో సాయిని చూడడం సాయి వెనుక రహస్యం,మనస్సును దాటితే కదా హృదయంలో ప్రవేశం!హృదయంలో చివరన ఆత్మ కదలాడుతుంది. సగుణ,నిర్గుణ తత్వాలు సామాన్యులకు అర్ధమయ్యేవి కాదు.


సగుణుడు,నిర్గుణుడుకూడాసద్గురువే.సద్గురువులోరెండుఅంశాలూఉంటాయి. ఎవరు ఏది కోరితే అదే లభిస్తుంది.ఎవరికి ఏది అవసరమో దానినే పొందగలరు.

సాయిబాబా భగవంతుడా! భక్తుడా! అవతారపురుషుడా! ఎవరు ఎలా అనుకున్నా సాయి కాదనరు. బాబా తన భక్తుల కోరికను మన్నించి, వారివారి భావాన్ననుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము జూపేవారుకాదు.అట్టి ఒక ఉదంతము:- 

 డాక్టర్ పండిట్ అనే ఆయన తాత్యానూల్కర్ కు మిత్రుడు.బాబా దర్శనం కోసం ఒకసారి షిర్డీ వచ్చాడు. సాయిని దర్శించి కొంచెంసేపు మశీదులో కూర్చున్నాడు. కేల్కర్ అతనికి మర్యాద చేసి ఆతిధ్యమిచ్చాడు.పూజ వేళకు దాదాబూటీ మసీదుకు బయలుదేరాడు. ఆయనతో డా. పండిట్ కలిసి బయలుదేరాడు. దాదాబూటీ సాయికి పాదపూజ చేసాడు. బాబాకు చందనం పూయుటకు ఎవరికి ధైర్యము ఉండేది కాదు.మహల్సాపతి బాబా కంఠమునకు చందనం పూసేవారు. అతనికి బాబాపైన భక్తి ఎంతో చనువు  అంతే ఎక్కువ.ఆ సమయములో మహల్సాపతి మసీదులో లేరు. డా.పండిట్ దాదా చేతిలోని చందనమును తీసుకుని బాబా నుదిటిపైన త్రిపుండ్రాకారముగ వ్రాసెను.అందరూభయభ్రాంతులైనారు.కానీబాబా కిమ్మనలేదు. ఆరోజు సాయంత్రం దాదాబట్ సాయిని ప్రశ్నించాడు భయం భయంగా.

బాబా! మీరు ఎవరినీ గంధం పూయడానికి అనుమతించరు గదా! పండిట్ అంత చనువుగా మీ నుదుట మూడు రేఖలు పెట్టుటకు ఏల ఒప్పుకున్నారు?

బాబా నవ్వి అన్నారు: "ఏం చేయను, పండిట్ నాలో తన గురువును చూచుకున్నాడు.తన గురువును తాను సేవించుకుంటే నేనెలా కాదనగలను చెప్పు?"ఆతని నిష్కల్మష భక్తి నన్ను కట్టి పడవేసినది." దాదాభట్ ఆ తరువాత పండిట్ ని ప్రశ్నించగా అతడు, బాబాను తన గురువు 'కాకా పురాణిక్' గా భావించి తన గురువునకొనరించినట్లు బాబా నుదిటిపై త్రిపుండ్రమును వ్రాసితిననెను.

భక్తుల అభీష్టం నెరవేర్చడం బాబాకు ఎంతో ఇష్టం వారు సభక్తికంగా ఎలా పూజించినా ఆమోదిస్తారు.స్వీకరిస్తారు.

సాయిబాబా మరియొక భక్తుని ఎట్లు ఆశీర్వదించెనో తదుపరి...సాయి సత్యవ్రత మహిమ ...టపాలో...సశేషం 

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 





Sunday, September 28, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 68

ఓం శ్రీ సర్వ లోక రక్షకాయ నమో నమ:

శ్లో:క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత /

  క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ// 

భా:- ఓభరతవంశీయుడా! సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలిసికొనుము. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసికొనుటయే జ్ఞానము.నేను పరమాత్మరూపమున ప్రతిదేహము నందును వసించియున్నాను."ప్రతిదేహము నందును నేను క్షేత్రజ్ఞుడనై యుందును." 


శ్రీ సాయిబాబా సర్వాంతర్యామిత్వము;  అద్భుతము 


శ్రీసాయి అవతారము విశిష్టమైనది; అద్భుతమైనది.

నా పూర్వజన్మ సుకృతముచే వారి చరణశరణ భాగ్యము లభించినది. 

వారిసన్నిధిలో,స్మరణలోనాకుకలిగినఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. 

సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు.

ఎవరువారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. 

సన్యాసులు,సాధకులు,ముముక్షువులు తదితరులనేకమంది బాబా వద్దకు వచ్చేవారు.బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించేవారు.వారు ఎల్లప్పుడూ 'అల్లామాలిక్'  అని  అనెడివారు.ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంతతత్వమును బోధించుచుండువారు. 

భక్తుల అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా యెరింగెడివారు.సర్వజ్ఞులైనప్పటికి ఏమియు తెలియనివానివలె నటించుచుండిరి. సన్మానములన్న వారికేమాత్రము ఇష్టము లేదు. వారి నైజమట్టిది.

మానవదేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి జూడ వారు సాక్షాత్తు భగవంతుడే!వారిని జూచిన భక్త జనసందోహం షిర్డీలో వెలసిన భగవంతుడని అనుకొనుచుండిరి. 


1910 సం" దీపావళి పండుగ ముందురోజున బాబా ధునివద్ద కూర్చుండి చలికాచుకొనుచు, ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగా మండుచుండెను. కొంతసేపైన తరువాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి, నిశ్చలముగ యుండిపోయిరి.మంటలకు చేయి కాలిపోయెను మాధవుడనే నౌకరును,మాధవరావు దేశపాండే దీనిని జూచి, వెంఠనే బాబావైపు పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగ వెనుకకు లాగెను." దేవా! ఇట్లేల చేసితిర"ని బాబా నడిగిరి.బాబా బాహ్యస్మృతి త్తెచ్చుకొని, "ఇక్కడకు చాలాదూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను యొడిలో నుంచుకొని,కొలిమినూదుచుండెను.అంతలో ఆమె భర్త పిలిచెను. తన యొడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుతున్న కొలిమిలో బడెను. వెంఠనే నాచేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని.నా చేయి కాలితే కాలినది. అది నాకంత బాధాకరము కాదు.కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నాకానందము గలుగచేయుచున్న" దని జవాబిచ్చెను.ఇలా భక్తులపై కారుణ్యమును జూపుచుండెడివారు.




భక్తులయందు అవిచ్చిన్నమైన పరిపూర్ణప్రేమానురాగాలను కలిగి యుండెడివారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని,దివ్యానందమునకు వారు ఉనికిపట్టు. 

సాయిబాబాయొక్కదివ్యస్వరూపముఅట్టిది.ఆద్యంతములులేనట్టిది,అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది,విశ్వమంతయు నావరించినట్టిది యైన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా యవతరించినది.

ఎంతో పుణ్యము చేసుకొన్న అదృష్టవంతులు మాత్రమే యా నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి.సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక, వారినొక సామాన్యమానవునిగా నెంచినవారు నిజముగ దురదృష్టవంతులు. 

శ్రీసాయి సగుణ బ్రహ్మ స్వరూపము -  సాయిసత్యవ్రత మహిమను గూర్చి తదుపరి అధ్యాయములో... సశేషం....

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు. 



Saturday, September 27, 2014 2 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం _ 67

ఓం సమర్ధ సద్గురు శ్రీసాయినాధాయ నమ:


శ్లో" మధులుబ్ధౌ యధాభృంగ: పుష్పాత్ పుష్పంతరం వ్రజేత్!

  జ్ఞానలుబ్ధ స్తధాశిష్యో గురోర్గుర్వంతం వ్రజేత్!! 



మధువునందు ప్రీతిగల తేనెటీగ పుష్పము నుండి పుష్పమునకు తిరిగి మధువును సంపాదించినట్లు, ముముక్షువైన శిష్యుడు పలువురు గురువులను దర్శించి, వారినుండి జ్ఞానమును సంపాదింపవలెను.

శ్రీమధ్భాగవతంలో అవధూత తాను 24 మంది గురువులనుండి జ్ఞానమార్జించినట్లు చెబుతారు.

భగవాన్ శ్రీరమణ మహర్షి వంటి ఆత్మవేత్తలు, మహనీయుల సందర్శన సేవా - సాంగత్యములెంతో శక్తివంతములైనవనీ,పవిత్రమైనవనీ చెప్పారు.

శ్రీ సాయినాధుని గురువు కూడా మొదట అడవిలో వారికి కనిపించి "భగవంతుని కృపలేక ఎవ్వరూ మా వంటివారిని మార్గంలో కలవలేరు" అంటారు.

దేవ, గురు, ప్రాజ్ఞ దర్శన సేవనాదులు ముముక్షువుకు ఆవశ్యమని శ్రీమద్భగవద్గీత చెబుతుంది.

గురుకరస్పర్శ ప్రభావము 

సంసారమను సాగరములో జీవుడనెడి యోడను సద్గురుడే సరంగుయై నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును.

సద్గురువనగానే నా కండ్ల ఎదుట సాయిబాబా నిలచియున్నట్లు, నా నుదుట ఊదీ పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయివేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషముతో నిండిపోయి, కండ్లనుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురుహస్తస్పర్శ మహిమ అద్భుతమైనది.

ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మశరీరము గురుకరస్పర్శ తగులగనే భస్మమైపోవును; అనేకజన్మార్జిత పాపసంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మికసంబంధమైన విషయములు వినుటకే విసుగుపడువారి వాక్కు కూడా నెమ్మది పొందును.

శ్రీసాయి సుందరరూపము కాంచుటతోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును;కన్నులనుండి ఆనందాశ్రువులు పొంగిపొరలును;హృదయము భావోద్రేకముతోయుక్కిరిబిక్కిరియగును.'నేనేతాన'ను(పరబ్రహ్మస్వరూపమను) స్ఫురణ మేల్కొని,ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును.'నేనునీవు ' అను బేధభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపజేయును. 

తదుపరి అధ్యాయములో శ్రీ సాయి అంతర్యామిత్వము..అద్భుతములను తెలుసుకుందాము.       సశేషం...

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.




Friday, September 26, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 66

ఓం శ్రీ ముకుందాయ నమ:



భవకూపంబుల బడలెడినాడు పాయని బంధువుడు ఇతడొకడే

దివి స్వర్గంబున తేలెడినాడు తిరుగబాయకెపు డితడొకడే

నవ నరకంబుల నలగెడినాడు నటనల బాయడితడొకడే

ఇవలనవల హృదయేశుడు విష్ణుడుఈతని మరువకుమీ జీవాత్మా..



భా: -  'సంసార సాగరంలోనే కాదు, స్వర్గనరకాల్లో,పూర్తిగా ఇహపరాల్లో మనకు దిక్కైనవాడు ఆ భగవంతుడు ఒక్కడే!అలాంటి హృదయేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును విస్మరించవద్దు.'


శ్రీ సాయిబాబాగారి అమృతతుల్యమైన పలుకులు:- 

ఎవరయితే నన్ను శరణు వేడెదరో, భక్తివిశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో వారిని దు:ఖబంధనములనుండి తప్పింతును.' ప్రాపంచిక విషయములను మరచి,నా లీలలను,చరిత్రమును మననము చేయుచు,ఎల్లప్పుడు నన్ను జ్ఞప్తియందుంచుకొనుడు.

మన:పూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధచైతన్యముతో తాదాత్మ్యము కలుగును.' సాయి  సాయీ యను నామమును జ్ఞప్తియందుంచుకొన్నంత మాత్రమున, చెడుపలుకుటవలన, వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును. 

"మీరెక్కడ నున్ననూ, ఏమి చేయుచున్ననూ నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. "

నేనందరి హృదయముల పాలించువాడను. అందరి హృదయాలలో నివసించువాడను.నేను చరాచరజీవకోటి నావరించియున్నాను.

 ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే.

నేనే జగన్మాతను,త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియచాలకుడను నేనే,సృష్టిస్థితిలయకారకుడను నేనే.

 ఎవరయితే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికేహానిగాని బాధగాని కలుగదు.నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు,చీమలు తదితర దృశ్యమాన చరాచరజీవకోటి యంతయు నా శరీరమే,నా రూపమే!"

"నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, భక్తి శ్రద్ధలతో మన:పూర్వకంగా నన్నే ఆరాధించువారి యోగక్షేమముల నేను జూచెదను.ప్రపంచములోని కీర్తిప్రతిష్ఠలకై ప్రాకులాడుట మాని, దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నించుము." 

తదుపరి అధ్యాయములో 'గురుకరస్పర్శ   'ప్రభావము....          -సశేషం...


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.



Thursday, September 25, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 65

ఓం శ్రీ సద్గురవే నమో నమ:

మం"  శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య:

       శృణ్వంతో2పి బహవో యం న విద్యు:!

     ఆశ్చర్యో వక్తా కుశలో2 స్య లబ్ధా

       ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్ట:!!


భా:- దేనిని గురించి వినడానికి అనేకులచే సాధ్యపడదో, 

విన్నప్పటికీ ఎందరో దేనిని అర్ధం చేసుకోలేరో, 

ఆ ఆత్మను గురించి ఉపదేశించేవాడూ అరుదు,

వినేవాడూ అరుదు.అంతటి అరుదైన వ్యక్తి ఉపదేశాలను 

పాటించి దానిని తెలుసుకున్నవాడు కూడా అరుదే.




శ్రీ సాయిబాబా జీవితచరిత్ర సముద్రము వలె విశాలమైనది.లోతైనది. అందరు దీనియందు మునిగి భక్తి,జ్ఞానములను మణులను వెలికితీసి కావలసినవారికి పంచి పెట్టవచ్చును.

వేదములవలె రంజకములును ఉపదేశకములునునగు బాబా ప్రభోదములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంచించునవి, అనగా బ్రహ్మైక్యయోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు.

భక్తులకు బాబా లీలలు మిక్కిలి ఆనందం కలుగజేయును.శ్రీ సాయినాధుని దర్శనభాగ్యమున మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల  బలము తగ్గును.ప్రపంచమంతయు సాయిబాబా రూపమే వహించెను.

వేదాంత విషయములలో మానవుడు స్వేచ్చాపరుడా కాడా! అను వివాదము వదలి పరమార్ధము నిజముగా గురుబోధలవల్లనే కలుగుననియు, రామకృష్ణులు తమ గురువులయిన వసిష్ఠసాందీపులకు లొంగి అణుకువతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందిరి. దానికి దృఢమైన నమ్మకము(నిష్ఠ), ఓపిక(సబూరీ) అను రెండు గుణములు ఆవశ్యకము అని శ్రీ సద్గురువు మనకు సచ్చరిత్రము ద్వారా  ఉపదేశిస్తున్నారు. 

మూడవ అధ్యాయములో శ్రీ సాయి అమృతతుల్యమగు పలుకులను తదుపరి టపాలో ...సశేషం .

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.








శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 64

                      ఓం శ్రీనారాయణాయ నమో నమ: 


మం"   ఇంధ్రియేభ్య: పరా హ్యర్ధా అర్ధేభ్యశ్చ పరం మన:!

       మనసస్తు పరా బుద్ధి: బుద్ధేరాత్మా మహాన్ పర:!!



భా:- ఇంద్రియాలకన్నా విషయ వస్తువులు శక్తి మంతమైనవి.

      విషయ వస్తువులకన్నా మనస్సు శక్తి మంతమైనది. 

     మనస్సుకన్నా బుద్ధి శక్తి మంతమైనది. 

    బుద్ధికన్నా మహత్వం సంతరించుకొన్నదైన ఆత్మ శక్తి మంతమైనది.


మం"   మహత: పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుష: పర:!

      పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరా గతి:!!


భా:- మహత్వం గలదైన ఆత్మకన్నా అవ్యక్తం శక్తిమంతమైనది. 

       అవ్యక్తం అంటే భగవంతుని శక్తి. 

     ఏది ఈ ప్రపంచాన్నే ఉద్భవించి కార్యకలాపాలు సాగిస్తున్నదో ఆ శక్తి.

     ఆ శక్తీ భగవంతుడైన స్థానం లేకుండా పనిచేయలేదు. కనుక 

    అవ్యక్తంకన్నా భగవంతుడు శక్తిమంతుడు.

    భగవంతునికన్నా శక్తిమంతమైనది ఏదీ లేదు. 

   ఆయనే పరమ వస్తువు. ఆయనే చరమ గమ్యం.  

 అటువంటి శక్తిమంతుడు, సర్వాంతర్యామి అయిన శ్రీ సాయినాధుని అవతార మహత్యమును,శ్రీ సాయి సచ్చరిత్రము ద్వారా ఒకసారి శ్రీ సాయిని దర్శించగలరు!


మొదటి అధ్యాయములో శ్రీ సాయి వేదాంత తత్వము:- 

శ్రీ సాయిబాబా శిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసరుచునే యుండిరి! నిత్యము వారు విసరునది గోధుమలు కావు. భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి.తిరుగలి యొక్క క్రింది రాయి కర్మ; మీది రాయి భక్తి; చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. 

జ్ఞానోదయమునకుగాని, ఆత్మసాక్షాత్కారమునకుగాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచివేయవలయును.అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలయును.   

కబీరుకధ:- 

ఒకనాడు ఒక స్త్రీ తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూసి కబీరు యేడ్వసాగెను. నిపతినిరంజనుడను యొక సాధుపుంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను. "నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమను తిరుగలిలో విసరబడెదను కదా? దానికి నిపతినిరంజనుడిట్లు బదులు చెప్పెను. 

"భయము లేదు! తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనుము. అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవునూ అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము. దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము.నీవు తప్పక రక్షింపబడెదవు.   

 రెండవ అధ్యాయములో శ్రీ సాయి యోగీశ్వరునిసచ్చరిత్రము మనకు సత్యమును, ఆధ్యాత్మిక మార్గమును తెలుపును. ఈ వివరణ తదుపరి టపాలో....సశేషం. 

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.  

   







 య నమ: