Thursday, April 14, 2022 0 comments By: visalakshi

ఆప్తగమన....అంతగమన...

 



శ్లో" ఊర్ధ్వమూలో 2 వాక్ శాఖ ఏషో 2 శ్వత్థః సనాతనః !

        తదేవ శుక్రం తద్ బ్రహ్మ తదేవామృతముచ్యతే !

 తస్మింల్లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన !ఏతద్ వై తత్ !!

 

ఈ అశ్వత్థ వృక్షం పురాతనమైనది.పైకి వ్రేళ్ళూనినది. క్రిందికి వ్యాపించిన కొమ్మలు కలది. అదే పావనమైనది. అదే భగవంతుడు. అది అవినాశి. సమస్త లోకాలూ దానియందే ఉన్నాయి. దానిని ఎవరూ అతిక్రమించలేరు.అదే సత్యం.

తలక్రిందులుగా నిలబడి ఉన్న ఒక రావిచెట్టు తో (అశ్వత్థవృక్షం) జీవితం పోల్చబడుతోంది.ఎప్పుడు ఒక వస్తువు తలక్రిందులుగా కనిపిస్తుంది?ప్రతిబింబించి నప్పుడు. ఏటి ఒడ్డున నిలబడ్డ చెట్టు ప్రతిబింబాన్ని నీటిలో చూసినప్పుడు చెట్టు తలక్రిందులుగా నిలబడ్డట్లుగా కనిపిస్తుంది. దాని వ్రేళ్ళభాగం పైన కొమ్మలు క్రింద ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రతిబింబం నిజం కాదు.

ఏటి నీటిలో చెట్టు తలక్రిందులుగా కనిపిస్తుంది. దాన్లోని సత్యాన్ని ఆకళింపు చేసుకోగోరితే ఆ ప్రతిబింబాన్ని వదిలిపెట్టి, ఆ ప్రతిబింబానికి ఆధారమైన చెట్టును చూడాలి. అదే సత్యం. ఆ విధంగానే జీవిత సత్యాన్ని తెలుసుకోగోరితే జీవితానికి ఆధారమైన భగవంతుణ్ణి పొందగోరాలి.జీవిత వృక్షాన్నే భగవంతునిగా చెబుతోంది ఈ మంత్రం.





నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు శరీరధ్యాస ఉండదు. అప్పుడు మృత్యుభయముంటుందా..? నీవు పూర్తిగా మేల్కొని, నీ శరీరాన్ని, ప్రపంచాన్నికి చూస్తున్నప్పుడే ఆ భయముంటుంది. కలలు లేని నిద్రలో వలె నీవు వీటిని చూడకుండా, కేవలం ఆత్మగానే ఉన్నప్పుడు ఏ భయమూ నిన్ను సోకలేదు. ఏదో పోతుందన్న భావమే భయాన్ని కలిగిస్తుంది. ఆ పోయేదేమిటి అని విచారిస్తే అది నీ శరీరం కాదనీ, అందులో పని చేసే మనస్సనీ తేలుతుంది.


తనకి ఎల్లప్పుడు ఎరుక ఉండేట్టయితే, ఈ రోగపీడితమైన శరీరాన్ని, దాని వల్ల కలిగే ఇబ్బందినీ వదిలించు కోవటానికీ అందరూ సిద్దమే. పోతుందని అతను భయపడేది ఈ ఎరుకని, ఈ చైతన్యాన్ని. జీవించి ఉండటమంటే, సదా ఎరుక కలిగి ఉండటమే. అదే వారి ఆత్మ. ఇదంటేనే అందరికీ ప్రీతి. అటువంటప్పుడు ఈ దేహంలో ఉంటూనే ఆ శుద్ధ చైతన్యాన్నే పట్టుకొని ఎందుకుండ కూడదు.. అన్ని భయాలనీ ఎందుకు వదిలించుకోకూడదు..నీ సహజస్థితి లోనే ఉండు"...

అంతగమనమైన మృత్యువు ను అత్యంత ఆత్మీయమైన చెలికాడుగా భావించి, ఆలింగనం కోసం అంతరంగం పడుతున్న తపన ఇది. మరణం దారుణమైనది కాదనీ , దయామయమైందన్న భావనకు నిదర్శనమిది. పరమశాంతికి మనల్ని చేరువ చేసే ప్రస్థానమే పరలోకగమనం. అందుకే జీవితపరమావధి తెలిసిన ప్రాజ్ఞులు , అస్తమయాన్ని ఆత్మబంధువుగా అక్కున చేర్చుకునేందుకు సంసిద్ధులై ఉంటారు.

భౌతిక శరీరంతో జీవాత్మకు కలిగే సంబంధమే జన్మ.  శరీరం నుండి జీవాత్మ విడిపోవడమే మృత్యువు.

నా ఆగమనంలోనూ నీవే... నా నిష్క్రమణంలోనూ నీవే! నా ఆనందంలోనూ నీవే... నా ఆవేదనలోనూ నీవే! అనుక్షణం నీ అద్భుత, అదృశ్యశక్తి నన్ను ఆత్మీయపవనమై ఆలింగనం చేసుకుంటూనే ఉంటుంది. నా ప్రమేయం లేకుండానే నీ అనురాగ హస్తం నన్ను చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. అది జననంలోనైనా...మరణంలోనైనా!

గమనించినా గమనించకపోయినా మనం ఊపిరి పోసుకున్న క్షణం నుంచి ఊపిరి విడిచే క్షణం వరకు ఓ దివ్యశక్తి మనల్ని అనుక్షణం అనుగమిస్తూనే ఉంటుంది. అజ్ఞాతంగా అందరి ఆలనకు పాలనకు ఆధారభూతమవుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రత్యక్షంగా కనిపించే మమతానుబంధాలకు , కురిపించే ప్రేమానురాగాలకు పరోక్ష ప్రేరకుడు ఆ పరమాత్మే!

నిజమే!అంతర్యామి అయిన ఆ అనంతాత్ముడు ఆనుదినం మనపై అనేక రూపాల్లో తన ప్రేమవృష్టిని కురిపిస్తున్నాడు.

జీవితమంటే ఎడతెగని బంధంతో మన ఆలోచనల్లోకి మరణాన్ని రానివ్వం.అది అనివార్య పరిణామమే అని తెలిసినా దాన్ని భయంకరమైన ఆలోచనగా దూరంగా ఉంచడానికి, వీలైనంత సుదూర ప్రక్రియగా మరచిపోవటానికి ఇష్టపడతాం. కానీ సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధపడాలి. మృత్యు భయాన్ని జయించడం కంటే తపస్సిద్ధికి మరో తార్కాణం ఏముంటుంది!నిజానికి మరణం అంటే మరో రూపంలో మాధవుడే! అందుకే 'సంహారకులలో సర్వసంహర్తయైన మృత్యువును నేనే 'అంటాడు భగవద్గీత 'విభూతియోగం'లో శ్రీ కృష్ణభగవానుడు.




ధర్మ పురిని దర్శిస్తే యమపురి ఉండదని శాస్త్ర వాక్కు .శ్రీ నృసింహ స్వామివారి మహా మృత్యుంజయ మంత్రం మహామహిమాన్వితమైన మంత్రం ప్రతీరోజూ పఠించడం వలన అపమృత్యువు, అకాల మృత్యువు, అనుకోని ఆపదలు మన దరిచేరవు. ఆదిశంకరాచార్య విరచిత నృసింహ కరావలంబ స్తోత్రం. ఋణ విమోచన శ్రీ నృసింహ స్తోత్రం. శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం.


ప్రతిరోజూ ఈ నరసింహ మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు ప్రతిరోజూ జపించినా, లక్ష్మీ నరసింహ స్వామిని పూజించినా దోషం నివారింపబడి దీర్గాయుష్మంతులు అవుతారని శాస్త్రవాక్కు.


🙏శ్రీ నృసింహుని మహా మృత్యుంజయ మంత్రం🙏


ఉగ్రం వీరం మహావిష్ణుం 

జ్వలంతం సర్వతోముఖమ్‌

నృసింహం భీషణం భద్రం 

మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం


🙏నరసింహ స్వామి అంత గొప్ప రక్షణ ఇస్తారు. ఆనాడు మృత్యువు కోరలలో చిక్కుకున్న ప్రహ్లాదుడిని రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షణ చేస్తారు. పిల్లల చేత ప్రతిరోజూ చేయిస్తే వారికి ఆయుష్షు చేకూరుతుంది.


🙏ఆదిశంకరులు చేసిన నృసింహ కరావలంబ స్తోత్రం కూడా విశేష ఫలదాయకమైనది. శ్రీ నృసింహ కరవలంబ స్తోత్రం, రుణ విమోచన నృసింహ స్తోత్రం, నృసింహ ద్వాదశనామ స్తోత్రం కూడా పఠించాలి.


ఆదిశంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం🙏


ప్రతీ రోజు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారిని స్మరించడం, సకల శుభకరం.


ఆదిశంకరభగవత్పాదులు ఒకటి లక్ష్మీనృసింహకరావలంబ స్తోత్రం చేశారు, రెండు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేశారు. ఇంకా ఏమైనా వారు చేసిన కరావలంబ స్తోత్రం ఉన్నాయేమో నాకు తెలియదు. అసలు కరావలంబం అంటే ఏమిటి? స్వామి వారిని "మాకు సహాయం చేసే చేతులను ఇవ్వు..." అని వేడుకోవడం. అంటే ఈ సకల లోకాలనూ రక్షించే నీ బాహువులతో మమ్మల్ని రక్షించు అని. కరావలంబ స్తోత్రం చాలా చాలా శక్తివంతమైనది. ఆదిశంకరులు ఒక విపరీతమైన ఆపద సమయములో నరసింహస్వామి వారిని కరావలంబస్తోత్రముతో పిలిస్తే, స్వామి తత్ క్షణమే వచ్చి ఆదిశంకరులను రక్షించారు. 


 శంకరులు మమదేహి కరావలంబం అని అంత అద్భుతమైన రెండు స్తోత్రాలు ఇచ్చారు అంటే, వాటిని ప్రతీరోజు మనం అనుసంధానం చేసుకుంటే, ఏ విధముగా ఆపదల నుంచి రక్షింపబడి, స్వామి యొక్క కృపకి పాత్రులము అవుతామో మన ఊహకి కూడా అందదు.


ఆదిశంకరులు అందించిన అటువంటి అద్భుతమైన మరియు శక్తివంతమైన స్తోత్రములలో ఒకటి  శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం...

*****                           ******                *****



"నిర్భయంగా వచ్చాను; నిర్భయంగా వెళతాను

ఉచ్ఛ్వసిస్తూ వచ్చాను ; నిశ్వసిస్తూ వెళతాను

మృత్యువు నృత్యం చూసి జడిపిస్తారెందుకని?

భయమెందుకు? నా ఇంటికి నే వెళతాను!

అంటూ ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు.... దాశరధి కృష్ణమాచార్యులు.

                       *******************

                     ఓం నమః శివాయ...


Sunday, April 10, 2022 5 comments By: visalakshi

భద్రాద్రి రాముడు...

                    భద్రాద్రి....శ్రీ సీతారామచంద్రస్వామి..



శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం, ఖమ్మం  జిల్లా, భద్రాచలం లో ఉంది.


 దక్షిణ_అయోధ్య గా పిలవబడే ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.


17 వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. 17 వ శతాబ్దం (1674) రెండవ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలం తహశీల్దార్ గా ఉన్నపుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండ లోని ఒక చెరసాలలో ఇతనిని బంధించారు. కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాదీశుడైన సుల్తాన్ కు దివ్య రూపంలో కనిపించి, గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన మీర్_ఉస్మాన్_అలీ_ఖాన్ సొమ్మును చెల్లించాడని చారిత్రక కథనం. బందీఖానా నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలను రచించాడు. అప్పటి నుండి గోపన్నను రామదాసు అని పిలుస్తుండేవారు. భద్రాచలం, విజయనగరం ప్రాంతాలకు రామాయణంతో దగ్గర సంబంధమున్నట్లు రామాయణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో రాముడు, సీత, లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడింది. గోదావరి నదిఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్నకొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరుపర్వతం, మేనకల కుమారుడే భద్రుడు (భద్రగిరి). ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రిరాముడు అయ్యాడు. ఈ భద్రగిరిపైవెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ కు కూడా ఈ ఆలయంతో దగ్గర సంబంధముంది. కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నపుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమైయ్యాయని మళ్ళీ అతనిని ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలంకి మరింత తోడ్పాటునందించింది. మేరుపర్వతం, మేనక లకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది.


మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7 వ నిజాం ఈ ఆలయానికి సంవత్సరానికి రూ.82,000 విరాళంగా ఇచ్చాడు.


#దేవాలయ ప్రత్యేకతలు

శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కాని భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా * కుడి చేతిలో బాణంను, ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖునుఎడమచేతిలో చక్రంను ధరించి ఉంటుంది.


భద్రుని కోరికమేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్షనమివ్వటంవల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు.


ఇతర దేవాలయములలో సీతాదేవి రాముని ప్రక్కన నిల్చుని ఉంటుంది. కాని ఈ దేవాలయములో స్వామి ఎడమ తొడపై ఆసీనవతియై ఉంటుంది. మిగిలిన దేవాలయాలలో ఇరువురకూ రెండు పీఠాలు ఉంటాయి. ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది.


 అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు, కాని ఇక్కడ మాత్రం ఎడమవైపున ఉంటాడు.


నిత్యపూజలు, ఉత్సవాలు, కళ్యాణం

ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమిరోజున జరిగే కళ్యాణం. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతుంది.

                  🙏  శ్రీ‌రామన‌వ‌మి...!!


విశ్వంలో చిన్న పెద్ద తేడాలు లేకుండా భగవంతుడిని నమ్మే ప్రతి ఒక్క భక్తుడికి అత్యంత ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి, పండగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. 


శ్రీ రాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల స‌మ‌యంలో త్రేతాయుగంలో జన్మించాడని, పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి, ఆయ‌న‌ జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకోవడమే శ్రీ రామ నవమి.


14 సంవత్సరములు అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడ‌య్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రతీతి. సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.


ఈ చైత్ర శుద్ధ నవమి నాడు అందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ , వాడ వాడల్లోనూ రమణీయంగా, కమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం.


ఖ‌మ్మం జిల్లా భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. 


సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.


శ్రీ రాముని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. 


శ్రీ రాముడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. 


శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. 


భక్త రామదాసు చెరసాలలో ఉండిపోవ‌డంతో పూర్వం సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా తెలుస్తోంది. 


అయితే తాను చెరసాల నుంచి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు.


సీతారామ కల్యాణం, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమి నాడే.

ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం జరిగిందని చెబుతారు.




కోదండ రామకల్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట.


శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. 


శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు...


🙏ఇంట్లో ఈ పండుగ జరుపుకునే విధానము🙏


శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులందరూ ఉద‌య‌మే లేచి, తలంటు స్నానం చేయాలి. 


శుభ్రమైన లేదా కొత్త వస్త్రములను ధరించాలి. 

సీతా, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి పటమును గాని, సీతారాముల విగ్రహములనుగాని పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి.


నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేసి, వడపప్పు (నానపెట్టిన పెసర పప్పు), పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. 


సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి ఊరిలోని రామాలయమునకు, పందిళ్లకు వెళ్లి సీతారాములను చూసి, వారిని ధ్యానించుకొని, ప్రసాదం స్వీకరించాలి.


వీలైన వారు రామాలయంలో గాని, శ్రీరామ నవమి పందిళ్లలో గాని సీతారాముల కళ్యాణం జరిపించవచ్చు. 


లేదా ఆ సమయానికి వెళ్లి సీతారాముల కళ్యాణం చూసి రావాలి. 


శ్రీసీతారాముల కళ్యాణం జరిపించినా లేక చూసినా సర్వ శుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు.


🙏పూజ...🙏


వినాయక ధ్యానం, సంకల్పం, పూజ చేసి దేవునికి షోడశపూజలు మాములే గనుక పూజ యధావిధిగా వాటిని ముగించి, ఆపై శ్రీరామాష్టకం, శ్రీరామ అష్టోత్తరం, జానకీ అష్టకం పఠించి పువ్వులతో పూజ చేయాలి.


చైత్రమాసం మల్లెలమాసమే గనుక మల్లెపూవులతో పూజించడం శుభప్రదం, 


మల్లెపూవులు లభ్యంకాని ప్రాంతాలలో వుండేవారు ఏదైనా సువాసనలు గల తెల్లరంగు పూవులతో


 సీతాలక్ష్మణాంజనేయ సమేత శ్రీరామ పటానికి, లేదా విగ్ర‌హానికి పూజించాలి.


వడపప్పు, పానకం, రామయ్యకు ప్రీతి.

అంటే స్వామి ఖరీదైన వ్యయ ప్రయాసలతో ముడిపడిన పిండివంటలేవీ కోరుకోడనీ, స్వామి సాత్వికుడనీ భక్తుల నుంచి పిండి వంటలుగాక పరిపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే ఆశిస్తాడ‌ని మ‌న‌కు తెలుస్తోంది..


వీటితో పాటు ఏదైన ఒక ఫలం స్వామి వారికి నివేదించాలి.


ఈ రోజంతా రామ నామ స్మరణ (రామ రామ రామ సీత) లో ఉండాలి, వీలైతే నలుగురు పేద జంటలకు కొత్త బట్టలు పెట్టాలి, వారికి తృప్తిగా భోజనం పెట్టాలి, చిన్న పిల్లలకు పానకం వడపప్పు పంచాలి.


               🙏సమస్తలోకా సుఖినోభవంతు🙏


భద్రాచలం లో వైకుంఠ ఏకాదశి పర్వదినం

వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి భద్రునికి దర్శనమివ్వటంవల్ల వైకుంఠఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారదర్శనం ఈ క్షేత్రంలో చాలా ప్రసిద్ధిచెందింది.


#నిత్యపూజలు

తమిళనాడులోని శ్రీరంగం నుండి రామదాసుచే తీసుకురాబదడిన ఆరు వంశాలకు చెందిన శ్రీవైష్ణవ ఆచార్యుల కుటుంబాలు ఇప్పటికి భద్రాచలంలో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. రామానుజులవారిచే శ్రీరంగంలో నిర్ణయించబడిన విదంగానే ఇక్కడి ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తున్నారు.


#పర్ణశాల

ఇది భద్రాచలంనుండి 35 కి.మీ. దూరంలో ఉంది. సీతారామలక్ష్మణులు తమ వనవాస వనవాసం సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర, శిల్ప రూపాలలో ప్రదర్శింపబడుతున్నాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడి రూపంలో వచ్చిన మారీచుని బొమ్మ, పర్ణశాలకుసమీపంలో ఉన్న సీతమ్మ వాగువద్ద సీత ఆరవేసిన చీర గుర్తులనీ, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్ళనీ కొన్ని చిహ్నాలను చూపిస్తారు. నదికి ఆవలివైపుని రావణుని రథపు జాడలని కొన్ని గుర్తులను చూపిస్తారు.రావణుడు సీతను అపహరించిన ప్రదేశం ఇది.సీత వియోగాన్ని పొందిన రామచమంద్రుడు శోక మూర్తిగా కనిపిస్తాడు. భద్రాచలంలో ఉన్న రామచమంద్ర మూర్తి ముఖంలో ఉండే తేజస్సు పర్ణశాల రామునిలో కనిపించదు.శ్రీరామ నవమి రోజున ఇక్కడ కూడా కల్యాణోత్సవం జరుగుతుంది.


#జటాయుపాక (యేటపాక)

ఇది భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతాపహరణం సమయంలో జటాయువు రావణుని ఎదుర్కొని, సీతను రక్షించే యత్నంలో తన ప్రాణాలను ఇచ్చిన స్థలంగా దీనిని చెబుతారు. జటాయువుయొక్క ఒక రెక్క ఇక్కడికి 55 కి.మీ. దూరంలో ఉన్న వి.ఆర్.పురం మండలంలో రెఖపల్లి గ్రామంలో పడిందట.


#దుమ్ముగూడెం

ఇక్కడ జరిగిన భీకరయుద్ధంలో రాముడు 14,000 రాక్షసులను హతమార్చాడట. ఆ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం ఉంది. గనుక దీనిపేరు దుమ్ముగూడెం. ఇక్కడి రాముడిని ఆత్మారాముడంటారు.


#గుండాల

ఇవి భద్రాచలానికి 5 కి.మీ. దూరంలో ఉన్న వేడినీటి బుగ్గలు. ఇక్కడ నదిఒడ్డున ఎక్కడ తవ్వినా వేడినీరు ఊరుతుంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడుచలికాలంలో ఇక్కడ స్నానం చేస్తారట.


#శ్రీరామగిరి

ఇది గోదావరి దిగువన 55 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన యోగరాముని మందిరం ఉంది.


#పాపికొండలు

పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక కొండల శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి. సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. పాపికొండల అడవుల్లో వివిధ రకాల జంతువులు, పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.

సేకరణ...



🕉🚩🕉🚩🕉🚩🕉🚩🚩భద్రాచలం 🕉.....


శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం గర్భగుడిపై 

ఉన్న సుదర్శన_చక్రం ఎవరూ తయారుచేసినది కాదు.


మరి అది ఎలా వచ్చిందంటే

భక్తరామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను రప్పించి వారిచేత సుదర్శన చక్రాన్ని తయారచేయిస్తున్నాడు.కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో,లేదా సరిగా రాకపోవడమో జరుగుతుంది.కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై "భక్తా..!! సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు.అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు" అని చెప్పాడు.మరుసటి రోజు గజ ఈతగాళ్ళతో రామదాసు వెతికించాడు.కానీ కనిపించలేదు. మళ్ల రాముడు కలలో కనిపించి "అది నామీద అమితమైన భక్తిని పెంచుుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది" అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రునికి స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది.ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది.

                 🙏🏻🚩🕉🙏🏻🕉🚩🙏🏻🕉🚩

               భక్తులకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు...

                                 || జై శ్రీరామ్ ||