Wednesday, November 16, 2016 By: visalakshi

అన్నదానం

 సాయి సత్యచరిత్ర 38 వ అధ్యాయములో నిరుపేదలకు బాబా స్వయంగా భక్తులకు పెద్ద గుండిగలలో అన్నం వండి అన్నదానం చేసేవారు.. "అన్నం పరబ్రహ్మ స్వరూపం." "పుణ్యాలలోకెల్లా పుణ్యం అన్నదానం". "ఆచార ధర్మాల్లోకెల్లా ప్రధానమైనదీ అన్నదానం" అందుకే బాబా దాన్ని స్వయంగా ఆచరణలో పెట్టి లోకంలో ఓ ఆదర్శం నెలకొల్పారు. అన్నదానం చేయటంలో బాబా బోధ ఏమిటంటే దాన్ని స్వయంగా వండి, అది తినేవారికి గొప్ప ప్రేమతోనూ, ఆదర సత్కారాలతోనూ సమక్షంలో పెట్టవలసివుంది. ఆ శ్రమ బాబా స్వయంగా తీసుకొనేవారు. "గడపలోకి ఎవరైనా ఎప్పుడైనా రానీ వచ్చిన అతిధులను అన్నదానంతో సంతృప్తి పరచాలి గృహస్థులు" .ఇదే మనుష్యయజ్ఞం అని బాబాగారు 19వ అధ్యాయములో వివరించారు.





గురువు స్వయంగా ప్రసాదమిచ్చినప్పుడు అది తినటానికి యోగ్యమా అయోగ్యమా అన్న శంక శిష్యుల మనసుకు కలగకుండా ఆ ప్రసాదాన్ని ఆదరపూరకంగా స్వీకరించి భుజించాలి. దేవుడి ప్రసాదానికి కూడా ఉపవాసం ఉన్నాము మరుసటిరోజు తింటాము అని పక్కన పెట్టకూడదు. "తినాలీ తినకూడదూ అన్న వికల్పం" యోగ్యం కాదు. అలా వ్యవహరించేవారు ఆ దేవతను అనాదారం చేసినట్లే. ఎంతో అదృష్టంతో లభించిన దైవప్రసాదాన్ని వెంటనే స్వీకరించాలి. అనుగ్రహాన్ని అనుభవించాలి. 

  ఏదైనా పనిమీద బయలుదేరేటప్పుడు భోజనసమయం అయి ఉంటే ఉపవాసంతో బయలుదేరకూడదు. ఎవరైనా ప్రేమతో ఫలహారం పెడితే తిరస్కరించి బయలుదేరకూడదు. దాన్ని "పూర్తిగా శుభశకునంగా కార్యనిర్విఘ్నకారకంగా భావించాలి." 32వ అధ్యాయంలో దీని గురించి బాబా , వనంలో కలిసిన వణజరి గురించిన స్వంత అనుభవాన్ని తెలిపారు. 




 అన్నం ఒంటరిగా తినటం మంచిదికాదు. మన ఎవరైనా వ్యక్తిగానీ లేదా పశుపక్షులుగానీ వున్నా వారికి అందులోంచి కొద్దిగా పెట్టి తినాలి. ఎవరూ లేకపోతే బాబాని స్మరించుకొని ఆయనకు అర్పించి తినాలి.బాబా స్వయంగా ఎప్పుడూ ఉపవసించలేదు. ఎవరినీ ఉపవసించనీయలేదు. అన్ని ఇంద్రియాలూ శక్తివంతంగా ఉన్నప్పుడే దేవుడిపై భక్తి పెట్టుకోగలం. అని చెప్పేవారు. "కడుపులో అన్న తడి లేకపోతే ఏ కళ్ళతో దేవుణ్ణి చూడాలి? ఏ వాక్కుతో మహిమను వర్ణించాలి? ఏ చెవులతో వినాలి? ఉపవాసం అంటే దైవం వద్ద వుండటం, పరమాత్ముని సతత చింతనలో రోజుని గడపటం. అన్ని ప్రాణుల్లోనూ నన్ను చూసేవారే నాకు ప్రీతి పాత్రులు. భేదబుద్ధిని వదిలి నా పట్ల భక్తిభావంతో శ్రద్ధతో వుండి పారమార్ధిక ప్రాప్తిని పొందండి.





"సమస్త దేవీదేవతలు ఒకటే కానీ జనులు వారిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అందుకని ఇతర దైవాలను అవమానించకూడదు." ఈ తత్వానికే మరో బోధ ఏమిటంటే అది బాబా ఎప్పుడూ ఉపదేశించే ..రాముడు, రహీము ఒక్కరే. వీరిలో తేడా లేదు. మరి వారి భక్తులు ఎందుకు శత్రువుల్లా ప్రవర్తిస్తారు? ఎంత మూర్ఖులు! హిందూముస్లింల మధ్య సత్సంబంధాలు నెలకొల్పండి. చక్కని ఆలోచనలను మనసులో దృఢం చేసుకోండి. అప్పుడే అవతలి తీరానికి చేరుకొంటారు. ఈ ప్రకారంగా ఈ అధ్యాయంలో అన్నదానం, సర్వదేవతల ఐక్యత, సర్వధర్మాల ఏకాత్మత విషయాల గురించి అమూల్యమైన బోధను బాబా మనకు ప్రసాదించారు.


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు


0 comments: