శ్రీరామ భద్రాయ నమో నమ:
మనసులో ఇష్టాయిష్టాలు ఎందుకు కలుగుతాయి? అని శ్రీరాముడు...వసిష్ఠ మహర్షిని ప్రశ్నిం పగా వారు ఇలా వివరించారు.
ఏ మనస్సైతే పూర్ణమైన ఆత్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొందదో, అప్పుడది "ఇదినాకు ఇష్టం. ఇది నాకు కష్టం" అనే కల్పనలన్నీ చేసుకుంటోంది. అయితే, తత్వజ్ఞుల మనస్సు ఇలాగ చపలంగా ఉండదు. మనస్సు అనేది చేతనశక్తి నుండే స్ఫురిస్తోంది.కాబట్టి ఈ వాయు, ప్రకాశ, ద్రవత్వాలూ "మనస్సే",కఠినతనీ, శూన్యతనీ పొందుతున్నదీ అదే. చైతన్యం అనిర్వచనీయమైన తన ఇచ్చాశక్తిచేతనే ఇలా మనస్సు యొక్క రూపాన్ని స్వీకరిస్తోంది. అలాంటి మనోరూపంతో భావనామాత్రంగా దేశకాలాదుల అనుభవం తనలోని అంగీకారబుద్ధి వలన పొందుతోంది.
మనస్సు ఎక్కడ సంలగ్నమైతే అక్కడే ఆ భావనకు సంబంధించిన అనుభవాన్ని పొందుతుంది.ఒకడి మనస్సు ఎక్కడో లగ్నమై ఉన్నప్పుడు, అతడు తాను తింటున్న పదార్ధపు రుచిని గుర్తించడుకదా! ఎదురుగా ఉన్న వస్తువుపై దృష్టి ఉన్నా కూడా, మనస్సు లగ్నం కాకపోతే ఆ వస్తువుని మనం చూడలేం.
ఓ రామా! అజ్ఞానానికి ఈ చిత్తం - శరీరం వేరువేరుగా కనిపిస్తాయి. ఈ మనస్సే "నేనిలా అవుతాను" అని భావించి, అటువంటి భావనకు అనుకూలమైన ఆయా ఉపాధులను నిరంతరం పొందుతోంది.ఈ మనస్సుతో ఉపాధులకావల నిశ్చలంగా ఉన్న ఆత్మను గ్రహించేవారు ఉపాధి భావనను అధిగమించి, ఆత్మభావనను స్వీకరించగలుగుతున్నారు.అఖండమైన ఆత్మను ఎరిగినవారు అఖండభావననే పొందుతున్నారు. మహాత్ములు సర్వం గ్రహించడం వలన మనోరహితులై ఉంటున్నారు. జ్ఞానులు అభ్యాసబలం చేతనే దు:ఖాలను సుఖాలుగా, స్త్రీ-ధన-వస్తుప్రాప్తులను తుచ్చమైనవిగా చూడగలుగుతున్నారు.
ఒకరి మనస్సు ఎక్కడో సంలగ్నమై ఉంటే ...నీవు అతనికి ఒక కధ ఎంత వివరంగా చెప్పినా అది గ్రహిస్తాడా? లేదు కదా! స్వప్నంలో మనసు అనేకవ్యక్తులను,సంఘటనలను పొందుతోంది. స్వప్నంలోని ఆయా పదార్ధాలన్నీ ఆ స్వప్న సమయంలో వాస్తవంలాగే తోస్తాయి. అవన్నీ ఎక్కడినుండి వచ్చాయి? ఆత్మ తన స్వస్వరూపం నుండి చ్యుతి చెంది, క్షుభితమైనప్పుడు తన హృదయంలోనే ఆ స్వప్న వ్యవహారాన్ని అలాగ దర్శిస్తోంది.
సముద్రజలం నుండి తరంగాలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ఈ దేహంలో అంతర్గతంగా ఉన్న మనసు నుండే ఆకార వికారాలు ఏర్పడుతున్నాయి.
ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు మనోవికారాలకు అతీతులవుతారు.
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు