ఓం శ్రీ సాయినాధాయ నమో నమ:
సాయినాధా! నిన్ను రోజూ మనసారా తలుచుకోవడం తప్ప సరిగా క్రమంగా అర్చించలేకపోతున్నానన్న వేదన నా అంతరంగమున కదలాడుతూ ఉండేది ...ఈ రోజు సాయంత్రము సమయము చూసుకొని తప్పనిసరిగా ఒక అధ్యాయమైనా మననం చేయాలన్న సంకల్పం తో సంధ్యారతి తదుపరి సచ్చరిత్రలో ఒక అధ్యాయము తీయగా 26 వ అధ్యాయము వచ్చింది..అందలి సందేశము....
" ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజముగా ఉండియుండలేదు. నిజముగా ఉండునది ఒక్కటే అదియే భగవంతుడు.చీకటిలో తాడును చూసి పామనుకొనునట్లు, ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు, కనిపించును; గాని అంతర్గతముగా నున్న సత్యమును తెలుసుకోలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా జూచునటుల జేయును.మన కగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురుని అసలయిన దృష్టిని కలుగజేయుమని ప్రార్ధింతముగాక! అదే సత్యదృష్టి."
ఆంతరిక పూజ:---
ఆనందభాష్పములతో తనివితీరా సద్గురుని పాదములను కడిగెదముగాక! స్వచ్చమైన ప్రేమయను చందనమును వారి శరీరముకు పూసెదముగాక! దృఢవిశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక! అష్టసాత్త్వికములను ఎనిమిది తామరపుష్పములు సమర్పించెదముగాక! ఏకాగ్రచిత్తమను ఫలమును సమర్పించెదముగాక! భావమను బుక్కా వారి శరీరముపై జల్లి భక్తియనే మొలత్రాడును కట్టెదముగాక! మన శిరస్సును వారి బొటనవ్రేళ్ళపై నుంచెదముగాక! సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతముగాక! అట్టి
ఆనందకరమైన ఆంతరిక పూజ చేసిన తదుపరి ఇటుల ప్రార్ధించెదముగాక!
ఆనందకరమైన ఆంతరిక పూజ చేసిన తదుపరి ఇటుల ప్రార్ధించెదముగాక!
" మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలివైపు పోవునట్లు చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలిసికొను శక్తిని కలుగజేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖదు:ఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుడు... మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక!"
ఈ విధముగా నా సంశయమును దూరము చేసి, శరణాగతి అన్నావుగా! నా పాదాల చెంత నీ మనస్సును ఉంచు... అని బాబాగారు బోధించినట్లయి..నా మనస్సు తన్మయ అనుభూతిని పొందింది...
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.
0 comments:
Post a Comment