Thursday, January 21, 2016 By: visalakshi

అవధూతోపాఖ్యానము - 2

 ఓం శ్రీ గురుదేవ దత్త నమో నమ:


మొదటి గురువు భూమి:- పూర్వకర్మననుసరించి జీవులకు ఈశ్వరుడే ఆయా దేహాలు ప్రసాదించి, వాటి జీవనానికవసరమైనరీతిగా ప్రవర్తింపజేస్తాడు.  అటువంటి పశుపక్ష్యాదులెన్నో భూమిపై నివసిస్తున్నాయి.
మానవులు భూమిని  దున్నుతారు. బావులు,చెరువులు కోనేళ్ళకోసం భూమిని త్రవ్వుతారు.అయినప్పటికీ భూమి ఓర్పు వహించి, జీవులకు సస్యాలు, ఆశ్రయమూ యిచ్చి పోషిస్తుంది. ఇన్ని జీవులనుండి తనకెంత బాధ కల్గినా చలించక, తన ధర్మాన్ని తాను అనుసరిస్తుంది. అలానే పూర్వకర్మవలన ప్రేరేపింపబడిన సకల భూతాలవలనా పీడింపబడినప్పటికీ ముముక్షువు,ప్రేమ-ఓరిమిలతో సహించి ధర్మమార్గము నుండి చలించకుండా ధైర్యం వహించి వుండాలని భూమినుండి నేర్చుకున్నాను.

 రెండవ గురువు వాయువు:- వివిధ వస్తువుల శీత-ఉష్ణ, శుచి-అశుచి, సుగంధ-దుర్గంధాలతో సంబంధము లేకనే వాయువు అనాసక్తుడై వాటిమధ్య సంచరిస్తాడు. తాత్కాలికంగా వాటిచేత ప్రభావితుడైనట్లు కనిపించినా మరుక్షణమే తన సహజ నైర్మల్యంతో ఎల్లెడలా సంచరిస్తాడు. ముముక్షువుగూడ యింద్రియ విషయాలనుభవమవుతున్నా సుఖ దు:ఖాది ద్వంద్వాలలో తగుల్కొనక హృదయము-వాక్కులకు అనుక్షణమూ సంభవించే విక్షేపాలను తొలగించు కోవడమే జీవితలక్ష్యమని తలచి, ప్రాణరక్షణ కవసరమైన ఆహారం మాత్రం చేతనే యోగి తృప్తి చెందాలి. 

 మూడవ గురువు ఆకాశము:- అప్పుడప్పుడు ఆకాశము, మేఘాలు, ధూళి, సంధ్యారాగాల చేత ప్రభావితమైనట్లు కంపించినా, అది సహజంగా దేనికీ అంటనిది.ముని గూడా కాల గతిలో సృష్టించబడిన త్రిగుణాల వికారరూపమైన దేహానికీ,దానివలన కలిగిన మనోవికారాలకూ అంటని వాడై, ఆకాశంలా స్వచ్చుడై ఉండాలని తెలుసుకున్నాను. అంతేగాక, ఆత్మ ఆకాశంవలె సర్వవ్యాపి. దానియందు గోచరించే వివిధ రూపాలచేత అది అవిభేద్యము, అసంగము, శుద్ధమూ అని గ్రహించాను. అట్టి ఆత్మయే బ్రహ్మంగదా! 

నాలుగవ గురువు అగ్ని:- అగ్నిదేవుడు ఒకప్పుడు విశేషాగ్నిగా ప్రజ్వలిస్తాడు. ఒకప్పుడు నివురుగప్పి మందంగా వెలుగుతాడు. మరొకప్పుడు రాపిడివల్లనే ప్రకటమయ్యే అగ్నితత్వంగా వస్తువులలో సూక్ష్మంగా దాగియుంటాడు. అట్టి సామాన్యాగ్ని,మధనంచేత విశేషాగ్నిగా ప్రకటమై, యజ్ఞం చేసేవారి పూర్వపాపాలను హరించి, రానున్న కర్మదోషాలను నివారించడం కోసము ఎవరినుండైనా సరే హవిస్సును గ్రహిస్తాడు. కాని తాను మాత్రం వారి పాపాల చేత అపవిత్రుడుగాకనే, వారి పాపాన్ని దహిస్తాడు. అలానే మునిగూడా తన    తపశ్శక్తిని  గుప్తంగా వుంచుకుంటూ, జనాన్ని పావన మొనర్చడానికై సర్వులనుండీ భిక్షనుగొని వారిననుగ్రహిస్తాడు. తాను మాత్రం అగ్నివలె యెట్టి భిక్షవల్లనైనా అపవిత్రుడు గాడు. అంతేగాక, అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ, కట్టెను చేరినపుడు ఆ రూపంలో భాసిస్తుంది. అలాగే ఆత్మగూడా,వివిధ దేహాలయందు తాదాత్మ్యం చెంది, ఆయా రూపాలలో గోచరిస్తుంది.జీవులన్నీ సకాలంలో జన్మించి మరలా సకాలంలో మరణిస్తున్నా, వాటి ఆద్యంతాలు అట్టి ఉత్పత్తిలయాల వలె గుప్తమైనవి. మధ్యదశలో మాత్రమే జీవులు గోచరిస్తాయి. కాని వాటి సృష్టిస్థితిలయాలకు ఆధారమైన ఆత్మ శాశ్వతము, వికారరహితము, అవ్యక్తము,సర్వగతమున్నూ అలానే సామాన్యాగ్నిగూడ. కనుక అగ్నియొక్క తత్వాన్ని గూర్చి విచారించి, నేనూ అట్టి తత్వజ్ఞానాన్ని పొందాను. అగ్ని వివిధ వస్తువుల గుణభేదాలను దహించి ఏకరూపమైన విభూతిగా మారుస్తుంది. అలానే ఈ తత్వజ్ఞానమనే అగ్ని వివిధములైన వస్తువులనూ,గుణాలనూ నిరసించి, సర్వగతమైన విశ్వవిభుని తత్వాన్ని గ్రహించి తనలో తానే అణగియుంటుంది. 

 తదుపరి టపాలో మరి కొందరి గురువులను గూర్చి వివరణ....


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

0 comments: