Sunday, November 8, 2015 By: visalakshi

మనో సంస్కారాలు

  ఓం శ్రీ రామాంజనేయాయ నమో నమ:

 స్తోత్రం:-
               సదారామ రామేతి రామామృతం తే

               సదారామ మానంద నిష్యంద కందం

              పిబన్న స్వహం నన్వహం నైవ మృత్యో


              ర్బిభేమి ప్రసాదా దసాదాత్త వైవ !!



  భా:- నిరంతరమూ ఆనందరసమును స్రవింపచేయు 'రామ రామ రామ 'అనెడి నామ సుధారసమును నిత్యము పానము చేయుచున్న నేను మృత్యువునకు భయపడను.నీ అనుగ్రహము వలన నేను నిర్భయుడనైతిని..

1. ప్రతి మనిషి జీవితంలో శారీరక కర్మల ప్రభావం కన్నా, మానసిక కర్మల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.మనం ఏ పని చేసినా రెండు రకాల ఫలితాలు కలుగుతాయి.ఒక ఫలితం బాహ్యంగా కనిపిస్తుంది.రెండవ ఫలితం మన మనస్సుపై ప్రతిఫలిస్తుంది.మనస్సులో పడ్డ సత్కర్మల,దుష్కర్మల పని తాలూకు ముద్రలు కాలక్రమంలో సంస్కారాలుగా పరిణమిస్తాయి.

2. సమాజంలో ఇలాంటి సంస్కారాల ప్రభావం చేతనే ఒక్కో మనిషి ఒక్కో రీతిలో ప్రవర్తిస్తూ ఉంటాడు.కొందరు ప్రలోభాలకు లొంగిపోయి తప్పటడుగులు వేస్తారు.మరికొందరు ప్రాణాల వరకు వచ్చినా తాము నమ్ముకున్న సిద్ధాంతం నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు వేయరు.మంచి సంస్కారాలతో మనస్సు ఎంత సుసంపన్నమైతే, జీవితం అంత అర్ధవంతమవుతుంది. 

3.ఆధునిక జీవనపు అలజడిలో యధాలాపంగా జీవించకుండా ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి.ఒక నియమానికి కట్టుబడి ఉండేలా మనసుకు శిక్షణ ఇవ్వాలి. విచక్షణ పాటించి, 'ఈ పని చేయడం అవసరమా? కాదా? అని ఆత్మావలోకనం చేసుకోవాలి.మంచి ఏదో, చెడు ఏదో వివేకంతో తెలుసుకొని మసలుకోవాలి.ముఖ్యంగా యౌవనప్రాయంలో తాత్కాలిక సరదాలకు లోనయితే ఆ అలవాట్లే సంస్కారాలుగా మారి భవిష్యత్తులో వ్యక్తిగతంగా తమనే నాశనం చేస్తాయని తెలుసుకోవాలి. మనల్ని అందలం ఎక్కించినా, అధోగతి పాల్జేసినా ఆ మనో సంస్కారాలేనని గుర్తుంచుకోవాలి.  

  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు. 

2 comments:

భారతి said...

మీ ప్రతీ పోస్ట్ ... ఒకో ఆణిముత్యం.
చాలా చక్కగా వ్రాస్తున్నారు వేద గారు.

visalakshi said...

ఆధ్యాత్మిక సత్యాలను ఆవిష్కరించుకోవాలన్నా, పరమాత్ముణ్ణి ప్రత్యక్షం చేసులోవాలన్నా కల్లా కపటం లేని బాలక స్వభావం కలిగి ఉండాలి.అటువంటి స్వభావం కలిగిన నా భారతి ప్రతి మాటా ఒక ఆణిముత్యం.ధన్యవాదాలురా తల్లీ.