ఓం శ్రీ గురుభ్యో నమ:
అగస్త్యమహర్షి, ఆయన శిష్యులు ఋగ్వేదాన్ని కూలంకషంగా అధ్యయనం చేసినవారు. అగస్త్యుని ఆశ్రమంలో అనేకమంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు.సుతీష్ణుడు వారిలో ఒకడు.
గురుదేవా పూజకు అన్ని ఏర్పాట్లు చేసాను.అన్నాడు సుతీష్ణుడు. చూడండి,సుతీష్ణుడు ఎంత చురుగ్గా,ఉత్సాహంగా ఉంటున్నాడో!
శిష్యులారా! రామనామం ఒక దీపం వంటిది.అన్నారు గురువు.
అవును గురుదేవా ! అది బాహ్యమైన చీకటినీ, ఆంతరిక అంధకారాన్నీ పారద్రోలుతుందని మునుపు ఒకసారి మీరు సెలవిచ్చారు.భేష్ సుతీష్ణా! నీ జ్ఞాపకశక్తి అద్భుతం.
గురువు సుతీష్ణుని ప్రశంసించడంతో తక్కిన శిష్యులకు అసూయ కలిగింది.వారు అగస్త్యునితో...గురుదేవా! మీరు సుతీష్ణుని అమితంగా ప్రశంసిస్తున్నారు, అందువల్ల అతడు మమ్మల్ని అసలు ఖాతరు చెయ్యడమే లేదు.మమ్మల్ని ఆటపట్టిస్తూ పరిహసిస్తున్నాడు.
మీకన్నా చిన్నవాడైన అతడు ఏకసంధాగ్రాహిగా ఉన్నాడు. అలా ఉండడం నేర్వండి. అనవసరంగా అసూయ చెందకండి. సుతీష్ణుడు ఉత్తమ విద్తార్ధే అయినప్పటికీ, చిన్నతనం కారణంగా అతడిలో కాస్త అల్లరి ఉండడం సహజమే.
ఒకసారి అగస్త్యుడు ఒక యాత్రకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు.ఆయన సాలగ్రామం ఉన్న పూజాద్రవ్యాల పెట్టెను సుతీష్ణుడు వెనకాల మెల్లగా తీసుకువస్తున్నాడు. దారిలో ఒక నేరేడు చెట్టును చూడగానే రాళ్ళతో కొట్టి క్రింద పడ్డ పళ్ళను తినసాగాడు.ఇలా రాళ్ళతో పండ్లను కొట్టి కొట్టి అక్కడ ఉన్న రాళ్ళన్నీ ఖాళీ చేసాడు. అలా విసిరిన రాళ్ళు పక్కనే ఉన్న నదిలో పడ్డాయి. చివరికి పండ్లమీద ఉన్న ఆశతో చిన్నతనపు తుంటరితనం కారణంగా గురువుగారి పెట్టెలోని సాలగ్రామాన్ని కూడా తీసుకొని విసిరివేశాడు.
ఆహా! పండు పడింది కానీ సాలగ్రామం నదిలో పడిపోయిందే! అయ్యో గురువుగారు కోప్పడతారే! ఏం చెయ్యాలి?.. నదిలో ఎంత వెతికినా సాలగ్రామం లభించలేదు.అందుచేత సాలగ్రామంలా ఉన్న ఒక నేరేడు పండును పూజాద్రవ్యాల పెట్టెలో జాగ్రత్తగా పెట్టాడు.
మర్నాడు అగస్త్యుడు పూజ చేస్తున్నప్పుడు.....ఈ రోజు సాలగ్రామం మృదువుగా ఉందే!అభిషేక జలం పడితే తోలు వొలిచేసినట్లు ఉంటోందే,ఏమిటిది? ఆ...ఇది నేరేడుపండు.! ఎవరీ తుంటరి పనిచేసింది? సుతీష్ణా... క్షమించండి గురుదేవా! పళ్ళు తినాలనే ఆశతో నేనే ఈ పాపానికి ఒడికట్టాను... మూర్ఖుడా! నీ తుంటరితనం శ్రుతిమించింది. నీ ముఖం చూపించకు. వెళ్ళిపో!
అనుగ్రహించండి గురుదేవా!మిమ్మల్ని చూడకుండా, మీకు సేవ చేయకుండా నేను క్షణం కూడా ఉండలేను...నేను సాక్షాత్తూ భగవంతునిగా ఎంచి ఆరాధించిన సాలగ్రామాన్ని పోగొట్టావు.ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ,నా భగవంతుణ్ణి నాకు తెచ్చి ఇవ్వు అంతవరకు నా ముందుకు రాకు.! విచారంతో ఆశ్రమం నుండి బయటకు వచ్చిన సుతీష్ణుడు దండకారణ్యంలో ఒక పర్ణశాల కట్టుకొని గురువు ఉపదేశించిన రామనామాన్ని జపిస్తూ రాముని ధ్యానంలో లీనమయ్యాడు.
కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి. వనవాసానికి వచ్చిన శ్రీరాముడు, లక్ష్మణునితో ఇలా చెప్పాడు.. లక్ష్మణా! ఈ ప్రాంతంలో రామనామం బిగ్గరగా వినవస్తున్నది. ఇక్కడ ఎవరో కఠోరతపస్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. ..వెంటనే శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై సుతీష్ణుని పర్ణశాలకు వెళ్ళాడు. అప్పటికీ సుతీష్ణునికి ధ్యానభంగం కాలేదు. శ్రీరాముడు అతడి హృదయంలో చతుర్భుజమూర్తియైన నారాయణునిగా దర్శనమిచ్చాడు. బాహ్యచైతన్యం కలిగిన సుతీష్ణుడు ...
పరమాత్మయైన శ్రీరామా! ఈ అల్పుడి కోసం ఈ ఘోరారణ్యంలోకి ఇంత శ్రమపడి వచ్చావా...?ఓ శ్రీరామా! మీరు నా గురుదేవుల ఆశ్రమాన్ని ఒక్కసారి పావనం చేయండి.ఆయన నా పట్ల మునపటిలా వాత్సల్యంతో ఉండేలా చూడాలి.,,అలాగే!
అగస్త్యుడు శిష్యులకు పాఠం బోధిస్తున్నాడు. విద్యార్ధులారా! ఓంకార మాహత్యమూ,దివ్యశక్తీ రెండూ రామనామంలో ఉన్నాయి. ..గురుదేవా ప్రణామాలు. మీరు ఆజ్ఞాపించినట్లే భగవంతునితో వచ్చాను. ఇదుగో మన ఆశ్రమాన్ని సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరాముడు పావనం చేస్తున్నాడు.శ్రీరామచంద్ర ప్రభువా! ఏం చెబుతున్నావు సుతీష్ణా?...శ్రీరాముని చూసి అగస్త్యుడు పులకరించిపోయి ఆయనను ఆహ్వానించి సముచిత మర్యాదలు చేశాడు. తరువాత...
సుతీష్ణా! గురువు శిష్యుడికి భగవద్ధర్శనం చేయిస్తాడు. కానీ నువ్వు మాత్రం గురువుకే భగవంతుని దర్శనం కలిగించావు. నీ గురుభక్తి మహోన్నతమైనది. నువ్వు చిరస్మరణీయుడవు.
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు