Monday, February 20, 2017 6 comments By: visalakshi

కాణిపాకం వరసిద్ధి వినాయకుడు

ఓం శ్రీ గణపతయే నమ:


కాణిపాకం గ్రామము చిత్తూరునకు అనతి దూరమున కలదు. ఆ గ్రామమునందు శ్రీవరదరాజస్వామి వారి ఆలయము, శ్రీ మణికంఠేశ్వరస్వామి వారి ఆలయము శ్రీ వరసిద్ధి వినాయకుల వారి ఆలయములు కలవు. 

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును రచించిన  శ్రీ శంకరభట్టుగారు వారి అనుభవాలను చెపుతూ కాణిపాకం వినాయకుని వృత్తాంతం తెలియజేశారు.

 శంకరభట్టు వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకొని బైటకు రాగా ఒక ఎత్తైన కుక్క అక్కడ నిలబడి యుండెను. ఆయనకు భయము వేసి మరల వినాయకుని ఆలయంలోనికి వెళ్ళెను. కొంతసేపు దైవధ్యానము చేసుకొని బయటకు రాగా ఈసారి అంతే పరిమాణము గల మరియొక కుక్క ఉండెను. ఈ రోజున యీ కాలభైరవుల చేత కరవబడుట ఖాయమని భయము వేసి మరల తిరిగి వరసిద్ధి వినాయకుని ఆలయములోనికి వచ్చినాడు. ఆలయ పూజారికి ఆతని ప్రవర్తన వింతగా తోచి, "అయ్యా" మీరు మాటిమాటికీ బయటకు పోవుచూ, లోపలికి వచ్చుచున్నారు. కారణమేమిటి? అని అడిగెను. శంకరభట్టు తన భయమును గూర్చి చెప్పగా..ఆ పూజారి "అవి నిష్కారణముగా ఎవ్వరినీ ఏమీ చేయవు. అవి తిరుమలదాసు అనే రజకుని వద్ద నుండు కుక్కలు. ఆతను దత్తభక్తుడు. శ్రీపాద శ్రీవల్లభ నామదేయమున శ్రీ దత్తులవారు భూమిమీద అవతరించిరని ఆ రజకుడు చెప్పును. అతడు ఆలయమునకు రాడు. తన నాలుగు కుక్కలను పంపును. నేను స్వామి ప్రసాదమును మూటకట్టి వాటికి ఇచ్చెదను. మిగతా రెండు కుక్కలు వచ్చినవేమో చూచెదము అనెను. వారిరువురు బయటకు వచ్చుసరికి నాలుగు కుక్కలుండెను. పూజారి ప్రసాదము మూటకట్టి వాటికిచ్చెను. ఆ నాలుగు కుక్కలు శంకరభట్టు నాలుగు వైపులా చుట్టుముట్టినవి. పూజారి "ఆ కుక్కల అభీష్టము మేరకు నీవు ఆ రజకుని యొద్దకు పోవుము. నీకు శుభమగును." అని పలికెను. శంకరభట్టు ఇలా తలంచుచున్నాడు...  

"నా జీవితమునందలి సంఘటనలు శ్రీవల్లభుల నిర్దేశములో జరుగుచున్నవని తెలుసుకొంటిని. ఇంతకు మునుపు జరిగిన సంఘటనము లననుసరించి కులమత బేదములు పెద్దగా పట్టించుకొనవసినది లేదని నాకు తోచినది. మరుజన్మమున చండాలుడు బ్రాహ్మణుడుగా జన్మింపవచ్చును. బ్రాహ్మణుడు చండాలుడుగా పుట్టవచ్చును. జీవి తను చేసుకొనిన పాపపుణ్యములను మూటకట్టుకొని జన్మజన్మాంతరములవరకు కర్మప్రవాహమున  పడిపోవుచుండునని  తెలుసుకొంటిని. "

పూజారి ఆదేశానుసారము శంకరభట్టు రజకుడు నివసించు చోటుకు వెళ్ళాడు. తిరుమలదాసు అను ఆ రజకుడు 70 సం"ల వయస్సు కలిగిన వృద్ధుడు.అతడు తన గుడిశెనుండి బయటకు వచ్చి శంకరభట్టును ఆదరముగా మంచముపై కూర్చుండబెట్టెను. శంకరభట్టులో బ్రాహ్మణ అహంకారము చాలాభాగము నశించెను. శ్రీపాద శ్రీవల్లభుల భక్తులు ఎవరైనను ఆయనకు చాలా ఆత్మీయులుగా కనిపించసాగిరి. వరసిద్ధి వినాయకుని ప్రసాదమును తిరుమలదాసు ఇవ్వగా ఆ ప్రసాదమును స్వీకరించాడు శంకరభట్టు. తిరుమలదాసు ఇట్లు చెప్పుచుండెను....

 'అయ్యా! ఈ రోజు ఎంతయో సుకృతము! నాకు మీ దర్శనభాగ్యము కలిగినది. మీరు నా వద్దకు ఎప్పుడు వచ్చెదరా? మాల్యాద్రిపుర విశేషాలను, పీఠికాపుర విశేషాలను ఎప్పుడు మీకు తెలియజేయుదునాయని తహతహలాడుచుంటిని. నాయనా! శంకరభట్టు! వరసిద్ధి వినాయకుని ప్రసాదము గైకొనినావు. నీవు ఈరోజుననే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమునకు శ్రీకారము చుట్టుము. కురువపురమునందు నీకు శ్రీవల్లభుల వారి ఆశీర్వాదము లభించును. నేను పూర్వజన్మమున గొప్ప వేదపండితుడను. పరమలోభిని. నా అవసాన సమయమున అప్పుడే జన్మించిన గోవత్సము పాత గుడ్డపీలికను నములుట గమనించి దానిని జాగ్రత్తపెట్టుకోవలసినదని నా కుమారులకు సూచించితిని. అవసానకాలమున మలిన వస్త్రముపై దృష్టి సారించి ప్రాణము విడుచుటచేత నేను రజక జన్మమునొందితిని. "జన్మావసానమున ఏ సంకల్పములతో ప్రాణము విడువబడునో తదనుగుణమైన మరు జన్మము లభించును".

 నా పూర్వపుణ్య వశమున గర్తపురీ(గుంటూరు)మండలాంతర్గతమగు పల్లెనాడు ప్రాంతమున మాల్యాద్రిపురము నందు జన్మించితిని. ఆ మాల్యాద్రిపురమే కాలక్రమమున మల్లాది అను గ్రామమాయెను. ఆ గ్రామమునందు మల్లాది అను గృహనామము గల రెండు కుటుంబములుండెను. ఒకరు మల్లాది బాపన్నావధానులు అను పేరు గల మహాపండితులు. వారు హరితస గోత్ర సంభవులు. రెండవ వారు శ్రీధర అవధానులు అను పేరు గల మహాపండితులు. వారు కౌశికస గోత్ర సంభవులు. శ్రీధర అవధానుల వారి సోదరి అయిన రాజమాంబను బాపన్నావధానులు గార్కి ఇచ్చి వివాహము చేసిరి. గోదావరీ మండలాంతర్గతమైన "అయినవిల్లి" అను గ్రామములో జరిగిన స్వర్ణగణపతి మహాయజ్ఞమునకు మహాపండితులైన బావ బావమరుదులిద్దరూ వేంచేసిరి. శాస్త్రము ప్రకారము ఆఖరి హోమమును గణపతి తన తొండముతో అందుకొనవలెననియూ, స్వర్ణమయకాంతులతో  గణపతి దర్శనమీయవలెననియూ, కొందరు పండితులువాదము చేసిరి. మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న బావ బావమరుదులిద్దరూ తాము మహాగణపతిని ప్రత్యక్షపరచ గలమనియూ వేదోక్తముగా సమస్తమునూ జరిపించగలమనియు ప్రతిజ్ఞ చేసిరి. "యజ్ఞాంతమున స్వర్ణమయకాంతులతో గణపతి దర్శనమిచ్చి ఆఖరి ఆహుతిని తన తొండముతో స్వీకరించి, అనతికాలములోనే వారు గణేశచతుర్ధినాడు సర్వకళలతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించెదనని ఆనతిచ్చిరి. " యజ్ఞమునకు హాజరయిన వారందరునూ ఆశ్చర్యచకితులైరి. ఆ సభలో ముగ్గురు నాస్తికులుండిరి. వారు కనుపించునదంతయును ఇంద్రజాలమో, మహేంద్రజాలమో గాని గణపతి మాత్రము కాదు. నిజమైన మరియొక పర్యాయము నిదర్శనమీయవలయును, అని వాదించిరి. 

అప్పుడు హోమగుండము నందలి విభూతి మానవాకారము ధరించినది. తదుపరి అది మహాగణపతిగా రూపొందినది. ఆ మహాగణపతి రూపము "మూర్ఖులారా! త్రిపురాసురుని వధించు సమయమునందు శివుడునూ, బలిచక్రవర్తిని నిగ్రహించుటకు పూర్వము విష్ణుమూర్తియునూ, శివుని యొక్క ఆత్మలింగమును కొనిపోవుచున్న రావణుని నిరోధించుటకు విష్ణుమూర్తియునూ, మహిషాసురుని వధించు సమయమున పార్వతీదేవియునూ, భూభారమును వహించుటకు ముందు ఆదిశేషువునూ, సమస్త సిద్ధులూ సిద్ధించుటకు సిద్ధమునులునూ, ప్రపంచమును జయించు నిమిత్తము మన్మధుడునూ, ఇదే విధముగా సమస్త దేవతలునూ, నన్ను ఆరాధించియే అభీష్టములను పొందిరి. సమస్త శక్తులకు నిలయుడను నేనే. నేను సర్వశక్తిమంతుడను. అన్ని విఘ్నములకు కర్తను నేనే. అన్ని విఘ్నములను హరించువాడను కూడా నేనే. దత్తాత్రేయుడనగా ఎవరనుకొంటిరి? హరిహర పుత్రుడైన ధర్మశాస్త్రయే. విష్ణురూపంలో బ్రహ్మరుద్రులు విలీనమయిన అది దత్తరూపము. దత్తుడెల్లప్పుడునూ త్రిమూర్త్యాత్మకుడు. " శ్రీపాద శ్రీవల్లభ రూపము నందు మహాగణపతి యున్నాడనుటకు నిదర్శనముగా శ్రీపాద శ్రీవల్లభులు గణేశచతుర్ధి  నాడు అవతరించిరి."  సుబ్రహ్మణ్యతత్వము వలన వారిది కేవలము జ్ఞానావతారము. ధర్మశాస్త్రతత్వము వలన వారిది సమస్త ధర్మకర్మలకు ఆదియునూ, మూలమునూ అని గమనించగలరు. రాబోవు వారి అవతారము  మాతాపితల  సంయోగ   ఫలితము కాదు. జ్యోతి స్వరూపము మానవాకృతి చెందును.

 ఇదే మీకు శాపమిచ్చుచున్నాను. సత్యస్వరూపమును కంటితో చూచియూ అసత్యము పలికినందులకు మీలో ఒకడు గ్రుడ్డివాడుగా పుట్టును. వాక్కులతో ప్రస్తుతింపక అవహేళన చేసిన కారణమున మీలో ఒకడు మూగవాడుగా పుట్టును. ఇంతమంది సత్యసంధులులయిన భక్తులు సత్యమును గురించి చెప్పుచున్ననూ పెడచెవిన పెట్టిన కారణమున మీలో ఒకడు చెవిటివాడుగా పుట్టును. మీ ముగ్గురును అన్నదమ్ములుగా జన్మించి నా స్వయంభూ మూర్తిని దర్శించిన తదుపరి మీరు దోషరహితులగుదురు. అని పలికెను.





నాయనా! వారు ముగ్గురూ ఈ కాణికాపురమున సోదరులుగా జన్మించిరి. వీరు ముగ్గురూ ఒక "కాణి" భూమిని ఈ గ్రామమునందే సాగుచేసుకొనుచుండిరి. ఆ పొలములో ఒక దిగుడుబావి కలదు. దీనినుండి ఏతము సహాయమున నీరు పెట్టుకొనెడివారు. ఒకానొక సంవత్సరమున అనావృష్టి కలిగినది. భూమిలోని నీరు అడుగంటినది.ఒకరోజున నీరంతయు ఖర్చుకాగా, పారతో ఇసుకను తోడు ప్రయత్నములోనుండిరి. ఆ నీటి అడుగునున్న రాతికి పార తగిలి రక్తము పైకి చిమ్మినది. ఆ రక్తము చేతికి తగులగానే వారిలోనున్న మూగవానికి మాట వచ్చెను. నీరు యధావిధిగా బావిలో నిండుచుండెను. నీటి స్పర్శవలన చెవిటివానికి వాని దోషము హరించినది. మూడవవాడైన గ్రుడ్డివాడు ఆ నీటిలోని రాతిని స్పృశించుటచే అతని గ్రుడ్డితనము పోయునది. ఆ రాయి స్వయంభూవినాయకుని మూర్తి. ఆ రాతి విగ్రహము తలమీద పార తగిలి పెచ్చు విరిగుటచే  అక్కడ నుండి రక్తము స్రవించింది.

 ఆ వరసిద్ధి వినాయకుని ప్రతిష్ఠచేయుటకు సత్యఋషీశ్వరులైన బాపన్నావధానులును, వారి బావమరిది అయిన శ్రీధరావధానులును ఈ గ్రామమునకు విచ్చేసిరి. వరసిద్ధి వినాయకుడు వారితో " మహాభూమినుండి ఈ లోకములోనికి వచ్చినాను. ఫృధ్వితత్వములో అవతరించితిని. ఈ తత్వము కాలక్రమమున అనేక మార్పులను చెందును. జలతత్వములోను, అగ్నితత్వములోను, వాయుతత్వములోను, ఆకాశతత్వములోను నా అవతరణ ఇదివరకే జరిగినది. అయినవిల్లిలో మీరొనరించిన మహాయజ్ఞములోని ఆ హోమభస్మమే ఈ రూపమును ధరించినది. తదుపరి కర్తవ్యమును ఆదేశించుచున్నాను. శ్రీశైలమునందు కళలు తక్కువగా ఉన్నవి. సూర్యమండలాంతర్గతమైన తేజస్సును మీరు అచ్చట శక్తిపాతము చేయవలెను. మీరు శ్రీశైలములో శక్తిపాతము చేసిన రోజుననే గోకర్ణమునందును, కాశీయందును, బదరీయందును, కేదారమునందును కూడ ఏకకాలములో నా అనుగ్రహ విశేషమున శక్తిపాతము జరుగును. శ్రీపాద శ్రీవల్లభుల అవతరణమునకు సమయము ఆసన్నమగుచున్నది. శ్రీధరా! మీ ఇంటిపేరును శ్రీపాద నామముగా మార్చుచున్నాను. కౌశికస గోత్రీకులయిన మీ వంశస్థులు ఇకనుండి శ్రీపాద గృహనామమున వర్ధిల్లెదరుగాక!"అనెను....





తిరుమలదాసు  శంకరభట్టుతో"నాయనా! శంకరా! మాల్యాద్రిపురము నుండి బాపన్నావధానులును, శ్రీధరావధానులును పీఠికాపురమునందు నివసించుటకు వలసపోయిరి. నేను శ్రీపాదశ్రీవల్లభుల బాల్యలీలలను ఎన్నింటినో చూచితిని. రేపు అవన్నియు వివరించగలను. నేను శ్రీపాదుల ఆజ్ఞవలన కాణిపురములోనే ఉండిపోయి నా రెండ  భార్యతోనూ, నా సంతానముతోనూ కులవృత్తి ననుసరించి జీవించుచున్నాను. నీవు శ్రీ పీఠికాపురమున(పిఠాపురం) ఎందరో మహానుభవులను కలిసికొందువు. నీవు రచించు శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను శ్రీచరణులు ఆశీర్వదించెదరు. అని తెలిపెను.  

(ఆ పుణ్యఫలము అణువంత నాకు లభించి ఉంటుంది. అందుకే ఆ ఇంటిపేరు గల 'శ్రీపాదపేరిశాస్త్రి' గారి ప్రధమ పుత్రికనయ్యాను. కానీ     ఇసుమంత కూడా ఆపాటి జ్ఞానము లభించలేదు..సాధనలోన....అన్నట్లుగా..కొద్దిపాటి ఆధ్యాత్మిక   బాటలో ఉన్నాను. ) 


 శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 

















Monday, February 6, 2017 0 comments By: visalakshi

ఆధ్యాత్మిక గురువులు - మహర్షులు

 ఓం శ్రీ గురుభ్యో నమ:




 శ్లో" ప్రకృతిం స్వా మవష్టభ్య విసృజామి పున: పున:
     భూతగ్రామ మిమం కృత్స్న మవశం ప్రకృతే ర్వశాత్   (భగవద్గీత 9అ-8 శ్లో)


 ఈ సమస్త జగత్ విధానమును నా ఆధీనమున ఉన్నది. నా సంకల్పము ననుసరించి ఆ ప్రయత్నముగా అది మరల మరల వ్యక్తమగుచు నా సంకల్పము ననుసరించియే అది చివరకు లయము పొందుచున్నది. 

 ఓ వ్యక్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సాధనతో భగవదనుగ్రహంతో ఆధ్యాత్మికంగా పరిణితిని పొంది, తను పొందిన పరిణితిని నలుగురులోకి తీసుకురావాలన్న తపనతో ...నాకు సాయిబాబా కృప వలన ఆత్మసాక్షాత్కార అనుభూతి కలిగింది. నేను ఇంతటి వాడినయ్యాను. అని చెప్పినా ఆ వ్యక్తిని కొంతకాలం పిచ్చివాడిలా చూసి ఊరుకున్నారు. కానీ నిజమైన సాయి భక్తులు కొందరు ఆయనను గుర్తించి వారికి శిష్యులై ఆయనను స్వామీజీని చేశారు. ఆ క్రమములో ఆయన జ్ఞాన సంపద రూపంలో బాబా ఆశీర్వాదంతో వారి శైలిలో పుస్తకాలను ప్రచురించి భక్తులకందించారు. క్రమేణా వారి ప్రసంగాలు జనాలని ఆకట్టుకొని భక్తజన సందోహం ఆయనను కొనియాడింది. వారికి శిష్యులూ పెరిగారు. యజ్ఞాలు, యాగాలు ఊరూరా మొదలుపెట్టారు. అన్ని ఊళ్ళలో ఆయన ప్రసంగాలకు, వారి గానానికి జనం హర్షం వ్యక్తం చేశారు. ఇంతవరకు చాలాబాగా జరుగుతున్నది. ఆ స్వామీజీ ఇంకో మెట్టు ఎక్కి జనాలకు 'శక్తిపాతం' చేస్తారని ప్రచారం...వారు దానికి ఇంత అని ఖరీదు పెట్టడము జరిగింది. జనాలు 'శక్తిపాతం' అంటే తెలుసుకోవాలన్న ఆశక్తితో మరింత శ్రద్ధగా వెళ్ళారు..వెళుతున్నారు. వారి అనుభవాలు చెపుతున్నారు. కొంతమంది మాకు భగవంతుడు కనిపించాడు. ప్రశాంతంగా ఉంది. గాలిలో తేలుతున్న అనుభుతి ఉంది.. అంటారు. కొంతమంది ఏమో మాకేమీ తెలియదు అంటారు.అవి వారి వారి అనుభవాలు. అన్నిటినీ గౌరవించాలి.   ఓ వ్యక్తిని ఒక్కసారిగా స్వామీజీని చేసి, మహర్షిగా బిరుదిచ్చి ఆయనకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఆ రాజ మర్యాదలకు ఆయన ఒకింత మైమరచి ఒక ఇంటర్వ్యూలో సాటి ఆధ్యాత్మిక గురువులను విమర్శనాత్మకంగా, కఠువుగా మాట్లాడడము, తారాస్థాయిలో రాముడిని, కృష్ణుడిని విమర్శించడము చేశారు.   

 సాయి భగవానుడు అందరిలో నన్ను చూడండి అని చెప్పారు. రాముడిగా కృష్ణుడుగా దర్శనమిచ్చారు. అలాంటప్పుడు రూపాన్ని విమర్శలలో గుప్పించి ఆ ఎదుటి స్వాములను అవహేళన చేయరాదు. వారు మూర్ఖంగా మాట్లాడితే సంయమనం పాటించాల్సిన స్వామీజీ మరింత మూర్ఖంగా మాట్లాడడం బాధాకరం. మహర్షిగా పేరుగాంచిన ఈ స్వామీజీని  ఓ చానెల్ వా రు మర్యాద లేకుండా తీవ్రపదజాలంతో వారిని విమర్శించడం, తూలనాడడం జనాలలో వారిని అభ్యంతరకరంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం. 'శక్తిపాతం ఇలా చేశారు..వారు జనాలను మోసం చేస్తున్నారు ' అని కొందరు భక్తులు వాపోవడం వలన ఆయన గుట్టు రట్టు చేయడానికి సంకల్పించామని చెపుతున్నారు. జనులు, భక్తులు అంత పిచ్చివారు కారు కదా! ఆయనలో ఏదో ప్రత్యేకించి భగవంతుడు అనుగ్రహించిన దివ్య అనుభవాలు చూసే కదా! వారిని స్వామీజీని, మహర్షిని చేసింది. పేరు ప్రఖ్యాతలతో పాటు అసూయాద్వేషాలు. అందువల్ల మనమే మనవారిని ప్రతి విషయానికి, ప్రతి వ్యాఖ్యకి తప్పుపట్టి అందరిలోనూ అవమానిస్తాము. ప్రతి హిందూ ధర్మాన్ని మనమే పరమార్ధాన్ని గ్రహింపక వేలెత్తి చూపుతుంటే అవకాశం ఇతరులకు మనమిచ్చి ఆహ్వానిస్తున్నాం. బాహాటంగా హిందూ ధర్మాలకు వర్గ చిచ్చు పెట్టి, ఇతర మార్గాలను ప్రవేశపెట్టే ద్వారాన్ని తెరిచి స్వాగతిస్తున్నాం. ఒకే కుటుంబంలో వేరు వేరు స్వభావాలుగలవారు ఉన్నట్లే సమాజంలో కూడా మేధావివర్గం, పాలకవర్గం, ఆర్ధికసుస్థిరత చేకూర్చేవర్గం, శారీరకశక్తిని ఉపయోగించే శ్రామికవర్గం ఉన్నారు. కాబట్టి ఎవరికి ఇవ్వవలసిన ప్రాధాన్యతలను వారికిచ్చి వారిని గౌరవించడం మన సామాజిక బాధ్యత. 

ఆధ్యాత్మికపరంగా ఆలోచిస్తే.. పరమాత్ముణ్ణి ఆరాధించినప్పుడు ముందు పాదాలకు నమస్కరిస్తాము. ప్రణమిల్లుతాము. పుష్పాలను ఆయన పాదాలవద్ద సమర్పిస్తాము. ఆ పరమాత్మ రూపం నుండి సృష్టించబడిన మనుషులం మన మధ్య వివక్షతలు...ఒకరినొకరు నిందాపూర్వక సంభాషణలు ఎందుకు? అంతర్యుద్ధాలు, అభిప్రాయభేదాలు ఎందుకు?



 భగవత్ చింతనలో జీవించేవారు, భగవంతుని అనుగ్రహం పొందినవారు, బ్రాహ్మీస్థితిలో ఉండేవారే భగవంతుని దృష్టిలో అగ్రవర్ణానికి చెందినవారు. భగవంతుని అనుగ్రహం పొందడానికి గుణం ప్రధానం అని నిరూపించిన మహోన్నతులకు నిలయం మన భారతావని. మనమంతా బేధభావనలను విడచి భగవంతుని దృష్టిలో అంతా సమానులే అనే భావంతో జీవించడం అలవరచుకోవాలి.  

 ఆధ్యాత్మిక గురువులకు; నిస్వార్ధ స్వామీజీలకు ఉన్నతస్థానం ఇవ్వాలి. వారుకూడా ఆ స్థానానికి గౌరవమిచ్చి వారి జ్ఞానసంపదను ప్రజలకు పంచాలి. ప్రతి చిన్న విషయాన్ని విపరీతార్ధాలకు తావునిచ్చి ఫలానా గౌరవం తగ్గిపోయింది అని మనకు మనమే స్పర్ధలు పెంచుకొని, వారి గౌరవం తగ్గించి వారిని సమాజంలో కించపరచవద్దు. వారే స్థాయిలో ఉన్నారో ఆ స్థాయికి గౌరవం ఇవ్వండి. ప్రతీ వ్యక్తిలోనూ కొన్ని బలహీనతలుంటాయి. అన్నీ శ్రవణానందకరంగా విని..ఒక తప్పునెంచి నిలదీయడం సబబు కాదు. పూజ్యులను గౌరవిద్దాం. శాస్త్రాలను..ధర్మాలను పరిరక్షిద్దాం.   

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు..






Thursday, February 2, 2017 1 comments By: visalakshi

ఆదిత్య తేజం

 ఓం ఆదిత్యాయ నమో నమ:






 ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ!
యద్  భద్రం తన్న ఆసువ!!  (యజుర్వేదము 30 - 3)


 ఈ వేద మంత్రంలో మూడు శబ్దాలున్నాయి. సవిత, దురుతములు, భద్రం. సవితా శబ్దానికి సృష్టికర్త, పరమాత్ముడు, ప్రేరకుడు, సూర్యుడు అనే అర్ధాలున్నాయి. రాత్రి గడచి ఉదయం సూర్య కిరణాలు వస్తువులపై పడగానే ఆ పదార్ధాలు - వస్తువులలో ఒక విధమైన ప్రేరణ జాగృతి కలుగుతుంది. అందుకే సూర్యునికి కూడా సవితా అనే పేరుంది. సూర్యుడు క్రొత్తగా ఏదీ ఉత్పన్నం చేయడు. పదార్ధాలలో సహజంగా దాగి ఉన్న శక్తే సూర్యకిరణాల స్పర్శతో ప్రకటమౌతుంది. వాటికి క్రొత్త జీవనం వస్తుంది.



 వేదమూర్తి ర్మహాభాగో - జ్ఞానదృష్టి ర్విచార్య చ !
 బ్రహ్మణా స్థాపితం పూర్వం - యాతయామవివర్జితం .

యాజ్ఞవల్క్యో మునిశ్రేష్ఠ: - కృతకృత్యో2భవ త్తదా !
ఋగాదిసకలాన్ వేదాన్ - జ్ఞాతవాన్ సూర్యసన్నిధౌ .   - (ఆదిత్య కవచం)


 ఆదిదేవ! నమస్తుభ్యం - ప్రసీద మమ భాస్కర !
 దివాకర! నమస్తుభ్యం - ప్రభాకర  నమోస్తుతే .

" సమస్త జీవకోటికి ఆ దినకరుడు తన అపారశక్తితో ధీర్గాయువును, ఆయురారోగ్యాలనూ ప్రసాదిస్తున్నాడు.  భాస్కరుడిని వేదాలు కొలిచాయి. 'నరుడికైతే ఆదిత్యుడు నడయాడే పరమాత్మ.'  ప్రత్యక్ష దైవం.  భాస్కరుడిని తొలిదేవుడిగా  ఆరాధించాడు  మానవుడు. "

ఓం స్వస్తి పంధా మనుచరేమ సూర్యా చంద్రమసావివ!
పునర్దదతా ఘ్నతా జానతా సంగమేమహి!! (ఋగ్వేదం 5-51-15)

సమస్త మానవులు సూర్యచంద్రులను ఆదర్శంగా తీసుకొని ఉన్నతమార్గంలో నడవాలి అని ఈ వేద మంత్రాభిప్రాయం. పగలు సూర్యుని ద్వారా కాంతి,  రాత్రి చంద్రుని ద్వారా శాంతి మనకు లభిస్తాయి. దదతా అంటే దానగుణం. అఘ్నతా అంటే అహింసను పాటించడం. జానతా అంటే ఇతరులను గూర్చి తెలుసుకోవడం. ఉత్తమ సమాజ నిర్మాణానికై దానగుణం, అహింస, పరస్పర అవగాహన అనే ఈ మూడు సుగుణాలు చాలా అవసరం. 


సృష్టిలో సూర్య చంద్రులు పరమాత్ముని ద్వారా చైతన్యం కలిగిన వసుదేవతలు. ఈశ్వరాజ్ఞతో అవి నిరంతరం వాటి వాటి కక్ష్యలలో చరిస్తున్నాయి. ఈ దేవతలు ఒక్కరోజు కనిపించకపోతే సమస్త భూమండలం అంధకారంగా నిర్జీవంగా, అచేతనంగా కనిపిస్తుంది. సూర్యునితోనే ప్రపంచానికి కాంతి, చైతన్యం, స్పృహ కలుగుతాయి. సూర్య,చంద్ర నక్షత్రాదులు ఆ పరమాత్ముని అధీనంలో ఉన్నాయి. శ్రీమన్నారాయణుడే వీటికి అధిష్ఠాత. 

సూర్య  మహాత్ముని అవతరణ....


బ్రహ్మపురాణములో ఇతిహాసగాధ ప్రకారం.. శ్రీమన్నారాయణుడి వర ప్రధానంతో బ్రహ్మ ఉద్బోధనతో దక్ష ప్రజాపతి దంపతులకు ఈసారి 60 మంది కుమార్తెలు కలిగారు.  దక్షుడు వారిలో 10 మందిని యమధర్మరాజుకు, 13 మందిని కశ్యప మునికి, 27 మందిని చంద్రునికి, ఇద్దరిద్దరు చొప్పున భూతుడికి, అంగిరసుడికి, కృశాశ్వుడికి, మిగిలిన నలుగురిని తార్ష్యునికి ఇచ్చి వివాహం చేశాడు. తార్ష్యుని భార్యలు వినత, కద్రువ, పతంగి,యామిని. వీరిలో పతంగికి పక్షులు, యామినికి మిడతలు, వినతకు( స్థావర జంగము)  గరుత్మంతుడు, అనూరుడు పుట్టగా కద్రువకు సర్పాలు పుట్టాయి. చంద్రుని భార్యలు కృత్తికాది 27 నక్షత్రాలు. దక్షుని కూతుళ్ళందరికీ సంతానం కలిగింది. అలా పుట్టినవారిలో దేవతలున్నారు, రుద్రగణాలున్నాయి, భయంకరులైన ప్రేతలు,పితృగణాలు కూడా ఉన్నాయి. కశ్యపుని భార్యలలో తిమికి జలచరాలు,  .....సురసకు రాక్షసులు, అరిష్టకు గంధర్వులు, దనువుకు దానవులు 18 మంది పుట్టారు. దితికి దైత్యులు జన్మించారు  అసురుల ఆట కట్టించగల అపారశక్తిమంతుడిని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్ధించింది. గర్భం ధరించి  అలాంటి పుత్రునికై వ్రతాలూ, ఉపవాసాలూ చేస్తున్న అదితిని కశ్యపుడు ఎగతాళిగా బిడ్డను ఆకలితో చంపేస్తావా అని అరిచాడు. ఆ మాటకు తల్లి మనసు గాయపడి నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది. నేలమీదపడ్డ ఆ అండం వేడికి సృష్టి తల్లడిల్లింది. అదితీకశ్యపుల ప్రార్ధనతో ఆ అండం పగిలి వెలుగులు వెదజల్లుతూ బాల భానుడు అవతరించాడు. అదితి గర్భాన శ్రీమన్నారాయణుడు భానుడుగా అవతరించాడు. ఆ రోజు మాఘశుద్ధ సప్తమి. "రధసప్తమి". అదితికి  భానుడు గాక 12మంది ఆదిత్యులు పుట్టారు. అదితికి జన్మించినవారు సాత్విక గుణములు కలవారు  దేవతలు.   మిగిలినవారికి జన్మించినవారు రాజసిక, తామసిక గుణములు కలిగినవారు.




కాలమానం, క్షణం, ముహుర్తం, పగలు,రాత్రి, రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు, ఋతువులు, ఆయనాలు ఇవన్నీ సూర్యకాలగమనము వలన ఏర్పడ్డాయి. 

ద్వాదశాదిత్యులు:  ఆదిత్య, సవిత, సూర్య, మిహిర, అర్క,ప్రభాకర, మార్తాండ, భాస్కర, భాను, చిత్రభాను, దివాకర, రవి.  

సూర్యుడు చైత్రమాసం మొదలుకొని ఏ మాసంలో ఏ నామంతో ప్రవర్తిస్తాడో సూతుడు తెలియజేస్తున్నాడు...ద్వాదశాదిత్యులు....




 శ్రీమన్నారాయణ స్వరూపుడైన సూర్యుడు ఒక్కడే అయినా కాలాన్ని బట్టి కార్యభేదాన్నిబట్టి ఋషులు అభివర్ణించారు.

 చైత్రంలో సూర్యుడిని ధాత అంటారు. కృతస్థలి అప్సరగా, హేతి రాక్షసుడిగా, వాసుకి సర్పంగా, రధకృతుడు యక్షుడిగా, పులస్త్యుడు రుషిగా తుంబరుడు గంధర్వుడుగా వారి పనులు వారు నిర్వర్తిస్తారు.


వైశాఖంలో సూర్యుడు అర్యముడు.పులహుడు రుషి, అధౌజుడు యక్షుడు, పుంజిక స్థలి అప్సర, ప్రహేతి రాక్షసుడు, నారదుడు గంధర్వుడు, కచ్చనీరుడు సర్పంగా కార్యనిర్వహణ చేస్తారు. 


జేష్ఠంలో సూర్యుడు మిత్రుడు, అత్రిరుషి, పౌరుషేయుడు రాక్షసుడు, తక్షకుడు సర్పం, మేనక అప్సర, హాహా గంధర్వుడు,రధస్వనుడు యక్షుడు. 


ఆషాఢమాసంలో సూర్యుడిని వరుణుడంటారు. ఆయన కార్యవర్గంలో వసిష్ఠుడు రుషి, రంభ అప్సర, సహజన్యుడు యక్షుడు, హూహూ గంధర్వుడు, శుక్రుడు నాగరాజు, చిత్రస్వనుడు రాక్షసుడిగా ఉంటారు. 


శ్రావణ మాసంలో సూర్యుని ఇంద్రుడు అంటారు. అనుచరులుగా విశ్వాసువు గంధర్వుడు, శ్రోత యక్షుడు, ఏలా పత్రుడు నాగం, అంగిరా రుషి, ప్రంలోచ అప్సర, వర్యుడు రాక్షసుడు ఉంటారు. 

భాద్రపదంలో సూర్యుడు వివస్వనుడు. ఆయనకు తోడుగా ఉగ్రసేనుడనే గంధర్వుడు, వ్యాఘ్రుడనే రాక్షసుడు, ఆసారణుడనే యక్షుడు, భృగువనే రుషి, అనుమోచ అనే అప్సర, శంఖుపాలుచనే నాగరాజు ఉంటారు.

ఆశ్వయుజంలో సూర్యుడు త్వష్టా, జమదగ్ని రుషి, కంబళనాగుడు, తిలోత్తమ అప్సర, బ్రహ్మాపేత రాక్షసుడు, శతజిత్తు యక్షుడు. ధృతరాష్త్ర గంధర్వుడు తమ కార్యాల్ని నిర్వర్తిస్తారు. 

కార్తీక మాసంలో సూర్యుడు విష్ణువు. అశ్వతరనాగుడు, రంభ అప్సర, సూర్యవర్చాగంధర్వుడు, సత్యజిత్ యక్షుడు, విశ్వామిత్రుడు రుషి, మరవాపేతుడు రాక్షసుడు సూర్యగణంలో ఉంటారు.

మార్గశిర మాసంలో సూర్యుడు అంశువు. కశ్యప రుషి, తార్ క్ష్యుడు యక్షుడు, రుతసేనుడు గంధర్వుడు, ఊర్వశి అప్సర, విద్యుచ్చత్రుడు రాక్షసుడు, మహాశంఖుడు నాగరాజు.

పుష్యమాసంలో భగుడు సూర్యుడు. స్పూర్జుడు రాక్షసుడు, అరిష్టనేమి గంధర్వుడు, ఊర్ణుడు యక్షుడు, ఆయువు రుషి, పూర్వచిత్తి అప్సర, కర్కోటకుడు నాగరాజు.

మాఘమాసంలో సూర్యుడు పూషుడు. ఆయన పరివారంలో ధనుంజయుడనే నాగం, వాత రాక్షసుడు, సుషేణగంధర్వుడు, సురుచి యక్షుడు, ఘృతాచి అప్సర, గౌతమరుషి ఉంటారు.

ఫాల్గుణమాసంలో సూర్యుడు పర్జన్యుడు. క్రతు యక్షుడు, వర్చా రాక్షసుడు, భరద్వాజరుషి, సేనజిత్ అప్సర, విశ్వగంధర్వుడు, ఐరావతసర్పం ఆయనకు తోడుగా ఉంటాయి. 

ఇలా ఆరుగురు అనుచరులతో సూర్యనారాయణుడు 12 మాసాలలో సంచరిస్తూ ఉపాసన చేసే భక్తుల పాపాలను నిర్మూలిస్తాడు. ఆయన అలా నడుస్తుంటే వేదమంత్రాలు చదువుతూ రుషులు స్తుతిస్తారు. అప్సరసలు నృత్యం చేస్తారు. గంధర్వులు పాటలు పాడుతారు. నాగరాజులు రధానికి పగ్గాలుగా ఉంటారు. యక్షులు రధాన్ని అలంకరిస్తారు. రాక్షసులు రధాన్ని వెనుకనుంచి తోస్తారు. 60వేలమంది వాలఖిల్యులనే మహర్షులు సూర్యునివైపు చూస్తూ స్తుతి పాఠాలు చదువుతుంటారు. ఇలా ఆదిమధ్యాంతరహితుడైన ఆదినారాయణుడు తన్ను తాను విభజించుకొంటూ ప్రతికల్పంలోనూ ప్రజలను పోషించి, పాలిస్తుంటాడు.  

సూర్యభగవానుని ప్రార్ధిస్తూ భక్తితో ఆవాహన చేసి, స్తవనం, జపము, నామస్మరణ మొదలగు షోడశోపచారములు, స్నాన,పుష్ప,ఫల,ధూప,దీప,నైవేద్య, ఆరతులతో ఆరాధించి.. బ్రాహ్మణులకు దక్షిణ సమర్పించి, భజన,కీర్తనలతో సూర్యభగవానునికి మనసారా సూర్యప్రదక్షిణ నమస్కారములు సమర్పించాలి. ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు సూర్యనమస్కారాలతో పఠించాలి.  సర్వం శుభంకరం.



  



 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు