స్త్రీలను జగన్మాతరూపాలుగా, మాతృమూర్తులుగా భావించే అద్భుత సంస్కృతికి నిలయమైన మాతృభూమి మనది.స్త్రీలు దు:ఖిస్తే సిరిసంపదలు నిలవవనీ, స్త్రీలను వేధిస్తే అరిష్టాలు ఆవరిస్తాయనీ నమ్మిన ఆర్యభూమి మనది. విద్యాదాయిని సరస్వతి, సౌభాగ్యదాయిని లక్ష్మి, శక్తిప్రదాయిని పార్వతి...ఇలా ముగురమ్మలను ఆరాధించే దేవభూమి మనది; ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి: - కనురెప్పలు తెరచినంత మాత్రాన సృష్టి, కంటికాంతులు ప్రసరించినంత మాత్రాన స్థితి, కనురెప్పలు మూసినంత మాత్రాన లయలను సాగించే ఆదిపరాశక్తి ఆవిర్భవించిన ఆధ్యాత్మిక భూమి మనది.
అలాంటి పుణ్యభూమి అయిన భారతావనిలో నేడు స్త్రీలు ఇంటా, బయటా వేధింపులకు గురవుతున్నారు. ...కామాసురులు, మదాసురులు,
లోభాసురులు లేని సమాజాన్ని చూడాలంటే, అనుగ్రహించి అభయమిచ్చిన ఆ జగన్మాతే ఆగ్రహిస్తే వినాశనమవుతామన్న విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి.
మనిషిచేత పాపకృత్యాలు చేయించేవి నియంత్రణలోలేని దశేంద్రియాలు. ఈ దశేంద్రియాల ద్వారా మనిషి చేసే పాపకృత్యాలు పది. అవి - దోపిడి, హింస, స్త్రీవ్యామోహం, లోభం, వంచన, పరుషవాక్కులు, అసత్యం, పరనింద, చాడీలు చెప్పడం, అధికార దుర్వినియోగం,ఈ దశవిధ పాపాలను హరించడానికి జగదంబను కొలిచే పండుగనే 'దశహరా ' అని అంటారు.......జన్మరాహిత్య స్థితిని పొందడానికి మానవజన్మ దశలను హరించమని జగన్మాతను ఆరాధించే పండుగనే 'దశహరా ' అని కూడా అంటారు. కాలాంతరంలో ఈ పదం 'దసరా 'గా రూపాంతరం చెందిందని పెద్దలంటారు.
మానవుల వద్ద శక్తిని ప్రసాదించే ఒక గొప్ప మంత్రం ఉంది.అది విజయానికి దారి తీసే అద్భుతమంత్రం.,అదే ఐక్యతామంత్రం. ఐకమత్యంగా ప్రజలందరినీ సంఘటిత పరచగలిగినశక్తి జన-గణేశుడు ఇస్తాడు. ఇంక ప్రజలందరి ఐశ్వర్యానికి సమిష్టి రూపంగా లక్ష్మీదేవి, జ్ఞానం యొక్క సమిష్టిరూపంగా సరస్వతీదేవి, సమాజంలోని యువశక్తికి స్పూర్తిదాయకునిగా కార్తికేయుడు నిలుస్తారు.ఈ నాలుగు సమిష్టి శక్తిరూపాలను కలగలిపితే వచ్చే ఏకత్వశక్తియే దుర్గా స్వరూపం.చతుర్భుజుడైన గణేశుని, రెండుభుజాలతో ఉన్న లక్ష్మి, సరస్వతి, కార్తికేయుల మొత్తం భుజశక్తిని కలుపుకొని పదిభుజాలతో దుర్గామాత మనకు గోచరమవుతుంది.
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ, వారికి గల సంఘటితశక్తికీ సంకేతం ఈ దుర్గామాత. ప్రజాబలం, ధనం, జ్ఞానం, ఐకమత్యాలు అన్నీ కలగలిసినప్పుడు దుర్గ ఆవిర్భవిస్తుంది. నాలుగు దిక్కులు, నాలుగు మూలలు, పైన, క్రింద అన్నీ కలిపితే దశదిశలు ఏర్పడతాయి.ఈ దశదిశలనుండి వచ్చిన ఏ ప్రమాదాన్ని అయినా అరికట్టగల అప్రమత్తతను కలిగి ఉండి, పది చేతులతో ఆయుధాలను ధరించిన శక్తి స్వరూపంగా దుర్గామాతను కొలుస్తారు. దుర్గామాత మాతృరూపంలో సమాజాన్ని పరిరక్షిస్తూ మన పూజలను అందుకొని..మనచే ఆరాధింపబడుతున్న మాతృరూపిణి.
జ్ఞానం, ఎరుకలతో కూడిన ప్రజ్ఞ బాహ్యశత్రువులనే కాక అంతర్గతంగా మనస్సులో దాగి ఉన్న అరిషడ్వర్గాలను సైతం నశింపజేయగలదు.. శత్రువులు అంటే రాక్షసులు, దుర్మార్గులుగా ఎక్కడి నుండో వచ్చేవారు మాత్రమే కాదు, సమాజంలోనే అంతర్గతంగా నివసిస్తూ మన మధ్యే తిరుగాడుతూ ఉండేవారు కూడా అని చెప్పవచ్చును. ఒక వైద్యుడు తన వృత్తిధర్మాన్ని విస్మరించినప్పుడు, ఒక దుకాణదారుడు వస్తువులను కల్తీ చేసినప్పుడు, రాజకీయాలు దుష్టత్వాన్ని సమర్ధించినప్పుడు, ఒక దొంగ నాయకుడైనప్పుడు, అనర్హుడు మత బోధకునిగా ప్రచారాలు చేస్తున్నప్పుడు, అసమర్ధుడు ప్రజాపాలకుడైనప్పుడూ - ఈ సమాజమనే తల్లి ఆ త్రిశూలాన్ని తప్పక ధరించవలసి ఉంటుంది! ఐకమత్యంగా ఉన్న మానవ సమూహమే సమాజాన్ని తల్లిగా, దుర్గామాతగా సంరక్షిస్తుందని గుర్తెరగాలి.

0 comments:
Post a Comment