Wednesday, November 2, 2016 By: Veda Sri

భయం - భద్రత

మహాభారతంలో బ్రహ్మదేవుడు మృత్యుదేవత మధ్య జరిగిన ఒక సంవాదం ఉంది. చతుర్ముఖుడు మృత్యుదేవతను సృష్టించి జీవుల ప్రాణాలను హరించమన్నప్పుడు ఆమె, 'అమ్మో! ఈ పాపకార్యాన్ని నేను చేయలేను. బంధువులు, సోదరులు, భర్త, భార్య, మిత్రులు చనిపోయినప్పుడు మనిషి విపరీతమైన బాధను అనుభవిస్తాడు. నేను వారి ద్వేషానికి గురవుతాను. అందరూ నన్ను చూసి భయపడతారు ' అంటూ ఏడుస్తూ బ్రహ్మదేవుడితో మొరపెట్టుకుంటుంది. బ్రహ్మదేవుడు ఆమె కన్నీళ్ళను చేతిలో ఒడిసిపట్టుకొని, ఈ కన్నీళ్ళు జీవులలో రోగం రూపంలో వ్యక్తమవుతాయి.' ఆత్మానాం వై ప్రాణినోఘ్నంతి 
సర్వే నైతాన్ మృత్యుర్దండపాణిర్హినాస్తి ' జీవులు వాటి మరణాన్ని అవే కొనితెచ్చుకుంటాయి. నీవేమీ దండం పట్టుకొని కార్యాన్ని నిర్వహించవలసిన అవసరం లేదు.అంటాడు. ' అభిధ్యా వై ప్రధమం హంతి లోకాన్ కామక్రోధావనుగృహ్యాశకు పశ్యాత్...-బ్రతుకుపై తీపియే మనిషిని చంపివేస్తుంది. తరువాత కామక్రోధాలు మనిషిని మృత్యువశం చేస్తాయి.జీవిత ప్రయోజనం తెలియకుండా జీవించాలని కోరుకుంటే ప్రమాదంలో పడతాం.ఆ ప్రమాదమే మనిషికి మృత్యువును తెచ్చిపెడుతుంది. జీవిత పరమార్ధం తెలిసి జీవిస్తే మనిషి అమృతత్వాన్ని పొందగలుగుతాడు. మహాభారతంలో సనత్సుజాతుడు మనిషి ఔన్నత్యాన్ని తెలియజెపుతూ ప్రమాదమే మృత్యువని ధృతరాష్థ్రుడికి బోధిస్తాడు..ఈ వివరణ నా సన్నిహితురాలు భారతి "స్మరణ" బ్లాగులో వివరించింది. " సనత్సుజాతీయం  "అనే పేరుతో నాలుగు భాగాలుగా వివరణ ...చదవగలరు.. 

 'అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్టితం! మృత్యుమాపద్యతే మోహాత్ సత్యేనాపద్యతే2మృతం.'...అమృతత్వం,మృత్యువు రెండూ దేహాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి.మోహం వలన మృత్యువు సంభవిస్తుంది. సత్యంతో అమృతత్వం సంక్రమిస్తుంది. ..ఇక్కడ మోహం అంటే దేహాభిమానమే ...భగవంతుడిని పొందడానికి మానవదేహం ఒక మహోపకరణం అని తెలిసి కాయాన్ని ధర్మాచరణకు, ఆధ్యాత్మిక సాధనలకు వాడుకున్ననాడు అమృతత్వం సిద్ధిస్తుందని ఋషుల బోధ. ప్రతీ మనిషికీ ఏదో భయం. జీవితంలో ఏదో కోల్పోతానన్న భయం. జీవితం-మరణం రెండూ నాణానికి బొమ్మాబొరుసు లాగా కలిసే ఉన్నాయి. కానీ మన విపరీత జీవేచ్చ అవతలి పార్శ్వాన్ని చూడనివ్వడం లేదు. మరణాన్ని స్వాగతించడానికి సిద్ధపడ్డవ్యక్తి మాత్రమే భయవిరహితుడవుతాడు.అతడు మాత్రమే నిజంగా జీవిస్తాడు.ప్రేమస్వరూపుడౌతాడు.శాంతికాముకుడౌతాడు. భయం లేని జీవితమే నిజమైన జీవితం. భయం తొలగినపుడు ఏకాగ్రత సిద్ధిస్తుంది. మనమీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. మన సామర్ధ్యం పెంపొందుతుంది. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది.

  భయం వలననే హింస జనిస్తుంది. తనకు చెందినదేదో నష్టపోతున్నానన్న భావనతో భయం జనిస్తుంది. ఆ భయంతోనే తోటివారిని తనకు శత్రువులుగా చేసికుంటాడు. తాను..తనవి అని భావించిన వానిని రక్షించుకోవాలన్న మిధ్యాజ్ఞానమే మనుషులను కఠినాత్ములుగా మారుస్తుంది.మానవులందరూ ఒకే జాతి అయినప్పుడు అందరికీ ఒకే ప్రయోజనం ఉంటుంది కదా! మరి మనిషికి ఎందుకు ఈ మాత్రం అర్ధం కావడం లేదు. అందుకే మృత్యువును జ్ఞప్తిలో ఉంచుకోమని, మరణం మన చేతుల్ని ఇదివరకే ఖాళీ చేసిందని గుర్తుంచుకోమని జ్ఞానులు మనకి బోధిస్తారు. ఆ బోధ అర్ధమైనప్పుడు నశ్వరమైన దేహాన్ని శాశ్వతమనుకొని స్వీయ సం రక్షణార్ధం తోటిమానవులను ఇతరులుగా భావించి వ్యక్తి తాను చేస్తున్న హింసను మానుకుంటాడు. జాగరూకతతో వ్యవహరిస్తాడు. దురాశ, క్రోధం మొదలగు అంతర్గత శత్రువులనుండి బయటపడతాడు. జీవన ప్రయాణాన్ని సుగమం చేసుకోగలుగుతాడు. అమృతత్త్వానుభవానికి అర్హుడవుతాడు.

 సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు

0 comments: