'మీ నర నరాల్లో బ్రహ్మచర్యం అగ్నిలా ప్రజ్వరిల్లాలి.' "శరీరం, మనస్సు, బుద్ధి ఈ మూడు సమగ్రంగా పరిణతి చెందాలంటే బ్రహ్మచర్యం అత్యంత ఆవశక్యం. బ్రహ్మచర్యాన్ని అవలంబించిన వ్యక్తులలో అద్భుతమైన జ్ఞాపకశక్తి, గణనీయమైన అవగాహనశక్తి వృద్ధి చెందుతాయి." బ్రహ్మచర్యాన్ని పాటించడం ద్వారా లైంగికశక్తి మరింత ఉన్నతమైన 'ఓజస్సు ' అనే మానసిక శక్తిగా రూపొందుతుంది.
ఆత్మనిగ్రహానికి,జిహ్వేంద్రియాన్ని అదుపులో ఉంచడానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అతి బలమైన జిహ్వేంద్రియాన్ని అదుపులో ఉంచడం ద్వారా మిగిలిన ఇంద్రియాలపై నియంత్రణ సులభం అవుతుంది. అందుకే ఆహార విషయంలో కొన్ని నియమనిబంధనలు అవసరం. సాత్విక ఆహారం తీసుకోవడం ;అపక్వ ఆహారం అంటే పండ్లు, కాయగూరలు భుజించడం; ఉపవసించడం మొదలైనవన్నీ సాధనామార్గంలో అవసరం. బ్రహ్మచర్య సాధన ఆరంభంలో శరీరానికి ఎలాంటి ఆహారం ఇస్తున్నామనే విషయంతో పాటు మనస్సుకు ఎలాంటి సమాచారాన్ని అందజేస్తున్నామనేది కూడా అంతే ముఖ్యం. మనస్సులోని ఆలోచనలు, భావనలు, ఇంద్రియాల నుండి సేకరించే సమాచారం పరిశుద్ధమైనవిగా ఉండటం బ్రహ్మచర్యపాలనకు అత్యంత ఆవశ్యకం.
గాంధీ మహాత్ముడు బ్రహ్మచర్యం గురించి తెలియజేస్తూ..." కేవలం జిహ్వేంద్రియాన్ని, గుహ్యేంద్రియాన్ని అదుపులో ఉంచడం బ్రహ్మచర్యం కాదు. త్రికరణశుద్ధిగా ఆత్మనిగ్రహాన్ని పాటించినప్పుడే అది సమగ్రమైన బ్రహ్మచర్య అనుష్ఠానం అవుతుంది." అని వివరించారు.
విషయాసక్తిని కేవలం భౌతికమైన పద్ధతులద్వారా అదుపు చేయలేము. మానసిక స్థాయిలో దాన్ని పరిష్కరించడం చాలా ముఖ్యం.
పూర్వమీమాంస కర్త అయిన జైమిని వేదవ్యాసుని వద్ద విద్యాభ్యాసం చేస్తున్న రోజులవి. పాఠ్యబోధనలో భాగంగా ఒకరోజు వ్యాసభగవానుడు ' ఎట్టి పరిస్థితులలోనూ స్త్రీలతో కలిసి మెలగవద్దు. అలాచేస్తే మీరు ఎంత జాగ్రత్త వహించినా, ఎంత మెలకువగా ఉన్నప్పటికీ కామానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది.' అని సూచించారు. అప్పుడు జైమిని అతి విశ్వాసంతో గురువర్యా! నేను బ్రహ్మచర్యంలో సుప్రతిష్ఠుడనయ్యాను.ఏ స్త్రీ కూడా నన్ను ప్రలోభానికి గురి చేయలేదు. అని పలికాడు . ఓహో అలాగా! అది త్వరలోనే తెలుస్తుంది అంటూ వ్యాసమహర్షి తీర్ధయాత్రకు బయలుదేరారు.
ఒకనాడు వ్యాసుడు తన యోగశక్తి ప్రభావంతో అందమైన స్త్రీ రూపాన్ని ధరించాడు. ఆకాశం మేఘావృతమై మరి కొద్దిసేపట్లో కుండపోతగా వర్షం కురుస్తుందనగా నిస్సహాయురాలైన అబలవలె ఒక చెట్టు క్రిందకు చేరాడు. అదే దారిలో తన ఆశ్రమానికి వెళుతున్న జైమిని ఆమెని చూసి ఆశ్రయం కల్పించి రక్షించాలనే ఉద్దేశంతో తనతో పాటు తీసుకువెళ్ళాడు.ఆమెకు ఆశ్రమం లోపల బస ఏర్పాటు చేసి, తను మాత్రం వరండాలో పడుకున్నాడు. అర్ధరాత్రి కామప్రకోపం అధికరించగా బయట చలిగాలి బాగా వీస్తోంది అంటూ లోపలికి చేరాడు. మరికసేపటికి ఆ స్త్రీ చేతిగాజుల గలగలలు విని ఉండబట్టలేక ఆమెను సమీపించాడు. అప్పుడు అక్కడ ఆ స్త్రీ స్థానంలో వ్యాసమహర్షి ప్రత్యక్షమై జైమినీ! ఏమైంది నీ సంయమన శక్తి? ఇప్పుడు చెప్పు, నువ్వు బ్రహ్మచర్యంలో సుప్రతిష్ఠుడవయ్యావా? అని ప్రశ్నించారు.
మాయ యొక్క శక్తి, ఇంద్రియాల ప్రభావం ఎంతటి ఘనులైనా మోసగిస్తుంది. అందుకే బ్రహ్మచర్యాన్ని పాటించాలనుకునే సాధకులు పెద్దల సూచనలను అనుసరించే క్రమంలో ఎలాంటి అలసత్వానికి తావు ఇవ్వకూడదు. స్వామి వివేకానంద బ్రహ్మచర్య వ్రతపాలన గురించి చెబుతూ "బ్రహ్మచర్య ఆదర్శాన్ని చేపట్టాలని కోరుకునేవారు సంయమనానికి సంబంధించిన నియమాలను నిష్ఠగా పాటించాలి. స్త్రీ సాంగత్యాన్ని కూదా విడనాడాలి." అని హెచ్చరించారు.
పతంజలి మహర్షి 'వితర్కభావనే ప్రతిపక్షభావనం - హానికరమైన భావాలను అరికట్టడానికి సద్భావాలను మనస్సులో ప్రవేశపెట్టాలి.'అని యోగసూత్రాల్లో సూచించారు.మహాత్ముల దివ్యసన్నిధి, స్పూర్తిదాయక వచనాల ప్రభావం వల్ల ప్రాపంచికుల మనస్సులు పవిత్రమవుతాయి. "పుణ్యక్షేత్రాలు,తీర్ధస్థలాల్లో ఎందరో మహాత్ములు సాధన చేస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశాలను దర్శించినప్పుడు మనస్సు త్వరితగతిన ఉనంత ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతుంది."
బ్రహ్మచర్య పాలనకు అత్యున్నత పరిష్కారం శరీర స్పృహను విడిచి ఆత్మబుద్ధిని అలవరచుకోవటం, సర్వులను లింగభేదంలేని నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, ఆత్మ స్వరూపాలుగా పరిగణించడం. ఇందుకు పట్టుసడలని సుదీర్ఘ ప్రయత్నం అవసరం.జపము,ధ్యానము, స్వాధ్యాయము, సంకీర్తన, సేవ, ప్రార్ధన వంటి మంచి అలవాట్లతో శారీరకంగా, మానసికంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం సులభమవుతుంది.
1 comments:
మరోసారి ధన్యవాదములు వేదగారు. చక్కటి వివరణ.
Post a Comment