ఓం శ్రీసాయినాధాయ నమ:
మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాలపెద్దమ్మ లలితమ్మ..జగతికి మూలమైన శక్తి స్వరూపిణి. సమస్త చరాచర జగత్తు యొక్క రూపము తానే అయి ఉన్న తల్లికి నమస్కారము. జగత్తును ధరించి పోషించు అమ్మవారిని బహు రూపాలలో పలు నామాలతో అర్చిస్తాము. ఏ పేరుతో పిలిచినా చల్లని వరాలను కురిపించే కరుణామయి నా దుర్గమ్మ తల్లి.
మంగళకరమైన స్వరూపముగల తల్లి భద్రకాళీమాత.. ఓరుగల్లు{వరంగల్} భద్రకాళీ అమ్మవారి క్షేత్రములో అమ్మ దీవెనలు భక్తులకు ప్రతిక్షణం అందుతాయనుటకు నిదర్శనం ఆ అద్భుతమైన అమ్మ వీక్షణ కరుణాకటాక్షాలు...భక్తుల భక్తి యందు ప్రియము గల తల్లి..నిష్కల్మషమైన భక్తిద్వారా ఆ తల్లి అనుగ్రహమును పొంది తరించగలము.
శ్లో" సర్వభూతహితేదేవి సర్వసంపత్ ప్రదాయిని
పద్మమాలాధరేదేవి నారాయణి నమోస్తుతే!!
వేదమాత గాయత్రి.."గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దేవత లేదు".మాతృరూపంలో,పితృరూపంలో గాయత్రీ దివ్యశక్తిగా తన భక్తులకు,
ఆరాధకులకు లోకకళ్యాణదృష్ట్యా ఆ తల్లి సద్గుణ సర్వస్వాన్నీ ప్రసాదిస్తుంది.
జన్మజన్మాంతరాల కర్మపాశాలనుండి విముక్తుల్ని చేస్తుంది.
లక్ష్మీమాత ధనవైభవశక్తులకు అధిష్ఠాత్రి. ఈతల్లి భక్తులకు ధన వైభవ ఐశ్వర్య సంపద పదవీ మొదలగు సమస్త భౌతిక సుఖసాధనలను ప్రసాదిస్తుంది.
"ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే, విష్ణు పత్న్యైచ ధీమహీ తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్."
.
రాధాదేవి ప్రేమశక్తికి అధిష్ఠాత్రి. భక్తులకు యదార్ధమైన ప్రేమభావాన్ని కలుగజేసి అసూయా ద్వేష భావాదులను దూరం చేస్తుంది.
"ఓం వృషభానుజాయ విద్మహే. కృష్ణప్రియాయ ధీమహీ, తన్నో రాధా ప్రచోదయాత్."
.
సరస్వతీమాత జ్ఞానశక్తికి అధిష్ఠాత్రి. జ్ఞాన, వివేక దూర దర్శిత్వం, బుద్ధిమత, విచారశీలత్వాదులను ప్రసాదిస్తుంది.
"ఓం సరస్వత్యై చ విద్మహే. బ్రహ్మ పుత్ర్యై చ ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్."
.
దుర్గామాత దమనశక్తికి అధిష్ఠాత్రీదేవి. సమస్త విఘ్నబాధలపై విజయాన్ని ప్రసాదిస్తూ దుష్టులనూ, శత్రువులనూ నాశనం చేస్తూ భక్తులకు సమస్త ప్రకారాలైన శక్తి సామర్ధ్యాలను ప్రసాదిస్తుంది.
"ఓం గిరిజాయై చ విద్మహే. శివప్రియాయై చ ధీమహీ తన్నో దుర్గి:ప్రచోదయాత్."
.
సీతామాత తపశ్శక్తికి అధిష్ఠాత్రీదేవి. నిర్వికారంగా పవిత్రభావంతో సాత్త్వికవృత్తితో అనన్య భావాలతో తపో నిష్ఠులనుగా తన భక్తులను తయారుచేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి మనలను ప్రేరితులను చేస్తుంది.
"ఓం జనక నందిన్యై చ విద్మహే.భూమిజాయై చ ధీమహీ తన్నో సీతా ప్రచోదయాత్."
.
హంసదేవత వివేక శక్తికి అధిష్ఠాత. హంస యొక్క క్షీరనీరవివేకం జగత్ ప్రసిద్ధమైనది.సదసద్వివేకాన్నీ, దూరదర్శిత్వాన్నీ, సత్సంగతినీ ఉత్కృష్ఠాహారాన్నీ, ఉజ్వల యశస్సంతోషాది గుణాలనూ ఈ దేవత ప్రసాదిస్తుంది.
"ఓం పరమహంసాయ విద్మహే. మహా హంసాయ ధీమహీ, తన్నో హంస: ప్రచోదయాత్"
.
తులసీదేవి సేవాశక్తికి అధిష్ఠాత్రి. సత్కార్యాలలో ప్రేరణ, ప్రాణిమాత్రులను సేవించాలన్న ప్రవృత్తి, ఆత్మశాంతి, పరదు:ఖ నివారణ, పవిత్రనిష్ఠాది ఫలాలను ప్రసాదిస్తుంది.
"ఓం శ్రీ తులస్యై విద్మహే. విష్ణు ప్రియాయై ధీమహీ తన్నో బృందా ప్రచోదయాత్."
శృంగేరి శారదా మాతను వీక్షించే కన్నుల్లో.. అలౌకిక ఆనందానుభవం మాటలకందనిది.
.
" అమ్మా!" అని నిష్కపటంగా నిరహంకారంగా శ్రద్ధాభక్తులతో మనం ఏ రూపాన్ని స్మరించినా పిలిచినా చాలు అమ్మ తన భక్తులను దీవిస్తుంది ఉద్ధరిస్తుంది.
" అమ్మా!" అని నిష్కపటంగా నిరహంకారంగా శ్రద్ధాభక్తులతో మనం ఏ రూపాన్ని స్మరించినా పిలిచినా చాలు అమ్మ తన భక్తులను దీవిస్తుంది ఉద్ధరిస్తుంది.
"ఓం శ్రీ మాత్రే నమ:"
0 comments:
Post a Comment