Tuesday, December 22, 2015 1 comments By: visalakshi

హరిణిని స్మరణలో .... హరిని విస్మరిస్తే....

 ఓం శ్రీ నారాయణాయ నమో నమ:

 పలువురు ఆధ్యాత్మిక   దిగ్గజులు సైతం ఒక్కోసారి చిన్న బలహీనత వల్ల సాధనాపధము నుండి వైదొలగి,ప్రాపంచిక విషయాలోలురై మాయలో పడి,తమను తాము మిధ్యా విషయలోలురను చేసుకొనిపరమాత్ముని సన్నిధిని కోల్పోతున్నారు.

స్నేహ ధర్మముతో, మిత్రురాలిపై మమకారముతో ఆధ్యాత్మిక సాధనా పధంలో వెనుకంజ వేసి సాధనకై పరితపిస్తున్న  నాఆత్మీయ,ఆత్మసమురాలైన స్నేహితురాలికై నా టపా....తను ఎంతో తపనతో ,ఆర్తితో భగవంతునికై విలపిస్తూ ..అన్నీ వదలి భగవంతుని చరణాలు పట్టుకుని,ఆయనను నిలదీస్తూ ఉంటుంది..నాలోనే ఉండు. సాధనా మార్గము చూపి ముక్తిని ప్రసాదించమని అణువణువు నామ స్మరణ పులకితురాలు అవుతూ ఉంటుంది. తన వేదన చూస్తే నాకే భగవంతుడు తనకి వరమీయరాదా! అనిపిస్తుంది...నా మిత్రురాలికి ఆధ్యాత్మిక చింతనతో శ్రీరామచంద్రుని సాన్నిధ్యంలో వారిని ఆరాధిస్తూ జన్మ ధన్యత చేసుకోవాలని ఆశిస్తూ.....  

 'యది గచ్చసి మాం త్యక్త్వా ప్రాణాంస్త్వ క్ష్యామి తే2 గ్రత:'-  శ్రీరాముని సహచర్యం లేకపోతే ప్రాణత్యాగం చేస్తాననీ ,ఆయన లేని అయోధ్య అరణ్యంతో సమానమనీ, పతిదేవుని చెంతలేని స్వర్గసీమైనా నరకతుల్యమేననీ, పతి సన్నిధే పరమ పెన్నిధి అని భావించి రామునితో అరణ్యవాసానికి పయనమైంది సీతమ్మ.పంచవటిలోని పర్ణశాల యందు పతి సాన్నిధ్యంలో ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్న సీతమ్మ కళ్ళలో ప్రకాశవంతమైన పసిడిలేడి పడింది.  ఆ లేడిని పట్టి తెమ్మని పంపి నిత్యప్రకాశకుడైన పరంధాముణ్ణి దూరం చేసుకుంది.' తమేమ భాంతమనుభాతి సర్వం తస్యభాసా సర్వమిదం విభాతి '  ఎవరి సన్నిధిలో సకల చరాచర సృష్టంతా ప్రకాశిస్తుందో అలాంటి పరమాత్ముణ్ణి పక్కనే పెట్టుకుని అశాశ్వతమైన ఒక అల్పజీవి తళుకుబెళుకులకు ఆకర్షితురాలైంది సీతమ్మ. 



 మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఒక దండకారణ్యవాసం లాంటిదే. సాధనలో తీవ్రత సన్నగిల్లినప్పుడు మనస్సు నిత్యసత్యుడైన భగవంతుణ్ణి వదలి అనిత్యమూ, అసుఖమైన విషయ వస్తువులవైపు పరుగులు తీస్తుంది. 'ధ్యాయతో విషయాన్ పుంస: సంగస్తేషూపజాయతే సంగాత్సంజాయతే కామ: ' విషయ వస్తువుల మధ్య ఉంటే మనసు వాటి ధ్యాసలో పడుతుంది.దానివల్ల వాటిపై రాగం కలుగుతుంది. ఆ రాగం వల్లనే వాటిని పొందాలనే కోరిక బలపడుతుంది.ఆ కోరికను నెరవేర్చుకోవడానికి మనసు ఎన్నో పన్నాగాలు పన్నుతుంది.వాటిని పొందాలనే ఆరాటంలో భగవంతుని ఆరాధనను విస్మరిస్తుంది.విషయ వస్తువుల్ని కోరి విశ్వేశ్వరుణ్ణి వదిలితే, పసిడిలేడి కోసం పరంధాముణ్ణి కోల్పోయిన సీతమ్మలా మనం కూదా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది.


సీతమ్మ కోరిక మేరకు లేడిని తీసుకురావడానికి ఆయత్తమవుతూ రాముడు  సీతమ్మ రక్షణ బాధ్యతను లక్ష్మణునకు అప్పగించాడు. కానీ రామునికి ఆపద వాటిల్లిందని అనుకొని లక్ష్మణున్ని రాముని వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించింది సీతమ్మ. లక్ష్మణుడు ఎంత విశదపరచినా సీతమ్మ వినలేదు కోపోద్రిక్తురాలై లక్ష్మణుణ్ణి దుర్భాషలాడింది. "మన శ్రేయస్సుని కాంక్షించిన వారిపైన కోపాన్ని ప్రదర్శించకుండా వారి సూచనలను స్వీకరించడం శ్రేయస్కరం."  

 శ్రీరామునికి దూరమైన సీతమ్మ రావణాసురుని స్వాధీనమైంది. అశోకవనంలో ఆమె జీవితం శోకమయంగా మారింది. మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి విస్మరిస్తామో అప్పుడు కామాసురుడి కబంధహస్తాలలో బందీ అవుతాం. ఒక అల్పమృగాన్ని ఆశించడం వల్ల ఆనందస్వరూపుడైన రాముణ్ణి కోల్పోయింది సీతమ్మ. అశోకవనంలోని శింశుపావృక్షం క్రింద కూర్చొని పశ్చాత్తాప హృదయంతో విలపించింది.ఒకప్పుడు పసిడిలేడిని చూచి మోహితురాలైన సీతమ్మ ...రావణుడు "నువ్వు కోరితే సమస్త ప్రపంచాన్నే నీ ముందు ఉంచుతాను" అని ఆశ చూపించినా ప్రలోభపడలేదు. పరుల నిధుల కంటే పతి సన్నిధియే మిన్న అని సీతమ్మ దృఢ మనస్కురాలై శ్రీరాముని సాన్నిధ్యం కోసం వేయి కళ్ళతో ఎదురు చూసింది. సీతమ్మ ఆవేదనను విన్న శ్రీరామచంద్రుడు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు. పశ్చాత్తాపంతో చేసిన ప్రార్ధనలు భగవంతుణ్ణి మన వద్దకు తీసుకువస్తాయి.ఆయన సన్నిధి తప్పక లభిస్తుంది.

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు  
Friday, December 11, 2015 6 comments By: visalakshi

గీతామృతసారం

  ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ:

  ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని 'వైకుంఠ ఏకాదశి ' అంటారు. మార్గశిర శుక్ల ఏకాదశిని 'గీతా జయంతి 'గా వ్యవహరిస్తారు. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి రెండూ ఒకే రోజు రావడం ఒక విశేషం.





 భగవద్గీత ఉపనిషత్తుల సారంగా, బ్రహ్మవిద్యను ప్రభోదించే గ్రంధంగా, యోగశాస్రంగా చెప్పబడింది.ఏ గ్రంధానికి లేనటువంటి ప్రత్యేకతను సంతరించుకొని,వ్యక్తులకు వలె జయంతిని జరుపుకుంటున్న భగవద్గీత, సాటిలేని ప్రస్థానత్రయంలో భాగమై,'సర్వశాస్త్రమయీ ' అనగా సర్వశాస్త్రాల సారమని చెప్పబడింది. 

 యోగీశ్వరుడైన కృష్ణుని ముఖతా వెలువడిన ఈ వాణి భరతఖండంలోనే కాక,ఖండాంతరాలలో కూడా విశేష ప్రాచుర్యాన్ని పొందింది.  ఈ గీత హిమవత్పర్వతం వంటిది. సమీపిస్తున్నా కొద్దీ దాని యొక్క వైశాల్యమూ, సౌందర్యమూ, విశిష్టత గోచరమవుతూ వస్తాయి. ఇందులో చిన్న,చిన్న విషయాలను (ధర్మం, కర్మ ) మొదలుకొని బ్రాహ్మీస్థితిని పొందేందుకు గల బ్రహ్మజ్ఞానం వరకు నిబిడీకృతమై ఉన్నాయి. 

నరుడికి, నారాయణుడికి మధ్య సంవాదంగా నిలిచి ఉన్న ఈ గీత, వారి యందు దాగి ఉన్న పరస్పర సంబంధమనే చిక్కుముడిని విప్పి, మానవ జీవిత లక్ష్య నిర్దేశ్యకంగా నిలుస్తుంది. ఇహలోకంలో మానవుణ్ణి క్రియాశీలునిగా వ్యవహరింపజేస్తూ, ఆత్మసాక్షాత్కార ప్రయాణ మార్గాన్ని తెలిపే ఈ గీత యొక్క మహాత్మ్యం వర్ణనాతీతం.

 వేగవంతమైన మనస్సు బుద్ధిని సంక్షోభంలో పడవేస్తుంది. బుద్ధి ఈ విధంగా అస్థిరతకు లోనైనప్పుడు కర్మ యొక్క నిజ స్థితిని గుర్తించలేదు. అస్థిరత్వానికి మూలం మమకారం. మన ఈ పక్షపాత వైఖరికి కారణం మమకారమనే సంకెళ్ళలో బందీ కావడమే!

"నా వారు " అనుకున్నా వారంతా యుద్ధంలో చనిపోతారు అనే భయం అర్జనుణ్ణి ఆవరించింది. అర్జనుడి దు:ఖానికి కారణం --నా వాళ్ళనే మమకారమే! 

 ఈ మమకారపు సంకెళ్ళ నుండి విడిపించడానికే శ్రీకృష్ణుడు దేహ పరిణామక్రమాన్నీ, అశాశ్వతత్వాన్నీ, పరమార్ధతత్వ జ్ఞానాన్నీ బోధిస్తూ....

  దేహినో2 స్మిన్ యధా దేహే కౌమారం యౌవనం జరా 
  తధా దేహాంతరప్రాప్తి: ధీర స్తత్ర న ముహ్యతి !! (గీత. 2 - 13)

    ' మానవుడికి ఈ దేహంలో బాల్యం,యౌవనం,ముసలితనం ఎలా కలుగుతున్నాయో, మరణం తరువాత మరొక దేహాన్ని పొందడం కూడా అలాంటిదే! ఈ విషయంలో జ్ఞానులు(ధీరులు) మోహవశులు కారు.' అని వివరించాడు. చిరిగిన వస్త్రం వదలి, కొత్త వస్త్రాన్ని ధరించినట్లు-మరణం తరువాత ఆత్మ మరో దేహాన్ని ధరిస్తుందని గ్రహించినవారే ధీరులు. అని ఉద్ఘాటించి, అర్జనుడి మోహపాశాన్ని త్రుంచి వేశాడు శ్రీకృష్ణుడు.

 ఆత్మజ్ఞానం పొందిన మహాత్ములు అతి కొద్దిమందే ఉంటారు. ఆ స్థితిని పొందడం అందరికీ అంత సులభం కాకపోవచ్చు. కానీ ఈ దేహం శాశ్వతం కాదని గుర్తెరిగి వ్యవహరిస్తే మన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. నిజానికి మనలోని అసూయా ద్వేషాలకూ, అహంకార మమకారాలకూ,లోభ మోహాలకూ,కోపావేశాలకూ, పంతాలూ పట్టింపులకూ, భయాందోళనలకూ ముఖ్య కారణం ఈ భూమ్మీద మన జీవితం మూన్నాళ్ళ ముచ్చటేనని మరచిపోవడమే!

 ' ఈ దేహం వేరు, ఆత్మ వేరు ' అన్న అనుభూతి మనకు కలగకపోయినా  " ఈ దేహం ఎప్పుడు రాలిపోతుందో, ఈ గూటిలోని చిలుక ఎక్కడికి ఎగిరిపోతుందో" అన్న భావన మన మదిలో మెదిలితే మమకారం పటాపంచలవుతుంది. నేను-నాది అనే భావం నశిస్తుంది. 

 గీతా శ్రవణేచ్చ పూర్వజన్మ పుణ్యం వలనే లభిస్తుంది. మన మనస్సు మలినపూరితమైతే దైవ కార్యాలపట్ల ఆసక్తి జనించదు. ఒకవేళ ఆసక్తి పుట్టినా అది నిలవదు. పుణ్యకార్యాలవల్ల, నామస్మరణ వల్ల, ప్రార్ధనలవల్ల మనోమాలిన్యాన్ని తొలగించుకోవాలి. అప్పుడే దైవవాణిని వినడానికి, దివ్యానుభూతిని అనుభవించడానికి అర్హులవుతాం. దైవకృపకు పాత్రులవుతాం.


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.








Wednesday, November 18, 2015 1 comments By: visalakshi

గురువుకు భగవద్దర్శనం కలిగించిన శిష్యుడు

 ఓం శ్రీ గురుభ్యో నమ:

 అగస్త్యమహర్షి, ఆయన శిష్యులు ఋగ్వేదాన్ని కూలంకషంగా అధ్యయనం చేసినవారు. అగస్త్యుని ఆశ్రమంలో అనేకమంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు.సుతీష్ణుడు వారిలో ఒకడు.

 గురుదేవా పూజకు అన్ని ఏర్పాట్లు చేసాను.అన్నాడు సుతీష్ణుడు. చూడండి,సుతీష్ణుడు ఎంత చురుగ్గా,ఉత్సాహంగా ఉంటున్నాడో! 
శిష్యులారా! రామనామం ఒక దీపం వంటిది.అన్నారు గురువు.

అవును గురుదేవా ! అది బాహ్యమైన చీకటినీ, ఆంతరిక అంధకారాన్నీ పారద్రోలుతుందని మునుపు ఒకసారి మీరు సెలవిచ్చారు.భేష్ సుతీష్ణా! నీ జ్ఞాపకశక్తి అద్భుతం. 

 గురువు సుతీష్ణుని ప్రశంసించడంతో తక్కిన శిష్యులకు అసూయ కలిగింది.వారు అగస్త్యునితో...గురుదేవా! మీరు సుతీష్ణుని అమితంగా ప్రశంసిస్తున్నారు, అందువల్ల అతడు మమ్మల్ని అసలు ఖాతరు చెయ్యడమే లేదు.మమ్మల్ని ఆటపట్టిస్తూ పరిహసిస్తున్నాడు.

  మీకన్నా చిన్నవాడైన అతడు ఏకసంధాగ్రాహిగా ఉన్నాడు. అలా ఉండడం నేర్వండి. అనవసరంగా అసూయ చెందకండి. సుతీష్ణుడు ఉత్తమ విద్తార్ధే అయినప్పటికీ, చిన్నతనం కారణంగా అతడిలో కాస్త అల్లరి ఉండడం సహజమే.

  ఒకసారి అగస్త్యుడు ఒక యాత్రకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు.ఆయన సాలగ్రామం ఉన్న పూజాద్రవ్యాల పెట్టెను సుతీష్ణుడు వెనకాల మెల్లగా తీసుకువస్తున్నాడు. దారిలో ఒక నేరేడు చెట్టును చూడగానే రాళ్ళతో కొట్టి క్రింద పడ్డ పళ్ళను తినసాగాడు.ఇలా రాళ్ళతో పండ్లను కొట్టి కొట్టి అక్కడ ఉన్న రాళ్ళన్నీ ఖాళీ చేసాడు. అలా విసిరిన రాళ్ళు పక్కనే ఉన్న నదిలో పడ్డాయి. చివరికి పండ్లమీద ఉన్న ఆశతో చిన్నతనపు తుంటరితనం కారణంగా గురువుగారి పెట్టెలోని సాలగ్రామాన్ని కూడా తీసుకొని విసిరివేశాడు.

 ఆహా! పండు పడింది కానీ సాలగ్రామం నదిలో పడిపోయిందే! అయ్యో గురువుగారు కోప్పడతారే! ఏం చెయ్యాలి?.. నదిలో ఎంత వెతికినా సాలగ్రామం లభించలేదు.అందుచేత సాలగ్రామంలా ఉన్న ఒక నేరేడు పండును పూజాద్రవ్యాల పెట్టెలో జాగ్రత్తగా పెట్టాడు.  

  మర్నాడు అగస్త్యుడు పూజ చేస్తున్నప్పుడు.....ఈ రోజు సాలగ్రామం మృదువుగా ఉందే!అభిషేక జలం పడితే తోలు వొలిచేసినట్లు ఉంటోందే,ఏమిటిది? ఆ...ఇది నేరేడుపండు.! ఎవరీ తుంటరి పనిచేసింది? సుతీష్ణా...  క్షమించండి గురుదేవా! పళ్ళు తినాలనే ఆశతో నేనే ఈ పాపానికి ఒడికట్టాను... మూర్ఖుడా! నీ తుంటరితనం శ్రుతిమించింది. నీ ముఖం చూపించకు. వెళ్ళిపో!

అనుగ్రహించండి గురుదేవా!మిమ్మల్ని చూడకుండా, మీకు సేవ చేయకుండా నేను క్షణం కూడా ఉండలేను...నేను సాక్షాత్తూ భగవంతునిగా ఎంచి ఆరాధించిన సాలగ్రామాన్ని పోగొట్టావు.ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ,నా భగవంతుణ్ణి నాకు తెచ్చి ఇవ్వు అంతవరకు నా ముందుకు రాకు.! విచారంతో ఆశ్రమం నుండి బయటకు వచ్చిన సుతీష్ణుడు దండకారణ్యంలో ఒక పర్ణశాల కట్టుకొని గురువు ఉపదేశించిన రామనామాన్ని జపిస్తూ రాముని ధ్యానంలో లీనమయ్యాడు. 



 కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి. వనవాసానికి వచ్చిన శ్రీరాముడు, లక్ష్మణునితో ఇలా చెప్పాడు.. లక్ష్మణా! ఈ ప్రాంతంలో రామనామం బిగ్గరగా వినవస్తున్నది. ఇక్కడ ఎవరో కఠోరతపస్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. ..వెంటనే శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై సుతీష్ణుని పర్ణశాలకు వెళ్ళాడు. అప్పటికీ సుతీష్ణునికి  ధ్యానభంగం కాలేదు. శ్రీరాముడు అతడి హృదయంలో చతుర్భుజమూర్తియైన నారాయణునిగా దర్శనమిచ్చాడు. బాహ్యచైతన్యం కలిగిన సుతీష్ణుడు ...

 పరమాత్మయైన శ్రీరామా! ఈ అల్పుడి కోసం ఈ ఘోరారణ్యంలోకి ఇంత శ్రమపడి వచ్చావా...?ఓ శ్రీరామా! మీరు నా గురుదేవుల ఆశ్రమాన్ని ఒక్కసారి పావనం చేయండి.ఆయన నా పట్ల మునపటిలా వాత్సల్యంతో ఉండేలా చూడాలి.,,అలాగే!


అగస్త్యుడు శిష్యులకు పాఠం బోధిస్తున్నాడు. విద్యార్ధులారా! ఓంకార మాహత్యమూ,దివ్యశక్తీ రెండూ రామనామంలో ఉన్నాయి. ..గురుదేవా ప్రణామాలు. మీరు ఆజ్ఞాపించినట్లే భగవంతునితో వచ్చాను. ఇదుగో మన ఆశ్రమాన్ని సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరాముడు పావనం చేస్తున్నాడు.శ్రీరామచంద్ర ప్రభువా! ఏం చెబుతున్నావు సుతీష్ణా?...శ్రీరాముని చూసి అగస్త్యుడు పులకరించిపోయి ఆయనను ఆహ్వానించి సముచిత మర్యాదలు చేశాడు. తరువాత...

సుతీష్ణా! గురువు శిష్యుడికి భగవద్ధర్శనం చేయిస్తాడు. కానీ నువ్వు మాత్రం గురువుకే భగవంతుని దర్శనం కలిగించావు. నీ గురుభక్తి మహోన్నతమైనది. నువ్వు చిరస్మరణీయుడవు.  

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
Saturday, November 14, 2015 0 comments By: visalakshi

భగవన్నామ మధువు మాధుర్యము

  ఓం శ్రీ పరంధామాయ నమ:

  ద్వా సుపర్ణా సయుజా సఖయా సమానం వృక్షం పరిషస్వజాతే!
 తయోరస్య: పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి!!


  భా:- ఒకే చెట్టు పైన రెండు పక్షులు ఉన్నాయి. కింద కొమ్మ మీద ఉన్న పక్షి పళ్ళను తింటున్నది. అది తియ్యని పళ్ళను తిన్నప్పుడు సుఖాన్ని, చేదు పళ్ళను తిన్నప్పుడు దు:ఖాన్ని పొందుతుంది.రెండవ పక్షి ఏమీ తినకుండా ప్రశాంతంగా కూర్చొంది. సుఖదు:ఖాలకు అతీతమైన ఆత్మానందాన్ని అనుభవిస్తోంది.


  దేవదానవుల మధ్య తీవ్ర యుద్ధాలు జరుగుతున్న రోజులవి.  దేవతలు 
ఎంతో కష్టపడి దానవులపై విజయం సాధించినా ఆ ఆనందం ఎక్కువ కాలం నిలిచేది కాదు.దానవ గురువు శుక్రాచార్యుడు అసురులను మృతసంజీవని విద్యను ప్రయోగించి బ్రతికించేవాడు. ఈ కారణం చేత దేవతల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తున్నది. 'ఇది ఇలాగే కొనసాగితే మనం అంతరించిపోతాం,ఏదైనా మార్గాన్ని అనుసరించి మనల్ని మనం రక్షించుకోవాలీ, అని దేవతలందరూ భావించారు. దేవగురువైన బృహస్పతి కుమారుడు కచుడిని శుక్రాచార్యుడి దగ్గరకు పంపాలని నిశ్చయించారు.   అతడు రాక్షస గురువు వద్ద మృతసంజీవని విద్యను నేర్చుకొని వచ్చి యుద్ధంలో చనిపోయిన దేవతలను తిరిగి బ్రతికిస్తుండాలి.ఆనాటి గురువులలో వివక్షత లేదు. దేవతల ప్రతినిధిగా వచ్చినప్పటికీ కచుడి వినయ విధేయతలు నచ్చి శుక్రాచార్యుడు కచుని శిష్యుడిగా స్వీకరించాడు. వినయ సంపదే విజ్ఞానార్జనకు మొదటి అర్హత అని చాటాడు. కచుడు గురుశుశ్రూష చేస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి.రాక్షసులు కచుడిని గమనిస్తున్నారు.అతడు దెవగురువు కుమారుడని,తమ గురువు వద్ద మృతసంజీవని విద్యను నేర్చుకొని యుద్ధంలో దానవ సమ్హారాన్ని నిరాటంకంగా కొనసాగించటానికి దేవతలు వేసిన ఎత్తుగడ అని వారికి అర్ధమైంది. ఒక రోజు కచుడు అడవిలో ఆలమందను మేపుతూ, ఒంటరిగా ఉన్నప్పుడు కచుని చంపి, శరీరాన్ని ఖండఖండాలుగా చేసి మృగాలకు ఆహారంగా వేసారు. శుక్ర తనూజ దేవయానికి కచుడంటే మహాభిమానం. కూతురంటే శుక్రాచార్యుడికి వల్లమాలిన ప్రేమ. బ్రహ్మజ్ఞాని అయిన ఆ ఋషి మనసు కుమార్తె కారణంగానే లౌకిక ప్రపంచంలో నిలిచేది. ఆ రోజు ఆవులతో పాటు కచుడు రాలేదు. దేవయాని ప్రమాదాన్ని శంకించింది. తండ్రి వద్దకు వెళ్ళి కచుడు తిరిగి రాలేదని ఏడుస్తూ చెప్పింది. ఆత్మజ రోదించడం చూడలేని ఆ సం యమి వెంటనే దివ్యదృష్టితో జరిగిన విషయాన్ని గమనించాడు. మృతసంజీవని విద్యను ప్రయోగించాడు. కచుడు జంతువుల శరీరాలను చీల్చుకుంటూ బయటకు వచ్చాడు.   ఇంకోసారి కచుడు దేవయానికి పూలను తీసుకురావటానికి అడవికి  వెళ్ళినపుడు రాక్షసులు అదే అవకాశంగా కచుడిని చంపి, శరీరాన్ని కాల్చి  ఆ బూడిదను సముద్రంలో కలిపారు. కచుడు ఆశ్రమానికి రాలేదని చూసి దేవయాని మళ్ళీ వెళ్ళి తండ్రి వద్ద మొరబెట్టుకుంది. ఈసారి కూడా అసుర గురువు తన అద్భుత విద్యతో కచుడిని బ్రతికించాడు. దైత్యులు ఇక లాభం లేదనుకొని మరోసారి కచుడు ఏకాంతంగా ఉన్నాప్పుడు అతడిని చంపి, ఆ శరీరాన్ని కాల్చి బూడిద చేసి, మద్యంలో కలిపి తమ గురువుతో తాగించారు. కచుడు కనబడకపోయేసరికి దేవయాని విచలిత మనస్కురాలైంది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కచుడిని బ్రతికించమని తండ్రిని వేడుకుంది. దేవయాని కచుడిని చూడందే అన్నపానీయాలు ముట్టనని భీష్మించింది. దైత్యగురువుకి ఇక తప్పలేదు.మళ్ళీ విద్యను ప్రయోగించి, 'నాయనా కచా! లేచి రా'అన్నాడు. 'గురువర్యా నేను మీ శరీరంలోనే ఉన్నాను.' అని కచుడు బదులిచ్చాడు. శుక్రాచార్యుడికి దానవుల పన్నాగం అర్ధమైంది. మహాతపశ్శాలి ఐన ఆయన సురాపానం వలన తాను మోసపోయినట్లు గ్రహించాడు. కచుడు బయటకు వస్తే తాను  చనిపోవాల్సి ఉంటుంది. ఇక నిశాచర గురువుకి ప్రత్యామ్నాయం కనబడలేదు. కచుడికి మృతసంజీవని విద్యననుగ్రహించాడు. కచుడు గురువు శరీరాన్ని చీల్చుకొని, బయటకు వచ్చి తరువాత తాను గ్రహించిన విద్య ద్వారా గురువుని బ్రతికించాడు.ఆచార్యుడి ఋణం తీర్చుకున్నాడు.ఆదర్శ శిష్యుడనిపించుకున్నాడు. అసురాచార్యుడు జరిగిన తంతునంతా విచారించి,మధ్యపానం ఎంత అనర్ధానికి దారి తీసిందో గ్రహించి ఆగ్రహోదగ్రుడయ్యాడు. భయంకర శాపాన్ని భవిష్యత్ మధ్యపాన ప్రియులపై ప్రయోగించాడు. 'ఎవరైతే జ్ఞానవిహీనులై సురాపానం చేస్తారో వారు    ధర్మభ్రష్టులవుతారు.వారిని అందరూ చీదరించుకుంటారు. ఈసడిస్తారు. ఈ నా ఆజ్ఞను పాటించనివాళ్ళు పతనమవుతారు.అన్నాడు శుక్రాచార్యుడు.ఇది మహాభారతంలోని ఒక అద్భుత సన్నివేశం. ఈ గాధలో ఎన్నో ధర్మసూక్ష్మాలు ఉన్నాయి.       

 ఒక వ్యక్తి మద్యానికి బానిసై, గురువుతో యావజ్జీవితమూ నన్ను మత్తులో పడేసే మద్యాన్ని దయచేసి నాకివ్వండి ' అంటాడు. భగవన్నామం జపించమని ,ఆ మధువు ముందు అన్నీ దిగదుడుపేనని చెప్పి ఆ వ్యక్తిని మహా భక్తుడిగా తీర్చిదిద్దారు గురుతుల్యులు.ఈ భగవన్నామ మధువును రుచి చూడలేకపోవటం వల్లనే మనిషి చవకబారు మద్యానికి అలవాటు పడుతున్నారు.మందార పుష్పంలోని మకరంద మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్తపూల వైపుకి పోతుందా?'అంటాడు ప్రహ్లాదుడు.భగవన్నామ మాధుర్యమును ఆస్వాదించ లేకపోవటం వలననే మన మనస్సనే తుమ్మెద మద్యమనే ఉమ్మెత్త పూవుపైకి పోవుచున్నది. కానీ ఈ మాధుర్యాన్ని గ్రోలాలంటే ఎంత ఆధ్యాత్మిక సంస్కారం కావాలి!మధుపాన ప్రియులను, మాధవ ప్రియులుగా మార్చుటకు 'దయాస్వరూపుడైన ఆ శ్రీహరి అందరినీ సమగ్రజ్ఞానం వైపుకు నడిపించు గాక!'

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.
Friday, November 13, 2015 1 comments By: visalakshi

మధుర స్పందన

  ఓం శ్రీ సర్వేశాయ నమో నమ:




ఆత్మీయ భావం మధుర స్పందన. ఆంతరంగిక అనుభూతి ఒక మధుర స్పందన. మదిలోఊగిసలాడే మధుర భావాలు ఒక మధుర స్పందన. ఈ స్పందనలన్నీ మనసులో నిక్షిప్తమై ఉంటేనే మధురంగా ఉంటుంది. మాటలద్వారా బయటకి బహిర్గతమయ్యాయా అనుకోని స్పర్ధలవుతాయి. సఖ్యతకు చెలిమికి దూరమయ్యే భావనలకు లోనవుతాము. సత్యానికి అందరం ఎంతో మధురానుభూతితో పలకరించుకుంటాము .కానీ ఆప్యాయత తో మరిన్ని కబుర్లు అపార్ధాలకు దారి తీస్తాయి. పరుష భావజాలము మొదలవుతుంది. 

మైత్రిలో ఒకరి భావాలను,ఒకరు పంచుకుంటాము. బాధలను కూడా పంచుకుంటాము. అలాగే భేదాభిప్రాయాలను కూడా అర్ధం చేసుకొని మైత్రీ భావనను మధుర స్పందనగా మలచుకొని హృదయంలో ఆత్మీయతానురాగాలను పదిలపరచుకోవాలి.

 అధ్యాత్మికంగా ఎల్ల వేళలా భగవంతుడి స్మరణం మనకు అలౌకిక ఆనందానుభూతిని కలిగిస్తుంది. మనము సౌమ్యముగా సఖ్యతతో,ఆత్మ స్వభావము తో స్నేహం,ప్రేమ భావ మైత్రితో అంతరంగమున దివ్య స్పందనలు మధురంగా నిక్షిప్తపరచుకోవాలి.

అధరం మధురం, వదనం మధురం,
నయనం మధురం, హసితం మధురం!
హృదయం మధురం, గమనం మధురం,
మధురాధిపతేరఖిలం మధురం!!


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.

ఆత్మాభిమానం (Self - respect )


 సమతన్ స్నేహముచే సుతత్వమును,విశ్వాసంబు చేతన్ సఖి
 త్వము,జాలన్ హితవృత్తి చేతన్ సుహృత్త్వంబున్, సుమంత్రోపదే
 శముచేతన్ నిజదేశికుం డనగ నిచ్చల్ పూజ్యుడౌ నిష్టదై
 వమునై వారికి కాలచక్రభయముల్ వారింపుదుం....


భా:-" సర్వసముడనైన నేను స్నేహం వల్ల కుమారుని వలెనూ, విశ్వాసము వల్ల చెలికాని వలెనూ,హితం చేకూర్చటం వల్ల ఆత్మీయుని వలెనూ, మంత్రం ఉపదేశించటం వల్ల ఆచార్యుని వలెనూ ఉంటూ వారికి నిత్యమూ పూజింపదగిన ఇష్టదైవాన్నై;కాలచక్రం వల్ల భయం కలగకుండా వారిని కాపాడుతూ ఉంటానని " అభయమిస్తూ...భక్తుడి భావాన్ని బట్టి భగవంతుడు తన అనుబంధాన్ని పెనవేసుకుంటాడు. 



 1. ఎవరికీ తలవంచని మనస్తత్వంతో, స్వతంత్రభావాలతో, ఋజువర్తనతో ఆత్మగౌరవానికి,విలువలకు కట్టుబడి ఏ ప్రలోభాలకు లొంగకుండా ఆత్మాభిమానంతో మెలగాలి.

2. అహంభావంగా వ్యవహరించకుండా ,బాధ్యతల విషయంలో నిక్కచ్చిగా ఉండాలి.

3. అంతరాత్మ ప్రభోదముతో మన వ్యక్తిత్వాన్ని,ఆత్మాభిమానాన్ని చాటుకోవాలి.

4.మనలోచాలామందికిఆత్మాభిమానం(Selfrespect)కి,అహంకారాని(egotism )కి తేడా తెలియదు. ఆత్మాభిమానం పేరుతో అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అణకువ,నమ్రత పేరుతో ఆత్మన్యూనతతో తమను తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు. రెండూ హర్షణీయం కాదు.  

5. ఆత్మ గౌరవం అత్యున్నతమైన గుణం. ఎక్కడా రాజీపడకూడదు. మన గౌరవాన్ని నిలబెట్టుకుంటూనే ,ఎదుటివారిని గౌరవించాలి. -ఎదుటి వారిని గౌరవించే ప్రక్రియలో నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు. 

6. ఇతరులకు సముచితమైన గౌరవాన్ని ఇస్తూ,మన ఆత్మాభిమానానికి భంగం కలగకుండా నడుచుకోవడం ఆదర్శవ్యక్తిత్వానికి చిహ్నం. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యపడుతుంది.

 " విశ్వాసమే గొప్పధనం, ధర్మాన్ని అనుసరించి జీవించడం శాంతిదాయకం. సర్వరుచులలో సత్యవాక్కు అమిత రుచికరం. ప్రజ్ఞతో కూడిన జీవితం ఉత్తమోత్తమం."-బుద్ధుడు


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు     
Tuesday, November 10, 2015 2 comments By: visalakshi

జ్ఞానదీపతేజం

  శ్లో" సమో& హం సర్వభూతేషు న మే ద్వేష్యో& స్తి న ప్రియ:!
    యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం!!(భగవద్గీత - 9.29)

  "నేను సర్వభూతముల యందు సమదృష్టి కలిగి ఉంటాను. నాకొకడు ఇష్టుడు కానీ,ఒకడయిష్టుడు కానీ లేడు. ఎవరు భక్తితో ఆరాధిస్తారో వారియందు నేను, నా యందు వారు నెలకొని ఉంటార"ని స్పష్టం చేస్తాడు భగవాన్ శ్రీకృష్ణుడు.


 మనం వెలిగించే దీపావళి దీపాలు బయట చీకటిని పారద్రోలుతున్నాయి కానీ హృదయంలో ఉన్న అజ్ఞానమనే అమావాస్యపు చీకటిని తొలగించలేకపోతున్నాయి. ప్రపంచంలో జీవులనుభవించే బాధలన్నింటికీ ఈ అజ్ఞానమే మూలకారణమై ఉన్నది. అజ్ఞానమనే ఈ గాడాంధకారం ఎన్నెన్నో జన్మలనుండి హృదయంలో ఘనీభవించి ఉన్నందునే, జన్మ పరంపరలు,సంసారపు యాతనలు కలుగుతున్నాయి. ప్రకాశవంతుడైన భగవంతుని ఉనికి కనుగొన్నాప్పుడు మాత్రమే ఈ అజ్ఞానపు చీకటి తొలగిపోతుంది. మన చిత్తంలో గల దోషాలను తొలగించుకొని హృదయాన్ని సత్త్వగుణమయం చేసుకొవాలి. మన హృదయమంతా అహంకారమనే నరకాసురుడు నిండి ఉంటే భగవద్దర్శనం లభించదు. ఈ అహంకారాన్ని నిర్మూలించుకునేవరకూ మనలోనే ఉన్న నరకుడు విజృంబిస్తూనే ఉంటాడు. 

  సర్వగం సచ్చిదానందం జ్ఞాన చక్షుర్నిరీక్ష్యతే!
  అజ్ఞాన చక్షుర్నే క్షేత భాస్వంతం భానుమందవత్!!

  'సర్వ వ్యాపకమై ఉన్న సచ్చిదానంద పరబ్రహ్మాన్ని జ్ఞాననేత్రం మాత్రమే చూడగలదు. ప్రకాశించే సూర్యుని అంధుడు చూడజాలనట్లు అజ్ఞాననేత్రం ఆ పరబ్రహ్మాన్ని దర్శించలేదు.'
  అందుచేత అహంకారమనే నరకుని నశింపజేసినపుడే, మనం ఆత్మానందమనే దీపావళిని జరుపుకున్న వాళ్ళమవుతాము.

  దీపావళినాడు భగవదారాధనం,లక్ష్మీ పూజ చేయాలని శాస్త్రవచనం. సంధ్యా సమయంలో దీపాలను వెలిగించి,అందు లక్ష్మిని ఆహ్వానించి,లక్ష్మీపూజ చేయడం పరిపాటి. 
    తామరపూవు సత్యానికి,పవిత్రతకు,సుందరత్వానికి ప్రతీక.అంతే కాక మన హృదయానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది.మానవుని హృదయం తామరమొగ్గ వలె ఉండునని,ధ్యానం చేత అది వికసించునని అందు పరమాత్ముని యోగులు సర్వదా గాంచుదురని మహాత్ములు తెలిపి ఉన్నారు.తామరపుష్పానికి మరొక విశేష లక్షణం ఉంది; తామరపూవు ఉదయించే సూర్యుని రాకతో వికసించి,రాత్రికి ముడుచుకునిపోతుంది.
 మన హృదయం అనే తామర వికసించేందుకు జ్ఞానసూర్యుడు ఆవశ్యకమని కమలం మనకు ప్రభోదిస్తోంది.అందుచేతనే శ్రీమహాలక్ష్మి పంకజాసనియై,మానవుని పరిపూర్ణతకు గుర్తు తామరపుష్పం అని చేత సంకేతంగా ధరించి ఉన్నది.సమస్త ఐశ్వర్యాలకూ అధిష్టానదేవత అయిన ఆ శ్రీమహాలక్ష్మిని, దీపావళి సందర్భంగా మనలోని అజ్ఞానపు తిమిరాన్ని పారద్రోలి జ్ఞానదీప తేజాన్ని ప్రసాదించమని ప్రార్ధిస్తూ అర్చించాలి. 

 దీపావళి శుభాకాంక్షలతో.... సర్వే జనా సుఖినో భవంతు... 


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
Sunday, November 8, 2015 2 comments By: visalakshi

మనో సంస్కారాలు

  ఓం శ్రీ రామాంజనేయాయ నమో నమ:

 స్తోత్రం:-
               సదారామ రామేతి రామామృతం తే

               సదారామ మానంద నిష్యంద కందం

              పిబన్న స్వహం నన్వహం నైవ మృత్యో


              ర్బిభేమి ప్రసాదా దసాదాత్త వైవ !!



  భా:- నిరంతరమూ ఆనందరసమును స్రవింపచేయు 'రామ రామ రామ 'అనెడి నామ సుధారసమును నిత్యము పానము చేయుచున్న నేను మృత్యువునకు భయపడను.నీ అనుగ్రహము వలన నేను నిర్భయుడనైతిని..

1. ప్రతి మనిషి జీవితంలో శారీరక కర్మల ప్రభావం కన్నా, మానసిక కర్మల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.మనం ఏ పని చేసినా రెండు రకాల ఫలితాలు కలుగుతాయి.ఒక ఫలితం బాహ్యంగా కనిపిస్తుంది.రెండవ ఫలితం మన మనస్సుపై ప్రతిఫలిస్తుంది.మనస్సులో పడ్డ సత్కర్మల,దుష్కర్మల పని తాలూకు ముద్రలు కాలక్రమంలో సంస్కారాలుగా పరిణమిస్తాయి.

2. సమాజంలో ఇలాంటి సంస్కారాల ప్రభావం చేతనే ఒక్కో మనిషి ఒక్కో రీతిలో ప్రవర్తిస్తూ ఉంటాడు.కొందరు ప్రలోభాలకు లొంగిపోయి తప్పటడుగులు వేస్తారు.మరికొందరు ప్రాణాల వరకు వచ్చినా తాము నమ్ముకున్న సిద్ధాంతం నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు వేయరు.మంచి సంస్కారాలతో మనస్సు ఎంత సుసంపన్నమైతే, జీవితం అంత అర్ధవంతమవుతుంది. 

3.ఆధునిక జీవనపు అలజడిలో యధాలాపంగా జీవించకుండా ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి.ఒక నియమానికి కట్టుబడి ఉండేలా మనసుకు శిక్షణ ఇవ్వాలి. విచక్షణ పాటించి, 'ఈ పని చేయడం అవసరమా? కాదా? అని ఆత్మావలోకనం చేసుకోవాలి.మంచి ఏదో, చెడు ఏదో వివేకంతో తెలుసుకొని మసలుకోవాలి.ముఖ్యంగా యౌవనప్రాయంలో తాత్కాలిక సరదాలకు లోనయితే ఆ అలవాట్లే సంస్కారాలుగా మారి భవిష్యత్తులో వ్యక్తిగతంగా తమనే నాశనం చేస్తాయని తెలుసుకోవాలి. మనల్ని అందలం ఎక్కించినా, అధోగతి పాల్జేసినా ఆ మనో సంస్కారాలేనని గుర్తుంచుకోవాలి.  

  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు. 
Monday, November 2, 2015 0 comments By: visalakshi

ఉభయకుశలోపరి

ఉభయకుశలోపరి అని నిన్న ఈనాడు ఎడిటొరియల్ లో నాకు నచ్చిన కొన్ని అంశాలు.


 'సర్వే భవంతు సుఖిన:/సర్వేసంతు నిరామయా- అందరూ సుఖంగా, నిశ్చింతగా ఉండాలి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. మంగళవచనాలు వీనులకు మంగళకార్యాలు అక్షులకు విందులు చేయాలి. ఏ ఒక్కరూ దు:భాజితులు కారాదు అని కోరుకొనే 'మంగళాచరణం' తెలుగునాట ప్రతి గుడి ముంగిట సమయ సందర్భం వచ్చినప్పుడల్లా గుడిగంటలతో కలిసి ప్రతిధ్వనించడం అనాదిగా వస్తున్న సదాచారం.  

 "వాక్కును మితంగా,పరహితంగా వాడితే అదే మంత్రమవుతుంది." అంటారు శ్రీశంకరులు. 

 అభయహస్తం ఆశించి వచ్చినవాడు పరమశత్రువైనా సరే ఉభయకుశలోపరి విచారించకుండా తిప్పి పంపడం భారతీయులకు బొత్తిగా సరిపడని సంస్కృతి.

స్వసంస్కృతీనిష్టులై,స్వదేశానురాగులయీ.... పరసంస్కృతుల పట్ల సంసర్గం, పరాయిదేశాల పట్ల గౌరవాలు పుష్కలంగా ప్రదర్శించే సామరస్య ధోరణి తెలుగుజాతి అనాదినుంచి హుందాగా ప్రదర్శిస్తూ వస్తున్న జీవనశైలి.  

 "ఆత్మాభిమానం, స్వాతంత్ర్య ప్రియత్వం... ఒక ఆకు ఎక్కువ కావడం వల్లనేమో...విశాలదృక్పధం ఉండీ మనసు అడుగుపొరలకిందే పడి ఉంది".అన్నారు కోట సచ్చిదానందమూర్తి.

  "నీ అడుగులకో తుదిగమ్యం అందాలంటే /ఎడతెగని యెదురు దెబ్బలు గమనించు మిత్రమా! గుండెను ఒక అద్దంలా తుడిచి చూసుకో నేస్తమా!" అని అంటారు సినారె!

 ప్రతి వ్యక్తిలోనూ పెత్తనం ప్రదర్శించే పెద్దాయన, కార్యశీలత కనబరచే పెద్దమనిషి, గారాబంగా ప్రవర్తించే పసిబిడ్డ ఉంటారు. ఇది ఎరిన్ బెర్న్ 
సిద్ధాంతం.

   'సమయానికి తగు మాటలాడు ' చాతుర్యం ప్రదర్శిస్తే చాలు ' విద్వేషం వింధ్యపర్వతంలా అడ్డంగా నిలబడ్డా... నట్టింట్లో ఆనందం వెల్లువలై పొంగులెత్తుతుంది.- అన్నది బెర్న్ మార్కు.

"మైత్రి సంపాదనకైనా, కొనసాగింపుకైనా మాటపట్టింపేగదా ప్రధాన అవరోధం! అందుకే 'ఓహో ...నువ్వా! ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తున్నావు ఏలాగ/ఏ నక్షత్రం కింద సంచారం చేస్తున్నవు ' అంటూ కవి అజంతా సరళిలో కుశల ప్రశ్నల శరపరంపర మనోచాపం నుంచి వరుస పెట్టి సంధిస్తే ...కోపతాపాలు,భేదభావాలు పక్కనపెట్టి ఎవరైనా కూరిమితో ఆత్మీయాలింగనం కోసం చేరువ కావడం ఖాయం."   

 "తామెల్లరూ భద్రంగా ఉంటూనే చుట్టుపక్కలవారందరూ క్షేమంగా జీవించాలని మనసా వాచా కాంక్షించే గొప్ప సంకల్పం ' యోగక్షేమం వహామ్యహం ' కల్పన చేసింది."

 "వ్యక్తిలోని మూర్తిమంతమైన సంస్కృతే పరిణత మానవత్వంగా పరిమళించేది."అన్నారు రమణ మహర్షి.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు





Saturday, October 31, 2015 0 comments By: visalakshi

ముభావం

 "ముభావం" ఒక భావం, ఏమిటాభావం?  ఒక వ్యక్తితో మాట్లాడడం మానేసి ఆ వ్యక్తిపై మనకున్న అయిష్టాన్ని కనబరచడమే ' ముభావం ' .

 మనం ఇతరులతో ముభావంగా ఉన్నప్పటికంటే ఇతరుల ముభావానికి మనం లోనైనప్పుడు మనసుకు చాలా కష్టంగా  ఉంటుంది.నేటి సమాజంలో ' ముభావం ' వలన కలిగే విపరీత పరిణామాలు అందరికీ విదితమే!

  " ముందు మనకు మనం మంచిగా ఉంటే అప్పుడు మన చుట్టూ ఉన్న లోకమంతా మంచిగా కనిపిస్తుంది.ఇతరులలో ఉండే మంచిని మాత్రమే అప్పుడు మనం చూస్తాము. మనం చూసే బాహ్య ప్రపంచం మన ప్రతిబింబమే.ఇతరులను తప్పు పట్టే అలవాటు మానుకుంటే మనల్ని ద్వేషిస్తున్న వారు కూడా మనల్ని స్వీకరించడం మనం చూస్తాం. మన మానసిక స్థితిని బట్టి,మానసిక పరిపక్వతను బట్టి ఇతరులు మనతో మెలగుతారు."

             స్వామి వివేకానంద జీవితంలో ఒక సంఘటన:-

 నరేంద్రుడు (స్వామి వివేకానంద) శ్రీరామకృష్ణుల ప్రియతమ శిష్యుడని అందరికీ విదితమే. అతడు తరచూ దక్షిణేశ్వరం వెళ్ళకపోతే రామకృష్ణులు తల్లడిల్లిపోయేవారు.కొన్ని సమయాలలో స్వయంగా ఆయనే నరెంద్రుణ్ణి వెతుకుతూ వెళ్ళేవారు, నరేంద్రుణ్ణి చూస్తే చాలు భావపారవశ్యం పొందేవారు. కానీ ఒకసారి ఈ పరిస్థితి తలక్రిందులైంది. నరేంద్రుడు వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులు ముభావంగా ఉండేవారు. అతని రాకను పట్టించుకోనట్లే ఉండేవారు. అయినప్పటికీ నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి ఆయన ముందు కూర్చునేవాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు.  

 ఈ విధంగా ఒక నెలకు పైగా గడిచింది. నరేంద్రుడు మామూలుగానే దక్షిణేశ్వరానికి వస్తూవుండడం గమనించిన శ్రీరామకృష్ణులు చివరకు ఒక రోజు అతణ్ణి పిలిచి "ఏం నాయనా! నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడడంలేదే!అయినప్పటికీ నువ్వెందుకు నావద్దకు వస్తున్నావు?"అని అడిగారు. అందుకు నరేంద్రుడు,"మీమాటలు వినడానికా వస్తున్నాను? నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను.మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. అందుకే వస్తున్నాను."అని జవాబిచ్చాడు. దానికి శ్రీరామకృష్ణులు "నిన్ను పరీక్షించి చూసాను.నీలాంటి దృఢచిత్తులే ఇంత అవమానాన్ని,ముభావాన్ని దిగమింగుకోగలరు.మరొకరైతే ఎప్పుడో పలాయనం చిత్తగించేవారు" అన్నారు 

  మనం నిత్యం ఎంతోమందితో కలిసిమెలిసి మెలగవలసి ఉంటుంది, పనిచేయవలసి ఉంటుంది.కాబట్టి ఒకరికొకరు ఎడముఖం-పెడముఖంగా ఉంటూ అస్తమానం అలుగుతూ ఉంటే ఏపనీ సవ్యంగా చేయలేము. భగవంతుడు పెట్టే పరీక్షలో మనం నెగ్గాలంటే మానసిక పరిపక్వతతో కూడిన ' గురుభక్తి-ఇష్టనిష్ఠ ' అలవరచుకోవాలి.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
Sunday, October 11, 2015 0 comments By: visalakshi

నారాయణ ఉపనిషత్ భావము

ఓం శ్రీ నారాయణాయ నమో నమ: 





 1.నారాయణుడే ఆది పురుషుడు. ఇది సత్యము.నారాయణునకు ప్రజలను సృష్టించవలెనను కోరిక కలిగినది .అపుడు మొదటగా నారాయణుని నుండి ప్రాణము(ప్రాణవాయువు)ఉద్భవించినది.ఆ తరువాత మనస్సు,ఇంద్రియములు,మరియు ఆకాశము,వాయువు, అగ్ని,జలము,భూమి వీటన్నింటికీ అధారమైన విశ్వము ఉద్భవించినవి. నారాయణుని నుండి బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు ప్రజాపతులు ఉద్భవించిరి.నారాయణుని నుండి ఆదిత్యులు(12) రుద్రులు(11)  వసువులు(8) ఉద్భవించిరి.మరియు వేద చందస్సు ఉద్భవించినది. ఇవన్నియూ నారాయణుని యందే పుట్టుచున్నవి.ప్రవర్తిల్లుచున్నవి. నారాయణునియందే విలీనమగుచున్నవి. ఇది ఋగ్వేద ఉపనిషత్తు.

 2.నారాయణుడు శాశ్వతుడు. నారాయణుడే బ్రహ్మ. నారాయణుడే శివుడు. నారాయణుడే ఇంద్రుడు. నారాయణుడే కాలుడు(మృత్యుదేవత).నారాయణుడే ఉర్ధ్వ-అధోదిక్కులు.లోపల వెలుపల (శరీరములోనున్న-బయటనున్న)ఉన్నది నారాయణుడే. సర్వము నారాయణుడే.ఇది సత్యము. భూతభవిష్యత్ వర్తమానములు నారాయణుడే. విభాగములు లేక ఒక్కటిగా నున్నది నారాయణుడే. 
సర్వమునకు ఆధారభూతుడు,దోషరహితుడు,భావింపశక్యముకానివాడు,వర్ణింపనలవికానివాడు, పవిత్రుడు, దివ్యుడు అయిన దేవుడు నారాయణుడు ఒక్కడే. ఆ నారాయణుడే విష్ణువు. ఆ నారాయణుడే సర్వవ్యాపి అయిన విష్ణువు. ఇది యజుర్వేద ఉపనిషత్తు.

3."ఓం" అని మొదటగా ఉచ్చరించవలెను. తరువాత "నమ:" అని ఉచ్చరించవలెను.తరువాత "నారాయణాయ" అని ఉచ్చరించవలెను."ఓం" అనునది ఏకాక్షరము."నమ:"అనునది రెండక్షరములు. "నారాయణాయ"అనునది ఐదక్షరములు.ఈ విధముగా నారాయణుడు "ఓం నమో నారాయణాయ"అను అష్టాక్షరి మంత్రముగా రూపుదిద్దుకొనినాడు.

ఈ అష్టాక్షరి మంత్రమును పఠించుట వలన సర్వారిష్టములు తొలగును.సంపూర్ణ ఆయురారోగ్యములు సిద్ధించును.

సంతానము, యశస్సు, ధనము, గోగణములు వృద్ధి చెందును. ఆ తరువాత అమృతత్వము(ముక్తి)సిద్ధించును.ఇది సత్యము. ఇది సామవేద ఉపనిషత్తు. 





4.పురుషుడైన నారాయణుని ప్రణవస్వరూపమైన ఓంకారమును పఠించుట వలన సంపూర్ణమైన ఆనందం కలుగును.ఓంకారము అకార,ఉకార,మకారములతో ఏర్పడినది.ఎవరు సదా ఓంకారమును ఉచ్చరింతురో వారు(యోగి)జన్మసంసార బంధముల నుండి విముక్తులగుదురు."ఓం నమో నారాయణాయ" అను అష్టాక్షరీ మంత్రమును ఎవరు ఉపాసింతురో వారు శ్రీమన్నారాయణుని వైకుంఠమునకు చేరుదురు.అది పరమ పురుషుని హృదయకమలం.అది ఇంద్రియాతీతమైన విజ్ఞానముతో నిండియున్నది. కారణముచే ప్రకాశించుచున్నది.

దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మము. మధువు అను రాక్షసుని చంపిన విష్ణువు బ్రహ్మము. పుండరీకాక్షుడు బ్రహ్మము; అచ్యుతుడు బ్రహ్మము.ఓంకారమే బ్రహ్మము. సర్వభూతములలో ఒక్కడుగా నున్నది నారాయణుడే. కారణరూపమైన అకారపరబ్రహ్మమే ఓంకారము.ఇది అధర్వణవేద ఉపనిషత్తు.


నారాయణ ఉపనిషత్తును ఉదయ,మధ్యాహ్న,సాయం సమయముల ఎప్పుడైనను పఠింతురో వారు పంచమహాపాతకములనుండి ,ఉపపాతకముల నుండి విముక్తులగుదురు.మరియు వారికి సర్వవేదములు పారాయణ చేసిన పుణ్యము లభించును.నారాయణ సాయుజ్యము(మోక్షము) లభించును.ఇది సత్యము.అని ఉపనిషత్తు ఉపదేశించుచున్నది.

నారాయణుడు అవ్యక్తము కంటే అతీతుడు. అవ్యక్తమునుండే ఈ బ్రహ్మాండము పుట్టినది. ఈ బ్రహ్మాండములోనే పదునాల్గు లోకములు, సప్తద్వీపములు,భూమి ఉన్నాయి.

ఓం శాంతి: శాంతి: శాంతి:.

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు  




Friday, October 9, 2015 0 comments By: visalakshi

నా ఆత్మకు ( To my soul )

నా ఆత్మకు 


 స్వామి వివేకానంద ' భావజాలం ' ఈ కవిత. స్వామీజీ ఈ కవితను 1899 నవంబరు లో అమెరికానందు ఒకరి ఇంట్లో ఉన్నప్పుడు ఆంగ్లములో వ్రాసారు. ఈ ' మహాత్మ ' ను మన హృదయాల్లో పదిలపరచుకొని, దివ్యత్వాన్ని పొందుదాం.



  
వర్తమానం చీకటిగా ఉన్నా
భవిష్యత్తు ఆశావిహీనంగా కనిపించినా
ధీర హృదయమా
ఈ జీవనభారాన్ని విడువకు
ఓపికతో ఒకింత నిరీక్షించు.


  
ఒకప్పుడు
పర్వతాల నెక్కుతూ దిగుతూ
మరొకప్పుడు
అరుదైన సముద్రాలను సులభంగా దాటుతూ
నువ్వూ నేనూ కలిసి
ఈ ప్రయాణం మొదలుపెట్టి
ఎన్నో యుగాలైంది అని అనిపిస్తుంది.



నా మనస్సులో ఆలోచనలు 
మసలడానికి ఎంతో ముందే 
నువ్వు నాకు
అత్యంత దగ్గరివాడివై
ప్రకటించుతావు.  


ప్రతి ఆలోచనను ప్రతిబింబిస్తూ
నాతో పరిపూర్ణంగా ఐక్యమైన
నిజమైన అద్దానివి నువ్వే.  


 సాక్షీ!
ఇప్పుడు మనం ఇద్దరం విడిపోవడం 
ఉచితమా! చెప్పు?
నిజమైన నేస్తానివి,నమ్మకస్తుడివి
నువ్వొక్కడివే.


నాలో 
దురాలోచనలు చెలరేగుతున్నప్పుడు
అనలసుడవై హెచ్చరించావు
నీ హెచ్చరింపులను
నిర్లక్ష్యం చేసినా
నన్ను విడిచిపోని 
శుభమైన నిజమైన 
మిత్రుడవు నువ్వే!   సాగిపో... నేస్తమా!---- స్వామి వివేకానంద  


 


భక్తి రసామృతము

  ఓం శ్రీ పురుషోత్తమాయ నమో నమ:

  ప్రార్ధన:---

 పద్మలోచన! కృష్ణ! భక్తాభయప్రద

           వినుము సంసారాగ్ని వేగుచున్న

 జనుల సంసారంబు సం హరింపగ నీవు

             దక్క నన్యులు లేరు తలచి చూడ 

 సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు

              ప్రకృతికి నవ్వలి ప్రభుడ వాద్య

 పురుషుండవగు నీవు బోధముచే మాయ

              నడతువు నిశ్శ్రేయసాత్మ యందు

 మాయచేత మునిగి మనువారలకు కృప

              చేసి ధర్మముఖ్య చిహ్నమైన

 శుభము సేయు నీవు సుజనుల నవనిలో

         గావ పుట్టుదువు జగన్నివాస!



కృష్ణా!  "సంసారజ్వాలల్లో తపించిపోతున్న జనుల కష్టాన్ని పోగొట్టడం నీకు తప్ప మరొకరికి శక్యం కాదు. నీవు సాక్షాత్తూ సర్వేశ్వరుడవు.ఈ ముల్లోకాలకూ ఆవలివాడవు! ఆది పురుషుడవైన ప్రభుడవు! నీవు ముముక్షువులకు జ్ఞానాన్ని ప్రసాదించి, మాయను మటుమాయం చేస్తావు. నీవు మాయాజాలంలో మునిగిన వారికి ధర్మసమ్మతమైన తేజస్సును అనుగ్రహిస్తావు. ఓ జగన్నివాసా! శిష్టరక్షణ కోసమే నీవు ఈ జగత్తులో జన్మిస్తావు" .



   ఏ జీవియు ఇటు భోగములను అనుభవించుటలోనో, అటు భోగములను త్యాగము చేయుటలోనో స్థిరముగా నుండలేడు. దీనికి కారణము: జీవుడు తన నిజ స్వభావము వలన ఈ రెంటిలో ఏ దశలోను నిజమైన ఆనందములను అనుభవింప లేకుండుట. 

   ఒక సాధారణ గృహస్తు రాత్రింబగళ్ళు కష్టపడి తన కుటుంబ సభ్యులకు సర్వసౌఖ్యములను చేకూర్చి, తద్ద్వారా ఒక విధమగు రసమును అనుభవింపవచ్చును. కాని తాను సాధించిన ఈ ఐహిక భోగమంతయు తన జీవితము ముగిసి దేహత్యాగము చేయుటతో అంతమైపోవును.భక్తుడు భక్తియుక్త సేవ ద్వారా భగవంతుని సాక్షాత్కరింప జేసికొనగా, నాస్తికుడు మాత్రము మృత్యువు రూపములో భగవంతుని దర్శించును.జీవితములో రాజకీయ, సాంఘీక, జాతీయ, అంతర్జాతీయ కార్యరంగములలో దేనిలోనైనను స్వయంకృషి వలన సాధించు ఫలితములన్నియు మృత్యువుతో అంతరించిపోవుట నిశ్చయము.

   అయితే - భగవంతునికి చేయు ఆధ్యాత్మికమైన భక్తియుక్త సేవ వలన అనుభూతమగు 'భక్తిరసము ' మాత్రము మరణముతో అంతరించిపోదు.అది శాశ్వతముగా నిలిచియుండును.అందుకే దానిని అమృతము (మృతిలేనిది,నిత్యమైనది) అందురు. ఈ జన్మలో మనము చేయు కర్మలమీద మన పునర్జన్మ ఆధారపడిఉండును. 'దైవము ' అను ఒక ఉన్నతాధికారి - భగవంతుని ప్రతినిధి - జీవుల కర్మలను పర్యవేక్షించుచుండును.మామూలు వాడుక భాషలో దైవమునకు ' విధి ' అని అర్ధము. దైవము 84 లక్షల దేహములలో ఏదో ఒక దేహమును జీవునికి ఒసంగును.ఆ ఎన్నిక మన ఇష్టానిష్టముల పై ఆధారపడి యుండదు.' విధి 'నిర్ణయమును అనుసరించి అది జరుగును.భగవంతుని భక్తియోగ మార్గమున మానవుడు భక్తి రసాస్వాదనను అవలంబించినచో సమస్త సన్మంగళములతో కూడిన జీవిత మారంభమగును."ముక్తికంటె ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవనమును ప్రసాదించుటయే ' భక్తి రసామృతము ' ".

సర్వం శ్రీ సాయికృష్ణార్పణ మస్తు
Wednesday, October 7, 2015 2 comments By: visalakshi

సహృదయం

 ఓం శ్రీ హృదయాలయాయ నమ: 

  ఓం సహృదయం సాం మనస్యం
  అవిద్వేషం కృణోమి వ:!
  అన్యో అన్య మభిహర్యత
  వత్సం జాత మివాఘ్న్యా!!          (అధర్వ వేదం 3-30-1)

 మానవులందరూ ధర్మాను వర్తనులై, సత్యమందు శ్రద్ధా భావంతో ఒకే అభిప్రాయాన్ని కలిగి, సద్భావనతో ద్వేషాన్ని విడిచి ప్రేమ భావంతో ఒకరి మంచి కోసం మరొకరు జీవించాలని ఈ వేద మంత్రం స్పష్టం  చేస్తుంది.








మంచి హృదయంతో, నిర్మల మనస్సుతో, విరోధ భావం లేకుండా కేవలం
 ప్రేమ భావంతో ఒకరితో ఒకరు పరస్పర స్నేహ సౌజన్యాలతో జీవించాలి.
ఆ ప్రేమ, శ్రద్ధ అప్పుడే పుట్టిన లేగదూడను తల్లిఆవు ఎంతగా ప్రేమిస్తుందో,
అంత చక్కగా ఉండాలి. మానవులు పరస్పరం   ప్రేమమయజీవితాన్ని
గడపాలని ఈ మంత్రాభిప్రాయం.

 తల్లి తన సంతానాన్ని ప్రేమించినట్లే, ఆవు తన దూడను కూడా అత్యధికంగా ప్రేమిస్తుంది. ఒక స్త్రీ ప్రసవిస్తుందంటే ఇతర స్త్రీలు సం రక్షిస్తారు. కానీ ప్రసవించిన గోవు వద్ద ఎవరూ ఉండరు. ప్రేమ ఒక్కటే దాని దగ్గర ఉంటుంది. అదే గొప్ప సాధనం. మన శరీరంలోని నాలుక అన్ని ఇంద్రియాలకంటే పవిత్రమైనది. ఏవైనా చెడు పదార్ధాలుంటే వాటిని పరీక్షించడానికి చేతితో తాకుతాం, ముక్కుతో వాసన చూస్తాం.కాని నాలుకతో మాత్రం దానిని మనం తాకం. నాలుక అంత పవిత్రమైన ఇంద్రియం. కాని ఆవు అంత పవిత్రమైన నాలుకతో అప్పుడే పుట్టిన లేగదూడ శరీరంపై నున్న మైలను శుభ్రం చేస్తుంది.ఆవు దూడను అట్లా శుభ్రం చేయకపోతే దూడకు జబ్బుచేసి చనిపోవచ్చును.  తరువాత  లేగదూడకు  ఆహారం  కావాలి. 

అప్పుడు తల్లిఆవుకు ప్రేమ పాలరూపంలో ప్రకటమౌతుంది. అప్పుడే పుట్టిన ఆ లేగదూడను ఆవు భూమిపై నుండి లేపి పొదుగు దగ్గరకు తీసుకొని వచ్చి పాలిస్తుంది. ఆ దూడ పాలు త్రాగేంత వరకు తల్లి ఆవుకు స్థిమితం ఉండదు.అలాంటి ప్రేమనే మానవులంతా పరస్పరం ప్రీతి భావంతో పొందాలని ఈ ఆవు దూడ  ఉపమానంతో భగవంతుడు మనకు ప్రేమ సూత్రాన్ని తెలియజేస్తున్నాడు. ఆవు సాధుజంతువని మనకు తెలుసు.
ఆవులో ప్రేమతత్వం, ఇతరులకు ఉపయోగపడే విశేషగుణం ఉంది.
అందుకే భారతీయులు ఆవును తల్లిగా,భావించి పూజిస్తారు.  

 అఘ్న్యా:- అంటే కొట్టకూడదు. గోవును కొట్టకూడదు. హింసించకూడదు. చంపకూడదు. మనం నిత్యం ప్రాత:సాయం సంధ్యా సమయాలలో చేసే భగవత్ ప్రార్ధనలో

  "యో  అస్మాన్  ద్వేష్టి  యం  వయం  ద్విష్మ:  తం  వో  జంభేదధ్మ:"!

 హే భగవన్! మమ్మల్ని ఎవరు ద్వేషిస్తున్నారో, మేము ఎవరిని ద్వేషిస్తున్నామో , ఈ పరస్పర ద్వేషాలు రెండింటిని నీకర్పిస్తున్నాము. నీ అనంతశక్తితో ఆ ద్వేషాలను, ద్వేష భావాలను నాశనం చెయ్యమని ప్రార్ధిస్తాం. సృష్టిలో మానవులు తప్ప ఇతర ప్రాణులు సహజంగా చాలా వరకు కలిసి జీవించడానికి ఇష్టపడతాయి.

  సహృదయంలో ప్రేమ,కరుణ,దయ,పరహిత చింతన మొదలైన శుభలక్షణాలుండాలి.హృదయం కేవలం గుప్పెడు మాంసపు ముద్దకాదు. అది జీవాత్మ, పరమాత్మ, మనస్సు అనే మూడు ఆధ్యాత్మిక తత్వాల సంగమ స్థానం.పరమేశ్వరుడు అనంత ప్రేమ మయుడు. ఆ ప్రేమను స్వయంగా గ్రహించగలిగిన అవకాశం జీవునకు కేవలం హృదయస్థానంలో మాత్రమే కలుగుతుంది. దానినే "ఉపాసన" అంటాం. అసూయ, రాగద్వేషాలు మనకు ప్రధాన శత్రువులు వాటిని మనం జయించాలి. కామ,క్రోధ,లోభ,మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు అతీతంగా, మానవాతీతమైన దైవీ సంపదను గూర్చి మనం ఆలోచించాలి. అవే ఆత్మకోవిదులు చెప్పే సుభాషితాలు."సర్వే భవంతు సుఖిన:"! మంచి మనస్సుతో స్వార్ధాన్ని త్యాగం చేసి, పరుల    శ్రేయస్సు కోసం పరితపించాలి. దీనికి సహృదయం కావాలని వేదం బోధిస్తోంది. 

   శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం హృదయం. హృదయం అనే మూడక్షరాలను ప్రజాపతి, బ్రహ్మము,సర్వము అని బృహదారణ్యక ఉపనిషత్ లో మహర్షి యాజ్ఞవల్క్యుడు వ్యాఖ్యానించారు. 

1)' హృ ' ఇదొక అక్షరం. ' హృ ' ధాతువునకు హరించుట, స్వీకరించుట దగ్గరకు తీసుకొని వచ్చుట అనే అర్ధముంది.

హృదయమే పరమాత్ముడని గ్రహించిన వారు సమస్త పదార్ధాలు పరమాత్మునివే అని భావిస్తారు.

2) ' ద ' ఇది రెండవ అక్షరం.' ద 'ధాతువునకు ఇచ్చుట-సమర్పించుట అనే అర్ధముంది.

హృదయమే భగవంతుడని తెలిసినవారు ఆ సర్వేశ్వరునికి సర్వము సమర్పిస్తారు.

3) 'య ' ఇది మూడవ అక్షరం(ఇణ్ గతౌ)అనే ధాతువునకు య అంటే వెళ్ళుట అనే అర్ధముంది.

హృదయమే ఈశ్వరుడని విశ్వసించిన వారు స్వర్గానికి వెళతారు. అంటే విశేషమైన సుఖాలను,దేహాన్ని పొందుతారని భావం.

   మానవజన్మ ముఖ్య ప్రయోజనం ఈశ్వరాజ్ఞలను పాలించి సహృదయంతో జీవించాలి. శుభకార్యాలను ఆచరించాలి. జీవితాన్ని చరితార్ధం చేసుకోవాలి.

సర్వం శ్రీ సాయిశివార్పణ మస్తు