ఓం శ్రీ నారాయణాయ నమ:
"యత్ర నార్యోస్తు పూజ్యతే తత్ర రమంతే దేవతా" - ఎక్కడ స్త్రీ మాతృరూపంలో ఆరాధించబడుతుందో, అచట దేవతలు నర్తిస్తారు.
మన భారతీయ పండుగల్లో వివిధ దేవతల అనుగ్రహం, అధ్యాత్మిక దృక్పధం,ఆత్మీయతానురాగాల అనుబంధం కలబోసి ఉంటాయి.
శ్రావణ పూర్ణిమ నాడు విద్యాదిదేవత,వేదమయుడు అయిన శ్రీ హయగ్రీవ స్వామి ఆవిర్భవించారు. దేవతారాధనకు, ధ్యానానికి అనువైన వేదాల జ్ఞానదీప్తిని ప్రసాదించడమే హయగ్రీవానుగ్రహం.
మన ధర్మ శాస్త్రాల్లో పేర్కొన్న రక్షాబంధన మహోత్సవం ఈ రాఖీ పూర్ణిమ ప్రత్యేకత.
ఈ రోజున సోదరుని తిలకధారణతో,అక్షతలతో అభినందించి,సోదరి రక్షా కంకణాన్ని బంధిస్తుంది.ఇది దేవతారక్షగా అతడిని కాపాడుతుంది.
బదులుగా సోదరిని కానుకలతో సత్కరిస్తారు.సోదరీ సోదర అనుబంధానికి చెలిమిని బలపరచి,స్త్రీకి పుట్టింటి అనుబంధాన్ని దృడపరచిన పండుగ ఇది.
ఇంటి ఆడపడుచును మహాలక్ష్మీ స్వరూపంగా, పరాశక్తికి ప్రతీకగా భావించే సంసృతి మనది.పుట్టింటి ఆత్మీయత స్త్రీకి ఎంతో మనో నిబ్బరాన్ని,ఉల్లాసాన్ని పెంచుతుంది.
ఈ శ్రావణ పూర్ణిమ నిండు చంద్రుని శోభలను పుడమి స్వీకరించే రోజు.చంద్రుని ప్రకాశం వల్ల మనసు పవిత్రమై,ఆరాధనలూ,ధ్యానాలు విశేషంగా ఆచరిస్తారు.
మానవ సంబంధాల్లో దివ్యత్వాన్ని నింపుకునే ఈ ఆచారమే" రక్షాబంధన మహోత్సవం.."
సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
1 comments:
Good post
Post a Comment