ఓం శ్రీ స్వామి సాయినాధాయ నమో నమ:
"భగవంతుడు మానవుడికి బుద్ధిని ఇచ్చాడు. ఈ బుద్ధితో మానవుడు అర్ధవంతమైన జీవితాన్ని జీవించాలంటే , జీవితమంటే ఏమిటన్నదాని మీద, జీవితంలో ఏమి సాధించాలన్న దాని మీద మనకు అవగాహన కావాలి. దీనినే మనం జీవిత లక్ష్యం అంటాము. ఈ జీవితలక్ష్యాన్ని సాధించడానికి మనస్సు ఒక ఉపకరణం."
విజయాలు చవి చూసిన కొందరు ఇలా చెప్పారు. సమస్యను ఎదుర్కొని పరిష్కరించి మరింత బలవంతులమయ్యాము. 'సమస్యలూ అనే మట్టి మీద మూడు పువ్వులు, ఆరు కాయలుగా పెరిగాము. ఎందుకంటే సమస్యలు మనస్సును గట్టి పరుస్తాయి. అని చెప్పారు.
సమస్య - కధ:-
ఒక గొంగళిపురుగు కట్టుకున్నగూడు కొద్దిగా పగిలి దానిలోనుంచి ఒక సీతాకోకచిలుక నెమ్మదిగా బయటకు రావడం మొదలుపెట్టింది. ఒక మనిషి చాలా ఆసక్తితో దాని ప్రక్కనే కూర్చుని గంటల తరబడి దాన్ని చూడసాగాడు.
ఆ చిన్న పగులులో నుంచి ఆ సీతాకోకచిలుక అతికష్టంతో బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. కొంతసేపటి తర్వాత ఇక అది బయటకు రాలేనట్లు కనపడసాగింది.దాని శక్తినంతా ప్రయోగించి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా ఆ గూడు దానికి సందు ఇవ్వడం లేదు. ఇక ఆ మనిషి ఉండబట్టలేక, దానికి సహాయం అవసరమని నిర్ణయించి, ఒక చిన్న కత్తెర తీసుకుని ఆ గూటిని నెమ్మదిగా కత్తిరించి తెరిచి వేశాడు. అప్పుడు ఆ సీతాకోకచిలుక సులభంగా బయటకు రాగలిగింది. కానీ దాని శరీరం సరిగా ఎదగక, రెక్కలు ముడుచుకు పోయి ఉన్నాయి. ఆ మనిషి ఆ సీతాకోకచిలుక రెక్కలు ఎప్పుడు పూర్తిగా విచ్చుకుంటాయా, అది ఎప్పుడు ఎగురుతుందా అని చూస్తూనే ఉన్నాడు.కానీ అదేమీ జరగలేదు. నిజానికి ఆ సీతాకోకచిలుక తన జీవితకాలమంతా ముడుచుకున్న రెక్కలతో కాళ్ళమీద పాకుతూ గడిపింది. అది ఎప్పటికీ ఎగురనే లేదు.
ఆ సీతాకోకచిలుక చక్కగా తయారై ఎదగడానికి కావలసిన శక్తిసామర్ధ్యాలను పొందడం కోసమే గట్టిగా ఉండే ఆ కోశాన్ని ప్రకృతి ఏర్పరిచింది. దానిలో నుంచి బయటపడేందుకు ఆ జీవి పెనుగులాడాలన్నది ప్రకృతి నియమం. అలా పెనుగులాడడం వల్ల దాని శరీరం లోని రక్తం దాని రెక్కలలోకి ప్రవహించి అవి చక్కగా తయారయ్యేందుకు సహాయపడతాయి. కానీ ఆ మనిషి తాను జాలి, దయ చూపుతున్నానని అనుకుంటూ, ఆ భ్రమలో ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయాడు.గూటి నుంచి బయటపడ్డ వెంటనే స్వేచ్చగా ఎగిరే శక్తిని పొందాలంటే అలా పెనుగులాడడం అత్యవసరమని అతడు గ్రహించలేకపోయాడు.
కష్టాలే కొన్నిసార్లు మనకు జీవితంలో కావలసినవి. జీవితంలో అవరోధాలే లేకుండా దేవుడు ముందుకు పోనిస్తే అది మనల్ని వికలాంగులుగా తయారుచేస్తుంది. కాబట్టి సమస్యే మనకి 'పట్టుదలా మరియు 'బలం'.
"అణగద్రొక్కివేసే పరిస్థితుల మధ్యలో వికసించి, పెంపొందడమే జీవితం!"- స్వామి వివేకానంద.
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.
0 comments:
Post a Comment