Thursday, December 24, 2020 By: visalakshi

ఉత్తర ద్వార దర్శనం - విశిష్టత*


భగవద్గీతలోని "సర్వారంభ పరిత్యాగీ:సర్వసంకల్ప సన్న్యాసి"అనే పదబంధాలలోని పరమార్ధం శరణార్ధి అయినవాడు స్వయం సంకల్పిత కర్మలు చేపట్టరాదని,భగవత్ సంకల్పం ఉంటే చేయగలమని..మన పూర్తి బాధ్యతను భగవంతునిపై మోపవలెనని సారాంశం.

 *వైకుంఠ ఏకాదశి విశిష్టత*


సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.

ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు.

ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.

ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య.. ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతారు.

ముక్కోటి రోజున భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే మంచిదని చెబుతారు.

పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలున్నాయి. ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. రెండు.. ఏకాదశి రోజు మొత్తం- ఉపవాసం ఉండాలి. మూడు.. అబద్ధం ఆడకూడదు. నాలుగు స్త్రీ సాంగత్యం పనికి రాదు. ఐదు.. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆరు.. ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. ఏడు.. అన్నదానం చేయాలి.

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల.. నరక బాధలనుభవించే అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ రెండోది

కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడు విష్ణుమూర్తికి విన్నవించారు. రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని, మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు.

విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

ఇందులోని తాత్త్విక సందేశం ఇలా వుంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. ఉపనిషత్తులు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్ధేశించి ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించాలి.

ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కలుపుకుని మొత్తం పది. వాటితో పాటు.. మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం.

అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని చెబుతారు.

ఇదీ హిందువులు పరమపవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశికి చెందిన పూర్తి సారాంశం.


వైకుంఠ ఏకాదశి నాడు ఆచరించవలసిన విధులు* 

 శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలివెళ్లే సందర్భం- వైకుంఠ ఏకాదశి.

భక్తులందరికీ పరమ పవిత్రమైన ఈ రోజున ఆస్తికులు ఆచరించాల్సిన విధుల గురించి పెద్దలు ఈ విధంగా చెబుతున్నారు.

వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. స్నానానంతరం పూజాగదిని శుభ్రపరచుకుని తోరణాలతో అలంకరించాలి. వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి, హరికి ప్రీతిపాత్రమైన తులసీదళాలతో ఆ స్వామిని పూజించుకోవాలి.

ఈ రోజున విష్ణుమూర్తిని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలగడంతో... తమలాగానే వైకుంఠద్వారాన్ని పోలిన ద్వారం ద్వారా హరిని దర్శించుకునేవారికి మోక్షం కలగాలని వారు కోరుకున్నారట. ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి.. ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకి పరిపక్వత కలిగించమంటూ ఆ భగవంతుని వేడుకోవడం ఈ ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుంది.

ఏడాది పొడవునా ఏ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం కుదరకున్నా, ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపార ఫలితం దక్కుతుందంటారు. మనలో ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు... ఇలా మొత్తం కలిపి ఏకాదశ ఇంద్రియాలు ఉంటాయి. 

ఈ ఏకాదశ ఇంద్రియాలనూ ఆ హరికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం.

ఇందుకోసం ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి, ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరిస్తూ, మర్నాడు ఉదయం ఎవరికన్నా అన్నదానం చేసిన పిదప భుజించాలి.

ఏకాదశి రోజు రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనసునీ, ఉపవాసంతో శరీరాన్నీ అదుపు చేసుకుని... వాటిని హరిధ్యానంలోకి మరల్చడమే ఏకాదశి వ్రత ఉద్దేశం. అందుకనే లౌకికమైన ఆలోచనలు వేటికీ తావివ్వకుండా కేవలం హరినామస్మరణ మీదే మనసుని లగ్నం చేయాలని చెబుతారు. 

 ఇలా నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేసినవారికి ఇహపర శాంతి లభిస్తుంది.

 *హరినామ స్మరణం...* 

 *సమస్త పాప హరణం ....* 


*మార్గశిర శుద్ధ ఏకాదశి ... గీతా జయంతి*

గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు. 

భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతాజయంతి జరుపుకొంటారు. 

గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . 

కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.

 గీకారం త్యాగరూపం స్యాత్

 తకారమ్ తత్వబోధకమ్

 గీతా వాక్య మిదమ్ తత్వం

 జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:

 గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. 

"గీ" అనే అక్షరం త్యాగాన్నిను బోధించుచున్నది. "త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. 

గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. 

త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది . అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది. 

అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది

ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథ రాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం మొదలెడదాం. 

  సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|

 పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్||

ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి, ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే, మరొపక్క లొకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందించాడట.

అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి, ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో, అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు, 

 మన వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః.

అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.

ఎప్పుడో ద్వాపరయుగంలో చెప్పింది ఇప్పుడు పాటించాలా,ఇప్పటికి అప్పటికి చాలా తేడా అని

కొందరి భావం.

అప్పుడు మనిషిలో స్వార్ధం,అహం,లాభం,మోసం

ఇంకా ఎన్నో చేదు భావనలు ఉన్నాయో,ఇప్పటికి మనిషిలో ఆ గుణాలు ఎక్కువైపోయాయి,

కాబట్టి కాలం మారినా పరిస్థితులు మారినా

మనిషి నైజం,బుధ్ధి మారలేదు.....

ఏ యుగానికైనా ఏ రోజుకైనా మానవాళికి పనికి వచ్చే బోధనలు భగవద్గీత సొంతం

.ఇది ఆ మతం ఈ మతం అని కాకుండా సర్వ మాన వాళికి పనికి వచ్చే అపురూప గ్రంధం,అద్భుతాలను నింపుకున్న ఆదర్శ గ్రంధం..

0 comments: