Thursday, December 29, 2016 By: Veda Sri

భక్త కనకదాస్ - part 2వ్యాసరాయలవారు జరిగిన వృత్తాంతమంతయు ఆలకించి విస్మయమొందుతారు. వ్యాసరాయలవారికి వెంటనే ఒక సంకల్ప ముదయిస్తుంది. తాను త్రవ్విస్తున్న కాలువకు అడ్డముగ ఒక పెద్దబండ పడి, తొలగింప నశక్య మవుతున్నది. ఆ బండను తొలగించవలసినదని దున్నపోతును కోరగా దున్నపోతు ఆ బండను తొలగించి అదృశ్యమవుతుంది. నీరు ప్రవహించుటకు అనుకూలముగా దున్నపోతు బండను తొలగించిన ఆ తూమును "కనకతూము" అని పిలుస్తారు. చిత్తూరు జిలాలోని మదనపల్లి గ్రామమునకు సమీపములో ఈ తూము ఉన్నది. వ్యాసరాయలవారు ఈ సంఘటనను ఆధారముగా గ్రహించి, కనకదాసు భక్తి శ్రద్ధలను అవగతము చేసుకొని, అతడిని తన శిష్యునిగా స్వీకరించి, ఆశీర్వదిస్తారు. గురుదేవుని ప్రజ్ఞా ప్రబోధాలతో ప్రభావితుడైన కనకదాసు నిరంతర తపోధ్యానాదులాచరించి, అంతరంగిక ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంటాడు. పవిత్ర తీర్ధక్షేత్ర సందర్శనము చేయవలెననెడి కుతూహలము కనకదాసు మనస్సులో జనిస్తుంది. గురుదేవుల అనుమతిపొంది తీర్ధయాత్రలకు బయలు దేరుతాడు. 

 పుణ్యనదులలో స్నానమాచరిస్తాడు. పవిత్ర పుణ్యక్షేత్రములను దర్శిస్తూ తిరుమలేశుని దర్శనానికి తిరుపతి వస్తుంటాడు. తన భక్తులైన బీరప్ప బుచ్చమ్మల ముద్దుబిడ్డడు, నిరంతర గోవిందనామ స్మరణామృత పానచిత్తుడు, భక్త శిఖామణియైన కనకదాసుడు తన దర్శనమునకు అరుదెంచుచున్నాడని గ్రహించిన 'శ్రీనివాసుడు ' దేవాలయ మహంతుకు స్వప్నంలో దర్శనమిచ్చి కనకదాసును సగౌరవముగా సత్కరించవలసిందని చెబుతాడు. కనకదాసు తిరుమలేశుని దర్శనానికి వస్తాడు. ఏ ఆడంబరము లేక సర్వ సామాన్యునివలె గోచరించే కనకదాసును గుర్తించడం మహంతుకు సాధ్యంకాదు. స్వామి దర్శనానికై ఆలయ ముఖద్వారం వద్ద కనకదాసు రోజంతా నిరీక్షిస్తాడు. దర్శనం మాత్రం కాలేదు.  

 బాలాజీ దర్శన భాగ్యానికి నోచుకోని తన దురదృష్టానికి చింతిస్తూ రాత్రంతా దేవాలయమునందే పడుకొని దు:ఖిస్తాడు. ఆ సమయములో స్వామి ఆభరణాలు ఆనాడే అదృశ్యమవుతాయి. రాత్రంతా ఆలయ ప్రాంగణములో ఒంటరిగా సంచరిస్తూ కనిపించిన కనకదాసే చోరుడని నిర్ణయిస్తారు. బంధించి న్యాయాధిపతికి అప్పగిస్తారు. కనకదాసును త్రాటితో స్థంభానికి కట్టివేసి కొరడాతో తీవ్రముగా కొడతారు. కర్కశమైన కొరడా దెబ్బలను భరించలేక కనకదాసు మూర్చిల్లుతాడు. 'తిరుమలేశుడు ' మహంతుకు స్వప్నంలో దర్శనమిచ్చి, జరిగిన వృత్తాంతమంతయు తెలియజేస్తాడు. తాను సన్మానించమనిన కనకదాసును అవమానపరచినందుకు మహంతుపై ఆవేశమును చూపుతాడు. వెంటనే కనకదాసును విడిపించమని చెబుతాడు. మహంతు కనకదాసు బంధించియున్న ప్రదేశమునకు పరుగెత్తి కనకదాసు పాదాలపై బడి క్షమాబిక్ష కోరుతాడు. దైవదర్శనార్ధము కనకదాసును ఆలయములోనికి తీసుకువెళ్తాడు. దేవాలయ తలుపులు తీయగానే పోయిన ఆభరణములతో సహా స్వామి దర్శనమిస్తారు. నేత్రములవెంట భాష్పములు రాలుచుండ కనకదాసు చేతులు జోడించి స్వామికి నమస్కరిస్తూ "భగవాన్! వెంకటరమణా! అశ్రిత జనరక్షకా! నీ లీలలు మాకు అర్ధం కావు. నీవు భక్తుల నుద్ధరించు తీరు ఊహాతీతము. ఆభరణముల అపహరణ వెనుక దాగియున్న నీ ఆశ్రిత జనరక్షణము ఆదర్శము. అద్భుత మహిమాన్వితము. ఈ విధముగా నా ప్రారభ్దమును కరిగించి ప్రజలలో నా కీర్తిని ఇనుమడింపజేయాలని సంకల్పించినావా?" అంటూ గగుర్పాటు చెందుతాడు. వేంకటరమణుని అపార కృపామహిమకు కనకదాసుని నేత్రాలు చెమ్మగిల్లుతాయి. దివ్యానుభవములను పొందుతూ భగవానుని గాన కీర్తనలతో కనకదాసు శ్రీకృష్ణసన్నిధానమైన ఉడిపి చేరుతాడు. శ్రీకృష్ణ దివ్య పాదపద్మ దర్శనాభిలాషియై అరుదెంచుచున్న కనకదాసుని ఆలయములో ప్రవేశించడానికి వీలులేదని ధర్మకర్తలు ఆదేశిస్తారు. కనకదాసు హృదయము ముక్కలైపోయింది. శ్రీకృష్ణుని దివ్యతేజోమయ రూపమును గాంచలేని తన జన్మ నిరర్ధకమని ..ఆలయకర్తలను దర్శనభాగ్యము కల్పించమని యాచిస్తాడు..ప్రార్ధిస్తాడు. వారు కనకదాసు హృదయవేదనను పట్టించుకోక అహంకారముతో వీలుకాదని వెడలుమని ఆదేశిస్తారు. చెదిరిన మనస్సుతో, శుష్కించిన హృదయముతో కనకదాసు కదలలేక కదుల్తూ ఆలయం వెనుకపైపునకు వెళ్ళి దు:ఖించసాగాడు. భక్తవత్సలుడైన శ్రీకృష్ణుని మనస్సు ద్రవించింది. దేవాలయ గర్భగుడి వెనుకవైపు గోడ కదిలి పడిపోయింది. తూర్పుముఖముగా యున్న భగవానుడు పడమరవైపు తిరిగి భక్త కనకదాసుకు దర్శనమిచ్చాడు. జై జై వాసుదేవ హరి ! కనకదాసు స్వామిని దర్శించి ధన్యత చెందాడు. దానిని ఇప్పటికిని "కనకభండి" అని పిలుస్తుంటారు. అనగా కనకదాసు స్వామిని దర్శించిన కిటికీ అని అర్ధం. భక్త కనకదాసుకు దర్శన మొసంగిన పుణ్యద్వారమని భావము. 

భగవంతుని కృపకు పాత్రుడైన కనకదాసు తొంభై సంవత్సరాలు జీవించారు.  కొన్నివేల కీర్తనలు రచించారు. అనేక దేవాలయాలు నిర్మించారు.ఆదికేశవుని పాదపద్మములను నమ్మి తాను తరించడమేగాక తన ఆదర్శనీయ జీవితము ద్వారా ఎందరికో స్పూర్తిని కల్గించి తరింపజేసిన భక్త కనకదాసుని దివ్య చరితము పవిత్రము. భక్తాధీనుడైన భగవంతుడు  భక్తుల హృదయాలలో దర్శనీయం. అట్టి భక్తుల దర్శనమే ముక్తికి సోపానం.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు  

1 comments:

sri said...

భక్త కనకదాస అన్న చిత్రం కన్నడం లో ఎంతో ఆదరణ పొందింది, యు టూబ్ లో చూడండి.