Monday, November 27, 2017 0 comments By: visalakshi

హరినామ మహిమ - అజామిళుని కధ



హరిని స్మరిస్తూ హరినే మదిలో ధ్యానిస్తూ హరినే శరణుజొచ్చిన జీవుని యమభటులు ఏమీ చేయలేరు. ఆ జీవుని ఏ పాపాలూ అంటవు. ఇందుకు తార్కాణంగా నీకు  అజామిళుని  కధను  చెబుతాను  విను  అని  శుకుడు
 పరీక్షిత్తుకు ఆ చరిత్రను వినిపించాడు...




కన్యాకుబ్జం అనే నగరంలో అజామిళుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆతడు శాంత స్వభావముతో ధర్మ సుశీలుడై సకలవేదములు చదివినవాడై, ఎల్లప్పుడూ గురువులను, అతిధులను గొప్పవారిగా భావించి సేవా శుశ్రూషలను చేసెడివాడు. సర్వజీవరాసులపట్ల సమబుద్ధియై యుండెడివాడు. సత్యభాషణా నియమము పాలించెడివాడు.అంతటి ఉత్తమ సద్బ్రాహ్మణుడైన అజామిళుడొకనాడొక పొదలో ప్రియునితో గాఢ రతికేళిలో నున్న ఒక కాముకిని చూసెను. ఆ శృంగారమును కనులారా గాంచి కాముకుడై యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం నశించగా పాపకర్మలన్నీ చేసేవాడు. నియమనిష్టలు, సదాచారాలు అన్నీ మరచాడు.  కట్టుకున్న భార్యను వదలి.. .....జూదము  స్త్రీలు, శృంగారముపై   ఆసక్తితో ..ధనం కోసం దొంగతనాలు చేసేవాడు. ఒక దాసీని వరించి పెళ్ళి చేసుకొన్నాడు. పది మంది పుత్రులను కన్నాడు. వారిని ముచ్చటగా లాలించి పాలించి పెంచాడు. సంసారవ్యామోహంలో పడి చాలాకాలం భార్యాపిల్లలతో సుఖించాడు. వయస్సు పెరిగే కొలదీ శరీరంలో జవసత్వాలు తగ్గిపోయాయి. 88 ఏళ్ళు వచ్చాయి. అయినా సంసారంపై భ్రాంతి పోలేదు. చిన్నకొడుకైన నారాయణుడిని చాలా గారం చేసేవాడు. వాడంటే అజామిళుడికి ప్రాణం.వాడు కనబడకపోతే ఉండలేడు ఒక్కక్షణం. మృత్యువు పొంచిఉన్నా మోహబంధాల్ని విడువడు. కొడుకునే తలుచుకొంటూ, కొడుకునే పిలుస్తూ గుటకలు మ్రింగుతున్నాడు. అతని ఆయుర్దాయం ముగియడంతో యమకింకరులు అతడిని సమీపించారు. యమపాశాలతో యమకింకరులను చూసిన అజామిళుడు భయంతో వణుకుతూ దూరంగా వున్న చిన్నకొడుకును నారాయణా, నారాయణా అని పిలిచాడు. విష్ణువు పేరు వినబడగానే ఆయన సేవకులు తమ ప్రభువును కష్టకాలంలో కాపాడేందుకు పిలిచిన వారెవరా అని పరిగెత్తుకు వచ్చి యమభటులను అడ్డుకొన్నారు. 




యమదూతలు తమ ప్రయత్నానికి విఘ్నం కలిగించినవారిని తేరిపారజూచి ఎవరు మీరు? చూడ్డానికి చక్కగా ఉన్నారు. మీ రూపాలు, ధరించిన భూషణాలు అద్భుతంగా ఉన్నాయి. మా ధర్మాన్ని పాటిస్తుంటే ఎందుకు అడ్డుపడ్డారు?అని అడిగారు. అప్పుడు విష్ణుదూతలు మీరు యమభటులైతే మాకొక సంగతి చెప్పండి. పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి? మీరు ఎవరిని ఎందుకు దండిస్తారో, ఇతడిని ఎక్కడికి తీసుకొని పోబోతున్నారో చెప్పండి అని అడిగారు. యమభటులు వారికిలా సమాధానం చెప్పారు. 

"వేదసమ్మతమైన కార్యం ధర్మం. వేదవిరుద్ధమైనది అధర్మం. హరిరూపమే వేదం కాబట్టి అది అనుసరణీయం. ప్రాణకోటికి ప్రకృతే ధర్మాధర్మాలను తెలియజేస్తుంది. కర్మచేసేవాడికి శుభమో, అశుభమో కలగకమానదు. బ్రతికి ఉన్నప్పుడు పుణ్యం, పాపం ఎంత చేస్తాడొ అంతగా దాని ఫలాన్ని చనిపోయాక అనుభవిస్తాడు. యముడు అంతర్యామి. జీవులుచేసే మంచిపనులు, చెడుపనులు గమనిస్తాడు. వాటికి తగినవిధంగా ఫలాన్నిస్తాడు. ప్రాచీనకర్మలవల్ల వర్తమానదేహం ఏర్పడుతున్నది. కాని పూర్వజన్మ జ్ఞాపకం లేనందున కార్యకారణ సంబంధం తెలుసుకోలేరు. వర్తమాన వసంతకాలంలో పువ్వులు, పండ్లు చూసినవాడు గత వసంతకాలంలో ఉన్నవి, రానున్న వసంతకాలంలో ఉండేవి ఊహించగలిగినట్లే గతజన్మ, భావిజన్మలలో జరిగినవి, జరగబోయేవి ఈ జన్మలోని కర్మలను బట్టి ఊహించుకోవచ్చు.పూర్వజన్మ సంస్కారబలం వలన గుణస్వభావాలు ఏర్పడి తదనుగుణమైన కర్మలు చేయడం జరుగుతుంది. వాటిని బట్టే స్థూల సూక్ష్మ శరీరాలు కలుగుతాయి. ఇదంతా ప్రకృతిపురుషుల కలయిక ఫలితం. పమేశ్వరుని సేవించితే ప్రకృతి దూరమవుతుంది."  




 ఈ అజామిళుడు పూర్వజన్మ పుణ్యాన బ్రాహ్మణుడై పుట్టాడు. వేదాలు చదివాడు. నిత్యనైమిత్తిక కర్మలు నిష్ఠతో ఆచరించాడు. యౌవనదశలో ఒకనాడు చూసిన దృశ్యంతో ఆతని మనసు పెడత్రోవ పట్టి కోరికలతో భార్యను వదలి ఆ దృశ్య సుందరినే పట్టి ఆమెకోసం అన్నివిధాలా బ్రష్ఠుడయ్యాడు. ఆమెను కుటుంబాన్ని పోషిస్తూ శుచికి స్వస్తి చెప్పి దుష్టుడయ్యాడు. అందువలన పాపాత్ముడైన ఈ ధూర్తుని మేము నరకానికి తీసుకువెళ్ళడానికి వచ్చాం. అక్కడ ఇతనికి తగిన శిక్ష వేస్తాం. అన్నారు యమదూతలు.

మీరు ధర్మదూతలు. ధర్మం తప్పి మాట్లాడుతున్నారు అన్నారు విష్ణుదూతలు. అజామిళుడు కోటికి మించి జన్మలెత్తి పాపాలన్నిటినీ ప్రక్షాళనం చేసుకొన్నాడు. మరణ సమయంలో నారాయణ అని భగవన్నామ స్మరణ చేశాడు కదా! హరినామ మహిమ మీకు తెలియదా? బ్రహ్మహత్య, దొంగతనం, మధుపానం వంటి మహాపాతకాలకు కూడా హరినామం విరుగుడు. హరినామ స్మరణం ముక్తిదాయకం పుణ్యకారకం. పుత్రుడిని మనసులో పెట్టుకొని పిలిచినా హరి నామ స్మరణ మాత్రముననే చేసిన పాపం నశిస్తుంది.తెలియక తీసుకున్నా ఔషధం వల్ల రోగం నయమయినట్లు పామరుడు తెలియక పలికినా హరినామం దాని మహిమ అది చూపుతుంది. కాబట్టి నారాయణుని స్మరించిన పుణ్యం ఇతనికి ఎలా వృధా అవుతుంది. మీకేమైనా సందేహాలుంటే మీ రాజును అడగండి అని పలికి విష్ణుదూతలు అజామిళుని పాశాలను తొలగించి మృత్యువునుంచి రక్షించారు. యమదూతలు యమలోకానికి తిరిగి వెళ్ళి యమరాజుకు జరిగినదంతా వివరించారు. 




అజామిళునికి భయం పోయి ఆనందం కలిగింది. లేచి నిలబడి విష్ణుదూతలకు నమస్కరించాలని ప్రయత్నిస్తుండగా వారు వెంటనే అదృశ్యమై వైకుంఠానికి  వెళ్ళిపోయారు .అజామిళుడు విష్ణుదూతల మాటలను మననం చేసుకొని హరిభక్తుడయ్యాడు. తన పాపాలను తలచుకొని విచారించాడు. కులాచారాన్ని కూలద్రోసి కాముకిని చేరదీసి బంధువులలో పరువు పోగొట్టుకున్నాను. చక్కని భార్యను తల్లిదండ్రులను నిందించి వారిని విడిచిపెట్టి సర్వం కోల్పోయాను. నరకానికి పోవలసిన నన్ను రక్షించిన మహాపురుషులెవరో ఎక్కడికి పోయారో అని చింతించాడు.("పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు") ఆతని అజ్ఞానం తొలగింది. మదిలో జ్ఞానదీపం వెలిగింది. సంసారమోహం నశించి హరిభక్తి కలిగింది. వైరాగ్యంతో తత్వం తెలిసింది. గంగాతీరానికి వెళ్ళి దైవసన్నిధిలో కూర్చుని యోగాభ్యాసం చేశాడు. సమాధిలో నిలిచి భగవద్ధ్యానంలో లీనమైపోయాడు. తనను మొదట మృత్యువు నుంచి రక్షించిన హరిదూతలను దర్శించి మ్రొక్కాడు. వారు అతనిని దివ్యమైన బంగారువిమానంలో ఎక్కించి వైకుంఠానికి తీసుకొనిపోయారు. కళేబరాన్ని గంగఒడ్డున వదిలి అజామిళుడు ఆ విధంగా ముక్తిపొందాడు.




యముని ఆజ్ఞ విఫలమైందని... యమదూతలు అజామిళుని తీసుకు రాలేకపోయిన వైనం యమధర్మరాజుకు వివరించి, అయ్యా ముల్లోకాల్లోనూ పాపులను శిక్షించే అధికారం నీకొక్కడికే గదా ఉంది. నీ శాసనాన్ని ధిక్కరించగల శక్తి ఎవరికైనా ఉందా? ఇలా ఎందుకు జరిగింది? మీ పాశాలను త్రుంచి మమ్మల్ని పారద్రోలారు. వారెవరో మాకు చెప్పండి అని అడిగారు. యముడు ఈశ్వరుని ధ్యానించి మనస్సులోనే భక్తితో నమస్కరించి దూతలతో ఇలా అన్నాడు.నేను గాక నా కన్న ఘనుడైనవాడు మరొకడున్నాడు. మనం కళ్ళతో చూడడం, కాళ్ళతో నడవడం అంతెందుకు? మనం బ్రతకడమే ఆయన దయవల్ల అనుకోండి. బ్రహ్మ, శివుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, నేను కూడా ఆ మహనీయుని మూర్తిని చూడలేము. అటువంటివాడు విష్ణుమూర్తి. ఆయన తత్వాన్ని తెలుసుకోవడం బ్రహ్మతరం కాదు. హరినామ మహిమ వల్లనే అజామిళుడు యమపాశాలను తప్పించుకోగలిగాడు. అందువలన మీరు భక్తితో శ్రీహరి పాదాలను ఆశ్రయించిన వారి వద్దకు వెళ్ళకండి. అని యముడు  హరినామ మహిమను తన భటులకు   వివరించాడు .

ఆనాడే భాగవతంలో అజామిళుని కధద్వారా మనకు హరినామ స్మరణ మాత్రము చేత మరియు ఆతని గత జన్మ కర్మల పుణ్య వశాన ఆతనికి ముక్తి లభించింది అని తెలుస్తొంది.  

స్మరణం అనేది నవవిధ భక్తులలో ఒకటి. కలియుగములో స్మరణ మాత్రము చేతనే ముక్తి లభించునని సద్గురువులు మనకు చెబుతారు. మనమంతా ఆ మహా విష్ణువు సంతానమే! ఎప్పుడూ అందరికీ మేలు చేయవలయును కానీ అందరినీ సంతోషపరచవలెనని ప్రయత్నమును చేయరాదు. అది అసంభవము.ఎవరైతే ఆ శ్రీహరి లీలలు అనుభవించి వాటిని మననం చేసుకుంటూ అద్వితీయ పారవశ్యంలో మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి. దివ్యమైన అవతార తత్త్వాన్ని, లీలల్ని పరిశీలించి అర్ధం చేసుకోగలరో వారు దేహాన్ని వదలిన తదుపరి ఈ భౌతిక ప్రపంచంలో జన్మించరు. వారికి శ్రీహరి శాశ్వతమైన ధామములో స్థానం లభిస్తుంది.  సర్వవ్యాపి అయిన హరిని మనస్సుతో, నోటితో స్మరిస్తూ అంతటా తానే అయి ఉన్నాడని గుర్తించే శక్తిని మనకిమ్మని ఆయనను మనసారా భజిస్తూ ...ఓం శ్రీ నమో నారాయణాయ నమో నమ:   




 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 











  
Wednesday, October 25, 2017 3 comments By: visalakshi

వ్యక్తిత్వ ధర్మం



 శ్లో" చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినో2 ర్జున !
     ఆర్తో జిజ్ఞాసు రర్ధార్ధీ జ్ఞానీ చ భరతషభ ! !!(7అ - 16శ్లో)

సుకృతులు, దుష్కృతులు అని లోకంలోని జనులను స్థూలంగా రెండు రకాలుగా విడదీసాడు పరమాత్మ. 

దుష్కృతులు - అత్యాశాపరులు ....


మనిషికి కోరికలు అనేకం. ఆ కోరికలే తోటివారిని నిందించేట్టు, లేదా హింసించేట్టు అనేక సందర్భాలలో వారిని  నిర్మూలించేటట్టు కూడా చేస్తూ ఉంటాయి. మనిషిలో ఉండే అత్యాశే  తన తోటి వారిని హింసించడానికి కారణమవుతోంది. ప్రతీ వస్తువును తయారుచేయడంలో పొటీతత్వంతో ఒకరిని మించి ఒకరు చేయాలన్న తాపత్రయంలో మనిషి సాగించే ప్రయత్నాలు ప్రకృతిని పాడుచేస్తున్నాయి.... పట్టెడన్నం కోసం పరితపించే వారినీ చూస్తున్నాం.... బస్తాలు బస్తాలు ఆహారధాన్యాల్ని పట్టుకెళ్ళి సాగరంపాలు చేసే దేశాల్నీ మనం చూస్తున్నాం. కోరిక ఉండాలి కానీ ఇంకొకరిని అధిగమించి స్వార్ధంగా తాను మాత్రమే ఎదగాలన్న చింతనతో అత్యాశాపరుడు కావటం తప్పు. తాను చేసే కార్యాలు తన తోటి ప్రాణకోటిని, ప్రకృతినీ హింసించని రీతిలో సాగాలి. తనను తాను ఆత్మవినాశనము చేసుకోని రీతిలో సాగాలి. 

మంచి మార్గంలో బతకడానికి భగవంతుని అనుగ్రహాన్ని కోరు. ఆయన అనుగ్రహిస్తాడు. అయితే మన కోరికలను బట్టి ఆయన పరీక్షలూ ఉంటాయి.  కావలసినవి కోరుకున్నా మనకు తగినవి అందిస్తాడాయన. మనకు హాని కలిగించని కోరికలను ఆ పరంధాముడు తీర్చి తన అనుగ్రహాన్ని మనకందిస్తాడు. పిల్లల కోరికకై తల్లిదండ్రులు ఎంత ఆతృత పడతారో లోకపిత అయిన భగవంతుడు కూడా మన విషయంలో ప్రేమతో అంత తపనా పడతాడు. అలాంటి జగత్పితను మనం ఏది కావాలన్నా అడగవచ్చును. ఏది తగునో అది మనకు తప్పక అనుగ్రహిస్తాడు.

మా కోరికలు తీర్చుటలేదు. అన్నీ కష్టాలే ఏ రూపంలో పూజించినా, ఎన్ని పండగలు చేసినా మాకు కష్టాలే..   పరమతంలో అందరూ సుఖంగా ఉన్నారు. కాబట్టి ఆ మతం తీసుకొని వెళ్ళిపోదాము అని చాలామంది ఏసు ప్రార్ధనలోకి మారతారు. మరి అప్పుడు కష్టాలు లేవా.. రావా.. వారి కర్మలు మారిపోయాయా..అంటే అదేమీ ఉండదు.. కానీ భ్రమలో మేము ఈ మతం తీసుకున్నాక చాలా సంతోషముగా ఉన్నాము.. మాకు ఎటువంటి కష్టాలు లేవు అని వారిని వారు మభ్యపరుచుకుంటారు. "ఏ మతం గానీ వారు కొలుస్తున్న వారి దైవం కానీ ఇతర మతస్తులను విమర్శిస్తూ మతమార్పిడులు చేయమని  చెప్పలేదు." ఏసుప్రభువు అంటే ఒక పవిత్ర ఆరాధన.. మహమ్మద్ ప్రవక్త అంటే ఒక పవిత్ర ఆరాధన మన హిందూ ప్రజలలో ఉంది. అలాగే వారికీ మన హిందూదేవతలపై, ధర్మాలపై మన పవిత్ర గ్రంధాల పై ఆరాధన ,గౌరవం ఉండాలి. అది కొద్దిమందిలో మనం చూస్తాం. కానీ ఎక్కువ శాతం అజ్ఞానంతో మతమార్పిడులకు పూనుకుంటున్నారు. దీనిని మనం ముక్తఖంఠంతో ఖండించాలి. ఇందుకు నేను సైతం ..అంటాను. కానీ వారి ధోరణిలోనే మనమూ వారిని విమర్శించడమూ ..విశ్లేషించడమూ అనవసరము. మన గొడవలను భగవంతుడికి ఆపాదించరాదు. హిందూ సంప్రదాయాలకు అర్ధం పరమార్ధం ఉన్నాయి. హిందూ కట్టుబాట్లకు క్రమశిక్షణ ఉంది. ప్రతి పండుగ వెనకాల ఒక ప్రబోధం ఉంటుంది. హిందూ పండగలను దేవతలను వ్యంగ్యముగా మాట్లాడితే  మనం సహించవలదు. పరమత సహనం అంటే గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. "నమ్మకము"(Faith) అన్నది పుట్టిన హిందూత్వం పైనే లేకపోతే ఆ "నమ్మకం" వేరే మతం తీసుకున్నపుడు ఎలా వస్తుందో నాకు అర్ధం కాదు.      





సుకృతులు, దుష్కృతులు అని లోకంలోని జనులను స్థూలంగా రెండు రకాలుగా విడదీసాడు పరమాత్మ. 

నన్నుకోరి నా నుంచి పొందగోరేవారు సుకృతులు. అలా నా నుంచి పొందగోరేవారు 1. ఆర్త:,2. జిజ్ఞాసు:, 3.అర్ధార్ధీ, 4. జ్ఞానీ. 

ఆర్త: -ఒకనాడు సంపద వైభవాలు ఉండీ దురదృష్టవశాత్తు పోగొట్టుకొని తిరిగి పొందాలని కోరుకునేవాడు.. అర్ధార్ధి - తన వద్దలేని కొత్త సంపద వైభవాలు కోరుకునేవాడు. వీరిద్దరూ ఒకలాంటివారే. ఇలాంటి లౌకిక సంపదలు కాక జ్ఞానస్వరూపమైన ఆత్మని దర్శింపగోరువాడు జిజ్ఞాసువు. అంటే ఆత్మసాక్షాత్కార కాముడు అని అర్ధం.  జ్ఞానము కల ఆత్మ కూడా భగవంతుని వస్తువే కనుక అది మనకు స్వయంగా ప్రకాశించాలన్నా స్వామి అనుగ్రహిస్తేనే అవుతుంది తప్ప మన సాధన వలన కాదు.  కనుక జిజ్ఞాసువు అయిన వ్యక్తి కూడా పరమాత్మునే ఆశ్రయించాలి. ఇక జ్ఞానీ అంటే జ్ఞానము పూర్తిగా కలవాడు. జ్ఞానం పూర్తిగా లభిస్తే ఆత్మ స్వరూపం తెలుస్తుంది. ఆత్మ స్వరూపం తెలిస్తే దానికి నియంతగా ఉన్న పరమాత్మ స్వరూపం తెలుస్తుంది. అలా జగత్కారణమై సర్వనియంతయై, ఆత్మ లోపల ఉండి నడిపే శ్రీకృష్ణుని అధీనమే జీవుడని తెలియడమే జ్ఞానమంటే. జ్ఞానం కలవాడు అంటే పరమాత్మకి దాసుడుగా ఉన్నవాడు అనే అర్ధం. 

ధర్మంగా మంచి ఆశయాలను తీర్చమని భగవంతుని కోరండి. భగవంతుడు తప్పక తీరుస్తాడు.మన ఆశలన్నీ ఆలోచించి తగిన రీతిలో నెరవేరుస్తాడు. ఆయన అనుగ్రహించినవి ఆనందంతో స్వీకరిద్దాం. వ్యక్తిత్వాన్ని నమ్ముకుందాం. తద్వారా భగవంతుని అశీస్సులు పొందుదాం. ఇక్కడ ఒక ఉదాహరణ:- సోదరి నివేదిత జీవితం గురుభక్తికి ప్రతీక. భారతదేశ వాతావరణం, ఆచారవ్యవహారాలు, సాంఘీక కట్టుబాట్లు తెలియని ఆవిడ వివేకానంద స్వామికి శిష్యురాలై..మార్గరేట్ "నివేదిత"గా మారారు. అంటే భగవంతునికి నివేదింపబడినదని అర్ధం. ఆవిడ భారత ప్రజల సేవలో స్వచ్చందంగా తనను తాను నివేదించుకొని తన పేరును సార్ధకం చేసుకొంది. పాశ్చాత్యులు భారతీయులను ఎంత చులకన చేశారో, ఎంత అణగద్రొక్కే ప్రయత్నం చేశారో ప్రత్యక్షంగా ఆమె చూసారు. భారతీయులకు కావలసినది పాశ్చాత్య విద్య కాదు..భారతీయ చరిత్ర, సంస్కృతి, భాష అని గ్రహించారు. మాతృభాషలో పదాలుండగా ఇంగ్లీషు వాడడం ఎందుకు? అని ఖండించారు నివేదిత. భారతదేశం గురించి, ఇక్కడ తన అనుభవాల గురించి ఆమె అనేక పుస్తకాలు వ్రాసారు. హృదయాలను కదిలించే ఎన్నో గాధలు భారతీయ చరిత్రలో ఉన్నాయి. చిత్రించడానికి ఎన్నో భారతీయ కళాఖండాలు ఉండగా విదేశీ అనుకరణ ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. పురాతన భారతీయ కళలను పునరిద్ధరించాలని ఆమె ప్రగాఢంగా ఆకాంక్షించారు. ఆమె  మనదేశ స్వాతంత్ర్య దిశలో సమైక్యతా దిశగా విశేష కృషి సలిపారు. నివేదిత ఆధ్యాత్మికంగా సేవలందిస్తూ రామకృష్ణ, వివేకానందులకే తన జీవితాన్ని అంకితం చేసారు. 
సోదరి నివేదిత భారతీయ సంస్కృతి ప్రాముఖ్యమును ప్రాచుర్యము చేశారు. కానీ మనలో కొందరు మన సంస్కృతిని విమర్శించడం శోచనీయం. 

భగవద్గీతలో శ్లోకానికి అర్ధాన్ని ఊటంకిస్తూ భారతీయ హిందూ సంస్కృతి పరి రక్షణ మన ధర్మం.  అని తెలియజేయుటయే ఈ పోస్ట్ సారాంశము.


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు  


Monday, October 16, 2017 0 comments By: visalakshi

శ్రీశ్రీశ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం-మానవజన్మ ప్రాముఖ్యము



ఈ విశ్వానికే అధిపతి అయిన భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించినప్పటికీ ఆయనకు సంతృప్తి కలుగలేదు. భగవానుని అనంత శక్తిని అవి గ్రహించలేకపోయాయి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించి వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తిని ప్రసాదించాడు. జ్ఞానము సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు.ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవజన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్యవివేకముతో కడకు భగవత్సాక్షాత్కారమునుపొందుచున్నాడు.  
మానవుడు భగవంతుని లీలలను, అద్భుతకార్యములను, మహత్యాలను జూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి జెంది ఆనందించును. అందుచే  మానవ జన్మ లభించుట  జన్మ సార్ధకము.



మానవ జన్మ యొక్క విలువను గ్రహించి ఈ దేహము నశ్వరమని..దేహానికి మరణం అనివార్యమని గ్రహించి జీవిత పరమావధిని సాధించుటకై విసుగు,విరామములేక రాత్రింబగళ్ళు కృషిచేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెను. అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలువవలెను. ఈ మన ధ్యేయము సత్వరము ఫలించాలంటే సద్గురువు సాయినాధుని సాంగత్యములో అది సాధ్యము. ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని విన్ననూ, ఆధ్యాత్మిక గ్రంధములెన్ని చదివినను..తెలియరాని ఆత్మసాక్షాత్కారము సద్గురువు సాయినాధుని సాంగత్యములో సులభముగా పొందవచ్చును. ఆ జ్ఞానమునంతయు సద్గురువు చెప్పగలరు. వారి చర్యలు..సామాన్య సంభాషణలే మనకు మౌనప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను సద్గురువు ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు. సాయిబాబా వారి పావనచరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగచేసి వారిని పారమార్ధికముగా ఉద్ధరించును. సద్గురువు సాయినాధుడు అట్టి మహా పురుషుడు. వారెప్పుడూ ఆత్మానుసంధానము నందే నిమగ్నులగుచుందురు. వారు స్థిరచిత్తులు. వారి చర్యలు నిగూఢములు. బాబావారి ప్రేమానురాగములు కొలువరానివి. స్వామి అనుగ్రహము ఇంతయని చెప్పుటకు అలవికానిది. బాబా వారి ఆదేశములలో అద్భుతమైన సందేశాలుంటాయి. అవి తెలుసుకున్నవారు ధన్యులు. 



 భక్తుల కొరకు మానవరూపమున అవతరించిన భగవతత్త్వమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో మన వంటి భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి యెవరికి గలదు? బాబావారు శుద్ధచైతన్యస్వరూపులు. విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. బాబా ఎల్లప్పుడు తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై యుండువారు. శ్రీసాయిబాబాను భక్తిప్రేమలతో స్మరించుటయే జీవన్మరణరూపమైన సంసారమనెడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఈ సాధనలో వ్యయప్రయాసలు లేవు. మన దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు గురు సన్నిధిలో సద్గురువు చరణములను నమ్మి కొలువవలెను. మనయొక్క అంతరంగమున గల భక్తిప్రేమలను బట్టి సద్గురువు మనకు జ్ఞానమును, శాశ్వతానందమును ప్రసాదించును.



ద్గురువు సాంగత్యమున కలుగు మహిమ చాలా అద్భుతము. అది మన అహంకారమును, దేహాభిమానమును నశింపజేయును. చావుపుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును. కేవలము హృదయ పూర్వకంగా సద్గురువును వంటి మహాత్మునాశ్రయించిన వారు మనలను భవసాగరము నుండి తరింపజేయుదురు. పూర్వజన్మ సుకృతము వలన శ్రీ  సాయిబాబా పాదములనాశ్రయించు భాగ్యము మాకు లభించినది. మసీదుగోడ కానుకొని  ఊదీమహాప్రసాదమును తనభక్తుల యోగక్షేమములకై పంచి పెట్టు సుందరస్వరూపుడు, ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడు, సదా పూర్ణానందములో మునిగియుండు వాడునగు శ్రీ సాయి పాదములకు సాష్టాంగనమస్కారములు చేయుచూ ...పరబ్రహ్మ స్వరూపులైన సాయినాధుడి కృప అందరికీ కలగాలని కోరుకుంటూ....



సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు 








   
Tuesday, October 10, 2017 0 comments By: visalakshi

ఆత్మీయత-అంతరంగం

 ఓం శ్రీ సాయినాధాయ నమ:


ఆత్మీయత అనేది అంతరంగ భావం. జనన కాలం నుండి ఆత్మీయానురాగాలను మనం పొందుతాం.మనమూ ఆస్వాదిస్తాం. అది ఒక కుటుంబ పరంగా కావచ్చు ..స్నేహం కావచ్చు..మరేదైనా బంధం కావచ్చు. అందరినీ ఆత్మీయులుగా భావించి పరస్పర అవగాహన మేరకు సంభాషణలు చేసుకుంటాము. కానీ "ఆత్మీయత"కు నిర్వచనం ఏమిటి? అంటే చెప్పగలమా...అది అనుభవిస్తేనే ఆ మధురత తెలుస్తుంది. "రెండు వేరు వేరు నదులలోని జలాలను ఒక కలశంలో పోస్తే ఆ జలాలు అవినాభావ సంబంధంతో కలిసిపోయి ఉంటాయి." అలాగే "ఆత్మీయులు" అంతరంగాన మిళితమైన భావనలతో కలిసి ఉంటారు. స్నేహాన్ని మించిన సహచర్యంతో సంతోషభావ ప్రకాశకులై ఉంటారు.    

ఆత్మీయత, అనురాగాలకు దర్పణం రామాయణ కావ్యం. సోదరుల మధ్య అనురాగము, భార్యాభర్తల మధ్య ఆత్మీయానురాగము.. తండ్రీ కుమారుల ఆత్మీయతా మమకారము.. ఇలా రామాయణ మహా గ్రంధములో ఆత్మీయతతో కూడిన అంతరంగాలకు ప్రతి పాత్ర అద్దం పడుతుంది. ఆత్మీయతకు ప్రతిరూపం ఆదికావ్యంలోని శ్రీ రామచంద్రమూర్తి. 

సీతారాముల కళ్యాణంగా శ్రీరామనవమిని భక్తిశ్రద్ధలతో మనం జరుపుకుంటాం. ఎంతో భక్తితో కోదండరాముణ్ణి అర్చిస్తాము. సీతారాముల తరువాత దైవత్వస్థాయిని పొందిన రామదూత "హనుమంతుడు". సీతారాములకు భక్తితో దాసుడైన హనుమంతునకు.. మనము భక్తితో శ్రీ ఆంజనేయకు  దాసులం.




శ్రీరామపట్టాభిషేకం తరువాత ఒకరోజు సీతారామలక్ష్మణులు తమ మందిరంలో ఉన్న హాలులోకి వెళ్ళారు. ఒక్కొక్క చిత్రపటం చూసి దానిగురించి చెప్పుకుంటూ హనుమంతుడి చిత్రం వద్దకు వచ్చారు. లక్ష్మణుడు 'అయం ఆర్యో హనుమాన్- ఈ పూజ్యుడు హనుమంతుడు '  అన్నాడు.... సీత, 'ఏష స: చిరనిర్విణ్ణజీవలోకప్రత్యుద్ధరణగురూపకారీ మహానుభావో మారుతి:- చిరకాలంగా నిర్వేదంలో పడి దు:ఖిస్తున్న జీవలోకాన్ని ఆ దు:ఖమునుంచి    బయటపడేసి మహోపకారం చేసిన మహానుభావుడు ఈ హనుమంతుడు ' అంది.....రాముడు  'దిష్ట్యా  సో2 యం మహాబాహు: అంజనానందవర్ధన: యస్య వీర్యేణ కృతినో వయం చ భువనాని చ - ఎవరి పరాక్రమం వలన మేమూ, లోకాలూ కృతార్ధులమయ్యామో ఆ మహానుభావుడు ఈ ఆంజనేయుడు ' అన్నాడు.

రామపట్టాభిషేకం అయిన తరువాత రాముని అనుమతితో వానరులూ రాక్షసులూ వారి వారి దేశాలకు వెళుతున్నారు. అప్పుడు  హనుమ ఇలా అన్నాడు.

శ్లో"స్నేహో మే పరమో రాజంస్త్వయి తిష్ఠతు నిత్యదా,
     భక్తిశ్చ నియతా వీర భావో నాన్యత్ర గచ్చతు.

రామా! నాకు నీపట్ల నిత్యమూ స్నేహమూ, అచంచలమైన భక్తీ ఉండుగాక! నా మనస్సు ఇతరవిషయాలవైపు మరలకుండా ఉండుగాక. ఈ భూలోకంలో నీ చరిత్ర ఎంతవరకు మానవులు చెప్పుకుంటారో అంతవరకూ నేను జీవించే ఉంటాను. నీ చరితామృతం వింటూ, నీకు దూరమయ్యాననే బెంగను తొలగించుకుంటాను.

శ్లో"ఏవం బ్రువాణం రామస్తు హనూమంతం వరాసనాత్,
     ఉత్ధాయ సస్వజే స్నేహద్వాక్యమేతదువాచ హ.

హనుమను రాముడు స్నేహత్వభావంతో అంతరంగాన ఆత్మీయమైన గౌరవభావము ఉప్పొంగగా. సింహాసనము దిగి .ఆనందముతో కౌగలించుకున్నాడు. ఆ వాయునందనుడు చేసిన మహోపకారాలకు తన కృతజ్ఞత అనితరసాధ్యమైన రీతిలో తెలియజేసాడు.

 శ్లో" ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపే,
      శేషస్యేహోపకారాణాం భవామ ఋణినో వయం.

హనుమా! నువ్వు మాకు ఎన్నో ఉపకారాలు చేసావు. వాటిలో ఒక్కొక్క ఉపకారం ఎటువంటిదంటే కేవలం ఆ ఒక్క ఉపకారానికే నా ప్రాణాలు ధారపోసినా కూడా నీ ఋణం తీరదు. మిగిలిన ఉపకారాల ఋణం మిగిలే ఉంటుంది. వాటికి నీకు (శాశ్వతంగా) ఋణగ్రస్తుడినయే ఉంటాను. 

శ్లో" మదంగే జీర్ణతాం యాతు యత్త్వయోపకృతం కపే,
     నర: ప్రత్యుపకారాణామాపత్స్వాయాతి పాత్రతాం.

మనం ఆపదలలో ఉండగా ఎవరైనా మిత్రుడు ఉపకారం చేస్తే తరువాతికాలంలో ఆ మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలనుకుంటాం. కానీ ఆ మిత్రుడికి ఆపద వస్తేనే మనకి ప్రత్యుపకారం చేసే అవకాశం వస్తుంది. నేను నీకు ప్రత్యుపకారం చెయ్యాలని కోరుకోను. (ఎందుకంటే నువ్వు చేసిన ఉపకారాలకి నీ ఋణం తీర్చుకోవాలంటే నీకు ఆపదలు కలగాలి. నీకు ఆపదలు కలగాలని కలలో కూడా కోరుకోలేను కనుక నీ ఋణం ఎన్నటికీ తీరదు.) "అందుచేత నువ్వు చేసిన మహోపకారాలన్నీ నాలోనే జీర్ణమైపోతాయి."  రాముడు ఇంత గొప్ప మాట హనుమను తప్ప ఇంకెవరిని గురించీ అనలేదు. వెంటనే రాముని మెడలో ఉన్న అమూల్యమణిహారం తీసి హనుమంతుడి మెడలో వేసి తన అత్యంత ఆత్మీయతను కనపరిచాడు.




హనుమంతుడు రామాయణ మహామాలారత్నం. అరిషడ్వర్గాన్ని జయించినవాడు కనుక జితేంద్రియుడు అని, రాముడు మెచ్చిన తెలివైనవాడు కనుక బుద్ధిమతాం వరిష్ఠం అన్నారు. హనుమ ఉన్నచోట భయం ఉండదు. ధైర్యం ఉంటుంది. కార్యదీక్ష ఉంటుంది. విజయం ఉంటుంది. అనితర సాధ్యమైన కార్యాలు సాధించినా ఆత్మస్తుతి ఉండదు. వినయమే ఉంటుంది. ఆవేశం కాకుండా ఆలోచన ఉంటుంది.ఇవన్నీ హనుమద్భక్తులుగా మనం నేర్చుకొని ఆచరించవలసిన అంశాలు.


  

రామాయణంలో శ్రీరాముడి సాన్నిహిత్యం కన్న తమకి వేరే ఏమీ అక్కరలేదనుకొని కోరి రాముడికి దాసులైనవారు ఇద్దరు. వారు లక్ష్మణుడు, హనుమంతుడు.. లక్ష్మణుడు పుట్టుకనుంచీ రాముడితో కలిసి ఉన్నాడు. తన జీవితం రాముడికే అంకితం చేసాడు. రాముడి గుణగణాలు చూసి తనంత తాను కోరి రాముడికి దాసుడయ్యాడు. లంకలో రాక్షసుల మధ్య నిలబడి తానెవరో చెప్తూ 'దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ: - నేను కోసలదేశాధిపతి రాముడికి దాసుణ్ణి ' అని తన గుర్తింపును తెలిపాడు హనుమంతుడు. 

పట్టాభిషేకం తదుపరి రాముడు అనేక దానములు చేసి వానరులకు, రాక్షసులకు విలువైన కానుకలు ఇచాడు. సీతమ్మకు అమూల్యమైన వస్త్రాలు,ఆభరణాలూ ఇచ్చాడు. ఆమెకి చంద్రకాంతిలా ఉన్న స్వచ్చమైన ముత్యాలహారం ఇచ్చాడు. సీత ఆ హారం తన మెడనుంచి తీసి రాముడివైపు, హనుమవైపు, వానరులవైపు చూసింది. ఆమె  ఆలోచన  గ్రహించిన రాముడు సీతా! తేజస్సు,యశస్సు,నేర్పు,సామర్ధ్యం,వినయం,నీతి,పౌరుషం,పరాక్రమం,తెలివి-ఇవన్నీ సర్వదా ఎవరిలో ఉంటాయో, నువ్వు ఎవరిపట్ల ఆనందంగా ఉంటావో అతడికి ఆ హారం ఇయ్యి 'అన్నాడు. సీత వెంటనే ఆ ముత్యాలహారం హనుమంతుడికి బహుకరించింది. అంతటి మహిమాన్విత మహానుభావునికి మనము మనసారా సాష్టాంగ వందనాలు అర్పిస్తూ....


పవమానసుతుడు పట్టు పాదారవిందములకు,
నీ నామరూపములకు నిత్యజయమంగళం.
  


   



Wednesday, September 20, 2017 0 comments By: visalakshi

హృదయకమలం - జగన్మాత



దైవానికి ప్రతిరూపం "తల్లి జగన్మాత" . అమ్మ అయినా అమ్మలగన్న అమ్మ అయినా నిష్కల్మష హృదయంతో పరితపించగలిగితే ఆ పరమేశ్వరి ప్రత్యక్షమవుతుంది. అందుకు మన హృదయం పసిహృదయంలా పరితపించాలి. 

'యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా!..యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా!.. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా!'

సకల గుణాల సంయుక్త అయిన ఆ జగన్మాత సర్వజీవుల్లోనూ విరాజిల్లుతోంది. మనలో ఉన్న బుద్ధికీ, స్మృతికీ, శక్తికీ ఆధారం ఆ ఆదిపరాశక్తియే! కానీ అహంకారంతో మన బుద్ధికుశలత, మన శక్తిసామర్ధ్యాల వల్లే మనం సాధించామని అనుకుంటాం. మనలో క్షుధారూపంలోనూ, నిద్రారూపంలోనూ ఉన్నది ఆ జగన్మాతే! కానీ మనం కొన్ని డిగ్రీలు చేతబట్టుకొని కొంత అధికారం సంపాదించి సంపాదన కలగగానే మనలోని శక్తులన్నింటికి మూలాధారమైన దైవాన్ని మరచిపోతాం. 'నేను' అన్న అహంకారంతో కనురెప్పలనే నియంత్రించలేని మనం ప్రపంచాన్ని శాసించాలనుకుంటాం. అలాంటి భ్రమల్ని పోగొట్టి ఈ 'నేను' అనే అహంకారాన్ని అజ్ఞానాన్ని తొలగించడానికి ఆ జగన్మాత మన హృదయకమలంగా అంతరంలో ఉండి అవసరమైతే శిక్షించి తగిన గుణపాఠం నేర్పుతుంది.  కనువిప్పు కలిగిస్తుంది.  మన జ్ఞాపక శక్తికి ఆధారం ఆ జగన్మాతే!..మనలో శక్తిరూపంలో ఉన్నది ఆ జగన్మాతే! సర్వశక్తులకూ మూలాధారం అమ్మలగన్న అమ్మ జగన్మాత. 



శరదృతువు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ఆరంభమయ్యే తొలి తొమ్మిదిరోజుల శక్తిరూపిణీ పూజలకి ఫలితంగా పదవనాటి ప్రత్యేక పర్వదినమే దసరా పండుగ. 'దశహర ' అన్న సంస్కృత పదానికి దసరా వ్యవహారమైంది కానీ వాస్తవానికి 'దశదోషహరం ' (పది దోషాలను పోగొట్టేది)అన్న అర్ధంతో కూడిన పండుగే ఇది. ఈ తొమ్మిది రాత్రులను శరన్నవరాత్రులంటారు. అమ్మవారిని శారదారాధ్యా అన్న నామంతో పూజిస్తారు తొమ్మిదిరోజులూ..'నవ ' అంటే సంఖ్యాపరంగా 9 ..సాహిత్యపరంగా కొత్తదన్న అర్ధం సూచిస్తోంది. 9వ సంఖ్య పూర్ణత్వ సంకేతం. సృష్టి నవాత్మకం- నవరసాత్మకం- అదే ఏకశక్తి. ఏకత్వం నవత్వంగా విస్తరించడమే విశ్వప్రణాలికారహస్యం. ఈ శక్తి చైతన్యమే సౌందర్యం. నవదుర్గలు అంటే  క్తిస్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించిందని ప్రతి అవతారం నుండి రెండు రూపాలు వెలువడినాయని కధనం. 9 స్వరూపిణులుగా అనగా నవదుర్గలుగా దుర్గను పూజిస్తారు. తొమ్మిది సౌందర్య రూపాలుగా విభజించుకుని ' శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి లేదా మహిషాసురమర్దినీదేవి ' అని తొమ్మిదిరోజులూ పూజించి పదవరోజున కార్యసిద్ధి కోసం   కోరుకున్న విషయానికి పునాదిరాయి వేసుకుని    పూర్ణఫలం పొండడానికి ప్రయత్నించాలి. 

పూర్వం రోజుల్లో దసరాపండుగనాడు సరస్వతీ పూజరోజున ఉపాధ్యాయులందరికీ సన్మానాలు చేసి పిల్లలతో "సరస్వతీ నమస్తుభ్యం వరదేకామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా..".అంటూ శ్లోకాలను పాడించేవారు. విజయదశమి రోజు శుభప్రదంగా శుభకార్యాలను ప్రారంభించేవారు.శక్తిరూపంగా పూజింపబడే తల్లి శ్రీమాత. తొమ్మిది రూపాలతో అర్చించిన దుర్గామాతను చివరగా "దుర్గాదేవి జగన్మాత స్వస్థానంగచ్చ పూజితే" అంటూ అమ్మవారిని సాగనంపి జలనిమజ్జనం చేయడంతో పండగ పూర్తవుతుంది. మన హృదయకమలంగా ప్రతిష్టిత అయిన ఆ జగన్మాతను "నీవు లేనిదే మేము లేము" అన్న సుస్థిరభావం కలిగేలా అమ్మను ప్రార్ధిద్దాం. ముగురమ్మల ప్రతిరూపమైన తల్లిని ఆరాధనాభావంతో కొలుద్దాం. ఆ జగన్మాత ప్రసాదించిన సర్వశక్తులనూ సద్వినియోగపరుచుకునేందుకు ప్రయత్నిద్దాం. నిరంతరం ఆదిపరాశక్తి స్మరణలో జీవిద్దాం.సర్వజీవులయందూ మాతృరూపంగా ప్రతిష్ఠితమై ఉన్న దేవికి పదే పదే నమస్కారములు. 
"ఓం శ్రీమాత్రే నమ:"      



మొదటిరోజు విశిష్టత..శైలపుత్రి..సాక్షాత్తు పరమశివుడిని పరిణయమాడిన పార్వతీదేవి ఈమె. పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు "శైలపుత్రి" అనే నామము వచ్చింది.వృషభ వాహనారాఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమ చేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. మానవ శరీరంలో 108 చక్రాలుంటే వాటిలో ప్రధానమైన ఆరు చక్రాలలో అమ్మవారు నివసిస్తుందని లలితాసహస్రం 'షట్చక్రోపరివాసిని ' అన్నది నామం. ఈ చక్రాలలో మూలాధారచక్రంలో ఉంటుంది శైలపుత్రి. హిమశైలానికి భూమి ఆధారం. మూలాధార చక్రానికీ, భూమికీ అన్వయం చెబుతారు. ఈ చక్రం ఎరుపురంగులో ఉంటుంది. ప్రతి చక్రాధిదేవతకూ పద్మాలను కలిగిన హస్తాలుండడం విశేషం. రేపు శైలపుత్రిగా మాత అలంకరణ... 
నవదుర్గలు......



శైలపుత్రి:  వందే వాంచితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం!
                వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం!!

బ్రహ్మచారిణి: దధానా కరపద్మాభ్యాం  అక్షమాలాకమండల:!
                   దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా !!

చంద్రఘంట: పిండజప్రవరారూఢా చండకోపాస్త్ర  కైర్యుతా !
                   ప్రసాదం తనుతే మహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా !!

కూష్మాండ: సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ !
                 దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే !!

స్కందమాత: సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా !
                   శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ !!

కాత్యాయని: చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా !
                   కాత్యాయనీ శుభం దద్యాద్దేవి దానవఘాతినీ !!

కాళరాత్రి:  ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నఖరా స్థితా
               లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ !
               వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా
               వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ !!

మహాగౌరి:  శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచి: !
                మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా !!

సిద్ధధాత్రి:  సిద్ధ గంధర్వ యక్షాద్యై: అసురైర మరైరపి !
               సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ !!

             సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే !
             శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమో2స్తుతే !!

"జగన్మాత ఆశీస్సులతో శరన్నవరాత్రి శుభాకాంక్షలు..." 
Saturday, August 5, 2017 0 comments By: visalakshi

పార్ధసారధిస్వామి(శ్రీకృష్ణుడు)

 ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమ:

 
మహాభారత యుద్ధానికి కురుపాండవ సైన్యాలు సిద్ధమవుతున్న సందర్భమది.... ఆ సన్నాహాల్లో భాగంగా ధుర్యోధనుడు, అర్జునుడు శ్రీకృష్ణుడి సహాయాన్ని అర్ధించేందుకు ఆయన నివాసానికి వెళ్ళారు. ఇద్దరూ దగ్గరివారే కావడంతో ఎవరినీ కాదనలేక ఇరుపక్షాలకూ సాయపడేందుకు అంగీకరించాడు ఆ మధుసూదనుడు. ఒక పక్షానికి సర్వసైన్య బలం, రెండవ పక్షానికి ఆయుధం పట్టని కేవలం రధసారధ్యం మాత్రమే అని స్పష్టం చేశాడు. ఎవరికి ఏది కావాలో నిర్ణయించుకోమని అర్జనుడికి, సుయోధనుడికి అవకామిచ్చాడు. కిరీటి ఎలాంటి సంశయం లేకుండా కృష్ణుడినే ఎంపిక చేసుకున్నాడు. ఆయుధం కూడా పట్టనన్న వాసుదేవుణ్ణి కోరుకున్న అర్జునుడి అవివేకానికి నవ్వుకొని, ఆ కౌరవ అధినేత బలరామానుజుడి బలగమైన సైన్యాన్ని కోరుకున్నాడు. అలా ఆనందంగా దుర్యోధనుడు వెళ్ళగానే శ్రీకృష్ణుడు విజయుడితో అయ్యో బావా! నువ్వు అమాయకుడిలా ఉన్నావే! అంత భారీ సేనను కాదనుకొని కేవలం రధాన్ని తోలే నన్ను ఎంపిక చేసుకున్నావు! అన్నాడు చిద్విలాసంగా!అప్పుడు ఆ కౌంతేయుడు 'ఏ యుద్ధాన్నైనా ఎదుర్కోవడానికి కావలసిన సైన్యం, శక్తిసామర్ధ్యాలు, అవసరమైన ఆయుధసామాగ్రి నా వద్ద ఉన్నాయి. కానీ నాకు సరైన తోవను చూపే మార్గదర్శకుడు లేడు.అందుకే నిన్ను ఎంచుకున్నాను. నీవు ఒక్కడివి ఉంటే చాలు.అదే బలమూ, బలగమూ!అన్నాడు.  

నీవొక్కడుండగా జగమంత ఎదురైన 
భయమేమి భయమేమి భయమేమి ఓ ప్రభూ!
నీవొక్కడుండక జగమంత నాదైన 
సుఖమేమి సుఖమేమి సుఖమేమి ఓ ప్రభూ!

అలాంటి ధైర్యంతోనే ఆ ధనుంజయుడు స్వామి సారధ్యంతో అజేయుడై నిలిచాడు. అందుకే  శ్రీకృష్ణ పరమాత్మ పార్ధసారధి స్వామిగా  కొలవ బడుతున్నారు.


చెన్నైలోని తిరువళ్ళికేనిలో పురాతన పార్ధసారధి కోవెల ఉంది. ఆ ఆలయ ఉత్సవమూర్తి గురించి ఒక చారిత్రక సత్యం ఉంది. క్రీ.శ. 8వ శతాబ్దంలో పల్లవరాజు మొదటి నరసింహవర్మన్ ఉత్సవమూర్తి విగ్రహాన్ని చేయమని ఒక కంసాలికి చెప్పాడు. అతను లోహమును కరిగించి, అచ్చులోపోసి విగ్రహాన్ని తయారుచేశాడు. ఆ విగ్రహంలో అందమైన కృష్ణపరమాత్మ ముఖానికి గాట్లు, బొబ్బలు వచ్చాయి. అప్పుడు ఆ కంసాలి 'అయ్యో! నేను ఏదో తప్పు చేశాను. అందుకే అందమైన కృష్ణపరమాత్మ ముఖానికి గాట్లు, బొబ్బలు వచ్చాయి ' అని విచారించాడు. అతడు మరొక విగ్రహాన్ని తయారు చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అతనికి కృష్ణపరమాత్మ కనిపించి 'నువ్వు మరొక విగ్రహము చేయవద్దు. దీనినే ఉత్సవమూర్తిగా స్వీకరించండి ' అని చెప్పాడు. అప్పుడు ఆ కంసాలి 'ఇంత అందవికారంగా ఉన్న విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా ఎలా ఉపయోగించమంటారు ' అని అడిగాడు. అప్పుడు కృష్ణపరమాత్మ అతనికి ఇలా తెలియజేశాడు.

"మహాభారతయుద్ధంలో భీష్మాచార్యులు పార్ధునిపై (అర్జునునిపై) ప్రయోగించిన బాణాలన్నింటినీ రధసారధిగా ఉన్న నేను స్వీకరించాను. అందులో ఒక్కబాణం అర్జునునికి తగిలినా అతను మరణించి ఉండేవాడు. అర్జునుణ్ణి రక్షించే క్రమంలో ఆ బాణాలన్నీ నా ముఖానికి తగిలాయి. ఆ కారణంగా నా ముఖం మీద గాట్లు ఇవి. నేను భక్తులను ఎన్నివిధాలుగా కాపాడుతుంటానో రాబోవు తరాలవారు తెలుసుకోవాలంటే ముఖం మీద గాట్లున్న ఈ విగ్రహాన్నే ఉత్సవమూర్తిగా ఉపయోగించండి."  

కృష్ణపరమాత్మ ఆదేశం ప్రకారం తిరువళ్ళికేనిలోని పార్ధసారధి దేవాలయంలో ఆ విగ్రహాన్నే ఉత్సవమూర్తిగా నేటికీ ఊరేగించడం జరుగుతోంది. 

 సర్వం శ్రీసాయికృష్ణార్పణ మస్తు



Sunday, July 30, 2017 2 comments By: visalakshi

సుయజ్ఞోపాఖ్యానము

  శ్రీ గురుభ్యో నమ:


"నిగమములు వేయిజదివిన
 సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్
 సుగమంబు భాగవతమను
 నిగమంబు పఠింప ముక్తి నివసము బుధా "

ఎన్ని వేదములు చదినను అవి సులభముగా ముక్తిని ప్రసాదింపజాలవు. లౌకికసుఖములన్నియు క్షణికములు. నశ్వరములు - మోక్షము పరమానందదాయకము. 'భాగవతము' అను వేదమును భక్తిశ్రద్ధలతో పఠించి.. భక్తిజ్ఞాన వైరాగ్యములు గల్గి నిష్ఠతో ఆ దేవదేవుని సేవించినప్పుడే ఆయన అనుగ్రహము లభించును.

"భగవంతు డగు విష్ణుడు జగముల కెవ్వేళ రాక్షస వ్యధ గలుగున్
 దగనవ్వేళల దయతో   యుగయుగమున బుట్టి కాచునుద్యల్లీలన్"

భగవంతుడైన శ్రీహరి ఎప్పుడెప్పుడైతే లోకాలకు రాక్షసులవలన బాధలు కలుగుతాయో అపారకరుణతో ఆయా యుగాలలో అవతరించి తన లీలా ప్రకటనలతో లోకులను కాపాడుచుండును.

"నశించే ఈ దేహానికై శోకించకు. నశించని  శాశ్వత ఆనందాన్ని నా నుండి పొందు అంటాడు పరమాత్ముడు. "మానవ జీవితం ఏడుపుతో ఆరంభమవుతుంది. పుడుతూ, పెరుగుతూ, ఆఖరికి పోతూ ఏడుపు, పోయాక కూడా ఏడుపులే మిగిల్చి పోతుంటాడు ఈ ప్రాణి. ఏడుపు సహజం. ఆ ఏడుపుని తగ్గించే ఒక ఓదార్పు ప్రతి ప్రాణీ కోరుకుంటుంది. ఆ ఓదార్పు ఎక్కడినుండి రావాలి మనకి?శోకసాగరంలో ఈదులాడే ప్రాణకోటికి నిజమైన ఓదార్పు నిచ్చేదెవరిని గుర్తించే శక్తి ఉన్నవాడు మానవుడొక్కడే. లోకంలో ఒక్కో జన్మకీ ఒక్కో బంధువర్గం చుట్టూ ఏర్పడుతూ ఉంటుంది. ఆయా బంధువులు ఆయా సమయాల్లో మాత్రం కొంతవరకు ఓదార్పు కలిగించే ప్రయత్నం చేస్తారు. 'జీవుడికి దేహాన్ని బట్టి ఏర్పడే బంధువులు ఎంతమంది మారుతున్నారో, కానీ మారని శాశ్వతమైన బంధువు ఆ పరమాత్మ.'ఎవరికి ఎక్కడ ఏ శోకం కలిగినా దానికి శాశ్వతమైన ఆనందాన్నిచ్చే ఉపశమనం  కేవలం "శ్రీహరి " మాత్రమే ఇవ్వగలడు. 



భాగవతములో పోతనామాత్యుడు వివరించిన సుయజ్ఞోపాఖ్యానంలో సుయజ్ఞుడనే రాజు యుద్ధంలో అసువులు బాసుట.. ఆతని మరణాన్ని జీర్ణించుకోలేక ఆ శవం వద్ద అతని భార్యలు,పిల్లలు భోరు,భోరున విలపించుట పలువిధాల ఆర్తనాదాలతో సాయం సమయం వరకు వారు రోదిస్తుండగా.. యముడు బాలకరూపం ధరించి వచ్చి అచ్చటివారి నుద్దేశించి జననమరణాల గురించి తత్వోపదేశం చేస్తాడు. ఈ సుయజ్ఞుని కధను  ఒక 'ఉదాహరణముగా' హిరణ్యకశిపుడు ఆ ఉపదేశమును వివరిస్తున్నాడు..( యముడు బాలకుడు రూపం ధరంచి వివరించిన ఆ తత్వోపదేశమును మనము కధలో విశదీకరించి చెప్పుకుందము.)   అసలు హిరణ్యకశిపుడు ఎవరికి తత్వోపదేశమును 
వివరిస్తున్నాడు అన్న కధాంశ మూలాల్లోకి మనం వెళితే..ఆ సారాంశము ఇదిగో ఇలా..... 

నైమిశారణ్యంలో సూతమహర్షి శౌనకాది మహామునులకు భాగవతాన్ని ఇలా వివరిస్తున్నాడు..మహాత్ములారా! గంగాతీరమున ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రుని ఈ విధంగా ప్రార్ధించాడు.

మహాత్మా! యోగీంద్రా! భగవానుడు ఆనందస్వరూపుడు. సకల భూతజాలమునకు ఆత్మీయుడు. రాగద్వేషాలకూ, త్రిగుణాలకూ అతీతుడు. ఆయనకు ద్వేషింపతగిన వాడుకానీ, ప్రేమించదగిన వాడుకానీ యుండడు. దయాస్వరూపుడు . అట్టి భగవానుడు దేవేంద్రుని కొరకు దానవులను హతమార్చుతుంటాడు. ఆయనకు దేవతల వలన కలిగే లాభమేమిటి? రాక్షసుల వలన తనకు కలిగే కీడేమిటి? ఈ నా సంశయమును తీర్చి నా మనసుకు శాంతిని కూర్చండి స్వామి అని ప్రార్ధించాడు.అందులకు శుకయోగీంద్రుడు ...నీ ప్రశ్న బాగుంది. లక్ష్మీరమణుడైన శ్రీహరి చరిత్ర మహా చిత్రంగా ఉంటుంది. వ్యాసభగవానునికి నమస్కరించి శ్రీహరి చరిత్రను వివరిస్తాను..విను.

 శ్లో" చిత్రంబులు త్రైలోక్యప, విత్రంబులు భవలతా లవిత్రంబులు స
    న్మిత్రంబులు మునిజనవన, చైత్రంబులు విష్ణు దేవు చారిత్రంబుల్.

పరమేశ్వరుడు గుణరహితుడు. ప్రకృతి ఆయన మాయ. దానికి సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే గుణాలున్నాయి. ఈ గుణాలు పెరుగుతూ తరుగుతూ ఉంటాయి. సత్వగుణం నుంచి దేవతలు, రుషులు.. రజోగుణం నుంచి అసురులు.. తమోగుణం నుంచి యక్షులు, రాక్షసులు పుట్టుకొచ్చారు. కాలరూపుడైన పరమాత్మ సత్వగుణులైన దేవతలకు మేలు, రజస్తమో గుణులైన అసురులకు, రాక్షసులకు కీడు చేస్తుంటాడు. పరీక్షిత్తూ! పూర్వం మీ తాతగారైన ధర్మనందనుడు అడుగగా నారదమహర్షి వివరించిన విషయమును చెపుతాను విను నీ  సంశయము తీరుతుంది. 

మీ తాత ధర్మరాజు రాజసూయయాగమునకు బంధు మిత్రాదులను మహర్షులనందరినీ ఆహ్వానించాడు. అందులో చేది దేశపురాజు శిశుపాలుడు కూడా వచ్చాడు. ఆ నిండు సభలో అహంకారంతో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని తూలనాడాడు. ఫలితంగా భగవంతుడు వానిని తన సుదర్శనాయుధంతో సిరస్సును చేధించాడు. అప్పుడు ఆ శిశుపాలుని దేహం నుండి ఒక తేజం వెలువడి శ్రీకృష్ణునిలో లీనమయ్యింది. అది చూచి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. సభలో ఉన్న నారదుని వైపు చూస్తూ ఇలా అన్నాడు. 



మహాత్మా! తమకు తెలియని ధర్మరహస్యాలులేవు. శిశుపాలుడు   పరమ దుర్మార్గుడు. భగవద్వేషి. అట్టివానికి వాసుదేవుని సాయుజ్యం ఎలా లభించింది? పూర్వం వేనుడనే రాజు భగవంతుని ద్వేషించి బ్రాహ్మణుల శాపానికి గురై నశించాడని చెపుతారు. శిశుపాలుడు, దంతవక్త్రుడు కలిసి గోవిందుని ఎప్పుడూ తిడుతుండేవారు..వారు శ్రీకృష్ణుని ద్వేషించని దినము లేదు. అలాంటి విరోధికి విష్ణుసాయుజ్యం ఎలా కలిగింది?నాకు వివరించండి అని ప్రార్ధించాడు.నారదుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు.. 

ధర్మనందనా! దూషణ, భూషణ, తిరస్కార, సత్కారాలు శరీరానికే గాని పరమాత్మకు లేవు. శరీరం మీద అభిమానం వలన ఎవరైనా కఠినంగా మాట్లాడినా, దండించినా బాధ అనిపిస్తుంది. నేను, నాది అనేభావం శరీరం వల్లనే కలుగుతుంది. ఈ అభిమానమే జీవుడిని బంధిస్తుంది. అన్ని శరీరాల లోనూ ఆత్మరూపంలో ఉన్న ఈశ్వరునికి ఏ దేహం పట్లనూ ద్వేషం గాని, అభిమానం గాని ఉండదు. అందువలన స్నేహంతో గాని, వైరంతోగాని, ఆయనకు నిమిత్తం లేదు. తనను తలచుకొన్న వారందరికీ తనలో చోటిస్తాడు.

హరిని చేరుటకు అనేక మార్గములు కలవు. అమితమైన కామంతో గోపికలు, భయంతో కంసుడు, వైరంతో శిశుపాలాది భూపాలుడు, బంధువులై వృష్ణులు, ప్రేమతో మీరు, భక్తితో మేము, శ్రీహరిని చేరుకోవచ్చునని నిరూపణ అయ్యింది. కామం, ద్వేషం, భయం, స్నేహం, సేవ - వీటిలో ఏదో ఒక భావంతో హరిని స్మరించిన వారికి చాలామందికి సద్గతి కలిగింది. వీటిలో ఏ ఒక్క గుణం లేనందున వేనుడి జన్మవ్యర్ధం అయ్యింది. కుంతీదేవి చెల్లెలి బిడ్డలైన, శిశుపాల దంతవక్త్రులు పూర్వజన్మలో విష్ణుమందిర ద్వారపాలకులు. విప్ర శాపం వలన పదభ్రష్టులై భూమిమీద పుట్టారు. అని నారదుడు చెప్పగా.. అప్పుడు నారదుడు వారి పూర్వగాధను ఈ విధంగా వివరించాడు.



ఒకనాడు బ్రహ్మమానసపుత్రులైన సనక సనందనాదులు ముల్లోకాల్లోను సంచరిస్తూ మాధవుని దర్శించాలనే కుతూహంతో ఐదారేళ్ళ పిల్లల్లా దిగంబరంగా వారి మందిరంలోకి ప్రవేశిస్తుంటే ద్వారపాలకులైన 'జయ, విజయులు' వారిని అడ్డుకొన్నారు. లోపలికి పోవుటకు అనుమతిలేదని కసురుకొన్నారు. ఆ మునులు ఆగ్రహంతో.. మమ్మల్ని అటకాయిస్తారా, మూర్ఖులారా! మదమెక్కిందా ఇంత కండకావరమా అని ద్వారపాలకులను నిందించి అసురజాతిలో పుట్టండని వారికి ఆ బాలకులు శాపమిచ్చారు. ద్వారపాలకులు వారెవరో గ్రహించి మునులారా! మా అజ్ఞానాన్ని మన్నించండి. మీరెవరో ఎరుగక పొరపాటు చేశాం. క్షమించండి. దయజూపమని బ్రతిమాలగా, ఆ మునులు కరుణించి మూడు జన్మలెత్తి మురారితో వైరం పెట్టుకొని ముక్తి పొందుతారని శాప విమోచనం చెప్పి వెళ్ళిపోయారు.   

జయ విజయులు మొదటి జన్మలో దితిగర్భాన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులై పుట్టారు. చిన్నవాడైన హిరణ్యాక్షుడిని శ్రీహరి వరాహరూపంలో అవతరించి సంహరించాడు. పెద్దవాడైన హిరణ్యకశిపుడిని నరసింహావతారములో వచ్చి సంహరించాడు. రెండవ జన్మలో కైకసి అనే రాక్షసికి రావణ కుంభకర్ణులై జన్మించగా వారిద్దరినీ శ్రీరామచంద్రుడుగా అవతారం దాల్చి వధించాడు. మూడవ జన్మలో శిశుపాల దంతవక్త్రులయ్యారు. కృష్ణుని చేతిలో మరణించి ఆయనలోనే ఐక్యమయ్యారు. 

అయితే హిరణ్యకశిపుడు తన కొడుకైన ప్రహ్లాదుడు ఎప్పుడూ హరినామస్మరణే చేస్తున్నాడని సంతోషించక ఎందుకు శిక్షించాడని ధర్మరాజు మరో ప్రశ్న వేయగా నారదుడిలా తెలిపాడు. తమ్ముడైన హిరణ్యాక్షుడిని హరి అంతం చేశాడని విని హిరణ్యకశిపుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. సభలో శూలం పుచ్చుకొని నిలబడి దైత్యుల్ని, దానవుల్ని ఉద్దేశించి చూశారా ఈ ఘోరం, నాకు తమ్ముడు మీకు ఆప్తమిత్రుడు అయిన హిరణ్యుని ఆ హరి అతి దారుణంగా చంపాడు. అతడిని ఇక వదిలేది లేదు.  నా తమ్ముని సం హరించిన వాని రక్తముతో నా తమ్మునికి తర్పణము ఇస్తేకాని నాకు మనోవేదన చల్లారదు. కపట స్వభావుడైన హరి నశించిన తరువాత ఇతర దేవతలందరు నశించుతారు. కాబట్టి దానవులారా!   యజ్ఞము, వేదము అతడే.  సర్వవైదిక కర్మలకు, దేవతాముని సమూహాలకు, సర్వధర్మాలకు అతడే మూలము.(అంతర్యామి గురించి, ఆయన పరాక్రమము గురించి అన్నీ తెలిసినా ఆ దానవుడు పగ విరోధముతో అహంకారమునకు లోనై తానే హరిపై ద్వేషముతో 'మాయ 'కు లోనై హరిపై నిరసన ద్వజం ప్రారంభించాడు.) .ఎక్కడ బ్రాహ్మణులు, దేవతలు సుఖంగా ఉంటారో ఎక్కడ ధర్మాలు, నియమాలు సక్రమంగా నడుస్తుంటాయో అక్కడ ఆ విష్ణువు నివాసముంటాడు. మీరు వాటినన్నింటినీ ధ్వంసం చెయ్యండి అప్పుడు వారు నివసించడానికి దగిన చోటు లేక నశిస్తారు. అని ఆజ్ఞాపించాడు. రాక్షసమూకలు భూమిపైబడి విచ్చలవిడిగా తిరుగుతూ పుణ్యక్షేత్రాలను, పుణ్యాశ్రమాలను, బ్రాహ్మణులను, గోవులను, భగవద్భక్తులను, వేద  సాంప్రదాయాన్ని నాశనం చేశారు. భూగోళమంతా కోలాహలంగా తయారైంది. ఈ భయానక దృశ్యాలను చూచి, దేవతలు స్వర్గమును వీడి అడవుల పాలైనారు. 

చక్షువుల ధరిత్రి చలితయై కానంగ బడినభంగి వికలభావరహితు
దాత్మమయుండు కంపితాంతరంగంబున గదలినట్ల తోచున్ గదలడతడు

ఈ ఈశ్వరుడు సర్వజ్ఞుడు. జీవరాసులకు ఆత్మయై వెలయువాడు. ఆత్మరూపమున ఎల్లప్పుడు తన మాయచే త్రిగుణములను కల్పించి ఆ గుణముల సంపర్కముచే పాంచభౌతిక శరీరము దాల్చి లీలానాటకములాడుచుండును. చలించుచున్న జలములో కదలని వృక్షములు కదలుచు కంపించునట్లు, తిరుగుతున్న కళ్ళకు భూమి గిర్రున తిరుగుతున్నట్లు, నిశ్చలుడైన పరమేశ్వరుడాత్మమయుడై కంపించుచున్న అంతరంగములో నుండుటచేత, తానుకూడా కదులుచున్నట్లు భ్రమ కలిగించునుగాని ఆతనికి కదలికయే లేదు. అని హిరణ్యకశిపుడు తన తల్లికి తత్త్వమును బోధిస్తున్నాడు. 

 హిరణ్యకశ్యపుడు సోదరుని మరణానికి శోకించాడు. ఉదకప్రదానం మొదలైన శ్రాద్ధకర్మలు,   తిలోదక దానాలు కావించినాడు.  హిరణ్యాక్షుని బిడ్డలైన శకుని, శంబర, కాలనాభ, మదోత్కచ ప్రముఖులను ఊరడించాడు. హిరణ్యాక్షుని భార్యలను పిలిచి పరామర్శించాడు. దు:ఖిస్తున్న తల్లి దితిని ఊరడిస్తూ ఇలా అన్నాడు. బాటసారుల్లా వస్తారు, కలుస్తారు, విడిపోతారు. ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఇది సత్యం. నీ కొడుకు శూరులు పోయే త్రోవలో పోయి  వీరగతి  చెందాడు.  అతని కోసం శోకించడం ఎందుకు?    కర్మ వలన
సంయోగ వియోగాలు సంభవిస్తాయి. ఈశ్వరుని లీల అది. ఇది అర్ధం కావడానికి సుయజ్ఞోపాఖ్యానం అనే కధను చెబుతాను వినండి అని హిరణ్యకశ్యపుడు ఇలా వారికి వివరిస్తున్నాడు.  

ఉశీనర దేశంలో సుయజ్ఞుడనే రాజున్నాడు. అతడిని యుద్ధంలో శత్రువులు వధించారు. ఆతని మరణవార్త విని అతని శవం చుట్టూ చేరి భార్యలు, పిల్లలు భోరు భోరున విలపిస్తున్నారు. మాకు ఈ పిల్లలకు దిక్కెవ్వరంటూ భార్యలు, నీవు లేకుండా మేముండలేము మేము కూడా అగ్నిలో దూకు నీతో సహగమనం చేస్తాం అని ఆర్తనాదాలు చేస్తున్నారు. సూర్యాస్తమయం కావస్తోంది. వాళ్ళ ఏడుపులు ఆగలేదు. అప్పుడు అంతా గమనిస్తున్న యముడు బాలకుని రూపం ధరించి అచటికి వచ్చి అక్కడ మూగిన బంధుజనాన్ని చూచి ఇలా అన్నాడు.పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. నిత్యం ఎంతోమంది మరణిస్తుండడం చూస్తూ కూడా తమకు మరణం లేదన్నట్లు మరణించిన వారికై తల్లడిల్లుతారు. మరణం ఎవరూ తప్పించుకోలేరు. జనన మరణాలు ప్రాణులందరికీ సహజం. 'ప్రాణుల పుట్టుక, రక్షణ, మరణం పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటాయి '. దైవం అనుకూలిస్తే వీధిలో పారేసుకొన్న ధనం చేతికొస్తుంది. అదే ప్రతికూలిస్తే భద్రంగా ఇంటిలో దాచుకొన్న ధనం కూడా రెక్కలొచ్చినట్లు ఎగిరి పోతుంది.అలాగే అడవిలో వదలివేయబడ్డ బాలుడు కూడా ఆయువు ఉంటే వర్ధిల్లుతాడు. లేకుంటే రక్షణ వలయంలో ఉన్నవాడు కూడా 'హరీ' అంటాడు. ఉండడం, పోవడం అనేది కాలాన్ని బట్టి, కర్మను బట్టి జరుగుతుంటుంది. పంచభూతాలతో నిర్మితమైన భవనం ఈ దేహం. జీవుడు పూర్వకర్మ వలన అందులో కొంతకాలముండి వెళ్ళిపోతాడు. దేహం చెడుతుంది కానీ జీవుడు చెడడు. దేహి వేరు, దేహం వేరు అని తెలుసుకోవాలి. రాజు దేహం చూస్తూ వెర్రివాళ్ళలా ఏడుస్తున్నారు. ఆ దేహంలో వినేవాడు, మాట్లాడేవాడు అక్కడ ఇప్పుడు లేడు. ఎప్పుడో వెళ్ళిపోయాడు. ప్రాణరూపంలో ఉండే గాలి మాట్లాడలేదు. వినలేదు. అందువలన ఏడ్వడం వలన ఏ ప్రయోజనము సిద్ధించదు. తల్లిదండ్రులు, బిడ్డలు, భార్యలు, బంధువులు, మిత్రులు, ఇళ్ళువాకిళ్ళు, సిరిసంపదలు కర్మానుబంధం వలన కలలో కంపించినట్లు కనిపించి కర్మ తీరినాక కనుమరుగైపోతాయి. తత్త్వం తెలిసిన వారు ఉన్నవని సంతోషించరు, పోయినవని విచారించరు. సుఖ దు:ఖాలు అజ్ఞానం నుంచి పుడుతున్నాయి. అని ఒక కధను వివరించాడు యమ బాలకుడు... 

పూర్వం ఒక అడవిలో ఒక ఎరుకు ఉండేవాడు. ఒకనాడు ప్రొద్దునే లేచి వేటకు బయలుదేరాడు.విల్లంబులు, వలలు, ఉరులు, కండెలు, చిక్కం మొదలైన సామాగ్రితో పిట్టలను కొట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. పిట్టలను పట్టి వాటి రెక్కలు విరిచి చిక్కంలో వేసుకొంటూ తిరిగాడు. ఒకచోట వాడికి కుళింగ పక్షుల జంట కనిపించింది. అందులో ఆడపిట్టను ఉరిలో వేసి పట్టుకొని చిక్కంలో వేశాడు. అప్పుడు చెట్టుమీద ఉన్న మగపిట్ట అయ్యో అడవిలో మేతమేసి, ఎవరికీ అపకారం చేయక తిరిగే మనకు బ్రహ్మలిఖితం వలన ఈ కిరాతుని పాలుకావలసి వచ్చింది అని వాపోయింది. ఇద్దరం వలలో పడితే బాగుండేది.రెక్కలురాని పిల్లలను నేనొక్కడినే ఎలా పోషించేది? తల్లికోసం దిక్కులు చూసే ఈ పిల్లలకు ఎమి చెప్పి సముదాయించాలి? ఈ బాధ నేను ఎలా భరించేది? అని విచారిస్తున్న మగపిట్టను కూడా ఆ కిరతకుడు బాణం వేసి కొట్టగా నేలమీద పడింది. కాలం సమీపిస్తే ఎవరైనా అలా కూలిపోవలసినదే. ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు. పోయినవారి కోసం శోకించుట వ్యర్ధం. మీ మీ శోకానికి వారు తిరిగి రారు కదా! అని యమ బాలకుడు చెప్పగా  శవం వద్ద ఉన్నవారంతా విస్మయం చెందారు. ప్రపంచంలో ఏదీ నిత్యం కాదని గ్రహించి శోకం మాని సుయజ్ఞునికి అంత్యక్రియలు పూర్తిచేసి ఇళ్ళకు వెళ్ళారు.అని ఈతత్త్వబోధను తల్లికి,తమ్ముని భార్యలకు, చెప్పి వారిని ఊరడించాడు హిరణ్యకశిపుడు. వారు కూడా శోకమును ఆపుకొని, తత్త్వదృష్టితో జనన మరణాలు పరమేశ్వరుడి ఆధీనములో ఉన్నాయని గ్రహించినవారై ఎవరి దారిన వారు నిష్క్రమించారు.  

ఇంతటి తత్వోపదేశమును తెలియజేసి వారి దు:ఖమును  ఉపశమింపజేసిన హిరణ్యకశిపుడు మాయ చే కప్పబడిన మనస్సుతో తాను మృత్యువును జయించాలి.ముల్లోకాలుఏలాలి, శత్రువులంతా నశించాలి, సింహబలంతో సదా తాను వర్ధిల్లాలి.. అని మందర పర్వాతానికి పోయి ఘోరతపస్సునొనరించాడు. ఆతని ఉగ్ర తపానికి భూమి అదిరింది, సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. దేవతలు స్వర్గాన్ని విడిచి బ్రహ్మలోకానికి పోయి బ్రహ్మను ప్రార్ధించారు. బ్రహ్మదిగి వచ్చి  ఆతని తస్సుకు మెచ్చి వరమిచ్చుట.. ఆ వరంతో అతను తనకు మృత్యువు లేదని దేవతలను, గంధర్వులను, అందరినీ హింసించుతూ  మద గర్వంతో  రాజ్యం చేశాడు. హిరణ్యకశ్యపుడి కుమారుడు ప్రహ్లాదుడు.. ప్రహ్లాదోపాఖ్యానము అందరికీ సుపరిచితమే... 



ప్రహ్లాదుడు నరసింహ భగవానుని చేత అతని తండ్రిని  సంహరింప చేసి తన తండ్రికి గొప్ప సేవ చేసెను. శాస్త్రములలో ఎవరైన రాక్షసుడైనను భగవంతుని చేత సంహరించ బడినచో అతడు వెంటనే ముక్తిని పొందునని తెలుపబడినది. ప్రహ్లాదుడు ఇలా ఆలోచించెను: "నా తండ్రి ఎన్నో పాపకార్యములను ఒనరించెను. మరియు భగవంతుని వ్యతిరేకించెను కాబట్టి అతడు ముక్తిని పొందజాలడు" అని భావించెను. నరసింహ భగవానుడు హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ప్రహ్లాదుడు ఇలా పలికెను: "శ్రీహరీ! నా తండ్రి గొప్ప నాస్తికుడు. అతడు మీ పాదపద్మముల వద్ద అనేక అపరాధములను చేసెను. అతడిని నీవు సంహరించితివి. అతడిని క్షమించి ముక్తిని ప్రసాదించుమని నేను మిమ్ములను ప్రాధేయపడుతున్నాను." నిజానికి హిరణ్యకశిపుడు వెంటనే ముక్తిని పొందాడు. కాని అతని ప్రియ పుత్రుడు తన తండ్రి ముక్తిని పొందగలిగెనా లేదా అని జిజ్ఞాసతో తెలుసుకోవాలనుకున్నాడు. విష్ణు భగవానుడిచేత సంహరింపబడి ఆ అసురుడు తన జన్మను ధన్యం చేసుకొన్నాడు. ముక్తిని పొందాడు. 

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు