Thursday, February 2, 2023 By: visalakshi

సీతోపనిషత్

  ఓం నమో శ్రీ నారాయణాయ నమః




  శ్లో"  ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి త్రయం యద్భావ సాధనం!

     తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వ ముపాస్మహే !!


మం!!  ఓం దేవాహవై ప్రజాపతి మబ్రువన్, కా సీతా కిం

      రూపమితి, సహోవాచ, ప్రజాపతిః సా సీతా ఇతి (1)

ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులనే మూడు శక్తులూ ఎలాంటి దివ్యభావాన్ని సాధించడానికి ఉపయోగపడతాయో , అలాంటి బ్రహ్మసత్తాతో సమానమైన సీతాదేవి తత్వాన్నిఉపాసిస్తున్నాను. 

పూర్వం ఒకనాడు దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లి పితామహా! సీత అంటే ఎవరు? ఆమె ఎలాంటి రూపం కలిగి ఉంటుంది ?అని ప్రశ్నించారు.

బ్రహ్మదేవుడు వారికిలా సమాధానం చెప్పాడు. "సీతాదేవి మూలప్రకృతి స్వరూపిణి అందుకే ఆమె ప్రకృతి అని పిలవబడుతోంది.'సీతా' అనే పదంలో మొత్తం మూడు అక్షరాలు ఉన్నాయి. ఆమె సాక్షాత్తు మాయా స్వరూపిణి. విష్ణువు ప్రపంచ బీజం. 'ఈ'కారం మాయా, 'స'కారం సత్యం అమృతం, ప్రాప్తం, చంద్రుడు, 'త'కారం లక్ష్మీ బీజం.  శ్రీంకారం,వైరాజం , సోమ , అమృతావయవాలు కలిగిన దేవి  'ఈ'కార రూపిణి అవుతోంది. ఆ దేవి ఆభరణాలతో ముత్యాలతో అలంకరించబడివుంది. ఆది మహామాయ శబ్ద బ్రహ్మరూపం. అందుకే స్వాధ్యాయం సమయంలో ప్రసన్నురాలౌతుంది. సమున్నతమైన భావాల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ మాయ పృధ్వీభాగంలో హలం (నాగలి)చివర సీతగా జన్మించింది.'ఈ'కార స్వరూపిణి అనే ఆమె ఆ దేవికి చెందిన మూడో మాయ. అది అవ్యక్త రూపంలో ఉంటుంది. శౌనకీయమైన శౌనకీ తంత్రంలో సీతాదేవి ఈవిధంగా వర్ణించబడివుంది. ఆమె శ్రీరాముడు సన్నిధిలో జగదానంద కారిణిగా ఉన్నది. సృష్టి , స్థితి, లయకారిణి కూడా ఆ సీతాదేవే.ఆ సీతమ్మ వ్యక్తంగా ఉన్న అన్ని జీవుల శరీరాలలో మూలప్రకృతి స్వరూపిణిగా జ్ఞేయరూపంలో ఉంటుంది. ఆమె ప్రణవ స్వరూపిణి కనుక ప్రకృతి అని వ్యవహరిస్తారు. ఆమెనే బ్రహ్మవాదినీ అని కూడా అంటారు. ఆ దేవి  "అధాతో బ్రహ్మజిజ్ఞాసా" స్వరూపిణి , సర్వవేదమయి , సర్వకీర్తిమయి , సర్వధర్మమయి , సర్వలోకమయి , సర్వాధార కార్యకారణమయి , మహాలక్ష్మీ తదితర దేవేశుల భిన్నాభిన్న రూపమయి , చేతనా చేతనాత్మక , బ్రహ్మ స్థావరాత్మక , గుణ ,కర్మ ,విభాగ భేదంలోదేహ స్వరూపిణి, ఆమె. దేవ ,ఋషి ,మనుష్య ,గంధర్వ స్వరూపిణి, అలాగే అసుర ,రాక్షస, భూత ,ప్రేత ,పిశాచ , దేహాలు ధరించినది.పంచభూత ,ఇంద్రియ ,మనః ప్రాణ స్వరూపిణి కూడా ఆమేనని తెలుస్తోంది. 



ఆ సీతాదేవి 1.ఇచ్ఛాశక్తి 2.క్రియాశక్తి 3.సాక్షాత్ శక్తి అనే నామాలతో మూడు రూపాల్లో శక్తి స్వరూపిణిగా ఉన్నది. ఆమే శ్రీ, భూ , నీలా , భద్రరూపిణీ ,ప్రభావరూపిణీ ,సోమసూర్యాగ్ని రూపిణీ అవుతున్నది. ఆ జనని సోమరూపిణిగా ఓషధుల్ని పుట్టిస్తోంది.కల్పవృక్షం, పుష్ప ,ఫల‌ ,లతా, గుల్మాత్ములైన ఔషధ భేషజాత్మికా ఉంది.అమృతం రూపంలో దేవతలకి మహస్తోమరసఫలాన్నిస్తోంది. అలా దేవతలకు అమృత రూపంలో, మానవులకు అన్నం రూపంలో , పశువులకి గడ్డి రూపంలో ఇలా సకల జీవులకీ ఎన్నో విధాలుగా ఆహారాన్ని అందిస్తోంది. ఆ సీతాశక్తి సూర్యాదులతో సకల లోకాల్నీ ప్రకాశింపజేస్తోంది. రాత్రి -పగలు రూపంతో , కాలస్వరూపిణిగా కల , విమేషం నుంచి ఘడియ,8జాములు ,దినం ,వారం ,పక్షం ,ఋతుఆయన ,సంవత్సర భేదాలతో మనుషులకి (వందసంవత్సరాలు ) కల్పనతో ప్రకాశిస్తోంది. ఇలా చిర ,క్షిప్ర రూపాలలో నిముషం నుంచి పదార్ధం వరకు ఉన్న ఈ కాలచక్రాన్ని  ఒక చక్రం లాగ త్రిప్పుతూ ,తన కాల విశేషాలతో ప్రకాశిస్తూ, తానే కాల స్వరూపిణి అవుతోంది.

ఆ సీతాదేవి అగ్ని రూపం కలిగింది. ఆమె ఆకలి దప్పికల రూపంలో ప్రాణులలో , ముఖ రూపంలో దేవతలలో , శీతోష్ణ రూపంలో వనౌషధులలో , కాష్ఠం(కర్ర) లోపలా బయటా నిత్యానిత్య రూపంతో ఉఃటుంది. ఆ శ్రీదేవి మొత్తం మూడు రూపాలు ధరించి శ్రీహరి సంకల్పం ప్రకారం లోకాల్ని రక్షిస్తూ ఉంటుంది. కాలానుగుణంగా ఆయా అవతారాలు ధరిస్తుంది. శ్రీ అని లక్ష్మీ అని భూదేవి అని ఆమెని పిలుస్తారు. ఆ తల్లి సప్త సాగరాల్లో నీరుగా , సప్త ద్వీపాలతో కూడిన భూమిగా, భూమి మొదలు14లోకాలకీ ఆధార ఆధేయమైన ఓంకార రూపిణి గా ఉంటుంది. సీతాదేవి అవతారమైన నీళాదేవి విద్యున్మాలినీ రూపంతో సకల ఔషధులకీ ,ప్రాణులకీ  పోషణ నిమిత్తం సర్వ స్వరూపిణి గా ఉంటుంది. అంతేకాక ఈ దేవి సమస్త భువనాలకీ క్రింది భాగంలో  జలాకారాత్మకమైన ఒక మండూకం (కప్ప)రూపంలో భువనాలన్నిటికీ ఆధారంగా ఉంటుంది.


సీతాదేవి క్రియాశక్తి స్వరూపిణి. ముందుగా శ్రీ మహావిష్ణువు ముఖం నుంచి నాదం , ఆ నాదం నుంచి బిందువు, ఆ బిందువు నుంచి ఓంకారం , ఆ ఓంకారానికి చివర వైఖానస పర్వతం ఆవిర్భవించాయి. ఆ పర్వతం నుంచి కర్మజ్ఞానమయమైన ఉపశాఖలు వచ్చాయి. ఆ ప్రదేశం లో త్రయీమయ రూపంలో అనగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం.. సర్వార్ధాలు దర్శనమిస్తాయి. లోకంలో వేదాలు మూడే అని చెప్పినప్పటికీ కార్యసిద్ధికో నాలుగో వేదం ఏర్పడింది. ఆ నాలుగో దాన్నే ఆసంగిరసం అంటారు. ఈ అధర్వాంగి రసవేదం కూడా త్రివేదాత్మకంగానే ఉంటుంది. ఋగ్వేదం21శాఖలతో., యజుర్వేదం 109శాఖలతో సామవేదం 100శాఖలతో ,అధర్వణ వేదం 50శాఖలతో ఉంది. ముందుగా అన్ని దర్శనాలకన్నా వైఖానస దర్శనం ప్రత్యక్ష దర్శనంగా ఉంది. ఆ తరువాత కల్పం ,వ్యాకరణం ,శిక్ష, జ్యోతిష్యం , నిరుక్తం ,ఛందస్సు అనేవి షడాంగాలు (ఇవే వేదాంగాలు).వీటి ఉపాంగాలైన న్యాయ మీమాంస లు ఏర్పడ్డాయి. ధర్మాన్ని తెలుసుకోవడం కోసం వేదవేదాంగాలన్నిటికన్నా అధికంగా  కాలానుగుణంగా ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. ధర్మశాస్త్రము అంటే అది మునీశ్వరుల అంతఃకరణ ప్రవృత్తే. బ్రహ్మ చెబుతున్నాడు ..ఇంకా ఇతిహాస పురాణాలు 1. వాస్తు వేదం 2.ధనుర్వేదం 3.గాంధర్వవేదం 4.ఆయుర్వేదం 5.మునివేదం..అనే ఈ అయిదు ఉపవేదాలు ఉన్నాయి. అలాగే దండం ,నీతి, వార్త ,విద్య ,వాయుజయం లాంటి స్వయంప్రకాశాలైన 21రకాల శాస్త్రాలున్నాయి. వైఖానస మహర్షికి పూర్వమే శ్రీ మహావిష్ణువు వాక్కు ప్రభవించింది. అది మూడువేదాల రూపంలో ఆవిర్భవించింది. వైఖానస మహర్షికి ముందు సాంఖ్యశాస్త్రం ఎలా పుట్టిందో అది ఏం చెప్పిందో మీకు బోధిస్తాను శ్రవణం చేయండి. (ఇతిహాస.. పురాణాలని పంచమవేదంగా పండితులు చెబుతారు.)


ఆ క్రియాశక్తి స్వరూపిణి ఉత్తమమైన బ్రహ్మమయ రూపం కలిగింది. సాక్షత్తు బ్రహ్మమైన ఆ శక్తిని స్మరించినంత మాత్రానే ఆమె అనుభవాన్నిస్తుంది. అంతే కాక ఆ దేవి నిగ్రహానుగ్రహ స్వరూపిణి. శాంతి తేజోరూపిణి. ఆమె వ్యక్తావ్యక్తకారణ చరణాది సమగ్ర అవయవ రూపంలో ,భేదాభేద రూపంగా ప్రకాశిస్తుంది. ఆ దేవి భగవంతుడి సహచారిణిగా ఉంటుంది. అనపాయిని అయిన ఆమె అనవతరం సాధకులకి సహాయ ఆశ్రయాల్ని ప్రసాదిస్తుంది. కళ్ళు మూసి తెరిచేంతలోనే సృష్టి ,స్ధితి, సంహార తిరోధాన ,అనుగ్రహాది శక్తుల్నీ ఆమె ప్రదర్శించగలదు.ఇంత సమర్ధులు కలిగిన ఆ దేవి  (సీత) సాక్షాత్తు శక్తిగా ప్రస్తుతించబడుతోంది.

ఇచ్ఛాశక్తి అనేది మూడు విధాలుగా ఉంటుంది. 1.యోగశక్తి 2.భోగశక్తి 3.వీరశక్తి అని.

1.యోగశక్తి - ప్రళయకాలంలో విశ్రాంతి తీసుకుంటున్న భగవంతుడి (శ్రీహరి) వక్షస్ధలంలో శ్రీవత్సాకార రూపంతో విశ్రమిస్తూ ఉంటుంది.

2.భోగశక్తి- భోగరూపంలో కల్పవృక్ష ,కామధేను ,చింతామణి ,శంఖ ,పద్మ నిధుల్ని ,నవనిధుల్ని ఆశ్రయించి ఉంటుంది. భగవంతుణ్ణి కోరికలతోగానీ ,కోరికలు లేకుండా గానీ ఉపాసించేవారిని అనుగ్రహిస్తుంది. అంతేకాదు భక్తులైనవారు అగ్నిహోత్రాలతో, యమ నియమాది అష్టాంగాలతో ,ఆరాధనలతో ,నిత్యపూజా జపహోమాదికాలతో ,పితృపూజలు ,నైవేద్యాలు ,వ్రతాలు, నోములు వంటి వాటితో నిత్యం భగవంతుని ఆరాధిస్తున్నారు.

3.వీరశక్తి - సీతాదేవి వీరశక్తి రూపంలో చతుర్భుజగా ,అభయ ,వరద ,పద్మాలని ,కిరీటాది సకలాభరణాలనీ ధరించి ఉంటుంది. సకల దేవతలతో పరివేష్ఠించబడి ,కల్పవృక్షం నీడలో నాలుగు ఏనుగులు తమ తొండంతో ఉంచిన రత్న ఘటాలలోని అమృత జలాలతో అభిషేకం చేస్తుండగా, దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె సమస్త దేవతల చేతా ,బ్రహ్మాదుల చేతా ,కామధేనువు ,వేదశాస్త్రాల చేతా ప్రస్తుతించబడుతూ జయాది అప్సరసలు చేత పరిచర్యలు అందుకుంటూ ఉంటుంది. ఆమె సూర్య చంద్రులనే దీపాలతో ప్రకాశించబడుతుంది. నారద తుంబురులు నిత్యం ఆమె ని తమ గానంతో సంతృప్తి పరుస్తుంటారు. ఆమె రాకా ,సినీవాలీ అనే ఛత్రాల నీడలో అలంకృతమై ఉంటుంది. హ్లాదినీ అనే మాయ ఆమె కి చామరాలు వీస్తూ ఉంటుంది. స్వాహా, స్వధా అనేవారు వ్యజనాలతో ఆమెను పూజిస్తారు. బృగువు లాంటి ఎందరో మహర్షులు ఆమెని నిత్యం అర్చిస్తుంటారు. ఇలా దివ్య సింహాసనం మీద ఆసీనురాలై సకల కార్యకారిణి అయిన ఆ లక్ష్మీదేవి భవనానికి వేరుగా స్థిరంగా ఉన్నది. ఆమె ప్రసన్నమైన నేత్రాలతో సర్వదేవతలతో పూజించబడుతూ వీరలక్ష్మి అనే నామంతో ప్రసిద్ధి చెందింది..

                              ఓం శ్రీ మాత్రే నమో నమః





1 comments:

భారతి said...

ఓం సీతాయై నమః