ఓం శ్రీ నారాయణాయ నమో నమ:
పలువురు ఆధ్యాత్మిక దిగ్గజులు సైతం ఒక్కోసారి చిన్న బలహీనత వల్ల సాధనాపధము నుండి వైదొలగి,ప్రాపంచిక విషయాలోలురై మాయలో పడి,తమను తాము మిధ్యా విషయలోలురను చేసుకొనిపరమాత్ముని సన్నిధిని కోల్పోతున్నారు.
స్నేహ ధర్మముతో, మిత్రురాలిపై మమకారముతో ఆధ్యాత్మిక సాధనా పధంలో వెనుకంజ వేసి సాధనకై పరితపిస్తున్న నాఆత్మీయ,ఆత్మసమురాలైన స్నేహితురాలికై నా ఈ టపా....తను ఎంతో తపనతో ,ఆర్తితో భగవంతునికై విలపిస్తూ ..అన్నీ వదలి భగవంతుని చరణాలు పట్టుకుని,ఆయనను నిలదీస్తూ ఉంటుంది..నాలోనే ఉండు. సాధనా మార్గము చూపి ముక్తిని ప్రసాదించమని అణువణువు నామ స్మరణ పులకితురాలు అవుతూ ఉంటుంది. తన ఆ వేదన చూస్తే నాకే భగవంతుడు తనకి వరమీయరాదా! అనిపిస్తుంది...నా మిత్రురాలికి ఆధ్యాత్మిక చింతనతో ఆ శ్రీరామచంద్రుని సాన్నిధ్యంలో వారిని ఆరాధిస్తూ జన్మ ధన్యత చేసుకోవాలని ఆశిస్తూ.....
'యది గచ్చసి మాం త్యక్త్వా ప్రాణాంస్త్వ క్ష్యామి తే2 గ్రత:'- శ్రీరాముని సహచర్యం లేకపోతే ప్రాణత్యాగం చేస్తాననీ ,ఆయన లేని అయోధ్య అరణ్యంతో సమానమనీ, పతిదేవుని చెంతలేని స్వర్గసీమైనా నరకతుల్యమేననీ, పతి సన్నిధే పరమ పెన్నిధి అని భావించి రామునితో అరణ్యవాసానికి పయనమైంది సీతమ్మ.పంచవటిలోని పర్ణశాల యందు పతి సాన్నిధ్యంలో ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్న సీతమ్మ కళ్ళలో ప్రకాశవంతమైన పసిడిలేడి పడింది. ఆ లేడిని పట్టి తెమ్మని పంపి నిత్యప్రకాశకుడైన పరంధాముణ్ణి దూరం చేసుకుంది.' తమేమ భాంతమనుభాతి సర్వం తస్యభాసా సర్వమిదం విభాతి ' ఎవరి సన్నిధిలో సకల చరాచర సృష్టంతా ప్రకాశిస్తుందో అలాంటి పరమాత్ముణ్ణి పక్కనే పెట్టుకుని అశాశ్వతమైన ఒక అల్పజీవి తళుకుబెళుకులకు ఆకర్షితురాలైంది సీతమ్మ.
మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఒక దండకారణ్యవాసం లాంటిదే. సాధనలో తీవ్రత సన్నగిల్లినప్పుడు మనస్సు నిత్యసత్యుడైన భగవంతుణ్ణి వదలి అనిత్యమూ, అసుఖమైన విషయ వస్తువులవైపు పరుగులు తీస్తుంది. 'ధ్యాయతో విషయాన్ పుంస: సంగస్తేషూపజాయతే సంగాత్సంజాయతే కామ: ' విషయ వస్తువుల మధ్య ఉంటే మనసు వాటి ధ్యాసలో పడుతుంది.దానివల్ల వాటిపై రాగం కలుగుతుంది. ఆ రాగం వల్లనే వాటిని పొందాలనే కోరిక బలపడుతుంది.ఆ కోరికను నెరవేర్చుకోవడానికి మనసు ఎన్నో పన్నాగాలు పన్నుతుంది.వాటిని పొందాలనే ఆరాటంలో భగవంతుని ఆరాధనను విస్మరిస్తుంది.విషయ వస్తువుల్ని కోరి విశ్వేశ్వరుణ్ణి వదిలితే, పసిడిలేడి కోసం పరంధాముణ్ణి కోల్పోయిన సీతమ్మలా మనం కూదా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది.
సీతమ్మ కోరిక మేరకు లేడిని తీసుకురావడానికి ఆయత్తమవుతూ రాముడు సీతమ్మ రక్షణ బాధ్యతను లక్ష్మణునకు అప్పగించాడు. కానీ రామునికి ఆపద వాటిల్లిందని అనుకొని లక్ష్మణున్ని రాముని వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించింది సీతమ్మ. లక్ష్మణుడు ఎంత విశదపరచినా సీతమ్మ వినలేదు కోపోద్రిక్తురాలై లక్ష్మణుణ్ణి దుర్భాషలాడింది. "మన శ్రేయస్సుని కాంక్షించిన వారిపైన కోపాన్ని ప్రదర్శించకుండా వారి సూచనలను స్వీకరించడం శ్రేయస్కరం."
శ్రీరామునికి దూరమైన సీతమ్మ రావణాసురుని స్వాధీనమైంది. అశోకవనంలో ఆమె జీవితం శోకమయంగా మారింది. మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి విస్మరిస్తామో అప్పుడు కామాసురుడి కబంధహస్తాలలో బందీ అవుతాం. ఒక అల్పమృగాన్ని ఆశించడం వల్ల ఆనందస్వరూపుడైన రాముణ్ణి కోల్పోయింది సీతమ్మ. అశోకవనంలోని శింశుపావృక్షం క్రింద కూర్చొని పశ్చాత్తాప హృదయంతో విలపించింది.ఒకప్పుడు పసిడిలేడిని చూచి మోహితురాలైన సీతమ్మ ...రావణుడు "నువ్వు కోరితే సమస్త ప్రపంచాన్నే నీ ముందు ఉంచుతాను" అని ఆశ చూపించినా ప్రలోభపడలేదు. పరుల నిధుల కంటే పతి సన్నిధియే మిన్న అని సీతమ్మ దృఢ మనస్కురాలై శ్రీరాముని సాన్నిధ్యం కోసం వేయి కళ్ళతో ఎదురు చూసింది. సీతమ్మ ఆవేదనను విన్న శ్రీరామచంద్రుడు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు. పశ్చాత్తాపంతో చేసిన ప్రార్ధనలు భగవంతుణ్ణి మన వద్దకు తీసుకువస్తాయి.ఆయన సన్నిధి తప్పక లభిస్తుంది.
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు