Thursday, September 10, 2020 By: visalakshi

స్మరణ-ఆరాధన...

 #దేహలీ దీప న్యాయము"


🍁🍁🍁🍁

దేహలీ అంటే సంస్కృతంలో ఇంటి గడప అని అర్థం. దీపం ఇంటి గడప లోపల ఉంచితే ప్రకాశం ఇంటిలోపలే ఉంటుంది . దీపం ఇంటి బయట గడప అవతల ఉంచితే  ప్రకాశం వీధి లో ఉంటుంది. అదే దీపం గడప మీద పెడితే ఇంటా బయట కూడా ప్రకాశం ఉంటుంది.  దీనినే దేహలీ దీప న్యాయము అంటారు.


 ఏవిధంగా గడప మీద దీపము లోపల , బయటా చీకటి ని నశింపజేస్తుందో , అదే విధంగా మన అంతరంగపు  ఆలోచనలలో దాగి ఉన్న అజ్ఞానాంధకారము, మన బాహ్యంలో మనము నిర్వహించే కార్యము లలో వ్యాపించిన అంధకారము , రెండింటినీ తరిమి కొట్టాలంటే  గడప మీద దీపము ఉంచినట్లు నాలుక మీద నామస్మరణ కదలాలి. 


నామస్మరణ కదిలితే  బాహ్యాభ్యంతరాలలోని అవిద్యాంధకారము చెదిరిపోతుంది.   


 కాపలాదారుడు గడప వద్దనే నిల్చుని శత్రువులను,

చోరులను రానివ్వకుండా చూస్తాడు. అదే విధంగా గడప మీద దీపము లాగ నామస్మరణ హృదయ గడప వద్ద మారు మ్రోగుతూ ఉంటే కామ,క్రోధాది అరిషడ్వర్గాలు అనే శత్రువులను చెదరగొట్టవచ్చును. ఇదియే దేహలీ దీప న్యాయము అని అంటారు.


🍁🍁🍁




శ్యామాగా పిలవబడే సాయిబాబా భక్తుని అసలుపేరు మాధవరావ్‌ దేశపాండే. సాయి ఎన్ని విచిత్ర లీలలు చూపిస్తారో, భక్తుల జీవితాలలో అన్ని విచిత్రాలు కనబడతాయి. కపర్దే అనే ఒక భక్తునికి ప్రతిదినం దినచర్య వ్రాసుకునే అలవాటున్నది. ఆయన డిసెంబరు8, 1911న జరిగిన సంఘటనను డైరీలో వ్రాసుకున్నారు. మాధవరావు దేశపాండే(శ్యామా) ఇక్కడ నిద్రపోతున్నాడు. విశేషమొకటి చూశాను. అతని ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసములలో శ్రీసాయినాథ్‌ మహారాజ్‌, సాయినాథ్‌ బాబా అనే శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. అతడు గురక పెడుతున్నప్పుడు అదెంతో దూరానికి వినిపిస్తోంది. ఇది కపర్దే సమక్షంలో జరిగిన యదార్థ సంఘటన. మాండలికుడు యువరాజు. అతనికి చిన్నతనము నందే భక్తి వైరాగ్యములు అలవడ్డాయి. తల్లిదండ్రులు ఒకసారి ఆనందమును, మరోసారి దుఃఖమును పొందు చుండేవారు. కుమారుని పరిస్థితిని చూచి రాజ్యము, వైభవము, ఐశ్వర్యము విడిచి సన్యాసి అవుతాడేమోననేది వారి దుఃఖం. ప్రహ్లాదుని వలె శ్రీహరి కటాక్షమును పొందుతాడనే ఆనందము. అలా కాలం గడుస్తోంది. మాండలికుడు రాజయ్యాడు. వివాహమయింది. భార్యపేరు సులక్షణ. ఈమె కూడ విద్యావతి భక్తురాలు. కాని మాండలికుడు భక్తుడయినను కీర్తనము,పూజ, భజనము మొదలగు భక్తి కార్యక్రమ ములలో పాల్గొనడు. ఆమె తన భర్తను ఎందుకు భక్తి కార్యక్రమ ములలో పాల్గొనుట లేదని అడిగింది. అతడు ప్రియా! నీ హితోపదేశము చాలా విలువైనది. దానికి నాకెంతయో ఆనందమైనది. అయితే మా తండ్రి రాజ్యభారమును నాపై మోపినారు. పూజాదిక ప్రవృత్తుడయినచో రాజ్యకార్యములపై శ్రద్ధ ఉంచుటకు సమయము ఉండదు. పూజాదులలో కాలము గడుపుచున్న, శత్రురాజులు దండెత్తుదురు. జయము ఎవరికి కలిగినను రక్తపాతము కలుగును. ఏమి చేయుచున్నను శ్రీహరి నా హృదయమున నిల్చియేయున్నాడు అని పలికాడు. భర్తతో వాదోపవాదమునకు దిగుట సమంజసము కాదని, ఆమె ప్రస్తుతము ఊరకున్నది.


ఒకనాటి రాత్రిమాండలికుడు గాఢముగా నిద్రిస్తున్నాడు. అతని నోటి నుంచి రామనామము వెడలుచున్నది. నిద్రపట్టని ఆతని భార్య తన భర్త నోటి నుండి రామనామము వెడలుట చూచి ఆశ్చర్యపడ్డది. ఆతనిలో రామనామము ఉండి బహిర్గతమై తుదకు కట్టతెగిన చెరువు నుండి నీరు ప్రవాహించు నట్లు రామోనామోచ్చరణ కొనసాగుచున్నది. సులక్షణ సంతసమునకు హద్దు లేదు. తన భర్త మానసికారాధన చేయుచున్నాడని గ్రహించినది. ఆ విషయమును తన వద్ద గుప్తముగా ఉంచుచున్నాడని తెలుసుకున్నది. అలా ఒక రాత్రి కాదు. ప్రతి రాత్రియు రామనామము మాండలికుని నోటివెంట వెలువడుచున్నది ధారావాహికముగా.


ఆ సంతోషముతో, ఆమె ఒకనాడు భర్తకు చెప్పకుండా ద్వాదశి దినము నాడు ప్రజలకు అన్నదానము చేయుచున్నది. మాండలికుడు ”అదేమిటి సందడిగానున్నది? అని ప్రశ్నించాడు. ఆమె అలా చేయటానికి కారణాన్ని సంతోషంగా వివరించింది. ఎంత పనిచేశావు దేవి? భక్తి అనేది ప్రదర్శన కొరకా? అన్నాడు రాజు. మీ భక్తి ప్రపత్తులు ప్రజలకు స్ఫూర్తిదాయకములు అవవలెను కదా అన్నది భార్య. భక్తి అంటే భగవంతునిలో ఐక్యస్థితియే గాని వేరుగాదు. భక్తుడే కరిగిపోతున్నప్పుడు ఇతరులకు స్ఫూర్తిని ఎలా కలుగచేసేది. ఇతరులకు స్ఫూర్తిని కలిగించేది దైవమే. వేరెవరు కాదు అన్నాడు రాజు. భక్తి ప్రకటన సామాగ్రి కాదు. ఇతరుల ఆచరణ కొరకు చేసేది భక్తి కాదు.




#శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ...



 వాచస్పతి బ్రహ్మశ్రీ డా|| చాగంటి కోటేశ్వరరావు గారు అనేక సందర్భములలో ప్రాతఃస్మరణీయులు, ఋషితుల్యులైన కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి, వారి కవితా పటుత్వమును గురించీ అనేక ప్రవచనములలో చెప్పియున్నారు. వాటిలోని కొన్ని విశేషములు తెలుగు భాషామతల్లిని మొట్టమొదట జ్ఞానపీఠమునెక్కించిన కవిసమ్రాట్ విశ్వనాథ వారి 125 వ జయంతి సందర్భంగా…


విశ్వనాధ సత్యనారాయణ గారు "చెలియలి కట్ట" అన్న ఒక నవల వ్రాశారు. సముద్రమును పురుషుడితో పోలుస్తారు. సముద్రము యొక్క శక్తి అపారము. తలచుకుంటే ఊరిమీద పడిపోగలదు అయినా కెరటము వచ్చి వెనకకు వెళ్ళిపోతుంది తప్ప ఊరుమీదకు రాదు. అది తనకి తాను చెలియలి కట్ట దాటను అని నియమము పెట్టుకున్నది. సముద్రము అలా గీత గీసుకున్నది కనక అందరూ సంతోషముగా ఉన్నారు. ప్రతి పురుషుడు సముద్రమైతే "ధర్మేచ, అర్ధేచ, కామేచ మోక్షేచ నాతి చరామి" చెలియలి కట్ట. అది దాటకపోవడములోనే లోకము యొక్క శాంతి ఉన్నది.  వ్యక్తిగత నిర్ణయము ఒకటే కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ విషయము కావ్యములలో మహర్షులు ఎంత పరిణతితో చెప్పారో, విశ్వనాథ వారు కూడా అంతే గొప్పగా వివరించారు.


మహానుభావుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు వేయిపడగల నవల వ్రాస్తూ 999 పడగలు చితికి పోయినా ఒక పడగ బ్రతికి ఉన్నది. అదే చావో, రేవో ఈ జాతికి ఒక స్త్రీమెడలో తాళికడితే ఆమె వలన సంతానము పొంది సంసారము చక్కగా నడచిందా నడచింది, లేదా ఆయనకి ఆమె కూతురు, ఆమెకి ఆయన కొడుకు. ఇద్దరూ భగవన్ మార్గములో నడచి ఈశ్వరుని చేరుకోవడము. ఏ కారణము చేత కట్టుకున్న భార్యకి విడాకులు ఇవ్వడము కానీ, ఆడది తక్కువ ఆన్న భావముతో విడచిపెడతానన్న మాట కానీ ఈ జాతియందు లేదు. అది ఈ జాతి విశిష్టత, అద్భుతమైన సంస్కృతి. దీనికొరకు ప్రపంచదేశములు అన్నీ మన జాతికీ, ఇక్కడి సంస్కారమునకూ నమస్కారము చేశాయి.

వారి రామాయణ కల్పవృక్షంలో -

ప్రభు మేని పైగాలి వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చె,

ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగె,

ప్రభు మేని నెత్తావి పరిమళించిన తోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెందె,

ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు గనవచ్చి రాతికి కనులు కలిగె

ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీక

రించినంత ఉపల హృదయవీధి

నుపనిషద్వితాన మొలికి శ్రీరామ భ

ద్రాభిరామ మూర్తి యగుచు తోచె!!

ఎప్పుడయినా సరే, మనం అహల్య గురించి తప్పుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడడానికి మనకు హక్కులేదు. కొన్ని వందల సంవత్సరాలు ఆమె నిరాహారియై తపస్సు చేసింది. తదుపరి శ్రీరామదర్శనం చేసింది. శ్రీరామదర్శనానంతరం ఆమె పాపము పూర్తిగా నశించిపోయింది. ఆమెయందిప్పుడు పాపము లేదు. అటువంటి తల్లి కనుకనే శాపవిమోచనానంతరము రామచంద్రుడే ముందుగా ఆమెకు నమస్కరిస్తారు. రామచంద్రమూర్తిచేత నమస్కరింపబడిన మహాతల్లి అహల్య. అహల్య పేరు వినబడితే రెండుచేతులు ఎత్తి నమస్కరించాలి. ఆమె గొప్పతనం గూర్చి చెప్పడానికే రాముడంతటివాడు ఆమెకు ముందు నమస్కారం చేశారు. తన భార్య తప్పుచేస్తే, ఆమె ఏ దోషాన్ని ఎందువల్ల చేసిందో గమనించి, ఆమె చేత తపస్సు చేయించి, ఆ దోషాన్ని నివృత్తి చేసి, రాముడు వస్తే ఆమె పాపము పూర్తిగా నశిస్తుందని గౌతమ మహర్షి గొప్ప ఆదర్శముతో వ్యవహరించారు. ఈ ఘట్టాన్ని వర్ణిస్తూ, పై పద్యములో శ్రీరాముడు ఎలా పతితపావనుడో మహాద్భుతముగా చూపించారు విశ్వనాథ సత్యనారాయణ గారు.


"మళ్ళీ అందరూ వ్రాసిన రామాయణమే నేను వ్రాయడం ఎందుకు? అంటే ప్రతిపూట తిన్న అన్నమే మళ్ళా ఎందుకు తింటున్నావు? అంటే అన్నం తినకపోతే ఉండలేము కనుక తింటున్నాము. అలాగే వినిన రామాయణాన్నే మరల మరల వింటున్నాము. రామాయణం లేనినాడు మనిషి జీవితమే లేదు." అని అన్నారు . అందుకనే ఆ మహానుభావుడు ఋషితుల్యుడు అయ్యారు.



0 comments: