Saturday, November 5, 2016 By: visalakshi

సీతాన్వేషణ - మొదటిభాగం

రామాయణంలో శ్రీరాముణ్ణి వాల్మీకి మహర్షి కేవలం మానవమాత్రుడిగానే చివరి వరకు చిత్రించాడు. అనగా పరమేశ్వరుడే "నా మాయయే నన్ను ఆవహించి ఉండు గాక!" అని సంకల్పించి ఉంటాడు.

శ్రీరాముడు మాతృభక్తి,  పితృభక్తి,  గురుభక్తి, పతిభక్తి, సోదరప్రేమ, శరణాగత సంరక్షణము, సత్యవాక్పరిపాలనము మొదలైన విశిష్టమైన గుణాలను తాను ఆచరించి లోకానికి బోధించాడు. 



  దాంపత్యబంధం ఎంత పవిత్రమైనదో రామాయణం మనకు బోధిస్తుంది.రాముడు శివధనుర్భంగం చేసినప్పుడు జనకుడు సీతాదేవిని వివాహం చేసుకోమని అడుగుతాడు. తండ్రి దశరధుని అనుమతి లేకుండా వివాహం చేసుకోనంటాడు. దశరధ మహారాజు వైభవోపేతంగా సీతారాముల కల్యాణం జరిపించుట అందరికీ విదితమే! రాముడు వనవాసానికి వెళ్ళే ఘట్టంలో తల్లి కౌసల్యాదేవి కూడా రాముడి వెంట అడవులకు వెళ్ళడానికి సిద్ధపడుతుంది.అప్పుడు రాముడు తల్లిని ఓదార్చుతూ, తండ్రి దశరధ మహారాజు సేవలో తరించడమే ఆమెకు శ్రేయస్కరమని, అదే పరమ సాధ్వీమణుల లక్షణమని వివరిస్తాడు.

 సీతారామలక్ష్మణులు పంచవటికి చేరుకున్నారు. అచటికి శూర్పణక అనే రాక్షస స్త్రీ రాముని మోహించుట.. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోయుట.. శూర్పణక సోదరుడైన ఖరుడు రామాదులను చంపటానికి ప్రయత్నించుట... ఖరుని అనుచరులను రాముడు  సంహరించుట .. ఖరదూషణాదులు  పంచవటికి  రామునితో  యుద్ధానికై  బయలుదేరుట..
కొన్నివేలమంది రాక్షసులను  సంహరించి..ఖరుని నిందించి రామచంద్రుడు ఖరుని వధించాడు...ఖరుడి మరణవార్త తెలిసిన రావణుడు..శూర్పణక ద్వారా సీతారామలక్ష్మణులను గూర్చి తెలుసుకొని... ఆ రాక్షసరాజు మారీచుని సహాయం అడగడం..  సీతను అపహరింప మారీచుని సహాయం అడగటం.. రావణునికి మారీచుని ఉపదేశం.. మారీచుని తనతో రమ్మని రావణుడు ఆజ్ఞాపించడం..మారీచుడు బంగారు లేడిరూపం దాల్చడం..ఆ మాయాలేడిని సీత కోరడం..రాముడు లక్ష్మణుణ్ణి సీతకు రక్షణగా ఉంచి ఆ మాయాలేడిని మారీచుడుగా గుర్తించి వధించడం..మారీచుడు రాముని స్వరంతో హా లక్ష్మణా..హా సీతా అని అరచుట.. లక్ష్మణుని రాముని వద్దకు సీత పంపుట.. రావణాసురుడు సన్యాసి వేషంలో సీత వద్దకు వెళ్ళటం..రావణునికి సీత తన వృత్తాంతం చెప్పటం..రావణుడు తన పరాక్రమాన్ని వర్ణించి సీతకు చెప్పుట అటు పిమ్మట రావణుడు సీతను అపహరించి తీసుకుపోయాడు. ఆమెకోసం రామలక్ష్మణులు అశ్రమమంతా వెతికారు. ఆశ్రమం చుట్టుపక్కల అడవి అంతా వెదికారు. ఆమె కనిపించలేదు.



సీత ఏమైందని రాముడు గోదావరిని అడిగాడు. నిరంతరం గలగలా పారే గోదావరి రావణుణ్ణి చూసిన భయంతోనూ, ఆ రాక్షసుడు సీతను అపహరించుకు పోయాడని దు:ఖంతోనూ నిశ్శబ్దంగా ప్రవహించింది.అడవిలో మృగాలను అడిగాడు. అవి జాలిగా కన్నీళ్ళు కారుస్తూ మోరలెత్తి దక్షిణంవైపు చూపించాయి. పర్వతాన్ని అడిగాడు. అది రాముడి ప్రశ్ననే ప్రతిధ్వనిగా బదులిచ్చింది. చెట్లను అడిగాడు. అవి విషాదంగా తలలు వాల్చాయి.ఏం చెయ్యాలో తెలియని అశక్తత. సీత ఏమైందోనని ఆందోళన. తమ అజాగ్రత్త వలన ఆమెకు ఆపద కలిగిందని ఆవేదన.అన్నీ కలిసి దు:ఖం  తట్టుకోలేక   లక్ష్మణుడి రెండు భుజాలూ పట్టుకొని కుదిపేస్తూ, నీకు నా మాట మీద గౌరవం లేదు. నేను ఆశ్రమంలో ఉండమని పదిసార్లు చెప్పినా నా రక్షణ కంటూ నా వెనకాల పరిగెత్తుకు వచ్చావు. ఘోరమైన ఆపద కలిగించావు. భార్యను రక్షించుకోలేని పిరికివాణ్ణని లోకం నన్ను అవమానిస్తుంది. అయినా ఎవర్నని ఏం లాభం! నా అదృష్టమే ఇలా ఉంది. లేకపోతే ' శోకేన శోకో హి పరంపరాయా మామేది భిందన్ హృదయం మనశ్చ ' ఒక దు:ఖం మీద మరొక దు:ఖం ఆగకుండా వచ్చి పడుతూ మనస్సుని వదలకుండా పీడిస్తున్నాయి. చూడు. రాజ్యం పోయింది. అయినవాళ్ళందరికీ దూరమయ్యాము. అరణ్యంలో ఋషుల దర్శనభాగ్యం వలన ఆ దు:ఖం కొంత శాంతించింది. అంతలోనే సీతా వియోగంతో మళ్ళీ రెట్టింపు దు:ఖం ముంచుకొచ్చింది. ఇలా ఈ దు:ఖాగ్ని రోజురోజుకూ మరింత ప్రజ్వరిల్లి నన్ను దహించేస్తోంది.  లక్ష్మణుడు పెద్దరికం ఆపాదించుకుని రాముణ్ణి ఓదార్చాడు. రామా! దు:ఖాన్ని వదిలిపెట్టి ధైర్యం తెచ్చుకో. సీతమ్మను వెదుకుదాం.    'ఉత్సాహవంతో హి నరా లోకే సీదంతి కర్మస్వతిదుష్మరేషు ' ఉత్సాహవంతులు కష్టమైనపనులు చేయవలసి వచ్చినా దిగులు చెందరు. తాము అనుకున్నది సాధిస్తారు. ఇందాకా నువ్వు మృగాలను అడిగినప్పుడు అవి మోరలెత్తి దక్షిణదిక్కును చూపించాయి. ఆ దిక్కుకు వెళ్ళి వెదికితే సీతమ్మ తప్పక కనబడుతుంది అన్నాడు. రాముడు అంగీకరించాడు. రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ దక్షిణదిశగా బయల్దేరారు. 



 ఆశ్రమం నుంచి కొంచెం దూరంలో వారికి ఇద్దరు వీరులు యుద్ధం చేసిన ఆనవాళ్ళు కనబడ్డాయి. యుద్ధ సమాగ్రి, రధం అంబులపొదులు, సారధి, సేవకులూ ప్రాణాలు పోయి పడి ఉన్నారు. నేలమీద అప్పుడే ఆరుతున్న రక్తపు మరకలు.. ఇవన్నీ చూస్తే గొప్ప యుద్ధం జరిగిందని తెలుస్తోంది. ఇద్దరు రాక్షసులు సీతకోసమే యుద్ధం చేసి గెలిచినవాడు సీతను అపహరించుకుపోయి ఉండాలి. అని అనుకోగానే రాముడికి దు:ఖం తన్నుకొచ్చింది.

 సీత ఏమరకుండా పాటించిన ధర్మం ఆమెను కాపాడలేకపోయిందని రాముడు చింతించాడు. పాటించిన నియమాలు ఆపదలో ఆదుకోలేక పోయాయని ఆవేదన చెందాడు. ధర్మమార్గం వదలని వాళ్ళను రక్షించవలసిన దేవతలు సీత విషయంలో ఉపేక్షించారని ఆగ్రహించాడు.   

 కోపం ఆపుకోలేక తీవ్రమైన సంకల్పం చేసాడు.  లక్ష్మణా! దేవతాప్రీతి కోసం ఎన్ని పుణ్యకార్యాలు చేసాం! కష్టనష్టాలు, ఆపదలు ఎదురైనా ధర్మమార్గం వదలకుండా జీవించాం. ఇంత చేసినా ఆపద కలిగితే దేవతలు సీతను కాపాడలేదు. నేను ఇంద్రియాలను జయించి, దయామూర్తినై, లోకానికి మేలు చేయడమే లక్ష్యంగా జీవిస్తుంటే 'నిర్వీర్య ఇతి మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరా:' నా మృదుస్వభావాన్ని అలుసుగా తీసుకుని దేవతలు నన్ను చేతకానివాణ్ణి అనుకుంటున్నారు. 

  ఇక నాలో ఉన్న మంచి గుణాలను అణిచిపెట్టి విజృంభిస్తాను. దయాదాక్షిణ్యాలు మర్చిపోతాను. నా ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తాను. లోకాలేమైపోతే నాకేం!  నా బాణాలతో గ్రహాల గమనం ఆపుతాను. అగ్నికి, వాయువుకి, సూర్యుడికి తేజస్సులేకుండా చేస్తాను. పర్వతాలను కూల్చివేస్తాను . సముద్రాలను ఇంకిపోయేలా చేస్తాను. దేవతలు తిరిగే ఆకాశమార్గాన్ని బాణాలతో నింపేస్తాను. ఇకపై ఏ ప్రాణులూ ఆకాశంలోకి ఎగరలేవు. విలాసంగా దేవతలు చేసే ఆకాశసంచారం ఆగిపోతుంది. అసలు దేవ దానవ యక్ష లోకాలన్నీ నాశనం చేసేస్తాను.  సీతను ప్రాణాలతో గానీ, ప్రాణం లేకుండా గానీ దేవతలు వెంటనే నాకు అప్పగించకపోతే దేవతలే ఉండరు..రాక్షసులసలే ఉండరు. లోకాలుండవు. అని ప్రళయకాలాగ్నిలా మండిపడుతూ ధనుస్సు పట్టి బాణం అందుకున్నాడు. రాముణ్ణి అంత భయంకరమైన రూపంలో లక్ష్మణుడు ఎప్పుడూ చూడలేదు.  రాముడి భయంకర రౌద్రరూపం చూసి లక్ష్మణుడు తెల్లబోయాడు. తేరుకొని అన్నకు అంజలి ఘటించి రాముడి కోపం తగ్గించేందుకు ప్రయత్నించాడు.

 రామా! చంద్రుడికి శోభ, సూర్యుడికి కాంతి, వాయువుకు గమనం ఎలా సహజలక్షణాలో అలాగే ఇంద్రియ నిగ్రహం, మృదుస్వభావం, జీవులన్నిటిపట్లా  దయ  నీకు  సహజలక్షణాలు. నువ్వు  ధర్మమూర్తివి. 

 ఎవడో ఒకడు నీకు బాధ కలిగించాడని లోకాలన్నిటినీ నాశనం చెయ్యడం నీకు తగదు. సకలప్రాణులూ నీకు మేలే కోరుకుంటాయి. నిన్ను ప్రభువుగా చూసుకుంటాయి. నువ్వు రక్షిస్తావని నమ్ముతున్నాయి. నువ్వు పదికాలాలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాయి. నదులూ పర్వతాలూ సముద్రాలూ నీకు అపకారం జరగాలని కోరుకోవు. నువ్వే స్వయంగా లోకనాశనానికి పూనుకొంటే నువ్వే దిక్కని నమ్మిన ప్రజలకు ఇక దిక్కెవరు?వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలి? 

నీకు బాధ కలిగింది నిజమే. కానీ ఓరిమితో బాధలను తట్టుకోవడమే కదా మహాత్ముల లక్షణం! సూర్యచంద్రులు లోకానికి కళ్ళవంటివారు. వారికే గ్రహణాలు తప్పడం లేదు. జీవులన్నిటికీ ఆధారమైన భూదేవి కూడా అప్పుడప్పుడు కంపిస్తోంది. దేవతలకు కూడా అవమానాలు తప్పడం లేదు. అంత మాత్రం చేత వారు ఉత్పాతాలు సృష్టిస్తున్నారా? నీకు తెలియంది కాదు..దు:ఖం గానీ, కష్టం గానీ వచ్చినప్పుడు బుద్ధితో ఆలోచించాలనీ, ఆవేశానికి లోనుగాకూడదనీ నువ్వే నాకు అనేకసార్లు చెప్పావు.నీకు తెలియని ధర్మం లేదు. నువ్వు నేర్చుకోని నీతి లేదు. బృహస్పతి కూడా నీతో మాట్లాడేందుకు జంకుతాడు. 'శోకేనాభిప్రసుప్తం తే జ్ఞానం సంబోధయామ్యహం ' ఈ క్షణంలో నీ ఆలోచనలను శోకం పూర్తిగా ఆవరించి ఉంది. నేను శోకంతో మరుగున పడిపోయిన నీ బుద్ధిని కేవలం మేల్కొలుపుతున్నాను.  లక్ష్మణుడి మాటలకు రాముడు శాంతించాడు. 

 తదుపరి భాగంలో కబంధుడనే రాక్షసుడు, భక్త శబరి వృత్తాంతాలతో....



సర్వం శ్రీ సాయిరామార్పణ మస్తు.