ఓం శ్రీ ముకుందాయ నమ:
భవకూపంబుల బడలెడినాడు పాయని బంధువుడు ఇతడొకడే
దివి స్వర్గంబున తేలెడినాడు తిరుగబాయకెపు డితడొకడే
నవ నరకంబుల నలగెడినాడు నటనల బాయడితడొకడే
ఇవలనవల హృదయేశుడు విష్ణుడుఈతని మరువకుమీ జీవాత్మా..
భా: - 'సంసార సాగరంలోనే కాదు, స్వర్గనరకాల్లో,పూర్తిగా ఇహపరాల్లో మనకు దిక్కైనవాడు ఆ భగవంతుడు ఒక్కడే!అలాంటి హృదయేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును విస్మరించవద్దు.'
శ్రీ సాయిబాబాగారి అమృతతుల్యమైన పలుకులు:-
ఎవరయితే నన్ను శరణు వేడెదరో, భక్తివిశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో వారిని దు:ఖబంధనములనుండి తప్పింతును.' ప్రాపంచిక విషయములను మరచి,నా లీలలను,చరిత్రమును మననము చేయుచు,ఎల్లప్పుడు నన్ను జ్ఞప్తియందుంచుకొనుడు.
మన:పూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధచైతన్యముతో తాదాత్మ్యము కలుగును.' సాయి సాయీ యను నామమును జ్ఞప్తియందుంచుకొన్నంత మాత్రమున, చెడుపలుకుటవలన, వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును.
"మీరెక్కడ నున్ననూ, ఏమి చేయుచున్ననూ నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. "
నేనందరి హృదయముల పాలించువాడను. అందరి హృదయాలలో నివసించువాడను.నేను చరాచరజీవకోటి నావరించియున్నాను.
ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే.
నేనే జగన్మాతను,త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియచాలకుడను నేనే,సృష్టిస్థితిలయకారకుడను నేనే.
ఎవరయితే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికేహానిగాని బాధగాని కలుగదు.నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు,చీమలు తదితర దృశ్యమాన చరాచరజీవకోటి యంతయు నా శరీరమే,నా రూపమే!"
"నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, భక్తి శ్రద్ధలతో మన:పూర్వకంగా నన్నే ఆరాధించువారి యోగక్షేమముల నేను జూచెదను.ప్రపంచములోని కీర్తిప్రతిష్ఠలకై ప్రాకులాడుట మాని, దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నించుము."
తదుపరి అధ్యాయములో 'గురుకరస్పర్శ 'ప్రభావము.... -సశేషం...
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.
0 comments:
Post a Comment