Monday, December 5, 2016 By: visalakshi

పరిశీలనా శక్తి

 భావిపౌరులను ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దడానికి మనం మన జీవితపుస్తకంలో ఆచరించి అనుభూతి చెందిన పాఠాలే వారిని అధికంగా ప్రభావితం చేస్తాయి. అప్పుడే పిల్లల్లో పరిపూర్ణ వ్యక్తిత్వం సాధ్యమవుతుంది. నీతులు చెప్పడం వేరు, నీతిగా జీవించడం వేరు. మనం కాలక్షేపాలతో సమయం వృధా చేస్తూ, పిల్లలు మాత్రం సమయపాలన పాటించి, బుద్ధిగా చదువుకోవాలనుకుంటాము. ఏ నీతిబోధ అయినా, ఏ స్పూర్తిదాయక వాక్యమైనా ఆచరించకుండా పిల్లలే కదా మనం ఏం చెబితే అది వింటారు అని తేలికగా తీసుకుంటే పొరపాటే! నేటి పిల్లల గ్రహణశక్తి, పరిశీలనాశక్తి పెద్దలకన్నా మిన్న. పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే చాలాసార్లు పెద్దలు తడబడాల్సి వస్తుంది. ఈ విషయంలో పెద్దలు మంచి అనుభవం సంపాదించే ఉంటారు.





 ఓ పదిహేనేళ్ళ బాలుడు ఆర్ధిక ఇబ్బందులతో వర్తకుని వద్ద పనిలో చేరాడు. యజమాని నమ్మకస్తుడిగా గుర్తించి, ఆ యువకుణ్ణి పొరుగూరు వెళ్ళి ఇతర వ్యాపారస్థుల నుండి బాకీలను వసూలు చేసుకురమ్మన్నాడు. అతడు పొరుగూరు వెళ్ళి బాకీలన్నీ వసూలు చేసుకొని నదిని దాటడానికి పడవ కోసం వేచి ఉన్నాడు.ప్రయాణ బడలిక వల్ల, చల్లని గాలి తాకిడికి అలా కూర్చోగానే నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో ప్రయాణీకుల సందడి వినిపించింది. వెంటనే హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పడవ ఎక్కాడు. పైకంతో ఉన్నా బ్యాగును మర్చిపోయాడు. కొంతసేపటికి బ్యాగు మరచిపోయిన సంగతి గుర్తుకు రాగానే పడవ దిగి పరిగెత్తుకుంటూ కూర్చున్నచోటికి వచ్చి చూశాడు. కానీ బ్యాగు కనబడలేదు. మొత్తం పైకం పోవడంతో కన్నీరుమున్నీరై విలపించాడు.  అంతలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి అతణ్ణి విషయం అడిగి తెలుసుకున్నాడు. ఆ బ్యాగులో పైకం వివరాలను అడిగి తెలుసుకున్నాడు. అతడు చెప్పిన వివరాలు సరిపోలడంతో ఆ వృద్ధుడు బ్యాగును అతడికి ఇచ్చాడు. ఆ బ్యాగు అతడిదే! దాన్ని తెరిచి చూడగా పెట్టిన సొమ్ము పెట్టినట్లుగానే ఉంది. పట్టరాని సంతోషంతో ఆ వృద్ధుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన ఉపకారానికి ప్రతిఫలంగా కొంత పైకం ఇవ్వబోయాడు. అందుకు ఆయన నిరాకరిస్తూ 'నాకు డబ్బు మీద వ్యామోహమే ఉన్నట్లయితే నీకీ పైకాన్ని తిరిగి ఇచ్చేవాణ్ణి కాదు. ప్రతిఫలం ఆశించకుండా చేసేదే నిజమైన సహాయం' అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వృద్ధుని మాటలు ఆ యువకుణ్ణి ఎంతగానో ప్రభావితం చేసాయి. 




ఆ యువకుడు ఊరు వెళ్ళడానికి పడవ కోసం నది ఒడ్డున వేచి చూస్తున్నాడు. ఇంతలో నల్లని మేఘాలు కమ్ముకొని పెనుగాలులతో బోరున వర్షం కురవసాగింది. చూస్తుండగానే నది మధ్యలో ఒక పడవ పెనుగాలిలో చిక్కుకొని మునిగిపోసాగింది. ప్రయాణీకులంతా భయంతో కేకలు పెడుతున్నారు. ఇదంతా ఒడ్డున ఉన్న యువకుడు గమనించాడు. తనకు సహాయం చేసిన వృద్ధుడి మాటలు గుర్తుకువచ్చాయి. వెంటనే ప్రయాణీకులను రక్షించడానికి తన వద్ద ఉన్న సొమ్మును ఇచ్చి గజ ఈతగాళ్ళను పురమాయించాడు. ఆ విధంగా నదిలో మునిగిపోతున్న ప్రయాణీకులందరూ రక్షింపబడ్డారు. ఈ సంఘటనలో ఆశ్చర్యకర విషయమేమిటంటే పడవ ప్రమాదం నుండి రక్షింపబడిన వారిలో ఆ వృద్ధుని కొడుకు కూడా ఉండడం. మనం ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తే అందుకు ప్రతిఫలంగా మనకు ఆ భగవంతుడు ఏదో రూపంలో సహాయం అందిస్తాడు.ఆ వృద్ధుడి ఆదర్శవంతమైన వ్యక్తిత్వం..ఆ యువకుణ్ణి కూడా ఆదర్శవంతమైన జీవితం వైపు పయనించేలా చేసింది. 








 జీవితంలో పిల్లలకు తల్లి తొలి గురువు. ఎంతో ప్రేమతో, ఓర్పుతో తన పిల్లలకు ఆటపాటలలోని మెళకువలను నేర్పిస్తూ, జీవిత సత్యాలకు అన్వయిస్తూ..భవిష్యత్ వ్యూహరచనా కౌశలాన్ని నేర్పిస్తుంది. గురువు కూడా గురుతరబాధ్యతగా జాతి భవిష్యత్తును తీర్చిదిద్దవలసినది తానే అనే విషయం నిరంతరం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వ్యక్తిగానీ, దేశంగానీ గొప్పది కావాలంటే 'మంచితనం యొక్క శక్తిని గుర్తించడం'.. 'అసూయ, అవమానాలకు తావివ్వకపోవడం'.. 'మంచిగా ఉండేవారికి, మంచి చేస్తున్న వారికి సహకరించడం'. అనే మూడు విషయాలు అవసరం. 

తమ తమ పిల్లల పరిశీలనా శక్తికి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించి, వారిని గొప్పవారిగా తీర్చిదిద్దడానికి తాము కృషి చేయాలి. ఉన్నత స్థితికి ఎదిగేలా తీర్చిదిద్దాలి. వారి దీక్షాదక్షతలు తమ దేశాన్ని గొప్పదేశంగా మార్చడానికి ఎంతో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గమనించాలి. మంచి పరిణామాలు ఏర్పడుతాయి అనేలా  చుట్టూ ఉన్న చీకటిని తరిమికొట్టే చిన్న దీపాలను వెలిగించుదాం అన్న స్పూర్తిని పిల్లలకు అందజేద్దాం.  వ్యక్తిత్వాలను వికసింపజేద్దాం. 


0 comments: