Friday, May 9, 2014 0 comments By: visalakshi

భక్తి,ముక్తి,ఆత్మతత్వాన్ని అనుగ్రహించిన సమర్ధ సద్గురు సాయినాధుడు

ఓం శ్రీ సర్వేశ్వరాయ నమో నమ: 


శ్లో: గురుచరణాంబుజ నిర్భరభక్త:;సంసారా దచిరాద్భవ ముక్త:
   సేంద్రియమానస నియమాదేవం; ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవం   


 భా:- గురుచరణ కమలాలపై మిక్కిలి భక్తిగల ఓ సాధకుడా! ఈ సంసార బంధనాల నుంచి శీఘ్రంగానే ముక్తిని పొందుదవు గాక! నీ ఇంద్రియాలనూ, మనస్సునూ అదుపులో పెట్టినవాడవై నీ హృదయంలోనే ఉంటున్న భగవంతుడిని దర్శించెదవు గాక!
  
ఇలా ఆశీర్వదిస్తూ.. మా హృదయాలలో ఉన్న శ్రీ సాయిభగవానుడు తమ ఉనికిని తెలియజేసి మమ్ములను తట్టి లేపి తమ లీలా ప్రబోధాలతో అలరించి, అనుగ్రహించిన దివ్యమైన రోజు ఈ వైశాఖ శుద్ధ దశమి. 

గురుచరణాలపై భక్తిప్రపత్తులతో మెలిగే సాధకుడు సులువుగా సంసార బంధాల నుంచి విముక్తిని పొందుతాడని జగద్గురువు శ్రీ సాయినాధుడు స్పష్టం చేశారు. గురువులలో కెల్లా పరమగురువు  భగవంతుడు శ్రీ సాయినాధుడు. వారి పాదాలను నమ్ముకొని,శరణాగతితో ముందుకు వెళితే లౌకికబంధాలు వాటంతట అవే సడలిపోతాయి

భగవద్భక్తి, ధ్యానం తదితర సత్ క్రియలను బోధించి,మాకు పరమతత్వాన్ని,ఆత్మతత్వాన్నీ అనుగ్రహించారు పరమగురువు శ్రీసాయినాధుడు.వారి మార్గదర్శకత్వంలో మా జీవితాల్ని ఉద్ధరింప చేసుకోవాలని మా సంకల్పం .

బాహ్య,అంతర సమాంతర సాధనలో భగవంతుడు అంతర్యామిగా మన హృదయంలోనే నెలకొన్నాడు. అంతశ్శుద్ధి కలిగిన మనస్సులో పరమగురువు ప్రతిష్ఠితమవుతాడు. ఆ దేవదేవుని దివ్యస్మృతే మన మనస్సును ఆనందసీమల్లో విహరింపజేయాలి.   

 "ఎవరైతే నేను షిరిడీలో మాత్రమే ఉన్నానని అనుకుంటారో,వారు నన్ను నిజంగా గ్రహించలేదని తెలుసుకో! అంటారు శ్రీ షిరిడీ సాయి. సాయినాధుని గుండెలో దర్శించుకోగలగాలి; అదీ భగవద్భక్తి అంటే!.ఇలాంటి పారమార్ధిక పరమోన్నత స్థితికి చేరుకునే ప్రస్థానంలో జగద్గురువు శ్రీ సాయినాధుడే మమ్ములను ఆదుకుని, అనుగ్రహించి నడిపించాలని సదా వారి చరణారవిందములకు ప్రణమిల్లి ....భక్తితో...  శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు శ్రీ సాయినాధ్ మహరాజ్ కీ జై.  

సర్వం శ్రీ సాయినాధార్పిత మస్తు.