పురుషార్ధాలు
" పురుషేణ (ఆత్మనా) అర్ధ్యతే కామ్యతే ఏతే పురుషార్ధా:"!
పురుషునిచే అంటే ఆత్మచే (స్త్రీ పురుషులచే) కోరబడేవి కనుక వీనికి పురుషార్ధాలని పేరు.. పురుషార్ధాలు నాలుగు. ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు. అధర్మ కార్యాలనుండి ఇంద్రియాలను మరల్చి ధర్మకార్యాలలో వాటిని రమింపజేయాలనేది వేదఋషుల ఆదేశం. అందుకే మానవుని జీవనంలో శ్రమించి సాధించే శ్రేయోమార్గాన్ని మనకు చూపించారు. ఆ శ్రేష్ఠ మార్గమే పురుషార్ధ సాధన-పురుషార్ధాలు.
ధర్మం:-
విశ్వమంతటా అంతర్యామి రూపంలో నిండి ఉన్న పరమాత్మ - విష్ణువు. సృష్ఠిలోని త్రివిధ పదార్ధాలనూ సత్వ,రజస్తమో గుణాలతో కూడిన పదార్ధాలను ఆ పరమాత్ముడే తయారు చేసాడు. అప్పుడే ఆ పదార్ధాలన్నీ తమ తమ ధర్మాలను ధరించి ఆయా విధులను సక్రమంగా నిర్వహిస్తాయని వేదం ఉపదేశిస్తుంది. వేద విహిత కర్మలు ధర్మములు. వానికి విరుద్ధమైనవి అధర్మములు. ధర్మాన్ని నాశనం చేసేవారిని ధర్మమే నాశనం చేస్తుంది. ధర్మాన్ని రక్షించేవారిని ధర్మమే రక్షిస్తుంది. ధర్మాన్ని విడిచిపెట్టినవారిని ధర్మమే విడిచి పెడుతుంది. అందువలన శ్రద్ధతో ధర్మాన్ని ఆచరించాలి.
పురుషార్ధాలన్నింటికీ 'ధర్మమే ప్రధాన లక్ష్యం ' అందుకే ఋషులు ధర్మాన్ని అతిక్రమించ వద్దని పదే పదే హెచ్చరించారు. అపుడే మనుష్యుడు తన పరిధిలో తను జీవిస్తాడు. సుఖిస్తాడు. తృప్తిని, శాంతిని పొందుతాడు.
ఈ ప్రపంచములో మానవులకు ధర్మమొకటే మిత్రుడు. అది మరణించిన తరువాత కూడా మన వెంట ఉంటుంది. బాంధవ్యాలతో సహా అన్నీ మనలను విడిచిపోతాయి. కానీ ధర్మం మాత్రం మనలను ఎప్పుడూ విడువదు.
అర్ధం:- మనం ఈ లోకంలో అనుభవించే పదార్ధాలన్నీ అర్ధాలే. ధర్మబద్ధంగా వస్తువులను సంపాదించుకొని వానిని త్యాగభావంతో అనుభవించడమే అర్ధ ప్రయోజనం. గృహస్తులకు సంపదలు కావాలి. వాటిని కష్టపడి పురుషార్ధంతో సాధించాలి. సాధించిన వానిని భోగించాలి. ఆ భోగంలో త్యాగముండాలి. నాది కాదనే ఆలోచన ఉండాలి. ఇతరులు కూడా ఆ వస్తువులను అనుభవించేందుకు అవకాశం కల్పించాలి. నాది అనే భావం వీడి అందరిదీ అనే విశాల మనస్తత్వం అందరిలో కనిపించాలి. అదే అర్ధం...
కామం:- అంటే ధర్మబద్ధమని కోరికలు. పురుషార్ధాలలో ప్రధమంగా ఉన్న ధర్మంతోనే వస్తువులను పొందాలి. అలాగే కోరికలు కూడా చాలా సహజంగా ధర్మానికి నీతికి అత్యంత దగ్గరగా ఉండాలి. ఉత్తమ సంతానాన్ని ఉత్పన్నం చేసి లోకానికి ఉపకారం చేయాలి. మనుష్యుడు వాంచలకు లొంగిపోకూడదు. అందని కోరికలకు ఆశించి భంగపడకూడదు. కోరికలు మనిషికి దు:ఖాన్ని కలిగిస్తాయి. జీవితావసరాలను సాధ్యమైనంతవరకు తగ్గించుకోవాలి. అవసరాలు మనిషిని వేధించి బాధిస్తాయి. ఈ నాటి మానవులు మొదటిదైన ధర్మాన్ని, చివరిదైన మోక్షాన్ని విడిచి, మధ్యలోని అర్ధకామాల వెంట పరుగులు తీస్తున్నారు. ఋషుల ఆలోచనలకు భిన్నంగా వ్యవహరిస్తే మానవులకు దు:ఖమే కలుగుతుంది. త్రికాలజ్ఞులైన వేదఋషులను అనుసరించడం మన ధర్మం.
మోక్షం:- ఇది పరమ పురుషార్ధం కైవల్యం. ఇది యోగులకు మాత్రమే ప్రాప్తించే అత్యంత పరమపద సోపానం. దానికి మానవులు యమములు, నియమములు శ్రద్ధతో పాలించి, ప్రాపంచిక మోహాలను వదిలించుకొని ఈశ్వర ప్రాప్తిని పొందాలి.యోగికి చిత్తస్థైర్యం కొరకు ప్రణవనాదం ఆలంబనమౌతుంది. యోగి బ్రహ్మప్రాప్తికై యత్నించి ముక్తుడౌతాడు. బ్రహ్మము శాంతము, అజరము, అమరము, అమృతము అభయము......
.......Visalakshi.....
0 comments:
Post a Comment