Tuesday, September 1, 2015 By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 82 ఊదీ మహిమ 2

 ఓం శ్రీ సర్వ వ్యాపక సాయినాధాయ నమ:

                                                                                                     
                  
శ్రీ సద్గురు సాయినాధ ఆశీర్వాద సాఫల్యత

 బాబా విభూతికి రెండు గుణాలు ప్రాపంచికము, పారమార్ధికము. ప్రాపంచిక గుణం ఏమిటంటే మానవ జీవన ప్రాంగణంలో బాధించే ఏ రకమైన వ్యాధినైనా సమూలంగా నయం చేయటం. అందుకు శ్రద్ధ, సహనం కావాలి.

 "శ్రద్ధ అంటే బాబా విభూతితో వ్యాధులు నయమౌతాయన్న దృఢ విశ్వాసం, సహనం అంటే వ్యాధి నయమయేందుకు ఎంత ఆలస్యం పట్టినా ధైర్యాన్ని సడలనీయకుండా ఎదురు చూడ్డానికి సిద్ధంగా ఉండటం."

  అఖండంగా జ్వలించే బాబా ధునిలోని విభూతి వెనుక బాబా దైవశక్తి ఉంది.కానీ సందర్భం వచ్చినప్పుడు భక్తులకుండే దృధమైన శ్రద్ధ వల్ల ఆ దైవశక్తి అగరొత్తుల వల్ల, దార్లోని మట్టిలో నుంఛి కూడా ఉత్పన్నమగును.దాని వెనుక విభూతినిచ్చే వారి శ్రద్ధ లేదా స్వయంగా బాబా ఇచ్చ, కృప ఉంటాయి.



 పారమార్ధిక గుణం అంటే....  ఈశ్వర ప్రాప్తి గురించి  చేసే సాధనా
మార్గంలో  అన్నిట్లోకి మొదటి అవసరం శారీరక, మానసిక శుద్ధి.

విభూతిని దేహానికి పూసుకోవటమంటే,పూజకోసం నీటితో స్నానం చేసి దేహాన్ని శుద్ధి చేసుకొన్నట్లే.  శాస్త్రాలు దీన్ని అంగీకరించాయి.  

 అలా చేయటం వల్ల మనసు శాంతంగా,పవిత్రంగా వుంటుంది.విభూతి స్పర్శతో భయంకర మహా పాతకాలు, ఉప పాతకాలు సమూలంగా నశిస్తాయి. ముక్తి కాంత వచ్చి భక్తుల ముంగిట వాల్తుంది. పారమార్ధిక మార్గం యొక్క గుహ్యార్ధం వారికి స్పష్టమై భక్తులకు పారమార్ధికం సాధ్యమవుతుంది. వాళ్ళు కృతార్ధులవుతారు.

 బాబాగారి సమాధి తరువాత కూడా ఈ గడచిన సంవత్సరాలలో , అఖండంగా ప్రజ్వలించే ధునితో బాబా ఎన్ని విభూతి బస్తాలు ఉత్పన్నం చేస్తున్నారో, ఎంతమంది భక్తులకు శ్రేయస్సు కలిగిస్తున్నారో! విభూతి ధన్యం! భక్తవాత్సల్యామృత వర్షిణి అయిన సాయిజనని ధన్యం!


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 








                                          





0 comments: