Friday, December 30, 2016 By: visalakshi

రమణ మహర్షుల వారి సంభాషణలు..

  ప్రారబ్ధం:-   "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే, యుగే" అన్నట్లు ఎప్పటికప్పుడు సాధువుల పుణ్యం, దుష్టుల పాపం చేరి ప్రారబ్ధంగా పరిణమించి ధర్మ సంస్థాపనార్ధం ఈశ్వరుడు రూపం ధరిస్తాడు.  ప్రారబ్ధం లేనిదే దేహమెట్లా వచ్చింది? పనులెట్లా చేస్తారు? జ్ఞానుల చర్యలనే ప్రారబ్ధమంటారు. బ్రహ్మ మొదలు సదాశివాది దేవతలకున్నూ ప్రారబ్ధం ఉన్నట్లు చెప్పబడింది. రామ కృష్ణాద్యవతారాలూ అంతే. శరీరమే ప్రారబ్ధం. ఏ నిమిత్తంగా ఆ శరీరం వచ్చిందో ఆ పని దానంతటదే జరుగుతుంది. 



ప్రారబ్ధం అహంకారానికే కానీ ఆత్మకు కాదు. మనం ఆత్మస్వరూపులమైనపుడు ప్రారబ్ధం మనలను బాధించదు. భగవంతునకు పరిపూర్ణ శరణాగతి చెందటం."ప్రభూ! నీవు తప్ప నేను లేను. నీ యిచ్చయే నెరవేరు గాక!" అంటూ నిరంతరం ప్రార్ధించాలి. ఏ కోరికా కూడదు  ..చివరకు మోక్షాపేక్ష కూడా అడ్దవుతుంది. అప్పుడు అహంకారం పూర్తిగా నాశనమైపోతుంది. ఇక ప్రారబ్ధం బాధించదు.   

సమాధి:-          యోగంలో శరీరాన్ని మరచి ఉండటమే  సమాధి.  
సకలేంద్రియాలు పనిచేస్తుండగానే ఎప్పుడూ సమాధిలో ఉండడం.  దీన్ని సహజ సమాధి అంటారు. నీవు సమస్త కార్యాలు చేస్తున్నప్పటికి శాంతితో నిలకడ కలిగిఉంటావు. అంతరాత్మ ప్రేరితుడవై చరిస్తున్నావని గుర్తించగలుగుతావు. అందువల్ల ఏమి చేస్తున్నా ఏమి తలుస్తున్నా అవి నిన్ను అంటవు. నీకు చింతలుండవు. ప్రతి పని వేరైయున్న ఒక వస్తువు చేత జరపబడుతుంది. ఆ గొప్ప వస్తువుతో నీవు ఏకమై ఉంటావు. " నాది అనేది అర్పించటం చిత్తశుద్ధి యిస్తుంది. నేనును అర్పించటం జ్ఞానాన్ని యిస్తుంది." 




 ధ్యానం:-        "నేను ఉన్నాను" అని ప్రతివారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటూనే ఉన్నా "నేను" పై దృష్టి కేంద్రీకరించక అన్యంగా ఉన్న వాటిపై ధ్యానం చేయాలని చూస్తారు.రెండు కనుబొమల మధ్య చూస్తే భగవంతుడు అక్కడే ఉన్నాడని అన్నట్లవుతుంది. ఈ సాధన వల్ల ఏకాగ్రత కుదురుతుంది. మనస్సును దృఢపరచి అంతర్ముఖ పరచవచ్చు. ప్రత్యక్ష మార్గమేమంటే "నేను" పైన దృష్టి నిలిపి నేనెవడను? అని నిరంతరం ప్రశ్నించుకోవాలి. ధ్యాన సమయంలో కళ్ళు మూసుకోవటం, తెరవటం ముఖ్యం కాదు. కండ్ల ద్వారా చూచేవారొకరున్నారు. ఆ చూచేవాడిని పట్టుకొని, లోపలికి తిప్పాలి. అప్పుడు ఆత్మ దర్శనం అవుతుంది.ప్రతివారికి ఉన్నది ఒక మనస్సు. దాని పుట్టుకెక్కడ? దాని స్వరూపమేమిటి? ఇది విచారిస్తూపోతే ఆ మనస్సు లయమై పోతుంది. ఆ తరువాత మిగులునది "నేను" "నెనెవరు?" నేను కేవలం ఆత్మను. ఇది ధ్యానము. ఈ పద్ధతిలో దేహవాసన నశిస్తుంది.  




  మౌనం:-       మౌనమంటే మాట్లాడకుండా ఉండటం కాదు. ఎక్కడ నుండి ఆలోచన, మాట పుడుతున్నదో అదే మౌనం. సంకల్పరహితమైన ధ్యానం. ఇదే నిజమైన భాషణ. మాట నిరంతరం మౌన భాషణను నిరోధిస్తుంది. గంటల కొలది ఉపన్యాసాలు, వ్యక్తులను రవ్వంత కూడా అభివృద్ధి చేయకపోవచ్చు. మౌనం అలాకాక, సమస్త మానవాళిని అభివృద్ధి పరుస్తుంది. సదా ఆత్మచింతనమే మౌనం. 




 ప్రాణాయామం:-        ప్రాణము, మనస్సు ఒక చోటునుండి పుట్టుకొస్తున్నాయి. అదే ఆత్మ. అందుచేత ఉచ్చ్వాస నిశ్వాసాలు, లేక మనస్సు(తలంపులు)ఎక్కడనుండి పుట్టుకు వస్తున్నాయో గమనిస్తూ ఉంటే ఆత్మ దర్శనం అవుతుంది.  ఈ  రెండింటిలో ఏ ఒక్కదాన్ని అనుష్టించినా చాలు. మనస్సును పరిశీలిస్తూ ఉంటే, ఒకనాటికి తలంపులన్నీ ఆగిపోతాయి. అప్పుడు పూర్ణశాంతి లభిస్తుంది. అది నీ స్వరూపమే. జనక మహారాజు ఇలా అన్నాడు "ఇప్పుడు నేను దొంగను(మనస్సు)పట్టుకున్నాను. ఇతడే నా నిజమైన నేనును దొంగిలించాడు. ఇప్పుడు ఇతనిని వధించి తీరుతాను."  




మనం తలంపులకు చోటిచ్చామంటే ఆత్మను పోగొట్టుకున్న వారమౌతాము. మనం పరిశీలించనంత వరకే మనస్సు బడాయి. పరిశీలించామా అదృశ్యమౌతుంది. ఆత్మ దర్శనమౌతుంది. తలంపులను సూటిగా అరికట్టలేని వారికి ప్రాణాయామం విధించారు. మనోనిగ్రహానికి ప్రాణాయామముపకరిస్తుంది. ఆసనాలు ప్రాణాయామానికి, ప్రాణాయామం ధ్యానానికి సాయం చేస్తాయి. ఫలితం మనశ్శాంతి.హఠయోగ ప్రయోజనం యిదే.  




 జపం:-         నేను జపిస్తున్నాను అను తలంపు పూర్తిగా పోయే వరకు జపం చేయాలి. అప్పుడు "జపిస్తున్నది నేను కాదు. మంత్రం నా యత్నం లేకుండానే తనంతట తానే సాగిపోతున్నది" అను సత్యం మీ అనుభవంలోకి వస్తుంది. అదే సహజస్థితి. అదే సిద్ధి. ఏ నామమైనా మనస్సును ఒక తలంపు పైన ఏకాగ్రపరచటం.తలంపులు మనస్సు నుండి వస్తున్నాయి కనుక మానసిక జపం ఉత్తమమైంది. వాచికము, దా ని  స్మృతి, ఆపైన ధ్యానము. ఈ క్రమంలో సాగి చివర అప్రయత్నమగు నిరంతర జపం. జకర్త 'ఆత్మయే ' జపాలన్నింటిలో "నేనెవరన్న" జపమే అత్యుత్తమం. అంతా పోతే నామమే ఉంటుంది. అదే ఆత్మ. అదే దైవం..అదే పరమావధి. నామజపం అంటే ఆ దైవానికి ఒక పేరు పెట్టి పిలుస్తున్నామన్నమాట. ...ఏ విధంగా తలిస్తే ఆ విధంగా వస్తాడు. వీరి అంతులేని కోరికలను తీర్చి.. ఇక్కడే ఫలితాన్ని అనుభవించమని అంతర్ధానమవుతారు. 


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు





0 comments: