"ముభావం" ఒక భావం, ఏమిటాభావం? ఒక వ్యక్తితో మాట్లాడడం మానేసి ఆ వ్యక్తిపై మనకున్న అయిష్టాన్ని కనబరచడమే ' ముభావం ' .
స్వామి వివేకానంద జీవితంలో ఒక సంఘటన:-
మనం ఇతరులతో ముభావంగా ఉన్నప్పటికంటే ఇతరుల ముభావానికి మనం లోనైనప్పుడు మనసుకు చాలా కష్టంగా ఉంటుంది.నేటి సమాజంలో ' ముభావం ' వలన కలిగే విపరీత పరిణామాలు అందరికీ విదితమే!
" ముందు మనకు మనం మంచిగా ఉంటే అప్పుడు మన చుట్టూ ఉన్న లోకమంతా మంచిగా కనిపిస్తుంది.ఇతరులలో ఉండే మంచిని మాత్రమే అప్పుడు మనం చూస్తాము. మనం చూసే బాహ్య ప్రపంచం మన ప్రతిబింబమే.ఇతరులను తప్పు పట్టే అలవాటు మానుకుంటే మనల్ని ద్వేషిస్తున్న వారు కూడా మనల్ని స్వీకరించడం మనం చూస్తాం. మన మానసిక స్థితిని బట్టి,మానసిక పరిపక్వతను బట్టి ఇతరులు మనతో మెలగుతారు."
స్వామి వివేకానంద జీవితంలో ఒక సంఘటన:-
నరేంద్రుడు (స్వామి వివేకానంద) శ్రీరామకృష్ణుల ప్రియతమ శిష్యుడని అందరికీ విదితమే. అతడు తరచూ దక్షిణేశ్వరం వెళ్ళకపోతే రామకృష్ణులు తల్లడిల్లిపోయేవారు.కొన్ని సమయాలలో స్వయంగా ఆయనే నరెంద్రుణ్ణి వెతుకుతూ వెళ్ళేవారు, నరేంద్రుణ్ణి చూస్తే చాలు భావపారవశ్యం పొందేవారు. కానీ ఒకసారి ఈ పరిస్థితి తలక్రిందులైంది. నరేంద్రుడు వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులు ముభావంగా ఉండేవారు. అతని రాకను పట్టించుకోనట్లే ఉండేవారు. అయినప్పటికీ నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి ఆయన ముందు కూర్చునేవాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు.
ఈ విధంగా ఒక నెలకు పైగా గడిచింది. నరేంద్రుడు మామూలుగానే దక్షిణేశ్వరానికి వస్తూవుండడం గమనించిన శ్రీరామకృష్ణులు చివరకు ఒక రోజు అతణ్ణి పిలిచి "ఏం నాయనా! నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడడంలేదే!అయినప్పటికీ నువ్వెందుకు నావద్దకు వస్తున్నావు?"అని అడిగారు. అందుకు నరేంద్రుడు,"మీమాటలు వినడానికా వస్తున్నాను? నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను.మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. అందుకే వస్తున్నాను."అని జవాబిచ్చాడు. దానికి శ్రీరామకృష్ణులు "నిన్ను పరీక్షించి చూసాను.నీలాంటి దృఢచిత్తులే ఇంత అవమానాన్ని,ముభావాన్ని దిగమింగుకోగలరు.మరొకరైతే ఎప్పుడో పలాయనం చిత్తగించేవారు" అన్నారు
మనం నిత్యం ఎంతోమందితో కలిసిమెలిసి మెలగవలసి ఉంటుంది, పనిచేయవలసి ఉంటుంది.కాబట్టి ఒకరికొకరు ఎడముఖం-పెడముఖంగా ఉంటూ అస్తమానం అలుగుతూ ఉంటే ఏపనీ సవ్యంగా చేయలేము. భగవంతుడు పెట్టే పరీక్షలో మనం నెగ్గాలంటే మానసిక పరిపక్వతతో కూడిన ' గురుభక్తి-ఇష్టనిష్ఠ ' అలవరచుకోవాలి.
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
0 comments:
Post a Comment