Thursday, February 17, 2022 By: visalakshi

కృష్ణ తత్వం.. మహత్యం

                    సర్వవ్యాపినమీశ్వరం....




ధ్యానం.... భగవధ్యానం చేసుకోడానికి ఏకాంతంగానూ ,పవిత్రంగానూ ఉండే ప్రదేశం కావాలి. అక్కడ ఎట్టి విఘ్నాలు ఉండకూడదు. ఏ కోలాహలం ఉండరాదు. ప్రశాంత స్థానం కావాలి. ఆసనంగా దర్భాసనం , తివాచీ వంటి దానిని కానీ ఉపయోగించుకోవాలి.సుఖంగా పద్మాసనం కానీ స్వస్తికాసనం గానీ వేసుకుని కుదురుగా కూర్చోవాలి. స్థిరంగా సుఖంగా అచంచలంగా ఎక్కువ సేపు కూర్చునే విధంగా ఉండాలి. శరీరము నిట్టనిలువుగా ఉండు విధముగా కూర్చోవాలి.
సంసారం క్షణభంగురం అని గుర్తించి ఆసక్తి ని పరిత్యజించి ధ్యానం చేయాలి. భగవానుడు నిర్గుణ నిరాకార రూపంలో సర్వదా , సర్వత్రా ఉన్నాడు. భగవానుడు సగుణ నిరాకారూపంలోనూ ,తరువాత సగుణ సాకారూపంలోనూ ప్రకటం అవుతూ ఉంటాడు. సగుణము ,నిర్గుణము ,సాకారము ,నిరాకారము అన్నీ ఒకే భగవానుని విభిన్నరూపాలు.
సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ భక్తులకు  సగుణ సాకారూపంలో ప్రకటమౌతాడు...భక్తుల ప్రేమ కారణంగా ఈ లీలను ప్రదర్శిస్తాడు భగవానుడు.

భగవంతుని గూర్చి తెలుసుకోవాలనుకొని అన్వేషిస్తూ ఉంటే భగవంతుని సృష్టిలోని ప్రతి లీలలోనూ పరమార్థం కనిపిస్తుంది.

గాలి వీచడంలోను, నదీజలాలు పారడంలోను ఎన్నో నిగూఢార్థాలు కలిగిఉన్నట్టు కనిపిస్తుంది. సృష్టిలో ఏవస్తువు కూడా పనికిరానిది అంటూ ఏదీ లేదు. ఏ కారణం లేకుండా ఏ జీవి పుట్టదు. వస్తువైనా, అ వస్తువైనా దానికోసం ఏదో ఒక కారణంగా అది ఏర్పడుతోంది.

ఎపుడైతే కారణం అయిపోతుందో అపుడు ఆ ప్రాణి అదృశ్యవౌతుంది. అంటే అవి వచ్చిన లేక చేయవలసి పని అయిపోతే చాలు అవి కనిపించకుండా కాలగర్భంలో కలసిపోతాయి

ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేసిన ఎన్నో అద్భుత లీలలున్నాయి. శ్రీకృష్ణుడు చేసిన ఏ పనికైనా సరే అంతరార్థం మరొకటి ఉంటుంది. అవి తెలుసుకొంటే భగవంతుని తత్వమేమిటో కొద్దిగా తెలిసే అవకాశం ఉంది అనిపిస్తుంది.

అమ్మ దగ్గరపాలు తాగే వయస్సులో తనకు పాలిచ్చినట్లుగానే ఇచ్చి ప్రాణాలు తీద్దామని వచ్చిన పూతనను సంహరించాడు. అంటే - ‘పూతము’ అనగా పవిత్రము. పవిత్రము కానిది పూతన. అనగా అజ్ఞానము, అవిద్య, పవిత్రమైనది జ్ఞానము. అజ్ఞానమువలన వాసనలు బయలుదేరుతాయి. పూతన వాసనా స్వరూపమే.

పూతన రాక్షసి చిన్ని కృష్ణుడిని చంపడానికొచ్చింది. కంసుడే ఆ ఆడబూచిని పంపాడు. రవిక ఒదులు చేసుకుని, ‘రారా కృష్ణా!’ అని పిలవగానే బిరబిరా వెళ్లాడా బిడ్డడు. ‘పాలకుండలనుకుని ఆబగా జుర్రుకుంటున్నాడు. కాలకూట భాండాలని తెలియదు కాబోలు’ అనుకుంది పూతన. దేవతలకే అమృతాన్ని పంచి ఇచ్చినవాడికి, పచ్చి విషపు ఆలోచనలు తెలియకుండా ఉంటాయా? నవ్వుకుని ఉంటాడు! ఎంత రాకాసి అయినా అమ్మే కదా! చనుబాలిస్తూ రెప్పపాటు సమయం మాతృత్వ తన్మయత్వాన్ని అనుభవించింది. చాల్చాలు. ఆ కాస్త ప్రేమ చాలు. మహామహా యోగీంద్రులు యజ్ఞయాగాలు చేసి ‘కృష్ణార్పణం’ అన్నంత ఫలం ఆమె ఖాతాలో జమైపోయింది. కృష్ణప్రేమలోని గొప్పదనమే అది. పూతన ఒంట్లోని విషాన్నంతా సర్రున జుర్రుకున్నాడు. రాక్షసి అంటేనే నిలువెల్లా పాషాణం. కృష్ణయ్య చేదునంతా మింగేశాక...పూతనతోపాటే పూతనలోని రాక్షసత్వమూ చచ్చిపోయింది. శవాన్ని వూరవతల తగులబెడుతుంటే, అద్భుత పరిమళాలు! కృష్ణ ప్రేమ తాలూకు సువాసనలవి.

ఈ వాసన మన దేహంలో పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రిములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను పదు నాలుగు స్థానములలో తిష్ఠవేసి ఉంటుంది. మాయ త్రిగుణాత్మకం. 

మనం సంసారం అనే బండిలో భగవంతుణ్ణి మన రథసారథిగా చేసుకుంటే ఇంద్రియములు అనే గుఱ్ఱాలు సక్రమంగా నడుస్తాయి.

శకటాసుర భంజనంలో అంతరార్థం ఇదే.

ఒకసారి శ్రీకృష్ణుడు యశోదను తనకు పాలివ్వమని అల్లరిచేస్తూండసాగాడు.

అదే సమయంలో పొయ్యిమీద పెట్టిన పాలు పొంగితే యశోద అటు పరిగెడుతుంది. ఇక్కడ సామాన్య జీవికి భగవంతుని యందు భక్తికంటే ఇహముపై అనురక్తి ఎక్కువ అని తెలుసుకోవాలి. 

శ్రీకృష్ణుడు రాతితో పెరుగు కుండ పగులగొడతాడు. యశోద కోపముగా కఱ్ఱ తీసుకొని అతని వెంటబడుతుంది. ఇక్కడ కఱ్ఱ అభిమానానికి, గర్వానికి ప్రతీక.

యశోద అలసిపోయి నిస్సహాయత ప్రకటించగానే శ్రీకృష్ణుడు ఆమెకి దొరికిపోతాడు. అహంకారం, అభిమానం, గర్వం విడిచిపెట్టి తనను సేవిస్తే తాను బంధీనవుతానని పరమాత్మ చెప్పకయే చెపుతాడు.

ఒకసారి శ్రీకృష్ణుడు అల్లరి మితి మీరుతోందని భావించిన యశోద త్రాటితో బంధించటానికి ప్రయత్నిస్తుంది. కాని త్రాడు రెండు అంగుళాలు తక్కువ అవుతుంది.అంటే ఆ రెండు అంగుళముల త్రాడే అహంకార, మమకారములు. అహంకార, మమకారములు కలవారు తన దరి చేరజాలరని కేవలము ప్రేమ అనే రజ్జువుకే తాను బందీనవుతానని భగవానుని చెప్పాడన్నమాట.

గోపికా వస్త్రాపహరణలో కూడా ‘లౌకిక సంస్కార శూన్యులై ఉన్న మీరు మాయ అనే తెరను (వస్తమ్రులను) తొలగించి నా దగ్గరకు రండి. మీ మోహమనే తెరను నేను తొలగిస్తాను’ అని భగవంతుడు చెబుతున్నాడన్నమాట

ఓ ఉప్పు బొమ్మకు సముద్రం లోతులు చూడాలన్న కోరిక కలిగింది. ఆత్రుత కొద్దీ దూకేసింది. నీళ్లలోకి వెళ్లగానే తానెవరో మరచిపోయింది. తనెందుకొచ్చిందీ మరచిపోయింది. కరిగి కరిగి సముద్రంలో భాగమైపోయింది. కృష్ణ ప్రేమా అలాంటిదే. ఎవరు ఏ రూపంలో ఆయనకు తారసపడినా.... చివరికంతా కృష్ణప్రేమాంబుధిలో కలసిపోవాల్సిందే, కరిగిపోవాల్సిందే. కృష్ణ...అన్న మాటకు ఆకర్షించేవాడన్న అర్థమూ ఉంది. గోపికలు వలపు భావనతో దగ్గరయ్యారు. మహర్షులు తపస్సుతో దగ్గరయ్యారు. కంసాది రాక్షసులు శతృత్వంతో దగ్గరయ్యారు. పాండవులు భక్తితో దగ్గరయ్యారు. ఎవరిదారులు వారివే. గమ్యం మాత్రం ఒకటే - కృష్ణుడే.

మధురాధిపతే అఖిలం మధురం! కృష్ణుడు మధురకే కాదు, ప్రేమ మాధుర్యానికీ అధిపతి. పద్నాలుగేళ్ల పసివాడు...అన్న బలరాముడితో కలసి కంసమామ చేపట్టిన ధనుర్యాగానికి బయల్దేరాడు. రథం దిగి వీధుల్లో నడుస్తుంటే, మధురానగరమంతా ‘అధరం మధురం, వదనం మధురం...’ అంటూ కృష్ణ సౌందర్యాన్ని కీర్తించింది. ఓ నిరుపేద నేత కళాకారుడిచ్చిన బట్టల్ని ప్రేమగా అందుకున్నాడు. తానే వెళ్లి మాలలు కట్టుకుని బతికే సుధాముడి తలుపుతట్టాడు. కుబ్జ పూసిన మంచిగంధాలకు మురిసిపోయాడు. భక్తి, ముక్తి, అనురక్తి...ఎవరికి ఇవ్వాల్సింది వాళ్లకు ఇచ్చాడు. ఎవర్నుంచి అందుకోవాల్సిన ప్రేమను వాళ్ల నుంచి అందుకున్నాడు.

పరమ రాక్షసుడైన కంసుడు కూడా తనకు తెలియకుండానే కృష్ణప్రేమలో పడిపోయాడు. కృష్ణుడు మధురలో కాలుపెట్టాడని తెలిసిన మరుక్షణమే.భయంతో సగం చచ్చిపోయాడు. అడుగుల సవ్వడి వినిపిస్తే చాలు, కృష్ణుడొస్తున్నట్టు అనిపించేది. పూల సువాసనలు నాసికాన్ని తాకగానే...వైజయంతీమాల పరిమళమేమో అన్న భ్రమ కలిగేది. ఎవర్ని ఎవరు పిలిచినా, ‘కృష్ణా’ అన్నట్టు చెవినపడేంత చిత్త చాంచల్యం. బాలకృష్ణుడు రానేవచ్చాడు. ముద్దుగారే బాలుడు గుండెల మీద కూర్చుని పిడిగుద్దులు గుద్దుతుంటే, ‘చంపొద్దు కృష్ణా..వదిలిపెట్టు కృష్ణా...’ అంటూ మృత్యుభయంతో మెలికలు తిరిగిపోయాడు. కలవర పాటులో అయితేనేం, తలుచుకున్నాడు కదా! ఆ కాస్త స్మరణకే పొంగిపోయి, మేనమామకు ముక్తినిచ్చేశాడు కృష్ణస్వామి.

ఇన్ని విధాలుగా చెబుతూ మనలను భగవంతుని గూర్చి తెలుసుకోమని భగవంతుడే చెబుతున్నాడు. 

కాని భగవంతుని మాయ లో చిక్కిన మనం మాత్రం మాయామోహితులయ దుర్లభమైన మానవ జన్మను వృథాచేసుకొంటున్నాం.

కనుక ఇక నుంచైనా భగవంతుని చింతన చేద్దాం..🙏


                     కృష్ణం వందే జగద్గురుమ్🙏




               *** జయ జనార్ధన కృష్ణా రాధికా పతే ....***


జయ జనార్ధన కృష్ణా రాధికా పతే… జన విమోచనా కృష్ణా జన్మ మోచనా

జయ జనార్ధన కృష్ణా రాధికా పతే… జన విమోచనా కృష్ణా జన్మ మోచనా

గరుడ వాహనా కృష్ణా గోపికా పతే…

నయన మోహనా కృష్ణా నీరజేక్షణా…

జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…

జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…

సుజన బాంధవా కృష్ణా సుందరాకృతే… మదన కోమలా కృష్ణా మాధవా హరే

వసుమతీ పతే కృష్ణా వాసవానుజా… వరగుణాకర కృష్ణా వైష్ణవాక్రుతే…

సురుచిరానన కృష్ణా శౌర్యవారిదే… మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా

విమలపాలక కృష్ణా వల్లభీపతే… కమలలోచన కృష్ణా కామ్యదాయకా…

జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…

జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…

విమల గాత్రనే కృష్ణా భక్తవత్సలా… చరణ పల్లవం కృష్ణా కరుణ కోమలం

కువల ఏక్షణా కృష్ణా కోమలాకృతే… తవ పదాంబుజం కృష్ణా శరణామాశ్రయే…

భువన నాయకా కృష్ణా పావనాకృతే… గుణగణోజ్వల కృష్ణా నళినలోచనా

ప్రణయ వారిధే కృష్ణా గుణగణాకరా… దామసోదర కృష్ణా దీన వత్సలా

జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…

జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…

కామసుందరా కృష్ణా పాహి సర్వదా… నరక నాశనా కృష్ణా నరసహాయకా

దేవకీ సుతా కృష్ణ కారుణ్యమ్భుదే… కంస నాశనా కృష్ణ ద్వారకాస్థితా…

పావనాత్మక కృష్ణా దేహి మంగళం… త్వత్పదామ్బుజం కృష్ణా శ్యామ కోమలం

భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా… పాలిసెన్నను కృష్ణా శ్రీహరి నమో

జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…

జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…

భక్తదాసనా కృష్ణా హరసు నీ సదా… కాదు నింటెనా కృష్ణా శలహెయ విభో

గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షణా…

 జయ జనార్ధన కృష్ణా రాధికా పతే… జన విమోచనా కృష్ణా జన్మ మోచనా

గరుడ వాహనా కృష్ణా గోపికా పతే…

నయన మోహనా కృష్ణా నీరజేక్షణా…

జయ జనార్ధన కృష్ణ రాధికా పతే…

జన విమోచనా కృష్ణ జన్మ మోచనా...


          *** ....సర్వం శ్రీ సాయి కృష్ణార్పణ మస్తు...***


3 comments:

Suvarna said...

బాగానే ఉంది మీరు రాసింది. నాకు దేవుళ్ళు సినిమాలో అందరి బంధువయ్య అన్న పాట విన్నప్పటి నుండి ఓ సందేహమమ్మాయి.రాముడు ఎక్కువ కష్టాలు పడ్డాడా? కృష్ణుడు పడ్డాడా? కాస్త చెప్పమ్మా....

భారతి said...

చక్కటి వివరణతో మంచి టపా...బాగుంది.

Vanitavanivedika.blogspot.com said...

శ్రీ మహావిష్ణువు అవతారాలలో రామావతారం... కృష్ణావతారం..విశిష్ఠమైనవి.వీరిరువురూ లీలామానసచోరులే. కష్టాలు పడడం..అనే పోలిక లేదు.కానీ నా పరిజ్ఞానం మేరకు....

బ్రహ్మ ను రావణుడు దేవ ,దానవ ,యక్ష ,గంధర్వాదుల చేతిలో చావు లేకుండా వరం కోరాడు. అనుగ్రహించాడు బ్రహ్మ. 'మానవుల పట్ల చులకన భావంతో రావణుడు మానవుని చేతిలో చావు లేకుండా ఉండడం' కోరలేదు.
బ్రహ్మ అనుగ్రహించిన వరం వలన రావణుడు లోక కంటకుడై దేవతలు.. గంధర్వులను ఇబ్బందులకు గురిచేస్తుండగా వారు మహావిష్ణువు కు మొరపెట్టుకున్నారు.. రావణ సంహారార్ధం మహావిష్ణువు మానవుడు గా రామావతారం దాల్చాడు.ధర్మ పాలన చేస్తూ..తండ్రి మాటకై అడవులకు వెళ్ళుట మొదలు అన్ని కష్టాలు మానవుడిగా చివరి వరకూ రామచంద్రమూర్తి అనుభవించాడు.
సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం చేసేవరకు అన్నీ కష్టాలే.ఆ తదుపరి కాలపురుషుడు రాముడు కి బ్రహ్మ గారి సందేశం తెలుపుతాడు.రామావతారం యొక్క విశేషం తెలుపుతాడు..సదా ప్రజా హితాన్ని కోరే శ్రీ రామచంద్రుడిని ప్రజలందరూ దేవుడు గా కొలిచారు.తమ పాలిట దైవం అనేవారు. రామయ్యే కష్టాలు ఎక్కువ అనుభవించి ..ఆ కష్టాలను ఎలా అధిగమించాలో..ఆదికావ్యం లో మనకు నేర్పింపబడుతుంది.. అది రామలీల..

శ్రీ కృష్ణ పరమాత్మ మనుషులకు దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ప్రత్యక్షంగా చూపాడు.అందరికీ తన ఉనికిని చూపాడు. ధృతరాష్ట్రుడు... భీష్ముడు.. అర్జునునికి తన విశ్వరూప సందర్శనం గావించాడు.తాను ప్రకటమవుతూ అనేక లీలలను చూపించిన లీలామానస చోరుడు శ్రీ కృష్ణ భగవానుడు.. ఆయన కష్టాలు అన్నీ మనకు తెలియుటకే... ఆయనకు ఏవీ అంటవు...ఈ పోస్ట్ లో ఆయన లీలలు..అవి భక్తులకు ఎలా వరాలయ్యాయో తెలపబడింది..ఇది కృష్ణ లీల...
నా రామయ్య ఇంత కష్టం పడ్డాడు.. నా కన్నయ్య ఇన్ని కష్టాలను నెగ్గాడు..అన్నవి భక్తుల మనోభావనలు ..అని నా అభిప్రాయం..