Sunday, September 28, 2014 By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 68

ఓం శ్రీ సర్వ లోక రక్షకాయ నమో నమ:

శ్లో:క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత /

  క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ// 

భా:- ఓభరతవంశీయుడా! సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలిసికొనుము. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసికొనుటయే జ్ఞానము.నేను పరమాత్మరూపమున ప్రతిదేహము నందును వసించియున్నాను."ప్రతిదేహము నందును నేను క్షేత్రజ్ఞుడనై యుందును." 


శ్రీ సాయిబాబా సర్వాంతర్యామిత్వము;  అద్భుతము 


శ్రీసాయి అవతారము విశిష్టమైనది; అద్భుతమైనది.

నా పూర్వజన్మ సుకృతముచే వారి చరణశరణ భాగ్యము లభించినది. 

వారిసన్నిధిలో,స్మరణలోనాకుకలిగినఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. 

సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు.

ఎవరువారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. 

సన్యాసులు,సాధకులు,ముముక్షువులు తదితరులనేకమంది బాబా వద్దకు వచ్చేవారు.బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించేవారు.వారు ఎల్లప్పుడూ 'అల్లామాలిక్'  అని  అనెడివారు.ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంతతత్వమును బోధించుచుండువారు. 

భక్తుల అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా యెరింగెడివారు.సర్వజ్ఞులైనప్పటికి ఏమియు తెలియనివానివలె నటించుచుండిరి. సన్మానములన్న వారికేమాత్రము ఇష్టము లేదు. వారి నైజమట్టిది.

మానవదేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి జూడ వారు సాక్షాత్తు భగవంతుడే!వారిని జూచిన భక్త జనసందోహం షిర్డీలో వెలసిన భగవంతుడని అనుకొనుచుండిరి. 


1910 సం" దీపావళి పండుగ ముందురోజున బాబా ధునివద్ద కూర్చుండి చలికాచుకొనుచు, ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగా మండుచుండెను. కొంతసేపైన తరువాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి, నిశ్చలముగ యుండిపోయిరి.మంటలకు చేయి కాలిపోయెను మాధవుడనే నౌకరును,మాధవరావు దేశపాండే దీనిని జూచి, వెంఠనే బాబావైపు పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగ వెనుకకు లాగెను." దేవా! ఇట్లేల చేసితిర"ని బాబా నడిగిరి.బాబా బాహ్యస్మృతి త్తెచ్చుకొని, "ఇక్కడకు చాలాదూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను యొడిలో నుంచుకొని,కొలిమినూదుచుండెను.అంతలో ఆమె భర్త పిలిచెను. తన యొడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుతున్న కొలిమిలో బడెను. వెంఠనే నాచేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని.నా చేయి కాలితే కాలినది. అది నాకంత బాధాకరము కాదు.కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నాకానందము గలుగచేయుచున్న" దని జవాబిచ్చెను.ఇలా భక్తులపై కారుణ్యమును జూపుచుండెడివారు.




భక్తులయందు అవిచ్చిన్నమైన పరిపూర్ణప్రేమానురాగాలను కలిగి యుండెడివారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని,దివ్యానందమునకు వారు ఉనికిపట్టు. 

సాయిబాబాయొక్కదివ్యస్వరూపముఅట్టిది.ఆద్యంతములులేనట్టిది,అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది,విశ్వమంతయు నావరించినట్టిది యైన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా యవతరించినది.

ఎంతో పుణ్యము చేసుకొన్న అదృష్టవంతులు మాత్రమే యా నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి.సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక, వారినొక సామాన్యమానవునిగా నెంచినవారు నిజముగ దురదృష్టవంతులు. 

శ్రీసాయి సగుణ బ్రహ్మ స్వరూపము -  సాయిసత్యవ్రత మహిమను గూర్చి తదుపరి అధ్యాయములో... సశేషం....

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు. 



0 comments: