Friday, November 18, 2016 By: visalakshi

బాబా ఆశీర్వాదం

సాయి సత్యచరిత్ర 13వ అధ్యాయములో బాబా ఆశీర్వాదం భక్తుల యందు అనన్యంగా ఉంది. భక్తుల రోగాలను తమ కేవల వచనాలతో, ఆశీర్వాదంతో బాబా ఎలా నయం చేసేవారో మనకు తెలుస్తుంది.   అప్పుడప్పుడూ ఆయన ఉపాయం విచిత్రంగానూ, బాధాకరంగానూ ఉండేది. అయినప్పటికీ కూడా భక్తులకు రోగం నయమయ్యేది. తాత్పర్యం, గుణం ఔషధంలోనో లేదా ఉపాయంలోనో కాక బాబా చేతిలో, ఆశీర్వాదంలో ఉంది.  



  ఈ జగత్తులో మానవప్రాణులకు దేవుడు బుద్ధి ఇచ్చినప్పటికీ దాన్ని వాడుకుని మనసులో నిశ్చయించుకొన్నట్లు తమ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించలేరు. వారి వెనుక కర్మ తంత్రం పట్టుకొని వుంటుంది.  జన్మల పర్యంతం చేసిన కర్మల సంస్కారం, వాటి ప్రారబ్ధాల పరిణామం, వారిని చెడుమార్గంవైపు లాక్కెళతాయి. ' శ్రద్ధ పుణ్యంవైపు పోతే పాదాలు పాపాలవైపు లాక్కెళతాయి. సత్కర్మను శోధిస్తూపోతుంటే కుకర్మలు అడ్డుగా వస్తాయి.' కనుక సత్కర్మలు చేసి పరమార్ధం సాధించటంకోసం మానవులు గొప్ప ప్రయత్నం చేయవలసివుంటుంది. ఇంతే కాదు సద్గురువుని ఆశ్రయించవలసి వుంటుంది.



మానవులు సుఖం కోసం అహోరాత్రులూ ప్రయత్నం చేసినప్పటికీ పూర్వకర్మల ఫలాలుగా దు:ఖాలు వారి మెడకు చుట్టుకొంటాయి. నెట్టిపారేద్దామనుకొంటే మరింతగా పెనవేసుకొంటాయి. ఇదంతా జీవుల వ్యర్ధశ్రమ. అవి అనుభవించక గత్యంతరం లేదు.  వేరే ఉపాయలతో ఆపివేసినా, మళ్ళీ   జన్మించి ఆ కర్మలను అనుభవించవలసి వుంటుంది. జీవన్ముక్తులకి అంటే జీవించి ఉండగానే ఆత్మజ్ఞానం కలిగి ముక్తులైన వార్ని కూడా ప్రారబ్ధభోగం వదిలిపెట్టదు. అప్పుడు ఇలాంటి దు:ఖాలను సహించటానికి  మానవులు  తయారుగా  వుండాలి. 



 అలాంటి దు:ఖాలను నివారించుకోవటానికి ఒక ఉపాయం మాత్రం వుంది. అదేమిటంటే సద్గురువుని శరణనటం. వారి కృపాదృష్టి పడితే మానవులు దు:ఖాన్ని సహజంగా ఏ యాతనలూ లేకుండా అనుభవించగలరు. సద్గురువు అనుభవించగల ధైర్యాన్నిస్తారు. 'అదృష్టవశాత్తూ మహాత్ముల దర్శనం అయితే అదే వ్యాధికి ఒక ఉపశమనం. వ్యాధిగ్రస్తులపై వారి కరుణా దృష్టి ప్రసరింపజేస్తారు. అప్పుడు వ్యాధిని దు:ఖం లేకుండా సహజంగా సహిస్తారు.' 



ప్రతి ఒక్క సందర్భంలోనూ మనసులో ఉండే బాబా తమ దైవీ శక్తిని ఉపయోగించి భక్తుల దు:ఖాల నన్నిటినీ కలిపి ఒక్కసారిగా అనుభవింపజేసి వారిని వెంటనే వాటినుంచి విడుదల చేస్తారు. ఆ దు:ఖాన్ని తమ మీదకు తీసుకొంటారు. ఈ అధ్యాయంలో భక్తులు బాబాకి తమ కృతజ్ఞతను ఎలా వ్యక్తం చేయాలో ఆ బోధ మనకి కలుగుతుంది. సద్గురువులకు తమ భక్తులపై "లాభం కోరని ప్రీతి" వుంటుంది. వారి ఉపకారానికి కృతజ్ఞతగా శిరస్సు వంచి, రెండు చేతులూ జోడించి అనన్యశ్రద్ధతో, దృఢవిశ్వాసంతో ప్రణామములర్పించాలి. అదితప్ప సాయినాధులకు మరోటి అవసరం లేదు.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.




0 comments: