Friday, April 18, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం- 61

ఓం శ్రీ స్వామి సాయినాధాయ నమో నమ:

"భగవంతుడు మానవుడికి బుద్ధిని ఇచ్చాడు. ఈ బుద్ధితో మానవుడు అర్ధవంతమైన జీవితాన్ని జీవించాలంటే , జీవితమంటే ఏమిటన్నదాని మీద, జీవితంలో ఏమి సాధించాలన్న దాని మీద మనకు అవగాహన కావాలి. దీనినే మనం జీవిత లక్ష్యం అంటాము. ఈ జీవితలక్ష్యాన్ని సాధించడానికి మనస్సు ఒక ఉపకరణం."  

విజయాలు చవి చూసిన కొందరు ఇలా చెప్పారు. సమస్యను ఎదుర్కొని పరిష్కరించి మరింత బలవంతులమయ్యాము. 'సమస్యలూ అనే మట్టి మీద మూడు పువ్వులు, ఆరు కాయలుగా పెరిగాము. ఎందుకంటే సమస్యలు మనస్సును గట్టి పరుస్తాయి. అని చెప్పారు.

సమస్య - కధ:- 

 ఒక గొంగళిపురుగు కట్టుకున్నగూడు కొద్దిగా పగిలి దానిలోనుంచి ఒక సీతాకోకచిలుక నెమ్మదిగా బయటకు రావడం మొదలుపెట్టింది. ఒక మనిషి చాలా ఆసక్తితో దాని ప్రక్కనే కూర్చుని గంటల తరబడి దాన్ని చూడసాగాడు. 
ఆ చిన్న పగులులో నుంచి ఆ సీతాకోకచిలుక అతికష్టంతో బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. కొంతసేపటి తర్వాత ఇక అది బయటకు రాలేనట్లు కనపడసాగింది.దాని శక్తినంతా ప్రయోగించి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా ఆ గూడు దానికి సందు ఇవ్వడం లేదు. ఇక ఆ మనిషి ఉండబట్టలేక, దానికి సహాయం అవసరమని నిర్ణయించి, ఒక చిన్న కత్తెర తీసుకుని ఆ గూటిని నెమ్మదిగా కత్తిరించి తెరిచి వేశాడు. అప్పుడు ఆ సీతాకోకచిలుక  సులభంగా బయటకు రాగలిగింది. కానీ దాని శరీరం సరిగా ఎదగక, రెక్కలు ముడుచుకు పోయి ఉన్నాయి. ఆ మనిషి ఆ సీతాకోకచిలుక రెక్కలు ఎప్పుడు పూర్తిగా విచ్చుకుంటాయా, అది ఎప్పుడు ఎగురుతుందా అని చూస్తూనే ఉన్నాడు.కానీ అదేమీ జరగలేదు. నిజానికి ఆ సీతాకోకచిలుక తన జీవితకాలమంతా ముడుచుకున్న రెక్కలతో కాళ్ళమీద పాకుతూ గడిపింది. అది ఎప్పటికీ ఎగురనే లేదు.


ఆ సీతాకోకచిలుక చక్కగా తయారై ఎదగడానికి కావలసిన శక్తిసామర్ధ్యాలను పొందడం కోసమే గట్టిగా ఉండే ఆ కోశాన్ని ప్రకృతి ఏర్పరిచింది. దానిలో నుంచి బయటపడేందుకు ఆ జీవి పెనుగులాడాలన్నది ప్రకృతి నియమం. అలా పెనుగులాడడం వల్ల దాని శరీరం లోని రక్తం దాని రెక్కలలోకి ప్రవహించి అవి చక్కగా తయారయ్యేందుకు సహాయపడతాయి. కానీ ఆ మనిషి తాను జాలి, దయ చూపుతున్నానని అనుకుంటూ, ఆ భ్రమలో ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయాడు.గూటి నుంచి బయటపడ్డ వెంటనే స్వేచ్చగా ఎగిరే శక్తిని పొందాలంటే అలా పెనుగులాడడం అత్యవసరమని అతడు గ్రహించలేకపోయాడు.

కష్టాలే కొన్నిసార్లు మనకు జీవితంలో కావలసినవి. జీవితంలో అవరోధాలే లేకుండా దేవుడు ముందుకు పోనిస్తే అది మనల్ని వికలాంగులుగా తయారుచేస్తుంది. కాబట్టి సమస్యే మనకి 'పట్టుదలా  మరియు 'బలం'. 

"అణగద్రొక్కివేసే పరిస్థితుల మధ్యలో వికసించి, పెంపొందడమే జీవితం!"- స్వామి వివేకానంద.

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.













Monday, April 7, 2014 1 comments By: visalakshi

పూర్ణ పురుషోత్తముడు - శ్రీరామచంద్రుడు




ఓం శ్రీ కోదండరామాయ నమో నమ:


ప్రార్ధన:

రామో మత్కులదైవతం సకరుణం రామం భజే సాదరం
రామేణా2ఖిలఘోరపాపనిహతీ రామాయ తస్మై నమ:
రామాన్నాస్తి జగత్త్ర్యైక సులభో రామస్య దాసో2స్మ్యహం
రామే ప్రీతి రతీవ మే కులగురో శ్రీరామ రక్షస్వ మాం.
                                                                         


 ఆదర్శరాజ్యం ఎలా ఉంటుందో తన పరిపాలన ద్వారా "ధర్మ నిరతి" తో తెలియజేసాడు శ్రీరాముడు. ధర్మ పరిరక్షణలో అనుబంధాలకు ప్రాముఖ్యం లేదని ఆచరించి మరీ చూపాడు.

 "ధర్మం" నిలువెత్తు రూపంలో మానవాకృతిని దాల్చి "శ్రీరామచంద్రుని"గా రూపుదిద్దుకుంది.

"రామాయణం" అంటే రాముని మార్గం. ఆ రాముని మార్గం రామాయణంలో ......

బాలకాండ:   
భక్తి మార్గంలో 'మనస్సు బాలుని మనస్సు లాగ స్వచ్చంగా ఉండాలి.ధనం,గౌరవం,జ్ఞానం ఎంత పెరిగినప్పటికీ మనస్సు మాత్రం బాలకుని లాగ స్వచ్చంగా ఉండాలి. హృదయం నిర్మలంగా నిష్కపటంగా ఉండాలి. ఇదే మనకు బాలకాండ నేర్పే ఆదర్శం.





అయోధ్యకాండ:   
ఎక్కడైతే దుర్బుద్ధి ,విరోధం, వాదోపవాదాలు లేవో అదే అయోధ్యాపురం. అక్కడ శ్రీరాముడు అవతరిస్తాడు. ఎప్పుడైతే మనస్సులో దురాలోచనలు మొదలవుతాయో అక్కడ రాముడు నిలువజాలడు.కైకేయి మనస్సులో దుర్బుద్ధి మొదలవగానే అయోధ్యను వదలి వెళ్ళాడు శ్రీరాముడు.అందువల్ల దుర్గుణాలకు తావివ్వకూడదని మనకు అయోధ్యకాండ తెలియజేస్తుంది.





అరణ్యకాండ:    
దట్టమైన అజ్ఞానారణ్యంలో చిక్కుకున్న సాధకులకు దారితెన్నులు చూపగలిగేవి ఇంద్రియ నిగ్రహం, వాసనాక్షయాలు మాత్రమే. సాధుసజ్జనుల సాంగత్యం ఆ మార్గాన్ని మరింత సుగమం చేస్తుంది.  శ్రీరామునికి శూర్పణక అనే మహా మోహం, శబరి అనే శుద్ధ భక్తి ఎదురయ్యాయి. అప్పుడు శ్రీరాముడు మోహాన్ని తృణీకరించి, భక్తిని ఆదరించాడు. మోహాన్ని విడిస్తే వివేకం, వైరాగ్యం జాగృతమై, భక్తిని పెంపొందిస్తాయి అనేది అరణ్యకాండ  సందేశం.


కిష్కిందకాండ: 
  శ్రీరామునితో సుగ్రీవుని మైత్రిని చేకూర్చినవాడు హనుమంతుడు(ఆచార్యుడు)  ఆదర్శ బ్రహ్మచారి అయిన హనుమంతుడు వారధిగా నిలిచి సుగ్రీవుడికీ(జీవాత్మ) శ్రీరాముడికీ(పరమాత్మ) మైత్రిని కలిగించాడు. రాముడు ఉన్నచోట కాముడు నిలవడు. అందువల్ల బ్రహ్మచర్యం ఆవశ్యకతను తెలియజేస్తూ, విషయానంద భ్రమలు తొలగితేనే బ్రహ్మానందంపై మనస్సు నిలవగలదనే సత్యాన్ని చాటుతుంది. కిష్కిందకాండ.





సుందరకాండ:   
 సుందరమైనది సుందరకాండ .మధురమైన రామనామామృతాన్ని గ్రోలిన వారి మనస్సులకి, రామనామాన్ని గట్టిగా పట్టుకున్నవారికి   భవసాగరాన్ని దాటడం అతి సునాయసమని ౠజువు చేస్తోంది. సుందరకాండ. నిరంతర రామనామ జపం వల్ల జగన్మాత (సీతామాత) దర్శనభాగ్యం కలగడమే కాక అజ్ఞానమనే అసుర లక్షణం అంతం కూడా సాధ్యమని వివరిస్తోంది.






యుద్ధకాండ:   
మానవునిలోని దశేంద్రియాలు పది తలల రావణునికి చిహ్నం. ఈ దశేంద్రియాలూ వాటి తాలూకు విషయాలు సంకల్పమనే అంతస్సూత్రంతో గుచ్చబడి ఉన్నాయి. ఆ తంతువు (దారం) తెగితేనే సంకల్పాలు క్షీణించి అది బ్రహ్మత్వానికి దారి తీయగలదు. దీనికోసం అచంచల కార్యదీక్ష, సం యమనం, స్థితప్రజ్ఞత అనే లక్షణాలు ఆవశ్యకం.ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొని ఒక సాధారణ మానవునిలా ప్రవర్తిస్తూనే రాముడు అసురవధ చేసాడు. మనకు ఆదర్శప్రాయమై నిలిచాడు.


ఉత్తరకాండ: 
 రాజ్య సం రక్షణ ;ధర్మ పరిపాలనలో ప్రజాభిప్రాయాలకు ప్రాధాన్యమిచ్చి,మమకార రహితంగా జగన్మాత అయిన సీతాదేవిని అడవులకు పంపవలసి వచ్చినా చలించలేదు. తాను సార్వభౌముడై ఉండి కూడా, భోగాలను త్యజించి, ఏకపత్నీ వ్రతానికి కట్టుబడి, ముని ప్రవృత్తిలో జీవనాన్ని కొనసాగించినవాడు శ్రీరామచంద్రుడు.బాహ్యదృష్టిని నిరోధిస్తే, జ్ఞాననేత్రం తెరుచుకోగలదని  ఉత్తరకాండ తెలియజేస్తోంది.



"ఆ ప్రాచీన ధీరయుగానికి  కన్నుల వెలుగైన శ్రీరాముడు మూర్తీభవించిన సత్య, ధర్మస్వరూపుడు, ఆదర్శతనయుడు, ఆదర్శపతి, ఆదర్శజనకుడు, అన్నిటికీ మించి ఆదర్శ నృపతి". - స్వామి వివేకానంద.


శ్రీరామ నవమి శుభాకాంక్షలతో........