అత్యంత శ్రేష్ఠము,అతి దుర్లభము, కఠినమూ అయిన బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోగల ఉపాయం శ్రీసాయిబాబా సత్యచరిత్ర పదహారు, పదిహేడు అధ్యాయాల్లో వివరంగా చెప్పబడింది.
శ్లో" చతుర్విధా భజంతే మాం జనా: సుకృతినో'ర్జున
ఆర్తో జిజ్ఞాసు రర్ధార్ధీ జ్ఞానీ చ భరతర్షభ (7వ అ..16వశ్లో")
భా:- ఓ భరతవంశ శ్రేష్ఠుడైన అర్జునా! ఆపదలోనున్నవాడు, సంపద గోరువాడు,జ్ఞానమునువాంచించువాడు,పరమాత్మజ్ఞానము నన్వేషించువాడు..ఈ నాలుగురకములైన పుణ్యాత్ములును నాకు భక్తియుక్తమైన సేవ చేయును.
పరబ్రహ్మ ప్రతీక 'ప్రణవస్వరూప ఓంకారా'న్ని సదా ధ్యానించాలి. ఇది వేదాలన్నిటికీ సారం. ఓంకార ఉచ్చారణతో దాని అంతరార్ధం మనసుకి స్పురిస్తుంది. దాని ఆవర్తన (మళ్ళీ మళ్ళీ అనటం) తో బ్రహ్మ సాక్షాత్కారమౌతుంది. జ్ఞానులు స్వస్వరూపంలో లీనమయితే వేదాంతాల్లో విద్వాంసులు వర్ణించిన సత్యము, జ్ఞానము, ఆనందము ఇత్యాది లక్షణయుక్తమైన బ్రహ్మ స్వయంగా వారివద్ద ప్రకాశిస్తుంది.
'శ్రేయస్సు ' అంటే సర్వదు:ఖాల నుంచి సంపూర్ణంగా ముక్తులై నిత్య ఆనందస్వరూప పరబ్రహ్మ పురుషోత్తముని ప్రాప్తింప చేసుకొనే ఉపాయం. ప్రేయస్సు అంటే భార్య, పుత్రులు, ధనం, ఇల్లు, వాకిలి, మానసన్మానాలు, యశస్సు ఇత్యాది ఇహపరలోకాల్లోని సుఖాలను అనుభవంలోకి రప్పించుకోవటానికి చేసుకొనే ఉపాయం. శ్రేయస్సు వివేకరూపంగా ఉంటుంది. ప్రేయస్సు అవివేకరూపంగా ఉంటుంది. శ్రేయస్సు విషయం కేవలం విద్య,జ్ఞానము. ప్రేయస్సు విషయం కేవలం అవిద్య, అజ్ఞానం, మోహం. ఈ రెండిటి గురించితెలిసినప్పటికీ మానవప్రాణులు స్వతంత్రబుద్ధితో సరైనదాన్ని ఎన్నుకోవాలి. ప్రేయస్సును పక్కకు జరిపి శ్రేయస్సుని ఆదరించడం పురుషార్ధమవుతుంది. పురుషార్ధం ఉదయిస్తే అప్పుడా పురుషులు తమ హితంకోసం సంసార చక్ర భ్రమణం నుంచి విడుదల అవటానికి, యోగ్యమైన ఉపాయం సాధిస్తారు. జీవుడికి అజ్ఞానమనే ఈ వృత్తే అతణ్ణి సంసారంవైపు ప్రవృత్తం చేస్తుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత అదే జీవుడు సంసారం నుంచి నివృత్తి అయిపోతాడు. ఆత్మను నిజంగా తెలుసుకొన్నవారికి అహంభావం అణుమాత్రమైనా ఉండదు. నివృత్తి విశేషం ఏమిటంటే నేనే సర్వత్రా ఉన్నాను అన్న భావంతో చూడటం వల్ల అక్కడ శతృత్వం, మితృత్వం అనేవి ఉండవు. అలాంటి మహాసుఖం ముందు శారీరిక మహాదు:ఖాలు ఏపాటి! మహాసుఖం ఇష్టమైనప్పుడు ఐహిక సుఖాలకోసం ఎవరేడుస్తారు! ఆత్మదర్శనంపై ఆసక్తి ఉన్నవారు ఈ భూమ్మీద ఆయుష్షుని కోరతారు. ఇక్కడే చిత్తశుద్ధి కలుగుతుంది. నిర్మలబుద్ధి ప్రాప్తిస్తుంది. భక్తిశ్రద్ధలు కలబోసిన మనసుతో, పూర్ణంగా నమ్రతతో సాష్టాంగ నమస్కారం చేసి 'గురువు 'కి శరణు వెళ్ళాలి. వారు జ్ఞాననిధిని ప్రసాదించగలరు. సర్వమూ సమర్పించి ఆయన్ని సేవించాలి. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు అన్న విషయం 'గురువు 'తప్ప ఎవరూ చెప్పలేరు.
'గురువు ' కూడా పూర్ణంగా శరణు రాకుండా ఉంటే జ్ఞానాన్ని ప్రసాదించరు. బ్రహ్మ, ఆత్మల ఐక్యతను సులభం చేయటానికి గురుపాదాలే సమర్ధవంతమైనవి. సాష్టాంగం చేసి గురుచరణాల్లో శిరసుంచి మనసులోని ఉత్తేజాన్ని దృఢం చేసుకొని గురుపాదాలు పట్టుకొని నోటితో, నేను మీ దాసానుదాసుణ్ణి. నాకు మీ పాదాలపై అచంచల విశ్వాసముంది " అనాలి. అప్పుడు చూడండి ఆ గురువు చమత్కారం! ఆ గురువనే దయామృత సాగర తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడ్తాయి. పీడలను నాశనం చేసి తమ అభయహస్తాన్ని మీ తలమీద పెట్టి సర్వపాపాల రాశిని దగ్ధం చేసి నుదుటిమీద విభూతి పెడ్తారు.
క్లుప్తంగా చెప్పాలంటే ఆత్మజ్ఞానమనేది వృద్ధాప్యంలో ఇంద్రియశక్తి క్షీణించిన తరువాత జగత్తులో ఎవరూ పట్టించుకోనప్పుడు ఖాళీగా ఉన్నామని చేసే పని కాదు. అలాగే రానూ పోనూ బాడుగకు తీసుకొన్న గుర్రబ్బండిలో హడావిడిగా వచ్చి అది కూడా తనదగ్గర రెండువందల యాభైరూపాయలు జేబులో ఉంచుకొని కేవలం అయిదు రూపాయలపై లోభం పెట్టుకొంటే బ్రహ్మజ్ఞానం ప్రాప్తించదు. బ్రహ్మప్రాప్తికి సాధకులు సర్వసుఖోపభోగాలు త్యాగం చేసి సమస్త ఆశలు, ఆకాంక్షలూ వదిలేసి బాగా శ్రమించవలసి ఉంటుంది. శ్రీ సాయినాధుని వంటి సద్గురువుని ఆశ్రయించవలసి ఉంటుంది. అప్పుడే ఆత్మ ప్రసన్నమై స్వయంగా సాధకులకి తన యదార్ధస్వరూపాన్ని చూపిస్తుంది. ఆత్మ ఎవరిని స్వీకరిస్తుందో వారికే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. వారికోసం ఆ ఆత్మ తన స్వరూపాన్ని స్వయంగా ప్రకటం చేస్తుంది.
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.
0 comments:
Post a Comment