Saturday, January 7, 2017 0 comments By: Veda Sri

వైకుంఠ ఏకాదశి

ఓం నమో నారాయణాయ 




 అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం !
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదు:ఖాతిగోభవేత్ !!

ఆది మధ్యాంత రహితుడు, నిర్వికారుడు, బ్రహ్మాది దేవతలకు ప్రభువు, సర్వలోకాలకు నియామకుడు,సర్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును నిరంతరం స్తుతించడంవల్ల సకల దు:ఖాలు తొలగి సంపదలు కలుగుతాయి. వైకుంఠ ఏకాదశినాడు గోపూజ చేయడం చాలా మంచిది. విష్ణుమూర్తి సన్నిధిలో ఆవునేతితో దీపం వెలిగిస్తే అజ్ఞానమనే చీకట్లు తొలగి ముక్తి లభిస్తుందని ప్రతీక. 





వైకుంఠ ఏకాదశి ఉత్తరాయణ ప్రారంభదినం  కావడం వలన ఇది అత్యంత విశిష్టమైన పండుగ. మన ఆరునెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. దీని ప్రకారం దేవతలందరూ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి రాత్రి నుంచి వెలుగులు చిమ్మే పగటిలోకి వచ్చారన్నమాట. స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తరద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే విష్ణ్వాలయాలలో ఈ రోజు ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ ద్వారం నుంచి భక్తులు  స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం.

 ముక్కోటి అంటే ముప్పది మూడు కోట్ల దేవతలని ఉద్దేశించినది. ఈ ఏకాదశినాడు విష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై ఉత్తర ద్వారాన దర్శనమిస్తాడట. ఆ దివ్యసుందర రూపుని దర్శించుకోవడం కోసం దేవతలందరూ ఈ రోజున దివి నుండి భువికి దిగి వస్తారట. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఇదే వైకుంఠద్వారం. వైకుంఠద్వారమే సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచన. అందుకే ఉత్తరద్వారం నుంచి విష్ణుదేవుని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని పురాణ వచనం. ఈ రోజు విష్ణు సహస్ర నామ పారాయణం బహు శ్రేష్ఠం. 

                          (జనవరి 8వ తేదీ ఆదివారం వైకుంఠ ఏకాదశి).....


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.
Friday, January 6, 2017 0 comments By: Veda Sri

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం -2



5 వ శ్లో" దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదు:
            స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి బ్రాంథా భృశం వాదిన: !
            మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సం హారిణే
             తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!

భా:- "ఆత్మతత్వమును తెలియజాలని కొందరు, ఆత్మ దేహమనియు, ప్రాణమనియు తప్పుగా గ్రహిస్తారు. బుద్ధిపరంగా స్త్రీలవలె, చిన్నపిల్లలవలె, మూఢులవలె, విషయాలనర్ధం చేసుకునే శక్తిహీనులు,మాయా ప్రభావానికి లోనై, శరీరమే సత్యమనీ, ప్రాణమే సత్యమనీ, ఇంద్రియాలనే సత్యమనీ, మనస్సే సత్యమనీ, నిత్యమూ మార్పు చెందే బుద్ధే సత్యమనీ, శూన్యమే సత్యమనీ శాస్త్రం నుండి తప్పుగా గ్రహిస్తారు. అట్టివారి భ్రమలను తొలగించగలిగే పరమగురువుకు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."

6 వ శ్లో"   రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్చాదనాత్
               సన్మాత్ర: కరణోప సం హరణో యోభూత్సుషుప్త: పుమాన్ !
               ప్రాస్వాప్సమితి ప్రబోధసమయే య: ప్రత్యభిజ్ఞాయతే
               తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!

భా:-" గ్రహణ సమయంలో సూర్యచంద్రులు రాహువుచే కప్పబడినట్లుగా, సర్వేంద్రియ వ్యవహారాలూ ఉపశమించిన  సుషుప్తి అవస్థలో ప్రవేశించి మాయావరణతో కూడిన సత్యం సన్నిధిలో విశ్రాంతినొంది మళ్ళీ మెలకువలో తాను నిద్రపోయినట్లుగా తెలుసుకునే పరమసత్యానికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."




7 వ శ్లో"     బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తధా సర్వాస్వవస్థాస్వపి
                వ్యావృత్తాస్వనువర్తమాన మహమిత్యంత: స్ఫురంతం సదా !
                స్వాత్మానాం ప్రకటికరోతి భజతాం యో భద్రయా ముద్రయా
                తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!

భా:-   " బాల్యకౌమార యౌవన వృద్ధాప్య దశలలోనూ, జాగృత్ స్వప్న సుషుప్తి మొదలైన అన్ని అవస్థలలోనూ భూత వర్తమాన భవిష్యత్ కాలాలలోను, సర్వదా అన్నిప్రాణులలోనూ "నేను"గా ఉంటూ తన భక్తులకు చిన్ముద్ర ద్వారా తన నిజ తత్వాన్ని వ్యక్తం చేసే సద్గురుమూర్తి శ్రీదక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."

8 వ శ్లో"      విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత:
                  శిష్యాచార్యతయా తధైవ పితృపుత్రాద్యాత్మనా భేదత: !
                  స్వప్నే జాగృతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామిత:
                  తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!


భా:-" ఏ పురుషుడు మాయా ప్రభావంతో తనలో.. కార్యకారణ సంబంధరూపమయిన విశ్వాన్నీ, శిష్యాచార విభేదాన్నీ, పితృపుత్ర మొదలయిన తేడాలనీ జాగృత్ స్వప్నావస్థలనీ చూస్తున్నాడో, ఆయనను, ఆ పరమగురువుకి, శ్రీదక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."




9 వ శ్లో"    భూరంభాస్య నలో2నిలో2ంబర మహర్నాధోహిమాంశు: పుమాన్
                ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం !
                నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్ విభో
                తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!


భా:- " ఎవని అష్టమూర్తులు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం సూర్యుడు చంద్రుడు జీవుడు విరాజిల్లుతున్నారో, ఎవరు చరాచరమైన జగత్తుగా వ్యక్తమవుతున్నాడో, ఎవనిని ఆరాధించి సర్వవ్యాప్తమయిన ఆత్మతత్వంకంటే వేరుగా రెండవదేదీలేదని సాధకులు తెలుసుకుంటున్నారో .... అట్టి సద్గురువునకు శ్రీదక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."


10 వ శ్లో"     సర్వాత్మత్వమితి  స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
                   తేనాస్య శ్రవణా త్తదర్ధ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ !
                   సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వత:
                   సిద్ధ్యేత్ తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం !!

భా:-     "  సర్వాత్మత్వం ఈ దక్షిణామూర్తి స్తోత్రము నందు వివరించబడింది. ఈ ప్రపంచము సర్వమూ ఆత్మస్వరూపమే..అని స్పష్టము చేయబడినది. కాబట్టి దీనిని శ్రవణం మననం చేసి ధ్యానించి కీర్తించడంలో అష్టవిభూతి సహితమయిన సర్వాత్మత్వం, ఈశ్వరత్వం, స్వరూపానుభూతి సిద్ధిస్తాయి."



 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు





Thursday, January 5, 2017 0 comments By: Veda Sri

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం - 1

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం 




ధ్యానం

శ్లో" మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం
     వర్షిష్ఠాంతే వసదృషిగణై రావృతం బ్రహ్మనిష్ఠై:!
     ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర మానందరూపం
     స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే !!

 భా:- ఆత్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వేదవిదులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువగురువు శ్రీదక్షిణామూర్తిని నేను ఆరాధిస్తాను.

శ్లో"  వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం
    సకలముని జనానాం జ్ఞానదాతారమారాత్ !
    త్రిభువనగురు మీశం దక్షిణామూర్తి దేవం
    జనన మరణ దు:ఖచ్చేద దక్షం నమామి !!

మర్రిచెట్టు క్రింద కూర్చొని తనచుట్టూ ఉన్న మహర్షులకు ఆత్మవిద్యను అందిస్తూ జనన మరణాలతో కూడిన సంసారదు:ఖాలను నిర్మూలిస్తూ ముల్లోకాల చేతనూ గురువుగా కొలవబడే శ్రీ దక్షిణామూర్తికి నమస్కృతులు. 

శ్లో"   చిత్రం వటరోర్మూలే వృద్ధా: శిష్యా గురుర్ యువా !
       గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్నసంశయా: !!

ఆహా! ఎంత ఆశ్చర్యకరం! యువకుడైన గురువుచుట్టూ వృద్ధులైన శిష్యులు శ్రద్ధాభక్తులతో కూర్చొని ఉన్నారు. గురువు తన మౌనంతోనే వారి సర్వసందేహాలనూ నివారింపగలుగుతున్నారు.

శ్లో"   నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం !
        గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ: !! 

భవరోగ బాధితులకు వైద్యుడై జగద్గురువై, జ్ఞానస్వరూపంగా ప్రకాశించే దక్షిణామూర్తికి నమస్కృతులు.

శ్లో"  ఓం నమ: ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైక మూర్తయే !
     నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ: !!

నిత్యశుద్ధుడవై, ప్రశాంతస్వరూపుడై, శుద్ధజ్ఞానమే మూర్తిగా, ప్రణవనాదమైన ఓంకారానికి లక్ష్యార్ధంగా భాసిస్తూ, నిర్మలుడైన దక్షిణామూర్తికి నమస్కృతులు. 





శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం -  ........

 శ్లో"   విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం
              పశ్యాన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధా నిద్రయా
             య స్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మాన మేవాద్వయం
             తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!

 భా:-  " నామరూపాత్మకమైన ఈ సర్వజగతినీ, ఆత్మచైతన్యమయిన తనలో లీలామాత్రంగా, స్వానుభవంగా, స్వాత్మగా, అద్దంలో కనిపించే నగరంవలె, స్వప్నదృశ్యం వలె తనకంటే భిన్నంగా ఉందన్న భ్రమ కలిగిస్తోందని గుర్తిస్తున్న జగద్గురువైన శ్రీ దక్షిణామూర్తికి నా నమోవాకాలు... దక్షిణాభి ముఖంగా ఉన్న మూర్తిని(దక్షిణామూర్తిని) ఆ పరబ్రహ్మస్వరూపమే అని ఈ శ్లోకం నిర్ధారిస్తోంది. "

వ శ్లో"   బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాక్ నిర్వికల్పం పున:
              మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం !
              మయావీవ విజృంభయత్యపి మహాయోగీవ య: స్వేచ్చయా
              తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!  

  భా:-  " పరిపూర్ణమూ ఏకమూ అయిన ఆత్మతత్వంతో ఈ సమస్త సృష్టి ఇమిడి ఉంది.  విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్లుగా గోచరించే ఈ మహావిశ్వమంతా, దేశకాలావృతమైన సమస్త చరాచర జగతినీ, ఇంద్రజాలికునివలె, మహాయోగివలె, బహిర్గతం చేసి తన మాయాశక్తితో స్వేచ్చగా జగన్నాటకాన్ని నడిపే పరమాత్ముడైన నా గురువునకు, శ్రీ దక్షిణామూర్తికి ఇదే నా నమస్కృతులు. "

వ శ్లో"   యస్యైవ స్ఫురణం సదాత్మక మసత్కల్పార్ధకం భాసతే
               సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ !
               యత్సాక్షాత్కరణాధ్ భవేన్న పునరావృత్తి ర్భవాంభోనిధౌ
               తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!

 భా:-    ఆత్మ యొక్క  ఈ ఉనికి ,స్ఫురణా వలననే మనకు వస్తువిషయక జ్ఞానమూ అనుభవమూ సంభవమవుతున్నాయి.  ఈ ఉనికి ,స్ఫురణా ఆత్మలో అంతర్లీనమై ఉన్న లక్షణాలే. ఇదే సర్వానికీ కారణం అని నిశ్చయింపవచ్చును. "ఎవరి వ్యక్తరూపం ఈ ప్రపంచంగా స్ఫురిస్తూ కూడా నిత్యసత్యమై ప్రకాశిస్తూ ఉంటుందో, శ్రద్ధతో శరణువేడినవారికి తత్త్వమస్యాది మహాక్యాలతో ఎవరు జ్ఞానబోధ చేస్తుంటారో, ఎవరి జ్ఞానబోధవల్ల జననమరణయుక్తమైన ఈ సంసారచక్రం నుండి ముక్తిపొందుతున్నారో, అట్టి పరమ పవిత్రమైన గురుమూర్తికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కృతులు."






వ శ్లో"    నానాచిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం
               జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహి: స్పందతే !
               జానామీతి తమేవ భాంత మనుభాత్యేతత్సమస్తం జగత్
               తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం  శ్రీ దక్షిణామూర్తయే !!


 భా:-  "  ఆత్మచైతన్యం అంత:కరణలో ప్రతిఫలించి, మనస్సులో సంచలనాన్ని సృష్టించి మన కళ్ళు చెవులు మొదలయిన ఇంద్రియాలద్వారా,బాహ్యంగా ప్రసరిస్తూ 'అనేక చిల్లులు కలిగిన కుండలో ఉన్న దీపకిరణాలవలె, పైకి ప్రసరిస్తూ ఉందో.'.ఏ చైతన్యం ప్రకాశించడం వలన ఈ వస్తుమయ మహా ప్రపంచమంతా తెలియబడుతూ ఉందో.... అటువంటి దివ్యమూర్తికి సద్గురువుకు, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."

                                                                                         - సశేషం


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు








Monday, January 2, 2017 0 comments By: Veda Sri

త్రికరణశుద్ధి

  ఓం నమో భగవతే వాసుదేవాయ



 ఆడి పాడే వయస్సులోనే అనంతాత్ముడి దర్శనం కోసం వ్యాకుల పడుతున్న బాలుడికి నారదమహర్షి మధువనం వైపు మార్గం చూపాడు. ఓంకారంతో కూడిన పన్నెండక్షరాల మహిమాన్వితమైన వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు. 'ఓం నమో భగవతే వాసుదేవాయ ' అనే మంత్రాన్ని ఏడు దినాలు జపిస్తే, ఆ దేవదేవుడి సాక్షాత్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేశాడు.  భక్తుడు మనోనిగ్రహం కలవాడై, శాంతుడై, మితభాషియై సదాచార సంపన్నుడై,కందమూలాశనుడై శ్రీహరి కల్యాణ గుణగణాలను ధ్యానించాలని ప్రభోదించాడు.ఇలా సర్వసమర్పణ బుద్ధితో చేసే పూజలను 'ఓం నమో భగవతే వాసుదేవాయ ' అనే మంత్రంతో ఆ వాసుదేవునికి సమర్పించాలని నారద మహర్షి ధ్రువుడికి సూచించారు.  త్రికరణశుద్ధిగా భక్తితో పూజించే భక్తుడు భగవంతుడి మాయలో చిక్కుకొనడని, ధర్మార్ధ కామ మోక్షాలనే పురుషార్ధాలలో కోరినదానిని అనుగ్రహిస్తాడని ఆ బ్రహ్మమానస పుత్రుడు అభయమిచ్చాడు. ఆ నీలమేఘశ్యాముని వర్ణిస్తూ...గరుడవాహనుడిని గరికపోచలతో సేవించాలి. పద్మనేత్రుడైన పరమాత్ముడిని పద్మాలతో పూజించాలి. తులసిదండలు ధరించే స్వామిని తులసీదళాలతో ఆరాధించాలి అని ప్రస్ఫుటం చేశాడు.



నారదమహర్షి ప్రసాదించిన "ఓం నమో భగవతే వాసుదేవాయ " మంత్రాన్ని స్వీకరించి ధ్రువుడు తీవ్ర తపస్సుకు పూనుకున్నాడు.  సమస్త పుణ్యాలకు ఆలవాలమైన మధువనంలో ఉపవాస దీక్షతో, ఏకాగ్రచిత్తుడై భగవంతుణ్ణి ధ్యానింపసాగాడు. ప్రాణవాయువును నిరోధించి పరమాత్మతో అనుసంధించాడు. ఆ బాలుడి అకుంఠిత దీక్షకు భూనభోంతరాలు కంపించిపోయాయి. తుదకు దేవతలందరూ ఆ దేవదేవుడిని లోకరక్షకుడైన పుండరీకాక్షుని శరణు వేడారు. పరమాత్మా! నీవు సర్వప్రాణి శరీరాలలో అంతర్యామిగా ఉండే స్వామివి. పూర్వం ఎప్పుడూ ఈ విధంగా మాకు ప్రాణనిరోధం ప్రాప్తించలేదు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఓ హరీ! కేశవా! జగదీశ్వరా! సర్వశరణ్యా! నీ చరణ కమలాలను శరణు పొందుతున్నాం ఆపదను తొలగించి కాపాడు ప్రభూ! అని వేడుకున్నారు. వారి విన్నపాన్ని విన్న పరాత్పరుడు వారిని ఓదారుస్తూ, బాలభక్తుడైన ధ్రువుడు నా యందు మనస్సును సంధానపరచి తపస్సు చేస్తున్నాడు. అందుకే మీకు ప్రాణనిరోధం కలిగింది. తపస్సు నుంచి ఆ బాలుని విరమింపజేస్తాను భయపడకండి అని అభయమిచ్చాడు. అనంతరం శ్రీహరి గరుడవాహనమెక్కి మధువనంలో ధ్రువుడి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ధ్రువుడు తనముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని తిలకించి ఆనందభాష్పాలతో పులకించాడు.



అనంతరం తన కనుదోయితో స్వామి సౌందర్యాన్ని తాగుతున్నట్లు, ముఖంతో స్వామిని ముద్దాడుతున్నట్లు తనకరములతో స్వామిని కౌగలించుకుంటున్నట్లు అనుభూతి చెందుతూ ధ్రువుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ విశ్వంభరుడిని వేవేల స్తుతిస్తూ ..."శ్రీ హరీ! నిర్మలాత్ములై నీ సేవయందాసక్తులైన భక్తులతో నాకు మైత్రి చేకూర్చు. ఆ సత్పురుషుల సాంగత్యం చేత నీ కధాసుధారసాన్ని మనసారా గ్రోలి, దు:ఖాలతో నిండిన సంసార సాగరాన్ని సులభంగా తరిస్తాన"ని ప్రార్ధించాడు. ఇలా సజ్జనుల సాంగత్యానికున్న మహత్యాన్ని ధ్రువుడు మరోమారు గుర్తుచేశాడు. పరమాత్మ ఉనికి ప్రస్ఫుటం కావటానికి సత్పురుషుల సాహచర్యం ఎంత ఉపకరిస్తుందో అనటానికి ఈ బాలభక్తుని ప్రార్ధనే నిదర్శనం. పారవశ్యంతో పరంధాముని గొంతెత్తి సుతిస్తూ పాదాభివందనం చేశాడు. భగవంతుడి దర్శనభాగ్యంతో బాలుడైనా, భావుకుడై కవితాత్మకంగా కీర్తించాడు.   
                       
                              ఓం నమో భగవతే వాసుదేవాయ    
Saturday, December 31, 2016 0 comments By: Veda Sri

పరిపూర్ణత్వము

 శ్లో" ఏతావానేవ లోకే2స్మిన్ పుంసాం ని:శ్రేయసోదయ:
     తీవ్రేణ భక్తియోగేన మనో మయ్యర్పితం స్థిరం

భగవానునిపై మనస్సు సంలగ్నమైన వారలు తీవ్రమగు భక్తియోగమున నెలకొందురు. జీవితపు చరమసిద్ధిని బడయుటకు అదియే ఏకైక సాధనము.



'మనోమయ్యర్పితం' (నా యందు సంలగ్నమైన మనస్సు) మనుజుడు తన మనస్సును శ్రీకృష్ణభగవానుని యందు అత్యంత శ్రద్ధతో నిలుపవలెను. అదియే పరమోస్థితి కాగలదు. మనస్సును కృష్ణపాదారవిందముల చెంత సంలగ్నము చేయుటే ఉత్తమోత్తమ విధానము. 'సర్వధర్మాన్ పరిత్యజ్య మాం మేకం శరణం వ్రజ ' "సమస్త ధర్మములను విడిచి కేవలం నన్నే శరణు పొందుము." మన భౌతిక బంధనముల నన్నింటిని విడిచి శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించ వలెను.


 

 'ప్రతిఒక్కరు తమ గుణకర్మల ననుసరించి పరిపూర్ణత్వమును సాధించ వచ్చునని శ్రీకృష్ణుడు తెలిపెను.' 

 శ్లో"  యత: ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం
           స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ: 

 "సర్వజీవులకు మూలకారణమును, సర్వవ్యాపకుడైన భగవంతుని మానవుడు తన స్వకర్మములను చేయుట ద్వారా అతడిని పూజించుటచే మనవుడు పరిపూర్ణత్వమును సాధించును."



ప్రహ్లాదుడు నరసింహ భగవానుని చేత అతని తండ్రిని  సంహరింప చేసి తన తండ్రికి గొప్ప సేవ చేసెను. శాస్త్రములలో ఎవరైన రాక్షసుడైనను భగవంతుని చేత సంహరించ బడినచో అతడు వెంటనే ముక్తిని పొందునని తెలుపబడినది. ప్రహ్లాదుడు ఇలా ఆలోచించెను: "నా తండ్రి ఎన్నో పాపకార్యములను ఒనరించెను. మరియు భగవంతుని వ్యతిరేకించెను కాబట్టి అతడు ముక్తిని పొందజాలడు" అని భావించెను. నరసింహ భగవానుడు హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ప్రహ్లాదుడు ఇలా పలికెను: "శ్రీహరీ! నా తండ్రి గొప్ప నాస్తికుడు. అతడు మీ పాదపద్మముల వద్ద అనేక అపరాధములను చేసెను. అతడిని నీవు సంహరించితివి. అతడిని క్షమించి ముక్తిని ప్రసాదించుమని నేను మిమ్ములను ప్రాధేయపడుతున్నాను." నిజానికి హిరణ్యకశిపుడు వెంటనే ముక్తిని పొందాడు. కాని అతని ప్రియ పుత్రుడు తన తండ్రి ముక్తిని పొందగలిగెనా లేదా అని జిజ్ఞాసతో తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరైనను శుద్ధ వైష్ణవుడై  భగవంతునికి సేవ చేసినచో వారు తమ కుటుంబమునకు అత్యున్నతమైన సేవ చేసినవారగుదురు. ఎందుకంటే ఇరవైఒక్క తరాలవారు ముక్తిని పొందుదురని భగవంతుడు నిర్ధారించెను. 



 భగవంతుని అవతారాలు ఎన్నో కలవు. కొంతమంది జనులు ఇలా ప్రశ్నిస్తుంటారు :" మీరు శ్రీకృష్ణుని పూజిస్తున్నారు. రాముని ఎందుకు పూజించరు? " నిజానికి కృష్ణునికి, రామునికి మధ్య తేడా లేదు. కాని ప్రతిఒక్కరు విభిన్నమైన ఆసక్తులను కలిగి ఉన్నారు. హనుమంతుడు ప్రత్యేకించి శ్రీరామచంద్రునికి అంకితమైనాడు. గోపికలు కేవలం శ్రీకృష్ణుడికి అంకితమైనారు. నిజానికి ఇందులో ఎటువంటి బేధము లేదు. భగవంతుడు వివిధ రూపాలతో అవతరించును. కాని అన్ని పరిస్థితులలోను అతడు భగవంతుడే. ఒకసారి గోపికల మధ్యనుండి శ్రీకృష్ణుడు అదృశ్యమై నాలుగు చేతులు గల నారాయణునిగా ప్రత్యక్షమైనాడు. కాని వారు కృష్ణుని వెతకసాగిరి. నారాయణుని రూపము పట్ల వారు పెద్దగా ఆసక్తిని కనపరచలేదు. వారు కేవలం కృష్ణుని చూడాలనుకున్నారు. నిజానికి శ్రీకృష్ణునికి, విష్ణువుకు మధ్య బేధము లేదు. కాని ప్రతి భక్తుడు ఒక ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటాడు. అందరి హృదయాలలో భగవంతుడు నిలిచి ఉన్నాడు. మనం భగవంతుని పట్ల శ్రద్ధాసక్తులను కలిగి ఉండి వారి కృపచే భక్తిలో దృఢసంకల్పులము కావలెను. 

  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు  






Friday, December 30, 2016 0 comments By: Veda Sri

రమణ మహర్షుల వారి సంభాషణలు..

  ప్రారబ్ధం:-   "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే, యుగే" అన్నట్లు ఎప్పటికప్పుడు సాధువుల పుణ్యం, దుష్టుల పాపం చేరి ప్రారబ్ధంగా పరిణమించి ధర్మ సంస్థాపనార్ధం ఈశ్వరుడు రూపం ధరిస్తాడు.  ప్రారబ్ధం లేనిదే దేహమెట్లా వచ్చింది? పనులెట్లా చేస్తారు? జ్ఞానుల చర్యలనే ప్రారబ్ధమంటారు. బ్రహ్మ మొదలు సదాశివాది దేవతలకున్నూ ప్రారబ్ధం ఉన్నట్లు చెప్పబడింది. రామ కృష్ణాద్యవతారాలూ అంతే. శరీరమే ప్రారబ్ధం. ఏ నిమిత్తంగా ఆ శరీరం వచ్చిందో ఆ పని దానంతటదే జరుగుతుంది. 



ప్రారబ్ధం అహంకారానికే కానీ ఆత్మకు కాదు. మనం ఆత్మస్వరూపులమైనపుడు ప్రారబ్ధం మనలను బాధించదు. భగవంతునకు పరిపూర్ణ శరణాగతి చెందటం."ప్రభూ! నీవు తప్ప నేను లేను. నీ యిచ్చయే నెరవేరు గాక!" అంటూ నిరంతరం ప్రార్ధించాలి. ఏ కోరికా కూడదు  ..చివరకు మోక్షాపేక్ష కూడా అడ్దవుతుంది. అప్పుడు అహంకారం పూర్తిగా నాశనమైపోతుంది. ఇక ప్రారబ్ధం బాధించదు.   

సమాధి:-          యోగంలో శరీరాన్ని మరచి ఉండటమే  సమాధి.  
సకలేంద్రియాలు పనిచేస్తుండగానే ఎప్పుడూ సమాధిలో ఉండడం.  దీన్ని సహజ సమాధి అంటారు. నీవు సమస్త కార్యాలు చేస్తున్నప్పటికి శాంతితో నిలకడ కలిగిఉంటావు. అంతరాత్మ ప్రేరితుడవై చరిస్తున్నావని గుర్తించగలుగుతావు. అందువల్ల ఏమి చేస్తున్నా ఏమి తలుస్తున్నా అవి నిన్ను అంటవు. నీకు చింతలుండవు. ప్రతి పని వేరైయున్న ఒక వస్తువు చేత జరపబడుతుంది. ఆ గొప్ప వస్తువుతో నీవు ఏకమై ఉంటావు. " నాది అనేది అర్పించటం చిత్తశుద్ధి యిస్తుంది. నేనును అర్పించటం జ్ఞానాన్ని యిస్తుంది." 




 ధ్యానం:-        "నేను ఉన్నాను" అని ప్రతివారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటూనే ఉన్నా "నేను" పై దృష్టి కేంద్రీకరించక అన్యంగా ఉన్న వాటిపై ధ్యానం చేయాలని చూస్తారు.రెండు కనుబొమల మధ్య చూస్తే భగవంతుడు అక్కడే ఉన్నాడని అన్నట్లవుతుంది. ఈ సాధన వల్ల ఏకాగ్రత కుదురుతుంది. మనస్సును దృఢపరచి అంతర్ముఖ పరచవచ్చు. ప్రత్యక్ష మార్గమేమంటే "నేను" పైన దృష్టి నిలిపి నేనెవడను? అని నిరంతరం ప్రశ్నించుకోవాలి. ధ్యాన సమయంలో కళ్ళు మూసుకోవటం, తెరవటం ముఖ్యం కాదు. కండ్ల ద్వారా చూచేవారొకరున్నారు. ఆ చూచేవాడిని పట్టుకొని, లోపలికి తిప్పాలి. అప్పుడు ఆత్మ దర్శనం అవుతుంది.ప్రతివారికి ఉన్నది ఒక మనస్సు. దాని పుట్టుకెక్కడ? దాని స్వరూపమేమిటి? ఇది విచారిస్తూపోతే ఆ మనస్సు లయమై పోతుంది. ఆ తరువాత మిగులునది "నేను" "నెనెవరు?" నేను కేవలం ఆత్మను. ఇది ధ్యానము. ఈ పద్ధతిలో దేహవాసన నశిస్తుంది.  




  మౌనం:-       మౌనమంటే మాట్లాడకుండా ఉండటం కాదు. ఎక్కడ నుండి ఆలోచన, మాట పుడుతున్నదో అదే మౌనం. సంకల్పరహితమైన ధ్యానం. ఇదే నిజమైన భాషణ. మాట నిరంతరం మౌన భాషణను నిరోధిస్తుంది. గంటల కొలది ఉపన్యాసాలు, వ్యక్తులను రవ్వంత కూడా అభివృద్ధి చేయకపోవచ్చు. మౌనం అలాకాక, సమస్త మానవాళిని అభివృద్ధి పరుస్తుంది. సదా ఆత్మచింతనమే మౌనం. 




 ప్రాణాయామం:-        ప్రాణము, మనస్సు ఒక చోటునుండి పుట్టుకొస్తున్నాయి. అదే ఆత్మ. అందుచేత ఉచ్చ్వాస నిశ్వాసాలు, లేక మనస్సు(తలంపులు)ఎక్కడనుండి పుట్టుకు వస్తున్నాయో గమనిస్తూ ఉంటే ఆత్మ దర్శనం అవుతుంది.  ఈ  రెండింటిలో ఏ ఒక్కదాన్ని అనుష్టించినా చాలు. మనస్సును పరిశీలిస్తూ ఉంటే, ఒకనాటికి తలంపులన్నీ ఆగిపోతాయి. అప్పుడు పూర్ణశాంతి లభిస్తుంది. అది నీ స్వరూపమే. జనక మహారాజు ఇలా అన్నాడు "ఇప్పుడు నేను దొంగను(మనస్సు)పట్టుకున్నాను. ఇతడే నా నిజమైన నేనును దొంగిలించాడు. ఇప్పుడు ఇతనిని వధించి తీరుతాను."  




మనం తలంపులకు చోటిచ్చామంటే ఆత్మను పోగొట్టుకున్న వారమౌతాము. మనం పరిశీలించనంత వరకే మనస్సు బడాయి. పరిశీలించామా అదృశ్యమౌతుంది. ఆత్మ దర్శనమౌతుంది. తలంపులను సూటిగా అరికట్టలేని వారికి ప్రాణాయామం విధించారు. మనోనిగ్రహానికి ప్రాణాయామముపకరిస్తుంది. ఆసనాలు ప్రాణాయామానికి, ప్రాణాయామం ధ్యానానికి సాయం చేస్తాయి. ఫలితం మనశ్శాంతి.హఠయోగ ప్రయోజనం యిదే.  




 జపం:-         నేను జపిస్తున్నాను అను తలంపు పూర్తిగా పోయే వరకు జపం చేయాలి. అప్పుడు "జపిస్తున్నది నేను కాదు. మంత్రం నా యత్నం లేకుండానే తనంతట తానే సాగిపోతున్నది" అను సత్యం మీ అనుభవంలోకి వస్తుంది. అదే సహజస్థితి. అదే సిద్ధి. ఏ నామమైనా మనస్సును ఒక తలంపు పైన ఏకాగ్రపరచటం.తలంపులు మనస్సు నుండి వస్తున్నాయి కనుక మానసిక జపం ఉత్తమమైంది. వాచికము, దా ని  స్మృతి, ఆపైన ధ్యానము. ఈ క్రమంలో సాగి చివర అప్రయత్నమగు నిరంతర జపం. జకర్త 'ఆత్మయే ' జపాలన్నింటిలో "నేనెవరన్న" జపమే అత్యుత్తమం. అంతా పోతే నామమే ఉంటుంది. అదే ఆత్మ. అదే దైవం..అదే పరమావధి. నామజపం అంటే ఆ దైవానికి ఒక పేరు పెట్టి పిలుస్తున్నామన్నమాట. ...ఏ విధంగా తలిస్తే ఆ విధంగా వస్తాడు. వీరి అంతులేని కోరికలను తీర్చి.. ఇక్కడే ఫలితాన్ని అనుభవించమని అంతర్ధానమవుతారు. 


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు





Thursday, December 29, 2016 1 comments By: Veda Sri

భక్త కనకదాస్ - part 2



వ్యాసరాయలవారు జరిగిన వృత్తాంతమంతయు ఆలకించి విస్మయమొందుతారు. వ్యాసరాయలవారికి వెంటనే ఒక సంకల్ప ముదయిస్తుంది. తాను త్రవ్విస్తున్న కాలువకు అడ్డముగ ఒక పెద్దబండ పడి, తొలగింప నశక్య మవుతున్నది. ఆ బండను తొలగించవలసినదని దున్నపోతును కోరగా దున్నపోతు ఆ బండను తొలగించి అదృశ్యమవుతుంది. నీరు ప్రవహించుటకు అనుకూలముగా దున్నపోతు బండను తొలగించిన ఆ తూమును "కనకతూము" అని పిలుస్తారు. చిత్తూరు జిలాలోని మదనపల్లి గ్రామమునకు సమీపములో ఈ తూము ఉన్నది. వ్యాసరాయలవారు ఈ సంఘటనను ఆధారముగా గ్రహించి, కనకదాసు భక్తి శ్రద్ధలను అవగతము చేసుకొని, అతడిని తన శిష్యునిగా స్వీకరించి, ఆశీర్వదిస్తారు. గురుదేవుని ప్రజ్ఞా ప్రబోధాలతో ప్రభావితుడైన కనకదాసు నిరంతర తపోధ్యానాదులాచరించి, అంతరంగిక ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంటాడు. పవిత్ర తీర్ధక్షేత్ర సందర్శనము చేయవలెననెడి కుతూహలము కనకదాసు మనస్సులో జనిస్తుంది. గురుదేవుల అనుమతిపొంది తీర్ధయాత్రలకు బయలు దేరుతాడు. 

 పుణ్యనదులలో స్నానమాచరిస్తాడు. పవిత్ర పుణ్యక్షేత్రములను దర్శిస్తూ తిరుమలేశుని దర్శనానికి తిరుపతి వస్తుంటాడు. తన భక్తులైన బీరప్ప బుచ్చమ్మల ముద్దుబిడ్డడు, నిరంతర గోవిందనామ స్మరణామృత పానచిత్తుడు, భక్త శిఖామణియైన కనకదాసుడు తన దర్శనమునకు అరుదెంచుచున్నాడని గ్రహించిన 'శ్రీనివాసుడు ' దేవాలయ మహంతుకు స్వప్నంలో దర్శనమిచ్చి కనకదాసును సగౌరవముగా సత్కరించవలసిందని చెబుతాడు. కనకదాసు తిరుమలేశుని దర్శనానికి వస్తాడు. ఏ ఆడంబరము లేక సర్వ సామాన్యునివలె గోచరించే కనకదాసును గుర్తించడం మహంతుకు సాధ్యంకాదు. స్వామి దర్శనానికై ఆలయ ముఖద్వారం వద్ద కనకదాసు రోజంతా నిరీక్షిస్తాడు. దర్శనం మాత్రం కాలేదు.  

 బాలాజీ దర్శన భాగ్యానికి నోచుకోని తన దురదృష్టానికి చింతిస్తూ రాత్రంతా దేవాలయమునందే పడుకొని దు:ఖిస్తాడు. ఆ సమయములో స్వామి ఆభరణాలు ఆనాడే అదృశ్యమవుతాయి. రాత్రంతా ఆలయ ప్రాంగణములో ఒంటరిగా సంచరిస్తూ కనిపించిన కనకదాసే చోరుడని నిర్ణయిస్తారు. బంధించి న్యాయాధిపతికి అప్పగిస్తారు. కనకదాసును త్రాటితో స్థంభానికి కట్టివేసి కొరడాతో తీవ్రముగా కొడతారు. కర్కశమైన కొరడా దెబ్బలను భరించలేక కనకదాసు మూర్చిల్లుతాడు. 'తిరుమలేశుడు ' మహంతుకు స్వప్నంలో దర్శనమిచ్చి, జరిగిన వృత్తాంతమంతయు తెలియజేస్తాడు. తాను సన్మానించమనిన కనకదాసును అవమానపరచినందుకు మహంతుపై ఆవేశమును చూపుతాడు. వెంటనే కనకదాసును విడిపించమని చెబుతాడు. మహంతు కనకదాసు బంధించియున్న ప్రదేశమునకు పరుగెత్తి కనకదాసు పాదాలపై బడి క్షమాబిక్ష కోరుతాడు. దైవదర్శనార్ధము కనకదాసును ఆలయములోనికి తీసుకువెళ్తాడు. దేవాలయ తలుపులు తీయగానే పోయిన ఆభరణములతో సహా స్వామి దర్శనమిస్తారు. నేత్రములవెంట భాష్పములు రాలుచుండ కనకదాసు చేతులు జోడించి స్వామికి నమస్కరిస్తూ "భగవాన్! వెంకటరమణా! అశ్రిత జనరక్షకా! నీ లీలలు మాకు అర్ధం కావు. నీవు భక్తుల నుద్ధరించు తీరు ఊహాతీతము. ఆభరణముల అపహరణ వెనుక దాగియున్న నీ ఆశ్రిత జనరక్షణము ఆదర్శము. అద్భుత మహిమాన్వితము. ఈ విధముగా నా ప్రారభ్దమును కరిగించి ప్రజలలో నా కీర్తిని ఇనుమడింపజేయాలని సంకల్పించినావా?" అంటూ గగుర్పాటు చెందుతాడు. వేంకటరమణుని అపార కృపామహిమకు కనకదాసుని నేత్రాలు చెమ్మగిల్లుతాయి. 



దివ్యానుభవములను పొందుతూ భగవానుని గాన కీర్తనలతో కనకదాసు శ్రీకృష్ణసన్నిధానమైన ఉడిపి చేరుతాడు. శ్రీకృష్ణ దివ్య పాదపద్మ దర్శనాభిలాషియై అరుదెంచుచున్న కనకదాసుని ఆలయములో ప్రవేశించడానికి వీలులేదని ధర్మకర్తలు ఆదేశిస్తారు. కనకదాసు హృదయము ముక్కలైపోయింది. శ్రీకృష్ణుని దివ్యతేజోమయ రూపమును గాంచలేని తన జన్మ నిరర్ధకమని ..ఆలయకర్తలను దర్శనభాగ్యము కల్పించమని యాచిస్తాడు..ప్రార్ధిస్తాడు. వారు కనకదాసు హృదయవేదనను పట్టించుకోక అహంకారముతో వీలుకాదని వెడలుమని ఆదేశిస్తారు. చెదిరిన మనస్సుతో, శుష్కించిన హృదయముతో కనకదాసు కదలలేక కదుల్తూ ఆలయం వెనుకపైపునకు వెళ్ళి దు:ఖించసాగాడు. భక్తవత్సలుడైన శ్రీకృష్ణుని మనస్సు ద్రవించింది. దేవాలయ గర్భగుడి వెనుకవైపు గోడ కదిలి పడిపోయింది. తూర్పుముఖముగా యున్న భగవానుడు పడమరవైపు తిరిగి భక్త కనకదాసుకు దర్శనమిచ్చాడు. జై జై వాసుదేవ హరి ! కనకదాసు స్వామిని దర్శించి ధన్యత చెందాడు. దానిని ఇప్పటికిని "కనకభండి" అని పిలుస్తుంటారు. అనగా కనకదాసు స్వామిని దర్శించిన కిటికీ అని అర్ధం. భక్త కనకదాసుకు దర్శన మొసంగిన పుణ్యద్వారమని భావము. 

భగవంతుని కృపకు పాత్రుడైన కనకదాసు తొంభై సంవత్సరాలు జీవించారు.  కొన్నివేల కీర్తనలు రచించారు. అనేక దేవాలయాలు నిర్మించారు.ఆదికేశవుని పాదపద్మములను నమ్మి తాను తరించడమేగాక తన ఆదర్శనీయ జీవితము ద్వారా ఎందరికో స్పూర్తిని కల్గించి తరింపజేసిన భక్త కనకదాసుని దివ్య చరితము పవిత్రము. భక్తాధీనుడైన భగవంతుడు  భక్తుల హృదయాలలో దర్శనీయం. అట్టి భక్తుల దర్శనమే ముక్తికి సోపానం.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు