Monday, July 6, 2020 By: visalakshi

మధుమాసం - కాల విశిష్ఠత....

 ఓం శ్రీ కాలాయ నమ:

"మధుశ్చ మాధవశ్చ వాసంతికా వృతూ"! 


మధుమాసం, మాధవమాసాలలో వసంత ఋతువు ఉంటుంది. మధు మాసం అంటే చైత్రం..మాధవమాసమంటే వైశాఖం.. సంవత్సరంలో ప్రధమ మాసం మధుమాసం. ఈ చైత్రమాస ప్రతిపద పాడ్యమి తోనే క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. సంవత్సర ఆరంభంలో ప్రకృతిలో ఎంతో కొత్తదనం ఉంటుంది. ఋతువులు, ఓషదులు, వస్పతులలో విశేషమైన ప్రత్యేకత కనిపిస్తుంది. పశుపక్ష్యాదులలో ప్రకృతిలోని మార్పుల కారణంగా క్రొత్తదనం వస్తుంది. లోక వ్యవహారంలోమధు మాధవాలు -చైత్ర వైశాఖాలుగా ప్రసిద్ధి చెందాయి. వసంత ఋతువులో ఎక్కువ చలిగానీ, ఎక్కువ వేడిగాని లేక వాతావరణం సమశీతోష్ణంతో సుఖదాయకంగా ఉంటుంది. ఎక్కువ పొడిగానీ, తేమగానీ లేక చక్కని స్పర్శగుణం కలిగి ఉంటుంది. అందుకే వసంతాన్ని కవులు తురాజుగా వర్ణిస్తారు. వసంత ఋతువుతోనే క్రొత్త సంవత్సరం ప్రారంభం ఈ కాలంలో చెట్ల పాత ఆకులు రాలి క్రొత్త చిగుళ్ళు చిగురిస్తాయి.ఇది వసంతఋతువుకు స్పష్టమైన లక్షణం. ఈ కాలంలో తప్ప సంవత్సరంలోని మరే ఇతర కాలంలోనూ ఓషధీ వనస్పతులలో ఇంత ఎక్కువగా విశేషమైన మార్పులు రావు.  



మాసాలన్నింటిలో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖమాసంలో, తులసీదళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించినవారికి ముక్తిదాయకం. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తం అయాచితంగా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది. వైశాఖమాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు, ధ్యానాలకు పూజలకు, దానధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి, శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది. ఈ మాధవమాసంలో వేకువజామున స్నానం చేసి ఎక్కువ జలముతో రావిచెట్టు మొదళ్ళను తడిపి ప్రదక్షిణలు చేస్తే  పూర్వీకులు తరిస్తారని చెపుతారు. ఈ మాసంలో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం  జరిగేలా  ఏర్పాటు  చేయడం  శుభఫలితాన్నిస్తుంది. 

శ్రావణ మాస విశిష్టత...


 

శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతివలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.

శ్రావణ సోమవారం
ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడం గా నమ్ముతారు

శ్రావణ మంగళవారం
శ్రీ కృష్ణుడు ద్రౌపదీ దేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదే వికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏస్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు.

శ్రావణ శుక్రవారం
ఈ మాసం లో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవి ని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని పెద్దలు చెప్పారు. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది.అష్ట లక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం

శ్రావణ శనివారాలు
ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పౌర్ణమి
శ్రావణ పౌర్ణమి ,జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి.

జంధ్యాన్ని యజ్ఞోపవీతమనీ , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వేదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు

రక్షా బంధనం..
శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి)దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండో వస్తున్న సంప్రదాయమేనని తెలుస్తోంది.

మాఘ మాసం విశిష్ఠత...



లక్ష్మీనారాయణుల కి , శివ పార్వతులకి ఎంతో ప్రీతి పాత్రమైనది మాఘ మాసం. అఘము అంటే పాపము. పాపం లేకుండా చేసే నెల మాఘము అంటారు. మాఘమాసం లో ఉదయం విష్ణువాలయం సాయంత్రం శివాలయం సందర్శిస్తే మోక్షం కలుగుతుంది. మాఘ మాసం లో చేసే స్నానాలకు చాలా ప్రాశస్త్యం ఉంది. మన నిత్య జీవితం లో స్నానం ఆచరించడం ఒక భాగం. శరీరాన్ని శుద్ది పరచుకునేందుకు, స్నానానికి ఆర్ష సంప్రదాయం లో ప్రముఖ స్థానాన్ని సంతరించుకుంది. జలం, పవిత్రం చేసే వాటిల్లో ఒకటి. అటువంటి జలం తో స్నానమాచరించడం వలన రూపం, తేజస్సు, ఆరోగ్యం, మనఃస్థిమితం చేకురుతాయి. మాఘస్నానాలు చేసినంత మాత్రానా సర్వ పాపాలు తొలగుతాయి. ఈ స్నానాలకి అధిష్టాన దైవం సూర్య భగవానుడు. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన కిరణాల తో సమస్త సృష్టి ని ఆరోగ్యవంతం గా చేయగల సమర్ధుడు. అందువల్లనే స్నానానంతరం ఆ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. తెల్లవారుఝామున నక్షత్రాలు ఉండగా స్నానం చేస్తే ఉత్తమం, నక్షత్రాలు లేని సమయం లో చేస్తే మధ్యమం, సూర్యోదయం జరుగుతుండగా చేస్తే మహాపాతకాలు నశిస్తాయి. సూర్యోదయం తర్వాత చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. ఉత్తరవాహినిగా ఉన్న నదుల్లో స్నానమాచరిస్తే ఎటువంటి పంచమహపాతకాలైన నశించి పోతాయి. ముఖ్యం గా వేగం గా ప్రవహించే నీటి లో చేసే స్నానాలు సర్వ శ్రేష్ఠమైనవి. ఈ మాసం లో ప్రయాగ లో స్నానమాచరించినా, కనీసం స్నానమాచరించెటప్పుడు ప్రయాగ ప్రయాగ అంటూ స్నానమాచరిస్తే పునర్జన్మ ఉండదు. కాశీ లో కాని, గంగాయమున సంగమం లో కాని స్నానమాచరిస్తే నూరురెట్లు అధిక పుణ్యం లభిస్తుంది.

మాఘమాసం లో చేసే దానాలకి అత్యంత ప్రాధాన్యమున్నది.  ఈ మాసం లో చెరుకు రసం, ఉసిరి దానాలు కుడా ఎంతో ఫలదాయకం. మాఘ మాసం లో     సాలగ్రామ దానం చేసినవారికి తీసుకొన్నవారికి కుడా శుభం కలుగుతుంది. ఈ మాసం లో చేసే అన్న దానం వలన సకల పుణ్యాలు లభిస్తాయి. మాఘమాసం లో ప్రతి దినం అన్నదానం చేయలేని వారు, మాఘ మాసం చివరి రోజున యథాశక్తి అన్నదానం చేసినా ఫలితం ఉంటుంది. రాగి పాత్రలో కాని కంచు పాత్రలో కాని నువ్వులు పోసి యధాశక్తి   దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. నువ్వులు సువర్ణం కలిపి దానం చేస్తే ఎటువంటి పాపాలైన నశిస్తాయి ముఖ్యం గా త్రివిధ పాపాలు తొలగుతాయి.

మాఘమాసం లో ఆదివారాలు విశిష్ఠమైనవి. ఆదివారం నాడు సూర్యుడిని భక్తి శ్రద్దలతో పూజించి, ఆయనకిష్టమై గోధుమతో చేసిన పదార్ధాన్నికాని తీపి పొంగలి కాని పాయసాన్నికాని నైవేద్యం గా సమర్పిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి.

మాఘ మాసం లో ముఖ్యమైన రోజుల్లో ఆచరించవలసిన విధులు...

ఈ మాసం లో శ్రవణా నక్షత్రం రోజున తులసి దళాలతో విష్ణు పూజ చేస్తే సకల పాపాలు తొలగుతాయి.
మాఘ తదియ రోజున బెల్లం, ఉప్పు దానం చేస్తే ఎంతటి కష్టాల నుండి అయినా విముక్తి లభిస్తుంది.
మాఘ శుద్ద చతుర్ధిని తిల చతుర్ధి అంటారు. ఈ రోజు ఉపవాసం చేసి గణపతి ని పూజించి జాగరణ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. ఈ రోజున నువ్వులను బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం ఇస్తే సర్వ పీడలు తొలగి బ్రహ్మ లోక ప్రాప్తి కలుగుతుంది. ఈ చతుర్ధి ని కుంద చతుర్ధి అని కూడా అంటారు. కుంద చతుర్ధి రోజున శివున్ని మొల్లలు తో పూజించి ఒంటిపూట భుజిస్తే ఐశ్వర్య ప్రాప్తి ,సిరిసంపదలు కలుగుతాయి.
సంకటహర చతుర్థి నాడు సాయంత్రం వరకు ఉపవసించి సంధ్యా సమయం లో గణపతి ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.

శ్రీ పంచిమి రోజున సరస్వతి దేవి ని పూజిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది. ముఖ్యం గా విద్యలకు అధిపతి అయిన సరస్వతి దేవి ని విధి విధానం గా విద్యార్దులు పూజిస్తే సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుంది. సరస్వతి దేవి కి ప్రీతికరమైన తెల్లని పుష్పాలతో పూజించి, క్షీరాన్నం, నారికేళం, చెరుకు వంటి పదార్దాలను నివేదన చేస్తే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది.

రథసప్తమి రోజున వేకువ ఝామున నిద్రలేచి జిల్లేడు ఆకులు, ఎర్రటి అక్షితలు తలపైన, భుజాల పైన ఉంచి స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున సూర్యనారయణుడి ప్రసన్నం కొరకు తూర్పు దిక్కుగా పొయ్యి మీద పాలు పొంగించాలి. చిక్కుడుకాయలతో చేసిన రథం పై సూర్య భగవానుణ్ణి ఉంచి పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి. రథసప్తమి వ్రతం ఆచరించిన వారికి దారిద్ర్య బాధలు తొలగుతాయి. ప్రయాగ లో ఈ వ్రతం ఆచరిస్తే కోటి సూర్య గ్రహణాల పుణ్య ఫలం లభిస్తుంది.

రాగి పాత్రలో సూర్య బింబ ప్రతిమ ఉంచి ఎర్రటి పూలతో అర్చించి బ్రాహ్మణునికి ప్రతిమ సహితం గా దానం ఇస్తే, జాతకరీత్య సూర్య గ్రహ దోషాలు తొలగుతాయి. ఈ రోజున అరుణ పారాయణం చేస్తే హృదయ సంబంధిత సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ వ్యాదులు తొలగుతాయి. ఈ రోజున శివ సన్నిధి లో మృత్యుంజయ స్తోత్ర పారాయణం చేస్తే అపమృత్యు భయాలు తొలగుతాయి.

భీష్మాష్టమి రోజున భీష్మాచార్యులకు ఆర్ఘ్యం ఇచ్చి పూజిస్తే వంశం వర్ధిల్లుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుశ, తిల, జలము తర్పణ చేస్తారో వారి కి సుందర సుగుణవంతులైన సంతానము ప్రాప్తిస్తుంది. ఈ విధి నిర్వహించిన వారికి ఆ సంవత్సరం లో చేసిన పాపాలు తొలగుతాయి.

కృత్తిక నక్షత్రం ఉన్న రోజున సుబ్రహ్మణ్య స్వామి కి పాలాభిషేకం చేస్తే సర్ప గ్రహ బాధలు, రాహు కేతు బాధలు తొలగుతాయి. సంతాన లేని వారు పుట్టలో పాలు పోసి సర్పాకారం లో సుబ్రమణ్య స్వామి ని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.

భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణుసహస్రనామ పారాయణం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది.

తిల ద్వాదశి నాడు నువ్వుల తో చేసిన పదార్ధాలను తినడం, నువ్వుల నూనె తో అభ్యంగన స్నానమాచరించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించి దానమివ్వడం చేస్తే కష్టాలు తొలగుతాయి.

శని త్రయోదశి నాడు నల్ల నువ్వులు, నల్లని వస్త్రం, దక్షిణ తో సహా బ్రాహ్మణునికి దానం ఇచ్చి, శివలింగానికి తైలాభిషేకం చేయించడం వలన శని బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యం గా ఏలిన నాటి శని, అర్దాష్టమ శని, శనిమహర్దశ అంతర్దశ జరుగుతున్నా వారు వీటిని ఆచరిస్తే మంచి ఫలితం ఉంటుంది. 

మాఘ పౌర్ణమి రోజున మాఘ మాసం లో ప్రతి నిత్యం స్నానమాచరించలేని వారు ఈ ఒక్క రోజు మాఘ స్నానం ఆచరిస్తే శుభం కలుగుతుంది. దైవ శక్తి సంపూర్ణం గా విలసిల్లే దివ్యమైన రోజున చేసే జపాలు, పూజలు, దానాలు, హోమాలు అక్షయ ఫలితాన్నిస్తాయి. ఈ రోజున చేసే సముద్ర స్నానం చెప్పలేనంత పుణ్యాన్ని కలిగిస్తుంది. అమ్మవారికి కుంకుమార్చన చేస్తే సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. శివాలయం లో ఆవు పాలతో అభిషేకం చేస్తే అన్ని గ్రహాల బాధలు తొలగుతాయి. పంచామృతాలతో అభిషేకం చేస్తే అన్ని కోరికలు తీరుతాయి. 

విశాఖ నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి ని భస్మం తో పూజిస్తే పాపక్షయం కలుగుతుంది, బిల్వపత్రాలతో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. స్వామి వారికి వస్త్రాలు సమర్పించి పూజించి ఉపవాసం చేస్తే ఉద్యోగ మార్గాలు లభిస్తాయి.

విజయ ఏకాదశి - శ్రీ రామచంద్రుడు లంకను చేరుకోవడానికి సేతువు నిర్మించడం పూర్తైన రోజు కావున విజయ ఏకాదశి అని అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువు ని పూజిస్తే విజయాలు ప్రాప్తిస్తాయి.

మహా శివరాత్రి పర్వదినాన శివారాధన, రుద్రాభిషేకం, జాగరణ, ఉపవాసం ఏది చేసిన పుణ్యం లభిస్తుంది. విభూది, రుద్రాక్ష ధారణ వలన మంచి ఫలితాలు పొందుతారు. శివ పార్వతుల కల్యాణం చేస్తే భార్య భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ దోషాలు ఉన్న వారికి దోషాలు తొలగి వివాహం జరుగుతుంది.
 సర్వే జనా సుఖినోభవంతు....

















 

0 comments: