Saturday, December 24, 2016 By: visalakshi

సంస్కారం

' మనుర్భవ - జనయా దైవ్యం జనం '!సృష్టిలో మానవజన్మ అత్యంత శ్రేష్టమైంది. మానవత్వంతో పరిమళించే సంతానాన్ని దంపతులు సృజించాలి. వారు దేవతలు అయ్యేటట్లుగా కృషి చేయాలి. మానవులలో విశేష కర్మలు ఆచరించేవారే దేవతలు. అట్లాంటి దేవతా సంతానంతో సమాజం సుశోభితం కావాలి. షోడశ సంస్కారాల ద్వారా కలిగే పూర్ణ ప్రయోజనమిది. వైదిక సంస్కృతిలో మానవ జీవనాన్ని సంస్కరించేందుకు షోడశసంస్కారాల విధానాన్ని ఋషులేర్పరిచారు. 16 సార్లు మానవుణ్ణి సంస్కారాలతో సంస్కరించారు. అందులో ఒక భాగంగానే శిశువును సంస్కారాల ద్వారా సంస్కరించేందుకు ప్రయత్నం జరుగుతుంది. స్వర్ణకారుడు సువర్ణాన్ని అగ్నిలో వేసి దానిలోని మలినాలను తొలగించి శుద్ధి చేసినట్లుగా, జన్మించిన శిశువును సంస్కారాలనే బట్టీలో వేసి, శిశువులోని పూర్వమున్న చెడు భావాలను దుర్గుణాలను తొలగించాలి. మంచి సంస్కారాలను వేసేందుకు పూర్తిగా ప్రయత్నించాలి. 



 "సంస్కారో హి గుణాంతరాదాన ముచ్యతే"!

చెడును తొలగించి మంచిని స్థాపించడమే సంస్కారాల ప్రధాన ఉద్దేశ్యం.

అనేక జన్మల నుండి తనతో పాటు వచ్చే సంస్కారాలు..వంశపరంపరగా తల్లిదండ్రుల నుండి వచ్చే సంస్కారాలు ఇవి మంచివి కావచ్చు, చెడువీ కావచ్చు.. సంస్కారాలతో సంపూర్ణమానవ నిర్మాణానికై రచింపబడే ప్రణాళిక, ఆధ్యాత్మిక ప్రణాళిక. ఇదియే వైదిక సంస్కృతి ముఖ్య లక్ష్యం. 



సంపూర్ణ మానవ నిర్మాణానికి సంస్కార పద్ధతే ఆధారం. జన్మించిన శిశువు తనపూర్వ జన్మలలోని కర్మల సంస్కారాలను, తల్లిదండ్రుల ద్వారా లభించే సంస్కారాలను తన వెంట తీసుకువస్తుందనే మాట వేదసమ్మతం - శాస్త్ర సమ్మతం. 

 ఈ సంస్కారాలలో కొన్ని ఆత్మ శరీరాన్ని ధరించడానికి ముందు, కొన్ని ఆత్మ శరీరాన్ని ధరించిన తరువాత చేస్తారు. శిశువు జన్మించేందుకు ముందు చేసే సంస్కారాలలో గర్భాదాన సంస్కారం మొదటిది. వైదిక సంస్కృతి ఈ సంస్కారాన్ని ఒక క్రొత్త ఆత్మను ఆవాహన చేసేందుకు జరిగే పవిత్ర యజ్ఞంగా భావిస్తుంది. శిశువును గర్భంలో ధరించక ముందే దంపతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు శ్రేష్టమైన సంతానాన్ని ఉత్పన్నం చేసే సంకల్పం ఈ గర్భాదాన సంస్కారంలో ఉంది. హోమంలో ఘృత ఓషధులను ఆహుతులుగా ఇస్తూ భౌతికశుద్ధి వేదమంత్ర పాఠంతో ఆత్మశుద్ధి కలిగి శరీర ఆత్మబలాలతో కూడిన సంతానాన్ని ఉత్పన్నం చేసేందుకై దృఢమైన సాధనతో 20 విశేష ఆహుతులతో హోమం చేయాలి. ఈ హోమం వలన దంపతులలో శారీరక మానసిక ఉన్నతికి ప్రతికూలమైన దోషాలను దూరం చేసి, అలాగే సంతానోత్పత్తికి సంబంధించిన సామర్ధ్యం ఉండాలని పరమాత్ముని ప్రార్ధిస్తారు. 

  

తల్లిదండ్రులు ఎలాంటి భావాలు కలవారో అట్లాంటి భావాలవైపు ఆ శిశువు ఆకర్షించబడుతుంది. బీజాన్ని సంస్కరిస్తే ఉత్కృష్టమైన మొక్క ఉత్పన్నమౌతుంది. అలాగే సుదృఢమైన వేగవంతమైన ఆలోచనలతో కూడిన తల్లి గర్భాన్ని ధరిస్తే ఆ తల్లినుండి ప్రతి అంగం తయారవుతుంది. అది శిశువు పూర్వ సంస్కారాలను పూర్తిగా మార్చేస్తుంది. చెడు ఆలోచనలను బలహీనం చేస్తుంది. అప్పుడే సంపూర్ణ మానవ నిర్మాణం జరుగుతుంది. దివ్య గుణాలతో కూడిన శిశువు జననోదయ మవుతుంది.  

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు




0 comments: