Wednesday, July 15, 2015 3 comments By: visalakshi

జీవితం అంటే ఏమిటి?

  ఓం శ్రీ సర్వ హృదయ నిలయాయ నమోనమ:
దృష్టి పూతం న్యసేత్పాదం
వస్త్ర పూతం జలం పిబేత్!
సత్య పూతం వదేద్వాచం
మన: పూతం సమాచరేత్!!

 " కంటితో పరిశీలించి అడుగువేయాలి. వడపోసిన నీరు త్రాగాలి. సత్యంలో వడకట్టిన మాటను పలకాలి. మనస్సులో వడపోసిన ఆలోచనను ఆచరించాలి".


 జీవితం అంటే ఏమిటి? అని ఎవరో ప్రశ్నించినప్పుడు వివేకానంద స్వామి "అణగద్రొక్కివేసే పరిస్థితుల మధ్యలో వికసించి, పెంపొందడమే జీవితం!" అని నిర్వచించారు.    ఉదాహరణకు ఒక కధ...

   ఒక గొంగళిపురుగు కట్టుకున్నగూడు కొద్దిగా పగిలి దానిలోనుంచి ఒక సీతాకోకచిలుక నెమ్మదిగా బయటకు రావడం మొదలుపెట్టింది.ఒక మనిషి చాలా ఆసక్తితో దాని ప్రక్కనే కూర్చుని, గంటల తరబడి దాన్ని చూడసాగాడు. 

 ఆ చిన్న పగులులో నుంచి ఆ సీతాకోకచిలుక అతికష్టంతో బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది.కొంతసేపటి తర్వాత ఇక అది బయటకు రాలేనట్లు కనపడసాగింది.దాని శక్తినంతా ప్రయోగించి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా ఆ గూడు దానికి సందు ఇవ్వడంలేదు.ఇక ఆ మనిషి ఉండబట్టలేక, దానికి సహాయం అవసరమని నిర్ణయించి, ఒక చిన్న కత్తెర తీసుకుని ఆ గూటిని నెమ్మదిగా కత్తిరించి తెరిచి వేశాడు. అప్పుడు ఆ సీతాకోకచిలుక సులభంగా బయటకు రాగలిగింది.కానీ దాని శరీరం సరిగా ఎదగక, రెక్కలు ముడుచుకు పోయి ఉన్నాయి.ఆ మనిషి ఆ సీతాకోకచిలుక రెక్కలు ఎప్పుడు పూర్తిగా విచ్చుకుంటాయా, అది ఎప్పుడు ఎగురుతుందా అని చూస్తూనే ఉన్నాడు.కానీ అదేమీ జరగలేదు. నిజానికి ఆ సీతాకోకచిలుక తన జీవితకాలమంతా ముడుచుకున్న రెక్కలతో కాళ్ళమీద పాకుతూ గడిపింది.అది ఎప్పటికీ ఎగురనే లేదు.  

 ఆ సీతాకోకచిలుక చక్కగా తయారై ఎదగడానికి కావలసిన శక్తిసామర్ధ్యాలను పొందడం కోసమే గట్టిగా ఉండే ఆ కోశాన్ని ప్రకృతి ఏర్పరిచింది. దానిలో నుంచి బయటపడేందుకు ఆ జీవి పెనుగులాడాలన్నది ప్రకృతి నియమం. అలా పెనుగులాడదం వల్ల దాని శరీరంలోని రక్తం దాని రెక్కలలోకి ప్రవహించి అవి చక్కగా తయారయ్యెందుకు సహాయపడతాయి. కానీ ఆ మనిషి తాను జాలి, దయ చూపుతున్నానని అనుకుంటూ, ఆ భ్రమలో ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయాడు.గూటినుంచి బయటపడ్డ వెంటనే స్వేచ్చగా ఎగిరే శక్తిని పొందాలంటే అలా పెనుగులాడడం అత్యవసరమని అతడు గ్రహించలేకపోయాడు.  

  కష్టాలే కొన్నిసార్లు మనకు జీవితంలో నిజంగా కావలసినవి. జీవితంలో అవరోధాలే లేకుండా దేవుడు మనల్ని ముందుకు పోనిస్తే అది మనల్ని వికలాంగులుగా తయారుచేస్తుంది.ఇది వెలుతురు అన్న జ్ఞానం ఉన్న వ్యక్తికి చీకటి అంటే ఏమిటో తెలిసి ఉంటుంది. సుఖం ఎరుక గల వ్యక్తికి దు:ఖం ఎరుక కూడా ఉంటుంది. పుణ్యం ఎరుక ఉన్న వ్యక్తికి పాపం ఎరుక ఉండే ఉంటుంది.మడి అన్న జ్ఞానం ఉన్న వ్యక్తి, మైల అనే జ్ఞానమూ కలిగి ఉంటాడు.'నేను ' అనే భావం ఉన్న వ్యక్తికి 'నువ్వు ' అన్న భావనా ఉంటుంది.

  "భగవంతుణ్ణి తెలుసుకోవడమే విశేష జీవిత పరమార్ధం. ఆంతరిక అనుభవంతో భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవడం జ్ఞానం. కానీ ఆయనతో మాట్లాడి వాత్సల్య,సఖ్య,దాస్య,మధుర ఇత్యాది భావాలలో ఎదో ఒక భావంలో ఆనందం చవిచూడడమే విజ్ఞానం. ఆయనే ఈ జీవజగత్తులు అయిఉన్నాడని దర్శించడమే జీవన విజ్ఞానం".

  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.