శ్రీ గురుభ్యో నమ:
"నిగమములు వేయిజదివిన
సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్
సుగమంబు భాగవతమను
నిగమంబు పఠింప ముక్తి నివసము బుధా "
ఎన్ని వేదములు చదినను అవి సులభముగా ముక్తిని ప్రసాదింపజాలవు. లౌకికసుఖములన్నియు క్షణికములు. నశ్వరములు - మోక్షము పరమానందదాయకము. 'భాగవతము' అను వేదమును భక్తిశ్రద్ధలతో పఠించి.. భక్తిజ్ఞాన వైరాగ్యములు గల్గి నిష్ఠతో ఆ దేవదేవుని సేవించినప్పుడే ఆయన అనుగ్రహము లభించును.
"భగవంతు డగు విష్ణుడు జగముల కెవ్వేళ రాక్షస వ్యధ గలుగున్
దగనవ్వేళల దయతో యుగయుగమున బుట్టి కాచునుద్యల్లీలన్"
భగవంతుడైన శ్రీహరి ఎప్పుడెప్పుడైతే లోకాలకు రాక్షసులవలన బాధలు కలుగుతాయో అపారకరుణతో ఆయా యుగాలలో అవతరించి తన లీలా ప్రకటనలతో లోకులను కాపాడుచుండును.
"నశించే ఈ దేహానికై శోకించకు. నశించని శాశ్వత ఆనందాన్ని నా నుండి పొందు అంటాడు పరమాత్ముడు. "మానవ జీవితం ఏడుపుతో ఆరంభమవుతుంది. పుడుతూ, పెరుగుతూ, ఆఖరికి పోతూ ఏడుపు, పోయాక కూడా ఏడుపులే మిగిల్చి పోతుంటాడు ఈ ప్రాణి. ఏడుపు సహజం. ఆ ఏడుపుని తగ్గించే ఒక ఓదార్పు ప్రతి ప్రాణీ కోరుకుంటుంది. ఆ ఓదార్పు ఎక్కడినుండి రావాలి మనకి?శోకసాగరంలో ఈదులాడే ప్రాణకోటికి నిజమైన ఓదార్పు నిచ్చేదెవరిని గుర్తించే శక్తి ఉన్నవాడు మానవుడొక్కడే. లోకంలో ఒక్కో జన్మకీ ఒక్కో బంధువర్గం చుట్టూ ఏర్పడుతూ ఉంటుంది. ఆయా బంధువులు ఆయా సమయాల్లో మాత్రం కొంతవరకు ఓదార్పు కలిగించే ప్రయత్నం చేస్తారు. 'జీవుడికి దేహాన్ని బట్టి ఏర్పడే బంధువులు ఎంతమంది మారుతున్నారో, కానీ మారని శాశ్వతమైన బంధువు ఆ పరమాత్మ.'ఎవరికి ఎక్కడ ఏ శోకం కలిగినా దానికి శాశ్వతమైన ఆనందాన్నిచ్చే ఉపశమనం కేవలం "శ్రీహరి " మాత్రమే ఇవ్వగలడు.
భాగవతములో పోతనామాత్యుడు వివరించిన సుయజ్ఞోపాఖ్యానంలో సుయజ్ఞుడనే రాజు యుద్ధంలో అసువులు బాసుట.. ఆతని మరణాన్ని జీర్ణించుకోలేక ఆ శవం వద్ద అతని భార్యలు,పిల్లలు భోరు,భోరున విలపించుట పలువిధాల ఆర్తనాదాలతో సాయం సమయం వరకు వారు రోదిస్తుండగా.. యముడు బాలకరూపం ధరించి వచ్చి అచ్చటివారి నుద్దేశించి జననమరణాల గురించి తత్వోపదేశం చేస్తాడు. ఈ సుయజ్ఞుని కధను ఒక 'ఉదాహరణముగా' హిరణ్యకశిపుడు ఆ ఉపదేశమును వివరిస్తున్నాడు..( యముడు బాలకుడు రూపం ధరంచి వివరించిన ఆ తత్వోపదేశమును మనము కధలో విశదీకరించి చెప్పుకుందము.) అసలు హిరణ్యకశిపుడు ఎవరికి తత్వోపదేశమును
వివరిస్తున్నాడు అన్న కధాంశ మూలాల్లోకి మనం వెళితే..ఆ సారాంశము ఇదిగో ఇలా.....
నైమిశారణ్యంలో సూతమహర్షి శౌనకాది మహామునులకు భాగవతాన్ని ఇలా వివరిస్తున్నాడు..మహాత్ములారా! గంగాతీరమున ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రుని ఈ విధంగా ప్రార్ధించాడు.
మహాత్మా! యోగీంద్రా! భగవానుడు ఆనందస్వరూపుడు. సకల భూతజాలమునకు ఆత్మీయుడు. రాగద్వేషాలకూ, త్రిగుణాలకూ అతీతుడు. ఆయనకు ద్వేషింపతగిన వాడుకానీ, ప్రేమించదగిన వాడుకానీ యుండడు. దయాస్వరూపుడు . అట్టి భగవానుడు దేవేంద్రుని కొరకు దానవులను హతమార్చుతుంటాడు. ఆయనకు దేవతల వలన కలిగే లాభమేమిటి? రాక్షసుల వలన తనకు కలిగే కీడేమిటి? ఈ నా సంశయమును తీర్చి నా మనసుకు శాంతిని కూర్చండి స్వామి అని ప్రార్ధించాడు.అందులకు శుకయోగీంద్రుడు ...నీ ప్రశ్న బాగుంది. లక్ష్మీరమణుడైన శ్రీహరి చరిత్ర మహా చిత్రంగా ఉంటుంది. వ్యాసభగవానునికి నమస్కరించి శ్రీహరి చరిత్రను వివరిస్తాను..విను.
శ్లో" చిత్రంబులు త్రైలోక్యప, విత్రంబులు భవలతా లవిత్రంబులు స
న్మిత్రంబులు మునిజనవన, చైత్రంబులు విష్ణు దేవు చారిత్రంబుల్.
పరమేశ్వరుడు గుణరహితుడు. ప్రకృతి ఆయన మాయ. దానికి సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే గుణాలున్నాయి. ఈ గుణాలు పెరుగుతూ తరుగుతూ ఉంటాయి. సత్వగుణం నుంచి దేవతలు, రుషులు.. రజోగుణం నుంచి అసురులు.. తమోగుణం నుంచి యక్షులు, రాక్షసులు పుట్టుకొచ్చారు. కాలరూపుడైన పరమాత్మ సత్వగుణులైన దేవతలకు మేలు, రజస్తమో గుణులైన అసురులకు, రాక్షసులకు కీడు చేస్తుంటాడు. పరీక్షిత్తూ! పూర్వం మీ తాతగారైన ధర్మనందనుడు అడుగగా నారదమహర్షి వివరించిన విషయమును చెపుతాను విను నీ సంశయము తీరుతుంది.
మీ తాత ధర్మరాజు రాజసూయయాగమునకు బంధు మిత్రాదులను మహర్షులనందరినీ ఆహ్వానించాడు. అందులో చేది దేశపురాజు శిశుపాలుడు కూడా వచ్చాడు. ఆ నిండు సభలో అహంకారంతో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని తూలనాడాడు. ఫలితంగా భగవంతుడు వానిని తన సుదర్శనాయుధంతో సిరస్సును చేధించాడు. అప్పుడు ఆ శిశుపాలుని దేహం నుండి ఒక తేజం వెలువడి శ్రీకృష్ణునిలో లీనమయ్యింది. అది చూచి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. సభలో ఉన్న నారదుని వైపు చూస్తూ ఇలా అన్నాడు.
మహాత్మా! తమకు తెలియని ధర్మరహస్యాలులేవు. శిశుపాలుడు పరమ దుర్మార్గుడు. భగవద్వేషి. అట్టివానికి వాసుదేవుని సాయుజ్యం ఎలా లభించింది? పూర్వం వేనుడనే రాజు భగవంతుని ద్వేషించి బ్రాహ్మణుల శాపానికి గురై నశించాడని చెపుతారు. శిశుపాలుడు, దంతవక్త్రుడు కలిసి గోవిందుని ఎప్పుడూ తిడుతుండేవారు..వారు శ్రీకృష్ణుని ద్వేషించని దినము లేదు. అలాంటి విరోధికి విష్ణుసాయుజ్యం ఎలా కలిగింది?నాకు వివరించండి అని ప్రార్ధించాడు.నారదుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు..
ధర్మనందనా! దూషణ, భూషణ, తిరస్కార, సత్కారాలు శరీరానికే గాని పరమాత్మకు లేవు. శరీరం మీద అభిమానం వలన ఎవరైనా కఠినంగా మాట్లాడినా, దండించినా బాధ అనిపిస్తుంది. నేను, నాది అనేభావం శరీరం వల్లనే కలుగుతుంది. ఈ అభిమానమే జీవుడిని బంధిస్తుంది. అన్ని శరీరాల లోనూ ఆత్మరూపంలో ఉన్న ఈశ్వరునికి ఏ దేహం పట్లనూ ద్వేషం గాని, అభిమానం గాని ఉండదు. అందువలన స్నేహంతో గాని, వైరంతోగాని, ఆయనకు నిమిత్తం లేదు. తనను తలచుకొన్న వారందరికీ తనలో చోటిస్తాడు.
హరిని చేరుటకు అనేక మార్గములు కలవు. అమితమైన కామంతో గోపికలు, భయంతో కంసుడు, వైరంతో శిశుపాలాది భూపాలుడు, బంధువులై వృష్ణులు, ప్రేమతో మీరు, భక్తితో మేము, శ్రీహరిని చేరుకోవచ్చునని నిరూపణ అయ్యింది. కామం, ద్వేషం, భయం, స్నేహం, సేవ - వీటిలో ఏదో ఒక భావంతో హరిని స్మరించిన వారికి చాలామందికి సద్గతి కలిగింది. వీటిలో ఏ ఒక్క గుణం లేనందున వేనుడి జన్మవ్యర్ధం అయ్యింది. కుంతీదేవి చెల్లెలి బిడ్డలైన, శిశుపాల దంతవక్త్రులు పూర్వజన్మలో విష్ణుమందిర ద్వారపాలకులు. విప్ర శాపం వలన పదభ్రష్టులై భూమిమీద పుట్టారు. అని నారదుడు చెప్పగా.. అప్పుడు నారదుడు వారి పూర్వగాధను ఈ విధంగా వివరించాడు.
ఒకనాడు బ్రహ్మమానసపుత్రులైన సనక సనందనాదులు ముల్లోకాల్లోను సంచరిస్తూ మాధవుని దర్శించాలనే కుతూహంతో ఐదారేళ్ళ పిల్లల్లా దిగంబరంగా వారి మందిరంలోకి ప్రవేశిస్తుంటే ద్వారపాలకులైన 'జయ, విజయులు' వారిని అడ్డుకొన్నారు. లోపలికి పోవుటకు అనుమతిలేదని కసురుకొన్నారు. ఆ మునులు ఆగ్రహంతో.. మమ్మల్ని అటకాయిస్తారా, మూర్ఖులారా! మదమెక్కిందా ఇంత కండకావరమా అని ద్వారపాలకులను నిందించి అసురజాతిలో పుట్టండని వారికి ఆ బాలకులు శాపమిచ్చారు. ద్వారపాలకులు వారెవరో గ్రహించి మునులారా! మా అజ్ఞానాన్ని మన్నించండి. మీరెవరో ఎరుగక పొరపాటు చేశాం. క్షమించండి. దయజూపమని బ్రతిమాలగా, ఆ మునులు కరుణించి మూడు జన్మలెత్తి మురారితో వైరం పెట్టుకొని ముక్తి పొందుతారని శాప విమోచనం చెప్పి వెళ్ళిపోయారు.
జయ విజయులు మొదటి జన్మలో దితిగర్భాన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులై పుట్టారు. చిన్నవాడైన హిరణ్యాక్షుడిని శ్రీహరి వరాహరూపంలో అవతరించి సంహరించాడు. పెద్దవాడైన హిరణ్యకశిపుడిని నరసింహావతారములో వచ్చి సంహరించాడు. రెండవ జన్మలో కైకసి అనే రాక్షసికి రావణ కుంభకర్ణులై జన్మించగా వారిద్దరినీ శ్రీరామచంద్రుడుగా అవతారం దాల్చి వధించాడు. మూడవ జన్మలో శిశుపాల దంతవక్త్రులయ్యారు. కృష్ణుని చేతిలో మరణించి ఆయనలోనే ఐక్యమయ్యారు.
అయితే హిరణ్యకశిపుడు తన కొడుకైన ప్రహ్లాదుడు ఎప్పుడూ హరినామస్మరణే చేస్తున్నాడని సంతోషించక ఎందుకు శిక్షించాడని ధర్మరాజు మరో ప్రశ్న వేయగా నారదుడిలా తెలిపాడు. తమ్ముడైన హిరణ్యాక్షుడిని హరి అంతం చేశాడని విని హిరణ్యకశిపుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. సభలో శూలం పుచ్చుకొని నిలబడి దైత్యుల్ని, దానవుల్ని ఉద్దేశించి చూశారా ఈ ఘోరం, నాకు తమ్ముడు మీకు ఆప్తమిత్రుడు అయిన హిరణ్యుని ఆ హరి అతి దారుణంగా చంపాడు. అతడిని ఇక వదిలేది లేదు. నా తమ్ముని సం హరించిన వాని రక్తముతో నా తమ్మునికి తర్పణము ఇస్తేకాని నాకు మనోవేదన చల్లారదు. కపట స్వభావుడైన హరి నశించిన తరువాత ఇతర దేవతలందరు నశించుతారు. కాబట్టి దానవులారా! యజ్ఞము, వేదము అతడే. సర్వవైదిక కర్మలకు, దేవతాముని సమూహాలకు, సర్వధర్మాలకు అతడే మూలము.(అంతర్యామి గురించి, ఆయన పరాక్రమము గురించి అన్నీ తెలిసినా ఆ దానవుడు పగ విరోధముతో అహంకారమునకు లోనై తానే హరిపై ద్వేషముతో 'మాయ 'కు లోనై హరిపై నిరసన ద్వజం ప్రారంభించాడు.) .ఎక్కడ బ్రాహ్మణులు, దేవతలు సుఖంగా ఉంటారో ఎక్కడ ధర్మాలు, నియమాలు సక్రమంగా నడుస్తుంటాయో అక్కడ ఆ విష్ణువు నివాసముంటాడు. మీరు వాటినన్నింటినీ ధ్వంసం చెయ్యండి అప్పుడు వారు నివసించడానికి దగిన చోటు లేక నశిస్తారు. అని ఆజ్ఞాపించాడు. రాక్షసమూకలు భూమిపైబడి విచ్చలవిడిగా తిరుగుతూ పుణ్యక్షేత్రాలను, పుణ్యాశ్రమాలను, బ్రాహ్మణులను, గోవులను, భగవద్భక్తులను, వేద సాంప్రదాయాన్ని నాశనం చేశారు. భూగోళమంతా కోలాహలంగా తయారైంది. ఈ భయానక దృశ్యాలను చూచి, దేవతలు స్వర్గమును వీడి అడవుల పాలైనారు.
చక్షువుల ధరిత్రి చలితయై కానంగ బడినభంగి వికలభావరహితు
దాత్మమయుండు కంపితాంతరంగంబున గదలినట్ల తోచున్ గదలడతడు
ఈ ఈశ్వరుడు సర్వజ్ఞుడు. జీవరాసులకు ఆత్మయై వెలయువాడు. ఆత్మరూపమున ఎల్లప్పుడు తన మాయచే త్రిగుణములను కల్పించి ఆ గుణముల సంపర్కముచే పాంచభౌతిక శరీరము దాల్చి లీలానాటకములాడుచుండును. చలించుచున్న జలములో కదలని వృక్షములు కదలుచు కంపించునట్లు, తిరుగుతున్న కళ్ళకు భూమి గిర్రున తిరుగుతున్నట్లు, నిశ్చలుడైన పరమేశ్వరుడాత్మమయుడై కంపించుచున్న అంతరంగములో నుండుటచేత, తానుకూడా కదులుచున్నట్లు భ్రమ కలిగించునుగాని ఆతనికి కదలికయే లేదు. అని హిరణ్యకశిపుడు తన తల్లికి తత్త్వమును బోధిస్తున్నాడు.
హిరణ్యకశ్యపుడు సోదరుని మరణానికి శోకించాడు. ఉదకప్రదానం మొదలైన శ్రాద్ధకర్మలు, తిలోదక దానాలు కావించినాడు. హిరణ్యాక్షుని బిడ్డలైన శకుని, శంబర, కాలనాభ, మదోత్కచ ప్రముఖులను ఊరడించాడు. హిరణ్యాక్షుని భార్యలను పిలిచి పరామర్శించాడు. దు:ఖిస్తున్న తల్లి దితిని ఊరడిస్తూ ఇలా అన్నాడు. బాటసారుల్లా వస్తారు, కలుస్తారు, విడిపోతారు. ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఇది సత్యం. నీ కొడుకు శూరులు పోయే త్రోవలో పోయి వీరగతి చెందాడు. అతని కోసం శోకించడం ఎందుకు? కర్మ వలన
సంయోగ వియోగాలు సంభవిస్తాయి. ఈశ్వరుని లీల అది. ఇది అర్ధం కావడానికి సుయజ్ఞోపాఖ్యానం అనే కధను చెబుతాను వినండి అని హిరణ్యకశ్యపుడు ఇలా వారికి వివరిస్తున్నాడు.
ఉశీనర దేశంలో సుయజ్ఞుడనే రాజున్నాడు. అతడిని యుద్ధంలో శత్రువులు వధించారు. ఆతని మరణవార్త విని అతని శవం చుట్టూ చేరి భార్యలు, పిల్లలు భోరు భోరున విలపిస్తున్నారు. మాకు ఈ పిల్లలకు దిక్కెవ్వరంటూ భార్యలు, నీవు లేకుండా మేముండలేము మేము కూడా అగ్నిలో దూకు నీతో సహగమనం చేస్తాం అని ఆర్తనాదాలు చేస్తున్నారు. సూర్యాస్తమయం కావస్తోంది. వాళ్ళ ఏడుపులు ఆగలేదు. అప్పుడు అంతా గమనిస్తున్న యముడు బాలకుని రూపం ధరించి అచటికి వచ్చి అక్కడ మూగిన బంధుజనాన్ని చూచి ఇలా అన్నాడు.పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. నిత్యం ఎంతోమంది మరణిస్తుండడం చూస్తూ కూడా తమకు మరణం లేదన్నట్లు మరణించిన వారికై తల్లడిల్లుతారు. మరణం ఎవరూ తప్పించుకోలేరు. జనన మరణాలు ప్రాణులందరికీ సహజం. 'ప్రాణుల పుట్టుక, రక్షణ, మరణం పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటాయి '. దైవం అనుకూలిస్తే వీధిలో పారేసుకొన్న ధనం చేతికొస్తుంది. అదే ప్రతికూలిస్తే భద్రంగా ఇంటిలో దాచుకొన్న ధనం కూడా రెక్కలొచ్చినట్లు ఎగిరి పోతుంది.అలాగే అడవిలో వదలివేయబడ్డ బాలుడు కూడా ఆయువు ఉంటే వర్ధిల్లుతాడు. లేకుంటే రక్షణ వలయంలో ఉన్నవాడు కూడా 'హరీ' అంటాడు. ఉండడం, పోవడం అనేది కాలాన్ని బట్టి, కర్మను బట్టి జరుగుతుంటుంది. పంచభూతాలతో నిర్మితమైన భవనం ఈ దేహం. జీవుడు పూర్వకర్మ వలన అందులో కొంతకాలముండి వెళ్ళిపోతాడు. దేహం చెడుతుంది కానీ జీవుడు చెడడు. దేహి వేరు, దేహం వేరు అని తెలుసుకోవాలి. రాజు దేహం చూస్తూ వెర్రివాళ్ళలా ఏడుస్తున్నారు. ఆ దేహంలో వినేవాడు, మాట్లాడేవాడు అక్కడ ఇప్పుడు లేడు. ఎప్పుడో వెళ్ళిపోయాడు. ప్రాణరూపంలో ఉండే గాలి మాట్లాడలేదు. వినలేదు. అందువలన ఏడ్వడం వలన ఏ ప్రయోజనము సిద్ధించదు. తల్లిదండ్రులు, బిడ్డలు, భార్యలు, బంధువులు, మిత్రులు, ఇళ్ళువాకిళ్ళు, సిరిసంపదలు కర్మానుబంధం వలన కలలో కంపించినట్లు కనిపించి కర్మ తీరినాక కనుమరుగైపోతాయి. తత్త్వం తెలిసిన వారు ఉన్నవని సంతోషించరు, పోయినవని విచారించరు. సుఖ దు:ఖాలు అజ్ఞానం నుంచి పుడుతున్నాయి. అని ఒక కధను వివరించాడు యమ బాలకుడు...
పూర్వం ఒక అడవిలో ఒక ఎరుకు ఉండేవాడు. ఒకనాడు ప్రొద్దునే లేచి వేటకు బయలుదేరాడు.విల్లంబులు, వలలు, ఉరులు, కండెలు, చిక్కం మొదలైన సామాగ్రితో పిట్టలను కొట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. పిట్టలను పట్టి వాటి రెక్కలు విరిచి చిక్కంలో వేసుకొంటూ తిరిగాడు. ఒకచోట వాడికి కుళింగ పక్షుల జంట కనిపించింది. అందులో ఆడపిట్టను ఉరిలో వేసి పట్టుకొని చిక్కంలో వేశాడు. అప్పుడు చెట్టుమీద ఉన్న మగపిట్ట అయ్యో అడవిలో మేతమేసి, ఎవరికీ అపకారం చేయక తిరిగే మనకు బ్రహ్మలిఖితం వలన ఈ కిరాతుని పాలుకావలసి వచ్చింది అని వాపోయింది. ఇద్దరం వలలో పడితే బాగుండేది.రెక్కలురాని పిల్లలను నేనొక్కడినే ఎలా పోషించేది? తల్లికోసం దిక్కులు చూసే ఈ పిల్లలకు ఎమి చెప్పి సముదాయించాలి? ఈ బాధ నేను ఎలా భరించేది? అని విచారిస్తున్న మగపిట్టను కూడా ఆ కిరతకుడు బాణం వేసి కొట్టగా నేలమీద పడింది. కాలం సమీపిస్తే ఎవరైనా అలా కూలిపోవలసినదే. ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు. పోయినవారి కోసం శోకించుట వ్యర్ధం. మీ మీ శోకానికి వారు తిరిగి రారు కదా! అని యమ బాలకుడు చెప్పగా శవం వద్ద ఉన్నవారంతా విస్మయం చెందారు. ప్రపంచంలో ఏదీ నిత్యం కాదని గ్రహించి శోకం మాని సుయజ్ఞునికి అంత్యక్రియలు పూర్తిచేసి ఇళ్ళకు వెళ్ళారు.అని ఈతత్త్వబోధను తల్లికి,తమ్ముని భార్యలకు, చెప్పి వారిని ఊరడించాడు హిరణ్యకశిపుడు. వారు కూడా శోకమును ఆపుకొని, తత్త్వదృష్టితో జనన మరణాలు పరమేశ్వరుడి ఆధీనములో ఉన్నాయని గ్రహించినవారై ఎవరి దారిన వారు నిష్క్రమించారు.
ఇంతటి తత్వోపదేశమును తెలియజేసి వారి దు:ఖమును ఉపశమింపజేసిన హిరణ్యకశిపుడు మాయ చే కప్పబడిన మనస్సుతో తాను మృత్యువును జయించాలి.ముల్లోకాలుఏలాలి, శత్రువులంతా నశించాలి, సింహబలంతో సదా తాను వర్ధిల్లాలి.. అని మందర పర్వాతానికి పోయి ఘోరతపస్సునొనరించాడు. ఆతని ఉగ్ర తపానికి భూమి అదిరింది, సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. దేవతలు స్వర్గాన్ని విడిచి బ్రహ్మలోకానికి పోయి బ్రహ్మను ప్రార్ధించారు. బ్రహ్మదిగి వచ్చి ఆతని తపస్సుకు మెచ్చి వరమిచ్చుట.. ఆ వరంతో అతను తనకు మృత్యువు లేదని దేవతలను, గంధర్వులను, అందరినీ హింసించుతూ మద గర్వంతో రాజ్యం చేశాడు. హిరణ్యకశ్యపుడి కుమారుడు ప్రహ్లాదుడు.. ప్రహ్లాదోపాఖ్యానము అందరికీ సుపరిచితమే...
ప్రహ్లాదుడు నరసింహ భగవానుని చేత అతని తండ్రిని సంహరింప చేసి తన తండ్రికి గొప్ప సేవ చేసెను. శాస్త్రములలో ఎవరైన రాక్షసుడైనను భగవంతుని చేత సంహరించ బడినచో అతడు వెంటనే ముక్తిని పొందునని తెలుపబడినది. ప్రహ్లాదుడు ఇలా ఆలోచించెను: "నా తండ్రి ఎన్నో పాపకార్యములను ఒనరించెను. మరియు భగవంతుని వ్యతిరేకించెను కాబట్టి అతడు ముక్తిని పొందజాలడు" అని భావించెను. నరసింహ భగవానుడు హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ప్రహ్లాదుడు ఇలా పలికెను: "శ్రీహరీ! నా తండ్రి గొప్ప నాస్తికుడు. అతడు మీ పాదపద్మముల వద్ద అనేక అపరాధములను చేసెను. అతడిని నీవు సంహరించితివి. అతడిని క్షమించి ముక్తిని ప్రసాదించుమని నేను మిమ్ములను ప్రాధేయపడుతున్నాను." నిజానికి హిరణ్యకశిపుడు వెంటనే ముక్తిని పొందాడు. కాని అతని ప్రియ పుత్రుడు తన తండ్రి ముక్తిని పొందగలిగెనా లేదా అని జిజ్ఞాసతో తెలుసుకోవాలనుకున్నాడు. విష్ణు భగవానుడిచేత సంహరింపబడి ఆ అసురుడు తన జన్మను ధన్యం చేసుకొన్నాడు. ముక్తిని పొందాడు.
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు