Saturday, December 6, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 74(శ్రీ దత్త గురువు - శ్రీ సాయి గురువు )

 ఓం శ్రీ అనంతరూపాయ నమో నమ:

 శ్లో" అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర:!
     స్మర్తృగామీ స్వభాక్తానాముద్ధర్తా భవసంకటాత్ !!


 రేపు అనగా 06-12-2014 శనివారం శ్రీ దత్తజయంతి సందర్భంగా ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజగారి "శ్రీగురుచరిత్ర"నుండి దత్తగురువుకు,సాయిగురువుకుగల సన్నిహిత పోలికలు...సారాంశము.

   శిరిడీ సాయిబాబా భక్తులకు "శ్రీగురుచరిత్ర" పారాయణ యెంతో అవసరం. హరివినాయక్ సాఠె, అన్నాసాహెబ్ దభోల్కర్ వంటి వారికి శ్రీసాయిబాబా దర్శనము, అనుగ్రహము లభించడానికి "శ్రీగురుచరిత్ర" పారాయణమే కారణమైంది.కుశాభావు అనే భక్తుడి విషయంలో యీ సత్యం యింకెంతో స్పష్ఠంగా కనిపిస్తుంది. అతడిచేత యీ గ్రంధాన్ని 108 సార్లు పారాయణ చేయించడంలో సాయినాధుడు దీనికెంత ప్రాముఖ్యమిచ్చారో తెలుస్తుంది.ఆయన మహాత్ములందలోకి తలమానికము.తాను సద్గురువునని చెప్పక, అతి సామాన్యుడిలా జీవించారు. భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో యెన్నడూ చెప్పలేదు. భగవద్గీతా శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాల్లాంటి మాటలు ఒకటి రెండు మాత్రమే చెప్పారు. అలాగాక గురుచరిత్రలో శ్రీగురుడు యెన్నో పురాణోపాఖ్యానాల సహాయంతో యీ విషయం వివరించారు. అంటే భక్తులు యెలా శ్రీసాయిని సేవించాలో "శ్రీగురుచరిత్ర" నుండి నేర్చుకోమని శ్రీసాయి సూచించారన్నమాట.

   అంతేగాక, శ్రీగురునికి-సాయిబాబాకు సన్నిహితమైన పోలికలు యెన్నో ఉన్నాయి. జన్మించిన క్షణమునుండే యీ యిద్దరికీ తాము ఎవరో తెలుసు. ఇద్దరూ లోకహితం కోసం అవతరించిన భగవత్స్వరూపులే.అయినప్పటికీ సత్సాంప్రదాయాన్ననుసరించి ఇద్దరూ బాహ్యంగా గూడ ఒకగురువును ఆశ్రయించారు.  శ్రీగురుడు శ్రీశైలములో అంతర్ధానమయినప్పుడు తమ శిష్యులకు పూలు ప్రసాదంగా అందజేసి వాటిని ప్రాణపదంగా ఉంచుకోమని చెప్పారు. సాయిబాబా తమ గురువు ప్రసాదించిన ఇటుక రాయిని అలానే పవిత్రంగా ఉంచుకున్నారు. అది విరిగిపోయిన కొద్దికాలానికే ఆయన గూడా శరీర త్యాగం చేసారు.  ఆయన తమను తమ గురువు ఒక బావిలోకి  తలక్రిందులుగా వ్రేలాడదీసినట్లు చెప్పారు. గురుచరిత్రలో దీపకుడు,ఉపమన్యువు మొ"న వారు చేసిన గురుసేవా విధానమంతా ఆ ఒక్క వాక్యానికి వివరణ అని తలచవచ్చు.   శ్రీగురుడు యెంతోకాలం సన్యాసాశ్రమ ధర్మాన్ననుసరించి దేశసంచారం చేస్తూ లోకుల దృష్టినుండి గుప్తంగా ఉండిపోయారు. ఒక్క నర్సోబావాడిలోనే 12 సం"లు తపోనిష్ఠలో ఉన్నారు.    శ్రీసాయి గూడా శిరిడీలో వేపచెట్టుక్రిందనున్న భూగృహంలో 12 సం"లు ఉన్నారు. అందుండి బయటకు వచ్చాక గూడ సుమారు 30 సం"లు గుప్తంగా పిచ్చి ఫకీరువలె జీవించారు.  శ్రీగురుడు తాము లోకానికి వెళ్ళడి కావలిసిన సమయమొచ్చాకనే గంధర్వపురం చేరి ప్రకటమయినట్లు, శ్రీ సాయి గూడ చివరి 23 సం"లలోనే వెల్లడి అయ్యారు. కాకుంటే సాయి నైష్ఠిక బ్రహ్మచారి గనుక, యావజ్జీవితమూ తమ గురుసన్నిధిలోనే ఉండిపోయారు. శ్రీగురుడు సంగమానికి వెళ్ళిరావడం నిత్యమూ మహోత్సవంగా జరిగినట్లే, శ్రీసాయి రోజూ లెండీకి రావడం,రోజు విడిచి రోజు చావడికి వెళ్ళడమూ గొప్ప ఊరేగింపుగా జరిగింది. కొద్దిలో చెప్పాలంటే ,సాయిచరిత్రలో గురుస్థానం (వేపచెట్టు మూలం) నర్సోబావాడి వంటిది.; లెండీవనమే సంగమం;ద్వారకామాయియే గంధర్వపురం. ఈ మహనీయులిద్దరూ తమ 16వ యేటనే బాహ్య ప్రపంచంలోనికి అడుగు పెట్టారు. ఇద్దరూ తమ భక్తులకు కవితాశక్తిననుగ్రహించి,వారికి బిరుదులు గూడా ఇచ్చారు. శ్రీగురుడు ఒకనికి 'యోగీశ్వర్ 'అని మరొకరికి 'కవీశ్వర్ ' అని బిరుదులిస్తే-శ్రీసాయి ఒకరికి 'దాసగణు ' అని, మరొకరికి 'హేమాడ్పంత్ 'అని బిరుదులివ్వడమే కాక, జోగేశ్వర్ భీష్మకు కవితాధారనిచ్చి 'సగుణోపాసన ' వ్రాయించుకున్నారు.  శ్రీగురుడు ఒక యవనరాజును అనుగ్రహించి అతనినుండి పూజలందుకున్నారు. సాయి యవనులందరిచేత సేవించ బడుతున్నారు.ఇద్దరిదీ భిక్షావృత్తియే. ఈ ఇద్దరూ కర్మఫలానికీ, జన్మ పరంపరలకూ యెంతో ప్రాముఖ్యమిచ్చారు. ఇలా ఆలోచించినకొద్దీ యింకెన్నో పోలికలు స్ఫురిస్తాయి. కనుకనే "శ్రీసాయిబాబా జీవితచరిత్ర","శ్రీగురుచరిత్ర" ..ఒకదానికొకటి వివరణమని చెప్పాలి. ఆ రెండూ ఒకే దత్తాత్రేయుని చరిత్రలో వేర్వేరు అధ్యాయాలు. కనుక సాయి భక్తులందరికీ, "శ్రీసాయిబాబా జీవిత చరిత్ర","శ్రీగురుచరిత్ర","శ్రీగురుగీత"లు కలిసి ప్రస్థానత్రయము అనవచ్చు. ప్రస్థానత్రయము అంటే సనాతనధర్మమంతటికీ మూలమైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు,భగవద్గీత.


  సర్వజీవులనూ ఉద్ధరించడమే తమ అవతారకార్యంగా గల దత్తాత్రేయుణ్ణి భక్తులందరూ గురుధ్యాన శ్లోకం చదువుకుంటూ,త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయుణ్ణే మనసారా స్మరిస్తున్నారు.

ఓం దత్త... శ్రీ దత్త...జయగురుదత్త  

   సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు