Monday, October 31, 2016 By: visalakshi

శ్రీసాయి సర్వవ్యాపకత

 శ్లో" అంతకాలే చ మా మేవ స్మరన్  ముక్త్వా కలేబరం!
      య: ప్రయాత స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయ:!!     8 అ-5శ్లో..


ఎవరు జీవితాంతమున నన్నే స్మరించుచు దేహమును విడుతురో వారు తత్క్షణమే నా భావమునే పొందుదురు. ఈ విషయమున సందేహము లేదు.

 శ్లో" యం యం వాపి స్మరన్ భావం త్యజ త్యంతే కలేబరం!
      తం త మైవేతి కౌంతేయ సదా తద్భావభావిత:!!       8 అ-6శ్లో..

దేహమును విడుచునపుడు మానవుడే స్థితిని స్మరించునో ఆ స్థితిని తప్పక పొందును.

 ఆయు:పరిమితి అనే తైలం అయిపోయాక, ప్రాణమనే జ్యోతి మందంగా వెలిగేటప్పుడు, బాబా దేహం బయ్యాజీ పాటిల్ తొడపై విశ్రమించింది. కింద పడనూ లేదు, నిద్రించనూ లేదు. కానీ హాయిగా ఆసనంపై కూచుని ఆ ప్రకారంగా తమ చేతులతో దానధర్మాలు చేస్తూ బాబా తమ దేహాన్ని ధరిత్రిపై విసర్జించారు. సాయిసమర్ధులు తమ మనోగతాన్ని ఎవరికీ తెలీనీకుండా ఉన్నపాటున తమ దేహపతనం చేసి బ్రహ్మీభూతులైనారు. దేహము అనే మాయా ముసుగు వేసుకొని మహాత్ములు ఈ జగత్తులో అవతరిస్తారు. లోకులను ఉద్ధరించే కార్యం ముగియగానే వెంటనే అవ్యక్తంలో సమరసతను పొందుతారు.



  చిన్మయకాంతులు వెదజల్లే సాయి ఆత్మానందానికి మూలస్థానం.  దేహధారణ చేసి ఆయన వ్యక్తమయారు. దేహత్యాగం తరువాత ఆయన అవ్యక్తమైనారు. ఒక కార్యం కోసం ఒక ప్రదేశంలో అవతరించిన ఆయన అవతారకార్యం సమాప్తమైంది. ఇప్పుడు అన్ని కార్యాలలోనూ, అన్నిచోట్లా ఆయనకున్న సంబంధం సుస్పష్టమైంది. ఆయన సర్వవ్యాపకతను పొందారు. పూర్ణంగా శాశ్వతులైనారు.భక్తుల హృదయాల్లో కూచున్నారు. చైతన్యంతో తొణికిసలాడుతూ భక్తుల హృదయాల్లో శాశ్వతంగా కొలువై భక్తులను సదా మేల్కొలుపుతారు.భక్తుల కార్యాల్లో సాయం చేసే సాయి షిరిడీలో తమ దేహాన్ని ఉంచేశారు. కానీ ఆయన జగత్తులోని సమస్త స్థావరజంగమ వస్తువుల్లో స్వస్వరూపంలో నిండిఉన్నారు. మనసుకి సంకల్పం కలిగినపుడు అవతారం ధరించగల సమర్ధులాయన. మూర్తీభవించిన బ్రహ్మస్వరూపులైన అలాంటి పుణ్యాత్ములు లోకోపకారానికై అవనిపై ప్రకటమవుతారు. మూడున్నర మూరల ఐదడుగుల మానవదేహం నాది కాదని గ్రహించండి. అని ఈనాడు కూడా బాబా మనకు ఉపదేశిస్తున్నారు. ఆయనకి  విశిష్టమైన   రంగు, రూపాలను ఆపాదించడం యోగ్యం కాదు. అదృష్టవశాత్తూ  పరబ్రహ్మ సగుణమూర్తిగా బాబా మనతో ఉండగా  మనకు మనసులలో సందేహాలేల...ఇది ఒక జన్మకు పరిమితి అయ్యే విషయం కాదు. ఒకరితో  4 జన్మల బంధం అయితే, మరొకరితో 72 జన్మల ఋణానుబంధం అని బాబా తాము భక్తులతో కధలు చెప్పేటప్పుడు చెప్పారు. ఎంతమందికో ఆయన ఇప్పటికీ ప్రత్యక్షంగా దర్శనమిస్తారు. ఎందరికో స్వప్నంలో అనుభవాలిస్తారు. అనేకులకు రహస్యంగా లీలలు చూపిస్తారు. భక్తులకు వాళ్ళున్నచోటనే కనిపిస్తారు. వారి వారి మనసుల్లో ఉన్న భావన బట్టే వారికి అనుభవాలు కలుగుతాయి.



  చావడిలో ఆయన గుప్తరూపంతో, మశీదులో పరబ్రహ్మ రూపంతో, సమాధి మందిరంలో సమాధి తీసుకొన్న రూపంతో సర్వత్రా సుఖరూపంతో ఉంటారు. ఆయన అక్షయంగా అఖండంగా దర్శనమిస్తారు. శ్రీసాయి చరణారవిందాలలో నిష్కామ ప్రీతి కలుగుగాక! గురుగుణాలను వర్ణించడంలో నిర్మలభక్తి ఉత్పన్నమగుగాక! గురు పాదాల్లో చెక్కుచెదరని అఖండ భక్తి కలుగుగాక! స్నేహానుబంధాన్ని దూరం చేయక భక్తులు అహోరాత్రులూ సుఖసంపన్నులుగా ఉందురుగాక!...




 మహాత్ముల స్వరూపం సదా ఆనంద దీపికలు వెలిగిస్తూ ఉంటుంది. దైవదృష్టికి పరిమితి లేదు. "ఏయధా మాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహం" (నా పట్ల ఎలాంటి భక్తిని కలిగిఉంటే వారికి వారి భక్తి ననుసరించి అలాంటి ప్రతిఫలమిస్తాను) అయితే మహాత్ముల అంత:కరణ వారిని నిందించిన వారిపై కూడా కారుణ్యం కురిపిస్తుంది. బాబా ఎన్నోసార్లు "ఇతరుల మనసుకి కష్టం కలిగేలా మాట్లాడితే అవి నా హృదయాన్నే తూట్లు పొడుస్తాయి. నా అత్యంత సున్నితమైన భాగానికి గుచ్చుకుంటాయని తెలుసుకోండి. ఇతరులను   బాధాకర మాటలతో కోపం కలిగేలా మాట్లాడితే అవి నన్నే బాధిస్తాయి. కానీ వాటిని శాంతంగా సహించే వారే నాకు బాగా తృప్తి కలిగిస్తారు". అని చెప్పి ఉన్నారు. అలా సాయిబాబా జీవులన్నింటా లోపలా, బయటా నిండి ఉన్నారు .ఆ మహా మంగళప్రదమైన ప్రేమమయి సర్వవ్యాపకుడై  భక్తుల  హృదయనివాసుడైనాడు.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

3 comments:

వెంకట రాజారావు . లక్కాకుల said...

ఏ మహితాత్ముని ధామమ్ము శాంతికి
చిరునామగా విలసిల్లు చుండు
ఏ మందిరము మహనీయమై తర తమ
భేదాలు లేక శోభిల్లు చుండు
ఏ మూర్తిని స్పృశించి యిరవొందు నానంద
పారవశ్యము వీలు పడుచు నుండు
ఎచ్చోట దూరాలు , హెచ్చుబాటులు తగ్గి
అందరొక్కటి గాగ నలరు చుంద్రు

ఏ యనఘు దర్శనముచేత హాయి గలుగు ,
కోర్కెలీరేడు , కష్టాలు కోలుపరుచు
నాతడే సాయి - జనులలో నమ్మక మిది ,
నమ్మకమె దైవమయి నిల్చు నరుల మదిని .

వెంకట రాజారావు . లక్కాకుల said...

ఏ మహితాత్ముని ధామమ్ము శాంతికి
చిరునామగా విలసిల్లు చుండు
ఏ మందిరము మహనీయమై తర తమ
భేదాలు లేక శోభిల్లు చుండు
ఏ మూర్తిని స్పృశించి యిరవొందు నానంద
పారవశ్యము వీలు పడుచు నుండు
ఎచ్చోట దూరాలు , హెచ్చుబాటులు తగ్గి
అందరొక్కటి గాగ నలరు చుంద్రు

ఏ యనఘు దర్శనముచేత హాయి గలుగు ,
కోర్కెలీరేడు , కష్టాలు కోలుపరుచు
నాతడే సాయి - జనులలో నమ్మక మిది ,
నమ్మకమె దైవమయి నిల్చు నరుల మదిని .

visalakshi said...

నమస్తే మాష్టారూ! మీ స్పందన చదువుతుంటే .. సాయిభక్తి మదిలో పొంగి..ఆనందభాష్పాలుగా కనులనుండి ప్రవహించింది.ధన్యవాదాలండీ...