యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్!
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజ:!! (పారస్కర గృహ్య సూత్రం 2-2-10)
యజ్ఞమనే సత్కార్యాన్ని చేసేందుకు ధరించే దీక్షా సూత్రం ఈ యజ్ఞోపవీతం.
యజ్ఞోపవీతం అంటే - మంచిపనులు చేసేందుకు సమీపంగా చేర్చేది, అర్హతను యోగ్యత కలిగించేదని అర్ధం.
పరమం పవిత్రం - మానవుని పవిత్రంగా ఉంచే దివ్యమైన సాధనం యజ్ఞోపవీతం.
శ్లో" అద్భిర్ గాత్రాణి శుద్ధ్యంతి
మన: సత్యేన శుద్ధ్యతి !
విద్యాతపోభ్యాం భూతాత్మా
బుద్ధిర్ జ్ఞానేన శుద్ధ్యతి !! (మనుస్మృతి 2-97)
జలంతో శరీరం,.. సత్యాచరణ, సత్యభాషణ వలన మనస్సు,.. విద్యా, ధర్మాచరణ వలన ఆత్మ,.. జ్ఞానంతో బుద్ధి పవిత్రమవుతాయని మహర్షులు తెలుపుతున్నారు.
ప్రజాపతేర్యత్ - సమస్త ప్రాణులకు పరమాత్ముడే ఆధారం. ఆయనే పతి, పాలకుడు, తండ్రి, రక్షకుడు, మనం చేసే శుభాశుభకర్మలకు న్యాయరూప ఫలాన్ని ఇచ్చేది పరమాత్ముడే. అతడు ఆనందస్వరూపుడు. పూర్ణసుఖస్వరూపుడు. మానవుడు అల్పబుద్ధితో ఇంద్రియాలకు వశుడై భౌతిక సుఖాలవెంట పరుగెత్తి అలసిపోతున్నాడు. అవి లభిస్తే సుఖాన్ని పొందుతున్నాడు. లేకుంటే రాగద్వేషాలకు లోనై దు:ఖాన్ని అనుభవిస్తున్నాడు.
సహజం పురస్తాత్ - శిశువు జన్మించడానికి ముందే, తల్లి గర్భంలో శిశువుకు ఈ ఉపవీతం సహజంగా ఉంటుంది. తల్లి గర్భంలో బిడ్డకు, బొడ్డు త్రాడు రస, ప్రాణాలనిచ్చి రక్షిస్తుంది. అట్లాగే యజ్ఞోపవీతం, మానవులకు వేదోపదేశ అమృత రూప రస ప్రాణాలనిచ్చి జీవితాంతం కాపాడుతుంది.
ఆయుష్యం - గర్భాధారణ మొదలు మరణకాలం వరకు మధ్య ఉండేకాలాన్ని ఆయువంటారు. ఆయుష్యమంటే ఆయువును వృద్ధి చేసేదని అర్ధం. అందుకే మానవుడు పురుషార్ధాలతో పూర్ణాయువును కోరుకోవాలి. శక్తిని అర్ధించాలి. ఇంద్రియాలు బలంగా దృఢంగా శక్తివంతంగా వుండాలని పరమాత్ముని కోరుకోవాలి.
అగ్ర్యం - ఈ యజ్ఞోపవీతం మానవునకు ఉత్తమమైన మార్గదర్శిని. శుభకార్యాలకు ప్రేరణనిస్తుంది. అవి చేసేవారిని రక్షిస్తుంది. వారిని సమాజంలో అగ్రస్థానంలో వుంచుతుంది.
ప్రతిముంచ శుభ్రం - ప్రతి ముంచ అంటే ధరించడమని అర్ధం. శుభ్రం అంటే తెల్లని శుద్ధమైన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఈ సూత్రం ఎప్పుడు శుచిగా ఉండాలి. శుచిగా లేకుంటే అది తీసి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
యజ్ఞోపవీతం - అలాంటి దివ్యగుణాలు కలిగిన యజ్ఞోపవీతం
బలమస్తు తేజ: - ఇది తేజోవంతమయిన యశస్సును, ఆత్మశక్తిని ప్రసాదిస్తుంది. యజ్ఞమయ జీవితాన్ని గడపాలనే జిజ్ఞాస కలిగిన స్త్రీ పురుషులందరు దీని ఉద్దేశ్యాన్ని, ప్రయోజనాన్ని తెలుసుకుని, యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
శ్లో" న శూద్ర సమాస్త్రియ: నహి శూద్రయోనౌ
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యా: జాయంతే
తస్మాత్ చందసాం స్త్రియ: సంస్కార్యా: !! (హారీత ధర్మ సూత్రాలు)
స్త్రీలు శూద్ర సమానులు కారు. శూద్ర యోనులందు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు జన్మింపరు. స్త్రీలు చందస్సులను (వేదాలను) పఠింపయోగ్యులని ప్రాచీన ఋషులు ప్రభోదించారు. ఈ వ్రతసూత్రం వైదిక సంస్కృతికి పరమ పవిత్రమైన ప్రతీక. ఆచార ధర్మాలను పాటించేవారు, శ్రద్ధ, శిష్టాచారం గల అన్ని వర్ణాల స్త్రీ పురుషులు నిష్ఠగా ఈ యజ్ఞోపవీతాన్ని ధరించవచ్చు అని కొందరు ఋషులు, ఆచార్యుల అభిమతం. నీతివంతమైన జీవితాన్ని అభిలషించేవారెవరైనా ఈ ధర్మ సూత్రాన్ని ధరించి, గాయత్రీ మంత్రోపదేశం పొందవచ్చుననెడిది శాస్త్రకారుల నిశ్చిత అభిప్రాయం.
సమస్త జీవరాసులలో మానవజన్మ అమూల్యమైనది. మనం ఈ జన్మలో అనుభవించే సుఖదు:ఖాలకు కారణం గత జన్మలలో చేసిన మంచి చెడుకర్మల ఫలమే. మానవులు చిత్తశుద్ధితో సత్కార్యాలను ఆచరించాలి. జన్మించిన ప్రతి మనుష్యునకు మూడు ఋణాలుంటాయి.. అవి పితృఋణం, దేవఋణం, ఋషిఋణం. యజ్ఞోపవీతం ఈ మూడు ఋణాలను తీర్చేబాధ్యతను తెలియజేస్తుంది. అందుకు ఈ వ్రతాన్ని స్వీకరించాలని యజ్ఞసూత్రం గుర్తుచేస్తుంది. శారీరక, మానసిక ఆత్మికబలాన్ని ప్రసాదిస్తుంది ఈ యజ్ఞోపవీతం.
సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు
0 comments:
Post a Comment